Wednesday, November 16

బాలల.............చదువులు

బాలల దినోత్సవం రోజున--14-11-2011 న--ఈనాడులో శ్రీధర్ కార్టూన్....కాస్త నవ్వు పుట్టించినా, కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి. అందులో....

ఓ పిల్లాడు ప్రథానిని "అప్పుడు పేదవాళ్లకు లాంతర్లూ, కిరోసిన్, పుస్తకాలూ, చదువూ....అందుబాటులో వుండేవా సార్?" అని అమాయకంగా, దీనంగా, హాచ్చెర్రెంగా అడుగుతున్నాడు!

నిజంగా, తన తలపాగాని అలాగే వూడదీసి, ఆ చిప్పలో నీళ్లు నింపుకొని, అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించాలాయనకీ.....అది చూస్తే.

"మీరలా అనడాన్‌కి గుట్కా లేదు....రూల్స్ వొప్పుకోవు.....మన అధిష్టానమ్మ పెర్మిషన్ లేకుండా అలాంటి నిర్ణయాలు దీసుకోరాదు. కోర్ కమిటీలో చర్చించాక, మీకు ఆదేశాలిస్తాం...అంతవరకూ, తలపాగా తగిలించేస్కొని, వెయిట్ చెయ్యండ్రి" అని కి కు రె అన్నట్టు ఆయనకి వినిపించిందేమో! ఆయన ఆ పని చెయ్యడానికి ప్రయత్నించలేదు. 

నా అయిదో యేట, విజయదశమినాడు, మా నాన్నగారి ఆధ్యాత్మిక గురువు చల్లా కృష్ణమూర్తి శాస్త్రి (ఆయనపేరే నాకు పెట్టారు.) చేత నా అక్షరాభ్యాసం మొదలై, అదేరోజు, జీడీఎం (గోదావరి డెల్టా మిషన్) ఎలిమెంటరీ స్కూలుకి (పసుపుగోచీ అలాగే వుంచుకొని, దానిమీద నిక్కరు చొక్కా వేసుకొని, చంకలో పలకతో, అప్పటికే ఆ స్కూల్లో చదువుతున్న మా అన్నయ్య స్నేహితులతో, పరుగు పరుగున స్కూలుకి వెళ్లడం నా కళ్లకి కట్టినట్టు కనిపిస్తూంది....ఇప్పటికీ!) వెళ్లి, ఒకటో తరగతిలో, పిల్లలందరికీ పప్పు బెల్లాలూ, కణికలూ, ఐదారుమందికి పలకలూ, సీనియర్ విద్యార్థులకి యెక్కాల పుస్తకాలూ పంపిణీ పూర్తయ్యాక, మరియా టీచర్ నా పలక మీద "అ, ఆ" అని వ్రాసిచ్చి దిద్దుకోమని చెప్పడం, వెనుక ఖాళీగావున్న ఓ "నేలబల్ల" మీద కూర్చొని, నేను దిద్దడం మొదలెట్టడం...పావుగంటైనా నేను దిద్దుతూనే వుండడం...ప్రక్కనున్నవాడు 'తీసుకెళ్లి టీచరుకి చూపించు' అనడం, నేను (అప్పటికే ఆవిడ చుట్టు మూగి వున్న పిల్లల్లో కాస్త చోటుచెసుకొని) పట్టుకెళ్లి  చూపించడం, ఆవిడ అవి చెరిపేసి, మళ్లీ "అ, ఆ" లు వ్రాసిచ్చి దిద్దమనడం.....నా మూడో యేటనే అ ఆలు నేర్చేసుకొని వుండటంతో ఆ "చదువు"ని ఎంజాయ్ చెయ్యడం.....! ఇవన్నీ ఇప్పటికీ "డేజావూ" నాకు!

.......మరోసారి.

2 comments:

Anonymous said...

నిజంగా, తన తలపాగాని అలాగే వూడదీసి, ఆ చిప్పలో నీళ్లు నింపుకొని, అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించాలాయనకీ.....అది చూస్తే


బంగారమ్మ పెర్మిషన్ ఉండాలేమో?

కృష్ణశ్రీ said...

టపా పూర్తిగా చదవకుండానే కామెంటెయ్యడమేనా? ఆఁయ్!!!

(తరవాత కి కు రె ఇచ్చిన వార్నింగు అదే కదా!)