Wednesday, May 18

మా మూడో హనీమూన్ అనే.......-9మొన్నటి మా యాత్ర

ఢిల్లీ లో పడ్డాం అని చెప్పనుకదా. అక్కడనుంచీ వెయిటింగ్. రెండుగంటలు దాటిపోయింది. మళ్లీ ఫోను చేస్తే, మా చెల్లెలు "ఇక్కడ హైవేలో పొగమంచు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరగంటనుంచీ వెయిట్ చేస్తున్నాం. కాసేపట్లో క్లియర్ అయ్యేలా వుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను" అని చెప్పింది.

ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ, (మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ...ఆడవాళ్లు నడవలేక, కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ) నిరీక్షించాము. 

గంటా గడిచింది. మళ్లీ ఫోను. "ఇంకో అరగంటదాకా క్లియర్ అయ్యేలా లేదు. మీరోపని చెయ్యండి. ఓ టాక్సీ మాట్లాడుకొని మాకు యెదురు వచ్చెయ్యండి!" అని. 

సరే! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ, వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ, అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను. (వెయిటింగు రూములో నిషేధం మరి!) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ, అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని (అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే, చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు) కుదరగడుతూండగా, మళ్లీ ఫోను.

"మా డ్రైవరు చాకచక్యంగా వేరే దారిలో వచ్చేస్తున్నాడు. ఇంక టాక్సీ వద్దు" అని.

యెట్టకేలకి 7-45 కి మా చెల్లెలు, వాళ్ల బావగారి అబ్బాయి, డ్రైవరులతో వచ్చి, అందర్నీ వాటేసుకొని, వాళ్లు మాకు పాదాభివందనాలు చేసేసి, భయంకర అనుభవాలు చెపుతూ, ఆలస్యానికి సారీలు చెపుతూ, "మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా?" అని నొచ్చుకొంటూ, సామాను వాళ్ల "బొలేరో" లో వేసి, యెక్కాము అందరూ.

పొగమంచు ఇంకా యెక్కువగా వున్నా, ప్రయాణం బాగానే సాగుతూంది హైవేలో--ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ. ఇంక "గురుగామ్" దగ్గరకొచ్చేసరికి, జామ్ ఇంకా క్లియర్ కాలేదు. అడ్డం పడినవి అన్నీ "రెడీమేడ్ కాంక్రీటు" వ్యాన్లే--ప్రముఖ కంపెనీలవి! 

మళ్లీ గురుగామ్ వూళ్లోంచి, అడ్డదారుల్లో వెళుతూ, మళ్లీ ఢిల్లీ ఎంట్రన్సు చేరి, ఇంకో కచ్చా రోడ్డు ద్వారా, మారుతీ ఫేక్టరీ, హీరో హోండా ఫేక్టరీ, అనేక రైల్వే స్టేషన్లూ, యార్డులూ దాటుతూ, # "పటౌడీ" చేరేసరికి 9-00 అయిపోయింది. అక్కడనుంచీ, రోడ్డు బాగుంది. వాళ్ల వూరు ఇంక 51 కిలోలే. (ఇంతాచేసి, ఢిల్లీ నుంచి హర్యాణాలో వున్న వాళ్ల వూరు "షేర్ పూర్" కేవలం 150 కిలోలు మాత్రమే!)

9-30 కల్లా వాళ్ల వూరు, వాళ్లింటికి చేరాం.

బొలేరో దిగి, ఇంట్లోకి వెళుతూ, అలవాటు చొప్పున బయట చెప్పులు వదిలేసి, ఇంట్లో అడుగుపెట్టానా.....అరికాళ్ల దగ్గరనించి తొడలదాకా "ఫ్రీజ్" అవడం మొదలెట్టాయి. నా వెనక్కాలే మా ఆవిడ నన్ను ఫాలో అయిపోతుంటే, ఖంగారుగా మా చెల్లి "వొదినా! చెప్పులు వదలొద్దు! అన్నయ్యా! వేసేసుకో! అప్పుడు లోపలికి రండి!" అనగానే, మళ్లీ చెప్పులు వేసేసుకొని, ఇంట్లో ప్రవేశించాం.  

..........ఇంకా తరువాయి.

2 comments:

Anonymous said...

me honey moon story rasesariki ..maku pellillu ayyi..pillalu kuda pudatharu..
konchem fast ga rayandi..

కృష్ణశ్రీ said...

పై అన్నోన్!

మా పిల్లలకి కూడా పెళ్లిళ్లయి, వాళ్లకి పిల్లలు కూడా పుట్టాక జరిగిన మూడో హనీమూన్ కదా! మీకున్నంత వేగమూ, ఓపికా మాకెక్కడ వుంటాయి?

కనీసం రోజుకో టపా వ్రాయాలనే ప్రయత్నిస్తున్నాను. ఒంటిచేత్తో దశావధానం చేస్తున్నవాణ్ని. దానికి తోడు మధ్యలో సాయిబాబా గురించీ, రిజర్వ్ బ్యాంకు గురించీ, యెన్నికలూ వగైరాల గురించీ వ్రాయక తప్పదు కదా.

ఇంకా, పెళ్లిళ్లూ, ప్రయాణాలూ వగైరా!

దాంతో ఇవి కొంత వెనకబడుతున్నాయి.

త్వరగానే వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

ధన్యవాదాలు.