Saturday, July 2

మా మూడో హనీమూన్ అనే.......-15


మొన్నటి మా యాత్ర

ఇంక ఆ సినిమాలో విషయం యేమిటంటే........సరిగ్గానే వూహించారు.....స్వామినారాయణ్ గా మారిన నీలకంఠ అనేవాడి కథే! (నీలకంఠుడంటే తెలుసుకదా? శివుడు).

ఆ కుర్రాడు సరయూ నదీతీరంలో ఓ పల్లెలో జన్మించాడట. చిన్నప్పుడే చేపలు పట్టుకొనేవాళ్లని తిట్టీ, తుఫానులు ఆపీ, ఇంకా యేవేవో చేశాడు. యెనిమిదేళ్ల వయసులో ఓ రాత్రి, ఓ నిశ్చయానికి వచ్చి, అర్థరాత్రి వర్షం కురుస్తూ వుండగా పొంగి ప్రవహిస్తున్న సరయూనదిలో దూకేశాడు--తన అన్వేషణ కొనసాగించడానికి వీలుగా. (శంకరాచార్యులు తన యేడవ యేటనే సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించి, తల్లి వొప్పుకోకపోవడంతో వూరుకుని, ఒకరోజు కాలడిలో ఓ నదిలో తనకాలు మొసలి పట్టుకుంటే, 'అమ్మా! యెలాగా చనిపోయేలా వున్నాను. నాకు సన్యాసానికి అనుమతి ఇవ్వవూ?' అనివేడుకొంటే, ఆవిడ ఇచ్చేసిందనీ, చిత్రంగా మొసలి వెళ్లిపోయి, ఆయన అప్పుడే సన్యసించాడనీ విన్నారా?) అక్కడినుంచీ ఆయన ప్రయాణం, దారిలో జరిగిన బోళ్లు అద్భుతాలూ........(నాకు గుర్తున్నంతవరకూ కొన్ని)

ఒక వూళ్లో అదేదో ప్రసిధ్ధ దేవాలయం, ఓ మఠం వుంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఇళ్లలో జొరబడి, తలుపులు మూసేసుకుంటారు. కారణం--ఓ భయంకరమైన సిం హం ఆ వూల్ళొకి వచ్చి, కనిపించినవాళ్లని చంపి తినేస్తూంటుంది. నీలకంఠ సాయంత్రంపూట ఆ వూరు చేరి, గుడిముందర ఓ చెట్టు చుట్టూ వున్న చపటామీద కూర్చొని, తపస్సులో ములిగిపోదామనుకుంటాడు. వూరి జనమందరూ, చివరికి ఆ మఠం ప్రథాన్ కూడా అతణ్ని హెచ్చరిస్తారు, బ్రతిమాలుతారు--అయినా వినడు. కాసేపటికి సిం హం రానే వస్తుంది! దానితో వాడు, "నాలో నీమీద ప్రేమ మాత్రమే వుంది! నీక్కూడా నామీద ప్రేమ మాత్రమే వుండాలి" అనడంతో అది తోకముడిచి, అతన్ని నాకుతూ కుక్కలా పడి వుంటుంది తెల్లవార్లూ. ప్రొద్దున్న చూసిన జనాలకి.....అద్భుతం!

హిమాలయ పర్వతాల్లో వున్న ఓ వూళ్లో, మంచు పడడం ప్రారంభమయ్యే సమయానికి, అక్కడి గుళ్లనీ, మఠాలనీ, ఆశ్రమాలనీ, జనావాసాలనీ ఖాళీ చేసి, కొండల క్రిందరికి వెళ్లిపోతూంటారు అందరూ. అందరూ అలా క్రిందికి దిగిపోతూ వుండగా, పైన ఓ మహంతుడు వుంటాడు....నీలకంఠ పైకె యెక్కి వస్తూండడం చూస్తాడు. వెంటనే అందరినీ తోసుకొంటూ క్రిందకి వచ్చేసి, 'బాబూ! అందరూ క్రిందికి వెళ్లిపోతున్నారు. నీవేమిటి పైకి వస్తున్నావు?' అనడుగుతాడు. వాడు 'నేను పైకే వెళతాను.' అంటాడు. "అహా! యేమినాభాగ్యమూ! నీవేనా నా తండ్రీ! యెప్పటినించో నీకోసం యెదురు చూస్తున్నాను! ఆ మహానుభావుడివి నీవేనన్నమాట! ఇంకెవ్వరూ వూరు వదిలి పోవలసిన పని లేదు. స్వామి వచ్చేశాడు!" అని ప్రకటించేస్తాడు. అందరూ సుఖంగా అక్కడే వుండిపోతారు. (ఇంక మంచు పడనే పడదు! మరి గంగా, సింధు, బ్రహ్మపుత్ర లాంటి జీవనదుల గతి ఆ సంవత్సరం యేమయ్యిందో?!)

అంతలాగ అన్ని ఆశ్రమాలలోనూ, మఠాలలోనూ సాక్షాన్నారాయణ స్వరూపుడిగా పరిగణించబడ్డవాడు, రామానుజుల ఆశ్రమానికి వచ్చి, ఆయన యెక్కడో పర్యటనలో వుంటే, ఆశ్రమాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ వుంటాడు. రామానుజులు తిరిగి రాగానే, ఆయన ఇంకా సముద్రంలోనో, నదిలోనో వుండగానే తెలిసేసుకొని, "నీలకంఠా! ఇప్పటికి వచ్చావా! ఇంక ఈ ఆశ్రమం నీదే. అన్ని బాధ్యతలూ నీవే!" అంటూ.....ప్రాణాలు విడుస్తాడు (అనుకొంటా!)

మధ్యలోనో, చివర్లోనో, వాడు యువకుడై, ఓ రాజుగారి దర్బారుకి వెళితే, అక్కడ ఆ రాజుగారు తన వారసుడిగా వీణ్ని ప్రకటించో యేదో.......మొత్తానికి రత్న ఖచిత; వజ్ర వైడూర్య భూషిత; స్వర్ణ సిం హాసనారూఢుడై, "ఆయనే స్వామి నారాయణుడు!" అనిపించుకొంటాడు.

నా దృష్టిలో ఈ సినిమా "హైలైట్" యేమిటంటే, "ఎగ్ జాక్ట్ గా" శంకరాచార్యుడిలాగానే, నీలకంఠ కూడా--సరయూనదీ తీరం నుంచి బయలుదేరి, అరేబియా సముద్రం నుంచీ, హిందూకుష్ పర్వతాలూ, టిబ్బెట్, నేపాల్, బెంగాల్ మీదుగా కన్యాకుమారి వరకూ చేరి, మళ్లీ బయలుదేరిన చోటుకే రావడం--ఆయన "అడుగుజాడల" రూపంలో ఆ మార్గాన్ని స్క్రీన్ మీద చూపించడం!

నాకు అర్థమైనది, శంకరుడు శైవుడు! ఆయనకి ప్రతిగా స్వామి నారాయణుడు! దానికోసం ఇంత "కల్ట్ బిల్డింగ్!". అదీ.

మన సోకాల్డ్ "సర్వసత్తాక గణతంత్ర, స్వతంత్ర, 'సర్వమతసమభావనా', 'సర్వసౌభ్రాతృత్వ ' ప్రజాస్వామ్య భారత దేశంలో ఇవన్నీ అవసరమా??!!    

.......తరువాయి మరోసారి.

No comments: