Wednesday, April 22

జీవితం ఉచితం

ఉచితాల గురించి

‘కేపిటలిజం’-- నియంత్రణలేని విపణి వుండాలనీ, విపణిలో పరిస్థితులు ‘సరఫరా—గిరాకీ’ ల మీదే అధారపడాలనీ, సబ్సిడీలూ, ఉచితాలూ వుండకూడదు—అంటుంది!

కానీ, కొన్ని పరిస్థితులకి లోబడి, రాజకీయ లభ్ధి కోసం, అమెరికా లాంటి దేశానికి కూడా తప్పలేదు—కొన్ని ‘ఉచితాలు’ ప్రకటించకుండా!

అమెరికా లో వుండేవాళ్ళకి చాలా ముఖ్యమైనది ‘సోషల్ సెక్యూరిటీ నెంబరు’.

అక్కది ఉచిత పథకాల్లో ఒకటి, ‘సోషల్ సెక్యూరిటీ పధకం’.

దీని కింద, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి (పింక్ స్లిప్డ్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని) నెలకి ఇంత అని ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వడమే ఈ పథకం!

కొన్ని పరిణామాలవల్ల అక్కడి మాఫియా బలపడి, ‘మనీ లాండరింగ్’ లాంటివి పెరిగిపోయాయి అక్కడ! ‘స్లాట్ మెషీన్లు’, 'వెండింగు మెషీన్లు’ మొదలైనవి వాళ్ళ కంట్రోల్ లోనే వుంటాయి.

ఈ పధకంతో ‘లోన్ షార్కింగ్’ మొదలయ్యింది!

ఇప్పటికే, మనదేశం లో మాజీ ఫ్యాక్షనిష్టులూ, నడమంత్రపు సిరి రాజకీయులూ, మాఫియా లెవెల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. మనీ లాండరింగు కి మంచి ఉదాహరణలు సత్యం రామలింగ రాజూ, వై యెస్ జగన్ కంపెనీలూ!

ఇంక ఉచిత నగదు బదిలీ పధకం వస్తే, మనకి కూడా లోన్ షార్కింగ్ మొదలవుతుంది!

ఇప్పటికే, ప్రైవేటు బ్యాంకులూ, కొన్ని వ్యాపార సంస్థలూ వాటి వసూళ్ళకి గూండాలని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక ప్రతీ వూళ్ళోనూ వీధికో డజను చొప్పున వెలిసిన ‘మైక్రో ఫైనాన్స్’ సంస్థలు యెలా విచ్చలవిడిగా అప్పులిస్తున్నాయో, యెలా వసూలు చేసుకుంటున్నాయో తెలుసు కదా?

లోన్ షార్కింగ్ అంటే, ప్రజలకి వచ్చే నియమిత అదాయానికి ఇన్నిరెట్లు అని అప్పు ఇచ్చి, ప్రతీ నెలా ఆ అదాయం రాగానే, వడ్డీ వసూలు చేసుకు పోవడం! అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా పూర్తిగా కట్టలేక చేతులెత్తేసి, మాఫియా చేత వికలాంగులుగా చెయ్యబడ్డవారూ, చంపబడ్డవారూ కోకొల్లలు అక్కడ. ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!

మరి మన దేశం లో కూడా అలాంటి పరిస్థితులు రావని నిశ్చింతగా వుండగలమా?

ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్లా, గ్రూప్ లెండింగ్ ద్వారా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది!

ప్రభుత్వమూ, మీడియా ద్రవ్యోల్బణం రేటు ‘సున్నా’ దగ్గరకి వచ్చేసింది అనీ, వ్యతిరేక ద్రవ్యోల్బణం రావచ్చు అనీ, అది చాలా ప్రమాదకారి అనీ, ఓ ఊదరగొట్టేస్తున్నాయి!

ప్రభుత్వమేమో, కాకుల్లెక్కలు చెపుతూ, రిజర్వ్ బ్యాంకు మీద వత్తిడి తెచ్చి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేలాగ బోళ్ళు చర్యలు తీసుకొనేలాగ చేస్తోంది!

మరి కొన్ని లక్షలు మార్కెట్ లోకి వచ్చేస్తే అప్పుడు ద్రవ్యోల్బణం సంగతేమిటి?

ఉచితాలకి తోడు, ఋణ మాఫీలు కూడా ప్రకటిస్తుంటే, ఇక బ్యాంకుల అప్పులెవరు తీరుస్తారు? బ్యాంకుల లోని ప్రజా ధనానికి భద్రత యేముంటుంది?

పైగా, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతూవుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటే, జనం డబ్బెందుకు దాస్తారూ? యెప్పటికప్పుడు ఖర్చు పెట్టెయ్యరూ!

అలోచించండి మరి!

2 comments:

cbrao said...

"ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!" -వీటిని అరికట్టడానికి, అక్కడి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది? ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడిన వారికి ఏమి శిక్ష విధించారు? అమెరికాలాంటి దేశంలో ఇలా జరిగిందంటే నమ్మలేకున్నాను.

A K Sastry said...

డియర్ cbrao గారూ!

నిజంగా చాలా అమాయకంగా అడిగారు!

ఇదింకా చాలా చిన్న విషయం! ఇలాంటివాటికి ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే, అది మాఫియా యెందుకు అవుతుంది?

ఇక శిక్ష అంటారా......పోలీసులు కొన్ని సంఘటనలు జరిగాక, జరిగిన తీరుబట్టి ఫలానా మాఫియా మెంబరు చేసి వుంటాడని తేల్చి, మరోసారి 'యాక్షన్ ' లో వుండగా, కాల్చి పారేస్తారు! అంతకన్నా యేమీ చెయ్యరు.

పేపర్ల లో చూడడం లేదా.....ఇది 'ఆర్గనైజ్డ్ క్రైం' అయితే, 'అనార్గనైజ్డ్ క్రైంస్ ' లో పెద్దది 'మగ్గింగ్!' అంటే డబ్బుకోసం దారిన ఒంటరిగా పోతున్న వాళ్ళని నలుగురైదుగురు కలిసి చితక బాది, జేబులో వున్న చిల్లరా, ఖరీదైన వాచీలూ, గొలుసులూ లాకెట్లు మొదలైనవి దోచుకోవడం. అలాగే (వర్ణ) 'విచక్షణ 'తో విచక్షణా రహితంగా కాల్చి చంపడం!

ఇవన్నీ జరుగుతున్నది 'అమెరికా' లోనే!