Monday, November 21

కొలతలూ......3



......మానాలూ

ఇంకా, దమ్మిడీనే 'పైస' అని కూడా అనేవారేమో. యాగాణీ అంటే రెండు పైసలు అనుకుంటా. (ఈ నాణాలు నేను చూడలేదు. యెన్ని గవ్వలైతే ఒక పైసాగా పరిగణించేవారో కూడా నాకు తెలీదు).  

అప్పట్లో, పెద్ద కాణీలు, జార్జి 5 త్ కింగ్-ఎంపరర్ బొమ్మతో వుండేవి. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడే "గేట్ వే ఆఫ్ ఇండియా" ఆయనకి స్వాగతం చెప్పడానికి అప్పటి బొంబాయిలో నిర్మించారు(ట). విశ్వకవి రవీంద్రుడు ఆ సందర్భంగానే, "జనగణమన" వ్రాశాడు అని కొంతమంది వ్రాసిన చరిత్ర!  

రెండో ప్రపంచ యుధ్ధం రోజుల్లో, పొదుపు కోసం చిన్న సైజు కాణీలూ, తరవాత "చిల్లు కాణీలు" ప్రవేశపెట్టారు. అంటే యేమీలేదు--కాణీలో మధ్యభాగాన్ని తొలగించి, అంచుమాత్రమే ముద్రించేవారు. ఆ కాణీలని పిల్లల మొలత్రాళ్లలో కూడా కట్టేవారు--దిష్టి తగలకుండా(ట)! 

తరవాత, జార్జి 6 త్ తో కూడా కాణీలు ఇతర నాణాలూ వచ్చాయి. స్వతంత్రం వచ్చాక, ఆ చిన్న కాణీల మీద  పరుగెడుతున్న గుర్రం బొమ్మ ముద్రించేవారు.

కాణీ పైన వుండే అర్థణా దగ్గరనుంచీ, రూపాయి వరకూ చివర 'కాసు' చేర్చేవారు--అర్థణాకాసు, అణాకాసు......ఇలా. 

ఇంకా, అణాకాసుని 8 వృత్తాకార కోణాలతో, వెనుకవైపు చక్కటి డిజైన్ మధ్య ఇంగ్లీషులో వన్ అణా అనీ, తెలుగులో ఒక అణా అనీ ముద్రించేవారు! ఇవి దేశవ్యాప్తంగా చలమణీలో వుండేవి అని మరిచిపోకండి--అదీ అప్పట్లో తెలుగుకి వున్న గుర్తింపు. 

ఇప్పుడు ఒక రూపాయి, రెండు రూపాయలూ, ఐదు రూపాయలూ నాణాలన్నీ ఒకే సైజులో గుండ్రంగా ముద్రించేబదులు, ఇలా చక్కటి డిజైన్లలో ముద్రిస్తే యెంత బాగుండును? మళ్లీ అలాంటి అందమైన నాణాలని చూడగలమా? దువ్వూరివారేమంటారో! 

ఇంక, అణా కి 12 పైసలు. రూపాయికి 16 అణాలు--అంటే, రూపాయికి 192 పైసలు. 

లెఖ్ఖల్లో, 1000 పైసలని, రూపాయలూ, అణాలూ, పైసలూ లోకి మార్చమనీ--ఇలా మా ప్రాణాలు తీసేవారు! (మీరెవరైనా చెయ్యగలరేమో ప్రయత్నించండి!)

(బ్రిటిష్ వాళ్ల పౌండ్ కి 20 షిల్లింగులు, ఒక్కో షిల్లింగుకి 12 ఓ 16 ఓ పెన్నీలు వుండేవి. ఆ లెఖ్ఖలు కూడా మమ్మల్ని చంపేవి! తరవాత వాళ్లు కూడా పౌండ్ కి 100 పెన్నీలుగా మార్చుకున్నారు--ఇంటర్నేషనల్ కరెన్సీగా మారాక)

ఇంకో చిత్రమేమిటంటే, నిజాం పాలనలోనేకాదు....మనకి స్వతంత్రం వచ్చాకా, నిజాం రాష్ట్రం మన దేశంలో విలీనం చెయ్యబడ్డాక కూడా, "తెలంగాణా వంద" చాలకాలం చెలామణీలో వుండేది. అంటే వంద వస్తువులు అంటే వాళ్ల లెఖ్ఖ 192!

(మా పెద్ద దొడ్డ, పెళ్లికాగానే భర్తతో నిజాం పాలనా కాలంలోనే హైదరాబాదు వెళ్లిపోవడంతో పక్కా తెలంగాణా భాషా, యాసా, కట్టూ బొట్టూ, ఆచారాలు వచ్చేశాయి ఆవిడకి. ఆవిడ, మనకి ఆవకాయలకోసం మామిడికాయలు 'మన వంద' 3 రూపాయలకి ఇస్తున్నారంటే, "మాకూ మూడు రూపాయలే--కానీ, తెలంగాణా వంద! ముక్కలు కొట్టి కూడా ఇస్తారు!" అని మా అమ్మని వుడికించేది! తనకి పిల్లలు చిన్నగా వున్నప్పుడే భర్తృవియోగం కలగడంతో, ఆవిడే మార్కెట్ కి వెళుతూండేది. తేడా అల్లా ఆవిడ చెప్పులు వేసుకొనేది కాదు. దాంతో మార్కెట్లో అందరూ "ఆంధ్రావాలీ" అని గుసగుసలు పోయేవారట. పిల్లలైతే, గేలి చేస్తున్నట్టుగా చిత్రంగా చూస్తూ వెనుకబడేవారట! అలా అని ఆవిడని యెవరూ అవమానించడమో, వివక్ష చూపడమో జరిగేది కాదట! ఇప్పటి "ప్రత్యేక తెలంగాణా వాదులకి" ఈ విషయాలు తెలుసోలేదో మరి)

యెక్కడో ములిగి యెక్కడో తేలాం అనుకుంటా. 

కరెన్సీ, నాణాలూ గురించి ఈ మాత్రం చాలనుకుంటా.

.....కొనసాగింపు మరో టపాలో

No comments: