Friday, July 3

పిచ్చి పిచ్చి బడ్జెట్లు

బ్రేకుల్లేని మమత రైలు!

……..వచ్చేసింది!

నాన్ స్టాప్ రైళ్ళని ప్రవేశపెడతాను…డబుల్ డెక్కర్లు వేస్తాను…..ఇలాంటి ప్రతిపాదనలతో!

లాలూ అప్పుడే ఫక్కున నవ్వేశాడు! ‘ఆచరణయోగ్యం కాని ప్రతిపాదనలు…..బ్రిడ్జిల మీదా, సొరంగాల లోనూ యెలా ప్రయాణిస్తాయి?’ అంటూ!

మరి నాకు మమత కనీసం అయిదో క్లాసు అయినా చదివిందా అని అనుమానం వచ్చింది!

ఇప్పటికే, డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతున్న రైళ్ళు, ఆపిన రైళ్ళ పెట్టెలు వెనక్కి వేగం గా నడుస్తూ వెళ్ళిపోవడం, యెవరో యెక్కి, యేదో నొక్కితే, వేగంగా వెళ్ళిపోతున్న లోకల్ రైళ్ళూ, ఇలాంటివన్నీ చూస్తున్నాం!

యేమాత్రం సాంకేతిక అధ్యయనం చెయ్యకుండా, కక్కుర్తి బెర్తులు బిగించి, బోగీల్ని తగలబెట్టి, అనేక మందిని చంపిన చరిత్ర మన రైల్వేలది!

గంటకి నాలుగు వందల మైళ్ళూ, ఆరు వందల మైళ్ళూ ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు కనిపెట్టిన వెర్రి జపాన్ వాళ్ళకి కూడా రాలేదు—ఇంత అద్భుతమైన డబుల్ డెక్కర్ ఆలోచన!

ఇప్పటికే, కొన్ని రూట్లలో, రైలు 60 కిలోమీటర్ల వేగాన్ని దాటితే, వెనుక వున్న స్లీపర్ బోగీలు యెలా వూగుతున్నాయో, గునుపు వక్రపు మలుపుల్లో చివరి బోగీలు యెంత పక్కకి ఒరిగిపోతున్నాయో, అందులో ప్రయాణాలు చేసే మనకి తెలుసు!

ఇక డబుల్ డెక్కర్లు వేస్తే—ప్రత్యేక పధకం క్రింద ప్రతీ బోగీలోనూ తాటికాయంత యెర్రని అక్షరాలతో ‘దేవుని స్మరింపుము ‘ అని వ్రాయించాలేమో! (మన పాత ప్రైవేటు బస్సుల్లో వుండేలాగ! ఆ బస్సులలో ముందుభాగం లో ఇలా వ్రాసి వుండేది! ఇక పక్కల్ని ‘హరే రామ హరే రామ స్త్రీలు రామ రామ పురుషులు హరే హరే అనీ వ్రాసి వుండేవి! అవి చదువుకొని జోకులు వేసుకొనేవాళ్ళం)

అసలు విద్యుద్దీకరణ జరిగిన లైన్లలో, వైర్లు యెంత యెత్తున వెయ్యాలి? వాటికి యెంతెంతెత్తు స్థంభాలు నాటాలి, వాటికి యెంత ఖర్చు అవుతుంది—ఇలాంటి అయిదోతరగతి చదివిన వాళ్ళకి వచ్చే సందేహాలైనా మమతకి రాలేదంటే…….!

మామూలు రైళ్ళకి సైతం ఇరవైమూడేసి బోగీలు తగిలించి, అవి ఆగే స్టేషన్లలో అంతంత పొడుగు ప్లాట్ ఫారాలే ఇంకా నిర్మించడం మన వల్ల కాలేదు!

సింగిల్ ట్రాక్ రూట్లలో, ఓ రైలు ప్లాట్ ఫారం మీద ఆగి వుంటే, ఇంకో రైలు ప్లాట్ ఫారం లేనివైపు ఆగడం, ప్రయాణీకులు లగేజీలతో, పిల్లలతో నానా ఇబ్బందీ పడడం జరుగుతోంది!

నాన్ స్టాప్ రైళ్ళంటే, ఇప్పటికే కొన్ని స్టేషన్ల ముందు సిగ్నల్ లేక, కనీసం అరగంటపాటు ఆగిపోతున్న సో కాల్డ్ సూపర్ ఫాస్ట్ రైళ్ళూ, ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతున్న చోట్ల, పది కిలోమీటర్ల వేగానికి తగ్గిపోవడం, లేకపోతే పాపం ఆ పనివాళ్ళమీదనించి దూసుకు పోతుండడం…..ఇలాంటి పరిస్థితుల్లో ఇవి సాధ్యమేనా? దీనికేమైనా సాంకేతిక అధ్యయనం చేశారా? (అయిదో క్లాసు చదివిన వాళ్ళకొచ్చే….!)

సో కాల్డ్ మేనేజిమెంట్ గురు లాలూ అయినా, యెప్పుడైనా, ట్రాక్ పక్కన యే రూట్లో అయినా, తీసేసిన చెక్క స్లీపర్లూ, ఇనప స్లీపర్లూ, పట్టాలూ కనీసం పది అడుగుల యెత్తున పేర్చి వుండడం, అవి శిథిలమై పోతూ వుండడం గమనించాడా? వాటిని అమ్మేసో, రీసైకిల్ చేసో ఉపయోగించుకుంటే, రైల్వేలకి కొన్ని లక్షల కోట్ల నిధి జమ అవుతుందని గమనించారా? ఆక్రమణకి గురైన వేలాది యెకరాల రైల్వే స్థలాలగురించి ఇంక మాట్లాడవలసిందేమీ లేదు!

ఇక మధ్యలో మన సత్రకాయి, వన్ మ్యాన్ ఆర్మీ చిరంజీవి ‘మన ఎం పీ లు యేం చేస్తున్నారు’ అంటాడు! మన ఎం పీ లు మంద లాంటి మందమైన చర్మమున్న మందలే అన్న విషయం ఇంకా తెలియనట్టు!

‘యెవరో వస్తారని, యేదో చేస్తారని యెదురుచూసి’ మోసపోతున్న ఓ సగటు భారతీయుడా! నిన్ను ఆ దేవుడంటూ వుంటే, వాడు రక్షించుగాక!


4 comments:

Anonymous said...

లాలూ భాధని అర్థం చేసుకోండి.

తాను ప్రవేశపెట్టవల్సిన బడ్జెట్ ని మమత ప్రవేశపెట్టిందని ఆయన ఆక్రోశం.

33 మంది ఎం.పి లని ఇచ్చి కనీసం రైల్వే సహాయమంత్రి పదవి కూడా తీసుకోలేని దౌర్భాగ్యం మన ఆంధ్రులది.

మునియప్పని చూడండి ఎన్ని రైళ్ళు తెచ్చుకున్నాడో.

బ్లాగాగ్ని said...

డబుల్ డెక్కర్ రైళ్ళు కొన్నేళ్ళ క్రితంనించే వున్నాయండీ. నేను 2003 లో ఆఫీసు పని మీద అహ్మదాబాద్ నించి బొంబాయికి ప్రయాణించినప్పుడు డబుల్ డెక్కర్ రైల్లోనే వచ్చాను. కాబట్టి ఇది కొత్త ఆలోచనేమీకాదు. బహుశా వాటిని విస్తృతం చెయ్యాలని ఆవిడ వుద్దేశ్యం కాబోలు. ఆంధ్రకి మరీ తక్కువ కేటాయింపులు చెయ్యటం నాకూ నచ్చలేదు.

A K Sastry said...

డియర్ bonagiri!

మీ కామెంట్ కి ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ బ్లగాగ్ని!

ఆ డబల్ డెక్కర్లు యెంత స్పీడు తో ప్రయాణించేవి, యెంత దూరం ప్రయాణించేవి, అవి యెలక్ట్రిఫైడ్ అవునా కాదా--ఇలాంటి వివరాలు ఇస్తే, సమాచారం సంపూర్ణం గా వుండేది కదా! దాంతొ పాటు అవి ఇంకా నడుస్తున్నాయా, లేకపోతే యెందుకు తొలగించారు--ఇలాంటివి కూడా వ్రాస్తే, ఇంకా సంపూర్ణం గా వుండేది కదా!

దన్యవాదాలు!