Saturday, April 2

మా మూడో హనీమూన్ అనే..... -4మొన్నటి మా యాత్ర

(ఇలా అయితే యాత్ర విశేషాలు యేడాదైనా తెమలవుగానీ, టూకీగా వ్రాసేసి, వివరణ అవసరమైనచోట్ల * గుర్తో యేదో వేసేసి, వేరే వ్రాస్తాను. సరేనా?)  

.......రైలు కూత వినపడింది* కదా?

*"రైలు కదిలిపోతూంది! యెక్కెయ్యండి" అని గోల. ఇంతకీ అది ప్రక్క లైనులోంచి వెళ్లిపోయిన ఓ గూడ్స్ రైలు! గూడ్స్ రైలు కూతకీ, ప్యాసింజరు రైలు కూతకీ (కారుకూతలకీ, రైలు కూతలకీ) తేడా చాలామందికి తెలియదు. తీరా నేను చూసేసరికి అప్పుడే మా రైలుకి సిగ్నలు ఇచ్చారు. వెంటనే యెక్కేశాను. 

అయినా, ఈ రైళ్లలో దిగి యెక్కడాలూ, సిగ్నళ్లు ఇవ్వడాలూ, కూతలు వెయ్యడాలూ, యే యే స్టేషన్లలో లగేజి లోడింగులు జరుగుతాయి, అక్కడ అవి అయ్యేవరకూ బ్రహ్మదేవుడు చెప్పినా రైళ్లు కదలవూ, యెక్కడెక్కడ, యెన్నెన్ని రైళ్లూ, గూడ్స్లూ, ఇంజన్లూ క్రాసింగులు అవుతాయి, అవతల లైన్లో యే రైలుని వొదిలారూ, మన రైలు యెప్పుడు వదులుతారూ--వగైరాలన్నీ నాకు 30 యేళ్లు వచ్చేటప్పటికే అవుపోశన పట్టేశాను. అందుకే నాకు భయం లేదు యెక్కలేకపోతానని!

రైలు నెమ్మదిగా బయలుదేరి, రాత్రి పదిగంటల ప్రాంతంలో విజయవాడ చేరింది. అప్పటిదాకా ఆకళ్లు యెవరికీ లేవు. (ఐదారుసార్లు కాఫీలు లాగించాము కదా!) కానీ, ఇంక నిద్రపోవాలికాబట్టి, తినెయ్యాలి. అక్కడ షెడ్యూల్డ్ స్టాప్ 20 నిమిషాలు. క్రిందికి దిగి, ప్లాట్ ఫామ్ మీద చూస్తే, ఓ వంద గజాల దూరం లో "ఇడ్లీ, వడా, దోశా" అని అరుస్తున్నారు. 

దిగబోతూ అందరినీ అడిగాను--యేమి తెమ్మంటారు? అని. "మాకేమీ వద్దు" అని కోరస్! నేను మాత్రం టిఫిన్ తెచ్చుకోదలిచి, ఓ వెండర్ని అడగ్గానే, 9 X 4 తగరం ప్లేట్లలో ప్యాక్ చెయ్యబడ్డ "వడా, దోశ" ని చూపించి, 25 రూపాయలు ఇమ్మన్నాడు. 

యెందుకైనామంచిదని రెండు ప్యాకట్లు తీసుకున్నాను.  

ఇదివరకు, ప్రతీ ప్లాట్ ఫామ్ మీదా, వేరే వేరే తట్టల్లో ఇడ్లీ, వడా, దోశా, పులిహోర, పెరుగన్నం--ఇలా అమ్మేవారు. ఓ ఆకులో రెండు ఇడ్లీ, రెండు వడా పెట్టించుకొని, నీళ్ల చట్నీ వేయించుకొని, అది కారిపోకుండా పెట్టెలో తమవాళ్లకి ఇవ్వడానికి యెన్నో ఫీట్లు చెయ్యాల్సి వచ్చేది!

విజయవాడ స్టేషన్ క్యాంటీనంటే--ప్రపంచం మొత్తమ్మీద 'అదుర్స్!' 

విజయవాడలో నెలకి వందా రెండువందలు జీతం సంపాదించుకొంటూ, అద్దెలు భరించలేనివాళ్లు--స్తేషన్లోనే వుంటూ, టిఫిన్లూ, భోజనాలూ చౌకగా తింటూ కాలం వెళ్లబుచ్చేవారు! ఇప్పుడా క్యాంటీనుకి అంత సీను వుందో లేదో చూసే భాగ్యం ఈ మధ్య కలగలేదు.

ఇప్పుడు, ఇడ్లీ, వడా, దోశా--మనిష్టం కాదు--వాళ్లు "వడా-దోశా"; "ఇడ్లీ-పులిహోరా"; "బ్రెడ్-పెరుగన్నం" లాంటి చిత్రమైన కాంబినేషన్లలో--యేమి పెడితే అది తినాల్సిందే! ఇక @చట్నీదో ప్రహసనం. పైగా, ఆ ప్యాకెట్లమీద ఆ రోజు తారీఖూ, ఎం ఆర్ పీ స్టాంప్ చేసి వున్నాయి! (ఎం ఆర్ పీ 20/- అయితే, వాడు 25/- వసూలు చేసి నన్నే మోసం చేసాడన్న విషయం తినే ముందు తెలిసింది!)   

..........ఇంకా తరువాయి.

2 comments:

Anonymous said...

ఎటెల్లిపోయావు బాబూ!

గుసగుస

‘నా జీవితం తెరిచిన పుస్తకం..’, ‘పారదర్శకత’ అంటూ తెగ డైలాగులు చెబుతుంటారు చాలా మంది నేతలు. వారిలో చాలా మంది పుస్తకాల్లో కనిపించని ‘నల్ల’ పేజీలు చాలానే ఉంటాయి. ఇటువంటి వారిలో అగ్రగణ్యుడు మన తెలుగు గడ్డపైనే ఉన్నారని కాంగ్రెస్ నేతలే కాదు.. తెలుగుదేశం నేతలూ చెవులు కొరికేసుకుంటున్నారు. అవినీతి గురించి తెగ నీతులు చెప్పే ఈ ‘తెలుగు’ నేత హఠాత్తుగా మాయమైపోతారని, విదేశాల్లో ‘వ్యవహారా’లను చక్కదిద్దుకున్నాక మళ్లీ ప్రత్యక్షమవుతుంటారని అంటుంటారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. విదేశీ ‘వ్యవహారాలు’ చకచకా చక్కబెట్టుకొచ్చేస్తుంటారు. ఇటు అసెంబ్లీ సమావేశాలయ్యాయో లేదో.. ఆయన మాయం. అదీ ప్రధాన అనుచరులక్కూడా ముందుగా చెప్పకుండా. అవినీతిపై ఆయనసభలో చేసిన తెగావేశపూరిత ప్రసంగం ఇంకా కళ్ల ముందు చెదిరిపోలేదు. అంతలోనే ఎటెళ్లిపోయారు బాబూ!.. అని వారు బురల్రు గోకేసుకుంటున్నారు. ఆయన సింగపూరా.. కాదు కాదు దుబాయ్ .. అబ్బే మాల్దీవులకెళ్లుంటారని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్తున్నారు. ఏదో ఒక దేశం వెళ్తే వెళ్లాడు కానీ, ఇప్పుడే యమర్జంటుగా వెళ్లిపోయేంత పనేం ముంచుకొచ్చిందని..! అందులోనూ.. హవాలా వీరుడు హసన్ అలీ నల్లడబ్బుతో ‘తెలుగు నేతల’కున్న లింకులు బయటపెట్టిన ఈ సమయంలోనా ‘సీక్రెట్’ పర్యటనలు? అందరూ నిజమనేసుకోరూ?.. అని అనుచరగణం తెగ మథనపడిపోతోంది.

కృష్ణశ్రీ said...

పై అన్నోన్!

ఎటెల్లబోయి ఇటొచ్చావు బాబూ? వేరే బ్లాగు వ్రాసుకోవచ్చుగా?

అయినా సంతోషం.