Sunday, February 15

మానవహక్కులు

పోలీసులపై కేసులు!

వినడానికి చిత్రంగానే వుంటుందిగాని, మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది జరిగే తీరాలట!

ఓ పదిహేనేళ్ళ క్రితం, పోలీసుల తీరుపై ‘అమానుష హక్కులు’ శీర్షిక తో ఈనాడు పత్రికలో నా లేఖ ఒకటి ప్రచురితమయ్యింది.

అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా అంటే, వచ్చింది—వెనకనించి!

అప్పట్లో, యెవరైనా అందోళన చేస్తూ వుంటే, పోలీసులు అక్కడకి చేరుకొని, మైకులో రెండు మూడు సార్లు హెచ్చరికలు చేసి, అప్పుడు గుంపుని చెదరగొట్టేవారు! బెత్తాలకీ, లాఠీలకి పని చెప్పేవారు! యెవరికీ పెద్దగా గాయాలు తగిలేవి కాదు—అవి నిజమైన అందోళనలు కాబట్టి!

తరవాత్తరవాత, ఈ రాజకీయ, కుల, మత ఫ్యాక్షన్ అందోళనలు పెరిగాక, తరలించబడిన జనాలతో, గూండాల నాయకత్వం లో జరుగుతున్న అందోళనలు ముష్టి యుద్ధాలనీ, కత్తి యుద్ధాలనీ తలపిస్తున్నాయి! ఇంకా పురాణాలు, ఇతిహాసాల్లో విన్న కుస్తీలూ, పోరాటాలూ వీటి ముందు దిగదుడుపు అనిపిస్తున్నాయి!

పైనించి వచ్చే అదేశాలమేరకు వాళ్ళని ఓఅరగంటో, గంటో అందోళన చెయ్యనిచ్చి, ఆ తరవాత విజృంభిస్తున్నారు! మన పోలీసులు! ఆడవాళ్ళనీ, మొగవాళ్ళనీ ఒకే విధంగా పక్షపాతం లేకుండా చూస్తున్నారు!

ఇక పేపర్లలో ఫోటోలూ, టీవీల్లో వీడియోలూ చూస్తూనే వున్నాము—చెరో పోలీసు ఒకణ్ణి చెరోకాలూ పట్టుకొని భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్టు చీలుస్తుంటే, ఇంకొకడు కాళ్ళ మధ్యన బూటు కాలితో తన్నడం! వెనక్కి రెక్కలు విరిచేసి ఒకడు పట్టుకుంటే, ఇంకొకడు బూటు కాళ్ళతో గూడు మీద తన్నడం! ఈడ్చుకు తీసుకెళ్ళి, కాళ్ళొకళ్ళూ, చేతులొకళ్ళూ పట్టుకొని, వాన్ లోకి బస్తాని విసిరినట్లు, నడుములు విరిగేలాగ విసిరెయ్యడం! (దీంట్లో నాయకులకి కూడా మినహాయింపు లేదు!)

మరింక మానవహక్కులెక్కడ?

అదే విదేశాల్లో చూస్తే, ఆందోళనలు కాక పోయినా, క్రిమినల్స్ నీ, మాఫియా వాళ్ళనీ కూడా రాగ ద్వేషాలకతీతంగా అందర్నీ ఒకే రకంగా ఒకే పద్ధతిలో లొంగతీసుకుని అరెష్టు చేస్తారు!

మన పోలీసులు యెప్పుడు అలా అవుతారు? యెన్ని కోర్టు తీర్పులూ, యెన్ని కేసులూ విచారణలు జరగాలి? యెంతమంది పోలీసులూ, ఉన్నతాధికారులూ శిక్షలు అనుభవించాలి? అసలు ఇవన్నీ జరిగేవేనా!

చూద్దాం!

No comments: