జీవితం ఉచితం
మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
“ఏమయ్యా! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు. నీ పనులన్నీ నేనే చేస్తాను.” అని.
తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు. “మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను.” అని.
ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు. కొందరు గిన్నెలు, గరిటెలు, మూకుళ్ళు, విస్తళ్ళు, కొనే పని మీద వున్నారు. కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు. మరికొందరు ఆవాలు, ధనియాలు, పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు—అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు. దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు. అందరూ పళ్ళు తోముకుని – ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం. మా ఆవిడ ఈ వార్త చదివి, “ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు” అంది. అప్పుడు నాకనిపించింది – రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క, కారబ్బూంది, సున్నుండలు, మిరపకాయబజ్జీలు, కోడి పలావు, చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను.
అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట. ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు “అన్న దుకాణం” తెరిచినా ఆశ్చర్యం లేదు. అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ, సరదా హత్యలూ, చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు. సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది. నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని – చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం. రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు.
మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది. సాధించాలన్న కృషే జీవితం. ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని, ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం, కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే, ఏదో ఒక పని చేయాలన్న తపన. చేసిన ప్రతిఫలం సమాజానికీ, దేశానికీ దక్కుతుంది.
లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే – ఉచితంగా భోజనం, పళ్ళపొడి, గావంచా, సినిమా టిక్కెట్లు – లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే – వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు.
* * *
—ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం, అంటే 10-9-1982 న, “ఆంధ్ర జ్యోతి” లో ‘జీవనకాలం’ అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం!
మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా?
రాలేదంటే దానికి బాధ్యులెవరు?
మనమేమీ చెయ్యలేమా?
ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి!
సత్తా జనాస్సుఖినోభవంతు!
No comments:
Post a Comment