Monday, July 11

మా మూడో హనీమూన్ అనే.......-16

మొన్నటి మా యాత్ర

సినిమా అయి బయటికి వచ్చాక, ఇంక మ్యూజియంలో "క్లైమాక్స్"! 
 
"మొత్తం మ్యూజియానికీ, గుడికీ, ఢిల్లీకీ, దేశానికీ, ప్రపంచానికీ 'హై లైట్'; అది చూడని వాళ్ల జన్మ వ్యర్థం: మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి కదండీ?" ఇలాంటి కామెంట్లు అనేకం పొందిన "నదీ యాత్ర". 
 
అంటే, ఓ పది పదిహేను మంది పట్టే బోటులో కూర్చోపెట్టి, దానిని అండర్ గ్రవుండ్లో వున్న ఓ నదిలాంటి ప్రవాహంలోకి, పెద్ద చైన్లూ, పళ్ల చక్రాలూ సాయంతో, పంపిస్తారు. అక్కడ, 'సబ్ డ్యూడ్' లైటింగులో, ఈ ప్రక్కా, ఆ ప్రక్కా లైఫ్ సైజు బొమ్మలతో, వాటిమీద స్పాట్ లైట్లతో ప్రదర్శన కొనసాగుతుంది. స్పీకరులో, అది సరయూ నదిలోనో, గంగా నదిలోనో, మన జీవన వాహినిలోనో జరుగుతున్న యాత్ర అంటూ, ఒక్కొక్క దృశ్యాన్నీ, అందులోని వాళ్ల పేర్లనీ, చరిత్ర (ఇతిహాసం) నీ చెపుతూ, వూరేగిస్తారు మనని. 
 
రామాయణ భారతాలదగ్గరనుంచీ, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడూ, శుశ్రుతుడూ దగ్గరనుంచి, అక్బరూ, షాజహాన్ల నుంచి, ఝాన్సీ లక్ష్మీ, శివాజీ, ఇతర రాజులూ, స్వతంత్ర పోరాటం నుంచి, అన్నీ చూపించి, చివరగా, ఇదంతా ఆ "స్వామినారాయణుడి" చలువ--అనే సందేశంతో ముగుస్తుంది ఆ యాత్ర. బోట్లు పైకి వచ్చి, మనం బయటికి! 
 
హమ్మయ్య! మ్యూజియం అయిపోయింది. 
 
కొంచెం గాలి పీల్చుకొంటూ, కారిడార్లలో నడుస్తూ, అసలు "గుడి" ని చేరతాం. 
 
గుడి చుట్టూ అనేకవందలమంది జనాలు--యెవరి వ్యాసంగంలో వాళ్లు. ఓ ప్రక్క అభివృధ్ధిలో భాగంగా, పాడయిపోయిన "టైల్స్" స్థానంలో క్రొత్తవి వేస్తూ, కొన్నిచోట్ల సిమెంటూ, కాంక్రీటు తో ఇంకేవో కడుతూ, పనివాళ్లు. చెప్పులు వదిలే స్టాండ్లలో రద్దీ. 
 
మేము మా చెప్పులని, కొంతమందిలాగ, ఓ ప్రక్కన పెట్టి, ఇంతకుముందే గుడి చూసేసిన మా ఢిల్లీ బావగారిని వాటికి కాపలా పెట్టి, ఇదివరకు "బిర్లా" టెంపుళ్లూ, "ఇస్కాన్" టెంపుళ్ల మెట్లెక్కినప్పటి అనుభూతులని తలుచుకొంటూ, అనేక మెట్లెక్కి, మధ్యలో ఆగుతూ, ఆయాసపడుతూ, చివరికి గుడి లోకి చేరాం. 
 
అక్కడ, క్రమ అష్టభుజకారంలో అనుకుంటా, ఓ నిర్మాణం. అందులో ఓ నలభై అడుగులో యెంతో యెత్తున్న "స్వామి నారాయణుడి" విగ్రహం. విగ్రహమంతా అనేక విలువైన రాళ్లతో అలంకరించబడి వుంది. నాకు విగ్రహంలో వివేకానందుడి చాయలు కనిపించాయి--లేదంటే, ఓ మహారాజు గెటప్ లో!. 
 
ఆ ఆష్ట భుజాలకీ మళ్లీ ఎక్స్టెన్షన్లు! వాటిలో అనేక మతాల శైలులూ, సీలింగుతో సహా అనేక "నీల కంఠ చరిత్ర" దృశ్యాలూ, అంతా బంగారం, వెండీ, విలువైనవనిపించే రాళ్లూ--అదీ ఆయన వైభోగం! (ఆ "దేవుడికి" భక్తిగా దణ్నం పెట్టినవాడెవడూ కనపళ్లేదు--నోరు తెరుచుకొని అద్భుతాలని చూస్తున్నవాళ్లు తప్పితే!) 
 
ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి లేదు. తాజ్ మహల్ దగ్గరలోలా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫోటోగ్రాఫర్లు లేరు! ఆ గుడివాళ్లు అమ్మే ఫోటోలూ అవీ మాత్రమే 'కొనుక్కోవాలి!' వాటిల్లో మనం వుండం కదా! 
 
ఆ వందల యెకరాల నిర్మాణంలో మా ఆడవాళ్లకి నచ్చింది యేమిటంటే--ఆ గుడిచుట్టూ వున్న ఆవరణని, కొన్ని వందలమంది మధ్యలోనుంచి, చాకచక్యంగా నడుపుకుంటూ, వెనుక తిరుగుతున్న "బ్రష్"లతో, డిటర్జెంటూ, నీళ్లూ కలిపిన నీళ్లతో, నేలని శుభ్రం చేస్తూ పోతున్న చిన్న చిన్న రోలర్ల లాంటి మెషీన్లు! ఇలాంటివి మనక్కూడా వుంటే, ఇల్లు వొత్తుకోడం బాధ తప్పేదికదా? అంటూ నిట్టూర్చారు వాళ్లు! 
 
మళ్లీ బయటికి వెళ్లే దారిలోంచి బయలుదేరిన చోటికి వచ్చేసరికి అక్కడ--బయటే వుండిపోయిన మా కాకినాడ బావగారి దర్శనం, పరామర్శలూ!      

.......తరువాయి మరోసారి.

No comments: