Sunday, February 1

కార్పొరేట్.....

కార్పొరేట్ చిల్లర దుకాణాలు!


నేను ముందే చెప్పాను—రిటెయిల్ (చిల్లర) వ్యాపారాల్లోకి కార్పొరేట్ లు ప్రవేశించడం వాటికీ, ప్రజలకీ, చిన్న దుకాణదారులకీ, ఆర్ధిక వ్యవస్థకీ దేనికీ మంచిది కాదని! విన్నారా? వినరు!

ఒక తాగుబోతు ఒక పెద్ద వీధి దీపం క్రింద గంట నించీ వెదుకుతున్నాడట దేనికోసమో! ఆ వీధినే గంటక్రితం వెళ్ళి, తిరిగి వస్తున్న వ్యక్తి అతన్ని అడిగాడట ‘యేమి వెతుకుతున్నావు?’ అని. అతను చెప్పాడు ‘పక్క వీధిలో మా యింటి తాళం పడిపోయింది—వెతుకుతున్నాను’ అని. ‘అదేమిటీ—పక్క వీధిలో పోతే అక్కడే వెతకాలిగాని, ఇక్కడ వెతుకుతే యెలా?’ అన్న ఆ వ్యక్తికి తాగుబోతు సమాధానం ‘మరి అక్కడ వెతకడానికి దీపం లేదుగా!’ అని!

మన కార్పొరేట్లు మాత్రం, ‘లాభాలు’ యెక్కడ వున్నాయా అని, సెర్చి లైట్లు పట్టుకొని వెతికేస్తాయి! చీమ దూరేంత సందు వుంటే యేనుగుని దోపెయ్యడానికి ప్రయత్నించేస్తాయి! దాని కోసం యెన్ని అడ్డ దారులైనా తొక్కుతాయి!

కొన్ని లక్షల చతురపు అడుగుల వ్యాపార ప్రదేశం లో, అనేక రకాల వస్తువులని నిలవ వుంచి, జనాన్ని రండి, కొనండి, ఆనందించండి అంటూ అహ్వానిస్తాయి!

మరి ఆ నిల్వలకి పెట్టుబడీ, భవన కట్టుబడి వ్యయం, దుకాణం నిర్వహణ ఖర్చులూ, ఉద్యోగుల జీత భత్యాలూ ఇలాంటివాటినన్నీ లెక్క వేసుకుని, వీధి చివర విల్లర కొట్టు వాడి కన్నా ప్రతీ వస్తువూ ఒకటి నించి పది రూపాయల తక్కువకి అమ్మి కూడా, లాభాలు అర్జించాలంటే, ముందే లెక్కలు వేస్తారు—మొదటి మూడు నాలుగు సంవత్సరాలూ నష్టాలు వచ్చినా, తరవాత (చిల్లర కొట్లన్నీ భూమి మీద నించి మాయం అయ్యాక, రెట్టింపు ధరలకి అన్నీ అమ్మడం మొదలెడితే) అయిదో సంవత్సరం నించీ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి—అని!

మరి ఈ లెక్కలు వేసేవాళ్ళు కూడా మన తొట్టి ఆడిటర్లే కదండీ? కాయితం మీద అన్నీ బాగానే వుంటాయి గాని, అసలు మాత్రం……అదన్నమాట!

నా చిన్నప్పుడు మా అమ్మ ‘బాబూ, ఎదురుగా వున్న చిల్లర కొట్లో ఓ పావుకేజి పంచదార పట్రా’ అంటే వెళ్ళిన నేను, దుకాణంవాడు కడుతుంటే, ఇంకొకావిడ వచ్చి ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం బేగి ఇచ్చెయ్యి బాబూ! ఈళ్ళ నాన్న కోప్పడిపోతన్నాడు’ అని చంకలో చంటిబిడ్డని చూపిస్తుంటే, దుకాణంవాడు ‘కాసేపాగు! కాటాలొ పంచదార కనబడడంలేదు!’ అని విసుక్కుంటుంటే, ‘పోనీ ఆవిడకి ఇచ్చేసిన తరవాతే నాకు పంచదార ఇయ్యి!’ అనేవాడిని—నాకంత అర్జెంటు లేదని!

మరి ఈ రోజునైనా, పొద్దున్నే ఆరింటికి కాఫీ గొంతులో పడక పోతే గడవని వాళ్ళూ, నిన్న రాత్రి పొద్దు పోతేగానీ తమ ఆర్జన చేతిలో పడని వాళ్ళూ, తొమ్మిదింటికో, పదింటికో తెరిచి, ఉద్యోగులందరూ వచ్చి, సర్దుకుని, అమ్మకాలు సాగించే వరకూ, ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం’ యెక్కడ వున్నాయా అని ‘మాల్’ అంతా గంటల తరబడి వెతుక్కుని, కొని, తీసుకెళ్ళడం—సాధ్యమేనా?

అందుకే ఈ రోజు ‘సుభిక్ష’ సంక్షోభంలో వుంది; రేపు త్రినేత్ర; యెల్లుండి ఇంకో చతుర్ముఖ, ఇలా అన్నీ!

మీ పిచ్చిగానీ! ఆడిటర్లూ—చిన్న లెఖ్ఖకి సమాధానం చెప్పండి—ఒక ఇల్లు కట్టడానిమి 30 మంది మనుషులకి 60 రోజులు పడితే, 600 మంది మనుషులు అదే ఇంటిని యెంత సేపట్లో కట్టగలరూ?

బుర్రలకి పదును పెట్టండి మరి!

పీ ఎస్: అపార్ట్ మెంట్ కొనబోతున్నారా? కొనొద్దు! ఆగండి. యెందుకంటే బిల్డర్లు ఉక్కుని టన్ను 60 వేల రూపాయలకి కొని కట్టారట! అదంతా మన మీద రుద్దుతారు! ఇప్పుడు టన్ను 29 వేలే! వాళ్ళు చెప్పిన ధరకి సగం రేటు కి ఇస్తేనే కొంటాం అని చెప్పండి! ఇవాళ కాక పోతే రేపు చచ్చినట్టు మీరడిగిన రేటుకే ఇస్తారు—లేదా కోట్లలో ములుగుతారు! తొందర మనకు లేదు!


4 comments:

Anonymous said...

చాలా బాగా చెప్పారు సార్!

నాగప్రసాద్ said...

చాలా బాగా చెప్పారు.

A K Sastry said...

డియర్ 'అమ్మ ఒడి ' మరియూ 'నాగప్రసాద్ '!

మీకు నచ్చినందుకు చాలా సంతోషం!

మరి యెవరిని ఉధ్ధరించడానికి వీళ్ళని ప్రోత్సహిస్తూ 'ఆర్ధిక వ్యవస్థ వృధ్ధి ' పేర విత్తమంత్రులు, రిజర్వ్ బ్యాంకుని ఒత్తిడిచేసి మరీ వడ్డీ రేట్లు తగ్గించమంటున్నారు?

Anonymous said...

అపార్ట్ మెంట్ కొనబోతున్నారా? కొనొద్దు.

మంచి సలహా ఇప్పుడున్న పరిస్తితులలొ. Thank you.