Wednesday, January 4

(తప్పనిసరి) తద్దినాలు.....!?"పి కాః" అంటే.....?

మా ఇంట్లో మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిన, ఇత్తడి "అడ్డెడు గిన్నె" ఉందేది. అంటే, అందులో అడ్డెడు బియ్యం ఒకేసారి అన్నం వండుకోవచ్చు అన్నమాట. అడ్డెడు అంటే, కుంచం లో సగం. అంటే ఇప్పట్లో 2 కేజీలకు పైగా అనుకుంటా! 

ఆ గిన్నెతో రోజూ అన్నం వండుకోవడం అవసరం ఉండదు కదా? మహా అయితే మనం రోజూ ఓ సారి తినేది 100 నించి 200 గ్రాములేమో! అందుకని, ఆ గిన్నెని మా తలంట్లకీ, స్నానాలకీ వేణ్ణీళ్లకోసం వాడేవాళ్లు. ఆ గిన్నె మీద తెలుగు లో చెక్కించబడిన పేరు, నాకు అలా తోచి, "పికాః" అని చదివేవాడిని!

నిజానికి అది ఆ చెక్కిన వాడి దృష్టిలో, "పి కొం"--అంటే పిరాట్ల కొండయ్య--అది మా తాత, అంటే అమ్మ తండ్రి  పేరు!

అందుకనే, నేను ప్రతీసారీ "అమ్మయ్య" అనుకున్నప్పుడల్లా, "పిరాట్ల కొండయ్య"! అని కూడా అనుకుంటాను. 

అలాగే, "అమ్మమ్మా" అనో, "అయ్యయ్యా" అనో, "అయ్యమ్మా" అనో అనాల్సి వస్తే, వాళ్లపేర్లు కూడా తలుచుకోవాలి అని నియం పెట్టుకొని, ఏడాది పైగా ఆచరిస్తున్నాను. 

మా ఆవిడ కూడా ఇది ఆచరణలో పెట్టింది. మొదట్లో, అమ్మయ్య అన్నప్పుడు, వాళ్ల అమ్మ తండ్రి పేరు "రొయ్యూరు వెంకటేశ్వర శర్మ" అని తలుచుకోడానికి కష్టపడేది! దానికి నేనో చిట్కా చెప్పాను.

అసలు, "వెంకటేశ్వర శర్మ"; "సుబ్రహ్మణ్య శాస్త్రి"; "అప్పయ్య దీక్షితులు"; "పరమేశ్వర సోమయాజి"; "నరసింహ అవధాని"-- లాంటి పేర్లు, "బ్రాహ్మణ వ్యాకరణం" లోంచి పుట్టాయి గానీ, అసలు పేర్లు--"వెంకయ్య"; "సుబ్బయ్య"; "అప్పయ్య"; "పరమయ్య"; "నరసయ్య"--ఇవీ! 

అందుకని, అమ్మయ్య అంటూ, "వెంకయ్య" అనుకుంటే సరిపోతుంది! అదే ఆచరిస్తోంది మా ఆవిడ ఇప్పుడు!

అసలు ఇదంతా ఎందుకు? అంటారా! ఏడాదికోసారి, తప్పనిసరి తద్దినాల్లోనే వాళ్ల పేర్లు తలుచుకోవడం, 12 యేళ్లకోసారి, ఇతర పూర్వీకులని తలుచుకోవడం, చాలామందికి వాళ్ల పేర్లు తెలియక ఇబ్బంది పడి, అందర్నీ అడిగి, తెలుసుకోవడం కన్నా, ఇలా అయితే, మన తరవాత తరాలవాళ్లకి వాళ్ల పేర్లు ఎప్పుడూ నోట్లో వుంటాయి!

పైగా, పూర్వీకుల పేర్లు అన్నీ దేవీ దేవతల పేర్లే! అందుకే, పుణ్యమూ పురుషార్థమూ కలిసివస్తాయి!

యేమంటారు?

12 comments:

sarma said...

సుబ్బయ్య,సుబ్బన్న, వెంకన్న కాదండీ వేంకన్న, కావమ్మ, నరసమ్మ, నరసన్న, కొన్ని చోట్ల నరసక్క ఇలా చాలా పేర్లు కనపడ్డాయి, నాకు స్వానుభవం కూడా. నా దగ్గర 200 వందల సంవత్సరాల కితపు దస్తావేజులున్నాయి. వాటిలో పేర్లు ఇలాగే ఉన్నాయి. కరక్కాయ సిరాతో గొలుసుకట్టు రాత పూసకుట్టురాత, మిషనుకుట్టు రాత బలే బలేగా ఉంటాయండి. ఆ కాయితం చదవడమే ఓ గొప్ప.

విన్నకోట నరసింహా రావు said...

ఈ కాలపు పేర్లతో ఆ ఇబ్బందేమీ లేదండి శాస్త్రి గారూ. ఎందుకంటే ఆ పేర్లేవిటో అసలు అర్ధం అయితే కదా. కుర్ర తల్లిదండ్రులే స్వంతంగా ఏవో రెండు మూడు శబ్దాలను కలిపేసి (అవి కలవకపోయినా) పేరు తయారు చేసెయ్యడం. ఏమంటే ఆ పేరు unique గా ఉండాలట (అంటే ఆ పేరు ప్రపంచంలో వేరెవరికీ ఉండకూడదట. ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత స్కూల్లోనూ, కాలేజ్ లోనూ, ఉద్యోగం లోనూ పక్కవాళ్లు ఆ పేరుతో ఆటపట్టిస్తే ఆ బిడ్డ ఖర్మ). ముఖ్యంగా అత్తగారి పేరు, మామగారి పేరు తమ పిల్లలకి పెట్టడం సుతరామూ ఇష్టంలేదు. దాంతో పెద్దవాళ్ళ పేర్లు పిల్లలకి పెట్టడం అనే పరంపర ఆగిపోయి చాలా కాలమైందండీ. ఇక తద్దినాల కోసమని ఆ మూడు పేర్లూ నోట్ బుక్ లోనే డైరీ లోనో -- కాదండోయ్ కాదు, సెల్ ఫోన్ లోనో లాప్టాప్ లోనో -- వ్రాసుకుని ఉంచుకుంటారేమో ?

sarma said...

నా పైన నా పూర్వీకులు ఏడు తరాలు వంశవృక్షం రాసుంచారు, నేను దాన్ని భద్రం చేశాను బ్లాగులోనూ పెట్టుకున్నానండి. పై మూడు తరాలకి ప్రతి నెల అమావాస్యకి,సంక్రమణానికి తర్పణం ఇస్తా.

విన్నకోట నరసింహా రావు said...

వంశవృక్షం వ్రాసుంచడం మీ పూర్వీకులు చేసిన మహత్తరమైన పని. అది సంపద లాంటిది. ఆ వ్రాతప్రతిని తప్పక భద్రం చేసుకోవాలి శర్మ గారూ. బ్లాగులో కూడా పెట్టుంచడం అదనపు సౌకర్యం. కాని వంశవృక్షం లాంటి ముఖ్యమైన పత్రం విషయంలో ఎలక్ట్రానిక్ కాపీ మీద మాత్రమే భరోసా పెట్టుకునుండడం మంచిది కాదు అన్నది నా పాయింట్ (ప్రపంచంలో అన్ని వ్యవహారాలూ paperless చెయ్యాలని ఎంత ధ్యేయం పెట్టుకున్నా కూడా). అయినా ఈ తరం వారు మాత్రం పేపర్ కాపీ పట్ల విముఖత పెంచుకుంటున్నారు. ఏదో బిల్లులు, రసీదులు, టిక్కెట్లు, చిన్నాచితకా చెల్లింపులు లాంటి వరకు paperless ఫరవాలేదు కానీ కొన్ని శాశ్వతంగా ఉంచాల్సిన ముఖ్య పత్రాలు కాగితం మీద ఉండితీరాలని నా అభిప్రాయం. Paperless అనేది ప్రతిదానికీ తారకమంత్రం కానేరదు.

ఇక ఈ టపాలోని అసలు విషయానికొస్తే ప్రతి కుటుంబం వారి వంశవృక్షం తయారు చేసుకోవడం మంచి పని (వాళ్ళ పెద్దవాళ్ళు ఉండగానే చెయ్యడం మంచిది, వంశం గురించి వివరాలు చెప్పగలుగుతారు కాబట్టి).

sarma said...


మిత్రులు కృష్ణశ్రీగారు మన్నించాలి.

నరసింహరావుగారు.

ఆ కాగితాన్ని లేమినేట్ చేయించి భద్రపరచాను.వంశవృక్షం ఎలా రాసుకోవాలో కూడా సూచనలూ ఇచ్చాను.
ఈ లింకులో చూడగలరు.https://kastephale.wordpress.com/2011/11/15/357/
ధన్యవాదాలు

Pavan said...

బాగుందండి మీ పద్దతి కృష్ణ శ్రీ గారు.

విన్నకోట నరసింహా రావు said...

అవును శర్మ గారూ, కృష్ణశ్రీ గారి బ్లాగ్ లో మనమంతా మాట్లడేసుకుంటున్నాం కదా 🙂.
వంశవృక్షం ప్రతిని లామినేట్ చేయించి ఉంచుకోవడం మరింత ప్రశస్తమైన ఆలోచన 👌.
మీరిచ్చిన లింక్ లో మీ వంశవృక్షం చూశాను. చాలా తరాలు వెనక్కి వెళ్ళగలిగారు. పెద్దవాళ్ళ పేర్లు తమ సంతానానికి పెట్టే సంప్రదాయాన్ని పాటించినట్లు కూడా తెలుస్తోంది. బాగుంది 👏.

పిల్లలకి పెట్టే పేర్లలో కొత్త పోకడలు మాగంటి వంశీ మోహన్ గారు తన "జానుతెనుగు సొగసులు" బ్లాగ్ లో ఈ నెల 4న ఓ చక్కటి టపా వ్రాసారు.

www.janatenugu.blogspot.in

Ammanamanchi Krishna Sastry said...

ఓహ్! "కష్టేఫలి" శర్మగారా! మీ వ్యాఖ్యలు చాలా సంతోషం కలిగించాయి.

నా దాదాపు 40 యేళ్ల బ్యాంకు ఉద్యోగం లో ఎన్ని దస్తావేజులు చూసి, చదివి ఉంటానంటారు? ఉదాహరణకి, ఊళ్ల పేర్లు కూడా ఎలా మార్పు చెందాయో తెలిసేది. ఓ పురాతన దస్తావేజు లో, కాశీబుగ్గని "పార్సంబా పురపు కాశీబుగ్గ" అని చదివి, ఒహో.....పూర్వం ఆ పేరుతో పిలిచేవారన్నమాట అనుకున్నాను. తరువాత ఇంకో దస్తావేజు లో "పార్సంబ వురఫు కాశీబుగ్గ" అని వుంటే, ఆహా.....అది వ్రాతలో వచ్చిన తేడా అన్నమాట అని నిశ్చయం చేసుకున్నాను!

ఇంక వంశవృక్షం విషయానికొస్తే, నేను కూడా మా పూర్వీకుల పేర్లు చాలామటుకు సేకరించగలిగాను. ఇంక వల్లకాక మానేశాను. అవన్నీ " లో భద్రపరచాను. మా ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో, దాదాపు సమగ్రంగా ప్రచురించాను. ఇంకా మార్పులు చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడూ!

మీరు మన్నింపు ఎందుకు అడిగారో అర్థం కాలేదు! ఆ అవసరం కనపడలేదు.

ధన్యవాదాలు!

Ammanamanchi Krishna Sastry said...


"పార్సంబ వురఫు (uraf) కాశీబుగ్గ"; "Geni" లో భద్రపరచాను.--అని ప్రచురించే ముందు వ్రాద్దామనుకొని, మరచాను. క్షంతవ్యుణ్ని!

Ammanamanchi Krishna Sastry said...

విన్నకోటవారూ! మీ పుణ్యమా అని మళ్లీ పాత మిత్రులని కలుసుకోగలుగుతున్నాను.

మీ సలహాలు బాగున్నాయి. వంశీ బ్లాగ్ కూడా నా ఫేవరిట్ బుక్ మార్క్స్ లో ఉంది! చూస్తూనే ఉంటాను.

మరోసారి ధన్యవాదాలు!

Ammanamanchi Krishna Sastry said...


చాలా సంతోషం Pavan!

sarma said...

కృష్ణ శ్రీ గారు

నేనూ గుర్తింపబడినందుకు ___/\__
మీ గుమ్మం దగ్గర నేను సోది మొదలెడితే,లోపలున్న మీకు ఇబ్బంది అనుకుని...... :)
పాత కాలం కాగితాలో చరిత్ర దాగుందండి. ఊళ్ళ పేర్లు,ఇంటి పేర్లు,పేర్లు రూపాంతరం,అపభ్రంశం చెందిన విధం, ఆర్ధిక,సామాజిక సంబంధాలు వగైరా వగైరా ... చూసే కన్నుండాలి..
ధన్యవాదాలు.