" 'క్రూర'మండల్" అనే గరీబ్ (లాలూ) రథం
మన దేశం లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ‘కోరమాండల్ ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పిందిట! కేవలం 18 మందే మరణించారట! యెందుకంటే, అప్పుడు అది గంటకి 60 కి.మీ. వేగంతోనే వెళుతోందట!
మరి దాని పూర్తి వేగం (గంటకి 120 కి.మీ. తో మొదలు పెట్టారు—ఇప్పుడు 140 కి.మీ. కి పెంచినట్టున్నారు) తో వెళుతూ వుండగా (అమంగళము ప్రతిహతమగుగాక!) అయితే అని అడగద్దు.
మన రైల్వేలకే ప్రతిష్ఠాత్మకమైన కోరమండల్ ప్రవేశపెట్టగానే—అతి తక్కువ స్టేషనులలో ఆగుతూ, మధ్య స్టేషనులలో ఆగకుండా వెళ్ళిపోతుంటే జనం నోరు వెళ్ళబెట్టి ‘అబ్బా! కోరమాండల్’ అంటూ చూసేవారు! (వెంటనే మనసులో ప్రశ్న—అంత స్పీడులో అది గానీ………అనుకొని చెంపలు వేసుకునేవారు పాడు ఆలోచన వచ్చినందుకు).
ఇప్పటివరకూ యెప్పుడూ జరగరానిది జరగలేదు! మరి ఇప్పుడెందుకు—అంటే సమాధానం—లాలూగారి కక్కుర్తీ, మన బ్యూరాక్రసీ!
దాదాపు 50 యేళ్ళుగా యెప్పుడూ వినని ‘పట్టాలు విరిగిపోవడం’ గురించి 21వ శతాబ్దం మొదట్లో విని, ఆశ్చర్య పోయేవాడిని!
చిన్నప్పుడు సైన్సు లో లోహాల సంకోచ వ్యాకోచ లక్షణాల గురించి చెపుతూ, ‘రైలు పట్టాల్కి ఒక దానికీ, ఇంకోదానికీ యెడం వుంచుతారు యెందుకు—అవి వ్యాకోచించి, ఒకదాని నొకటి గుద్దుకొని ప్రమాదాలు జరుగుతాయని’ అని చెప్పేవారు మా మేష్టారు!
కొత్త టెక్నాలజీ అంటూ, పట్టాలని వెల్డింగ్ చేయడం మొదలు పెట్టారట—అందుకని పట్టాలు విరిగి పోవడం మొదలు పెట్టాయి!
మరి ఆ టెక్నాలజీని యెక్కడ సంపాదించారో, దాని మీద సరైన అధ్యయనం జరిగిందో లేదో మన బ్యూరాక్రసీయే చెప్పాలి.
అక్కడనించీ, కోకొల్లలుగా ‘త్రుటిలో తప్పిన’ రైలు ప్రమాదాలూ, గ్యాంగుమన్ సమయ స్పూర్తి వల్ల తప్పిన రైలు ప్రమాదాలూ, లైన్మెన్ కి అవార్డులు ప్రకటించడాలూ లాంటి వార్తలు పేపర్లలో చదువుతూనే వున్నాము.
వీళ్ళ కక్కుర్తికి పరాకాష్ట—‘సైడ్ మిడిల్ బెర్త్ లు’ బిగించడం!
ఒక రైలు పెట్టెలో, తొమ్మిది ‘సెల్స్ ‘ గా, ఒక్కోదాంట్లో అడ్డంగా యెదురెదురుగా మూడేసి చొప్పున ఆరూ, నిలువుగా రెండూ కలిపి, యెనిమిది బెర్తులతో మొత్తం 72 బెర్తులూ, యేదో ఒక పక్క మరో మూడు బెర్తులూ కలిపి, పెట్టెకి 75 చొప్పున బెర్తులు వుంటాయి.
ఇప్పుడు, తొమ్మిది సెల్స్ లో ఒక్కొక్కటి చొప్పున 9 సైడ్ మిడిల్ బెర్తులు బిగించడంవల్ల—తొమ్మిది మంది మనుషులు—ఒక్కొక్కరూ సగటున 50 కే జీల బరువున్నా, దాదాపు అర టన్నూ, బెర్తుల, వాటి గొలుసుల, బరువూ, వాళ్ళ లగేజీ బరువూ కలుపుకుంటే, కనీసం ఒక టన్ను బరువు పెరుగుతుంది కదా? మరి చక్రాలూ, ఇరుసులూ, బ్రేకులూ—వాటి పై యెంత భారం పడుతోంది—అని అధ్యయనం చేశారా? అదీ మన బ్యూరాక్రసీయే చెప్పాలి.
బొగ్గు ఇంజన్లతో రైళ్ళు నడిచేటప్పుడు మామూలు ఇంజన్లతో నడిచే రైళ్ళకి గరిష్ఠంగా యేడు లేక ఏనిమిది పెట్టెలు వుండేవి! కెనడా ఇంజను తో నడిచే మెయిలూ, జీటీ, సర్కార్ లాంటి రైళ్ళకి గరిష్ఠంగా పది/పన్నెండు పెట్టెలు వుండేవి. అప్పట్లో చక్రాల క్రింద నిప్పురవ్వలు రావడం, చూడడం చాలా అరుదు! అది కూడా మెయిలూ అవీ రాత్రి పూట పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు—యెవరోగానీ చూసేవారు కాదు.
ఇప్పుడు చిన్న రైలుకి కూడా 18 పెట్టెలూ, పెద్దవాటికి 23 నించి 27 వరకూ తగిలిస్తున్నారు. వాటిల్లో కనీసం 9 నించి 14 వరకూ స్లీపరు క్లాస్ పెట్టెలూ, రెండైనా ఏ సీ (III) పెట్టెలూ వుంటున్నాయి. అంటే, కనీసం 15 నించి 20 టన్నులు బరువు పెరుగుతోంది ఈ సైడ్ మిడిల్ బెర్త్ ల వల్ల.
మరి పట్టాల లో యేమైనా మెరుగుదల వుందా?
కాంట్రాక్టర్ల అధికారుల అవినీతి తో బల్లాస్ట్ గా వాడే కంకర దగ్గరనించీ, ఒకచోట వేసిన దానినే బిల్లు తినేశాక ఇంకో చోటు కి తరలించి బిల్లులు పెట్టుకోవడం లాంటి లీలలతో నానాటికి తీసికట్టు నాగంభొట్టు అన్నట్టుంది వాటి స్థితి.
చక్రాలనించి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు, పట్టాల వెల్డింగ్ కి ఉపయోగించిన లోహం కరిగిపోయి, చక్రాలకి చుట్టుకుని చక్కగా మండుతూ, బోగీలని అంటించేస్తోంది! అందుకే స్లీపర్ క్లాస్ లో మొదటి లేదా చివరి బోగీలకీ, వాటి పక్కనే ఏ సీ బోగీలకీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి--బ్రేకులు వేసినప్పుడు వాటి చక్రాలకే వత్తిడి యెక్కువగా వుండి, నిప్పులు బాగా యెక్కువగా వచ్చి!
ట్యూటికోరిన్ లో తనకు బహూకరించిన మేకపిల్లని ఢిల్లీలో తన మనవడికి ఇచ్చి, అది మళ్ళీ తల్లికోసం బెంగ పెట్టుకుందని ఆ తల్లిని వెతికించి, దాన్ని మళ్ళీ ప్రత్యేక ఏ సీ బోగీలో ఢిల్లీ కి పంపించిన మన మేనేజిమెంటు గురు లాంటి వాళ్ళ నడ్డి విరగదన్నాలా వద్దా.
ఆలోచించండి!
2 comments:
మా నడ్డి విరగదన్నితే గడ్డితిన్నోళ్ళం మిమ్మల్ని కుమ్మిపారేస్తాం జాగ్రత్త
డియర్ విజయమోహన్!
పోనీ ఈ సారికి బందెల దొడ్డికి తోలేద్దాం--వెరైటీగా! అక్కడ తోటి పశువులు చూసుకుంటాయి!
ధన్యవాదాలు!
Post a Comment