Friday, April 1

మా మూడో హనీమూన్ అనే..... -3



మొన్నటి మా యాత్ర

హమ్మయ్య. 

రైలు (అన్నట్టు రైలు మన తెలుగు శబ్దమేకదూ? లేక "ధూమశకటం" అందామన్నా, ఇప్పుడు బొగ్గులూ లేవు, ధూమం లేదు మరి. డీజెల్ కి తెలుగు పేరు పెట్టబడినట్టు లేదు--ఆ శకటం అందామన్నా) బయలుదేరింది. 

బ్యాగులూ గట్రా సీట్ల క్రిందకి తోసేసి, అవసరమొచ్చేవి ప్రక్కనే పెట్టుకొని, హేండ్ బ్యాగులు ఆడవాళ్ల ప్రక్కన పెట్టుకొని, 'అందరికీ' ఫోనులు చేసేసి 'బండి యెక్కేశాం, కదిలిపోయింది, మళ్లీ తరవాత చేస్తాం' అని చెప్పేసి (ఇదివరకు యెవరినైనా బండి యెక్కించి, 'చేరగానే కార్డు ముక్క రాయండి' అనేవారు--ఆ కార్డు ముక్క చేరితే సంతోషం, లేదా చేరక ....స్తారేమిటీ...అని ఓ ధీమా వుండేది. ఇప్పుడా ధీమా కరువై, గంటగంటకీ మనం చెయ్యకపోతే వాళ్లే ఫోను చేసేసి, హమ్మయ్య అనుకొంటూ రాత్రంతా గడిపేస్తారు. తెల్లవార్లూ కంపార్ట్ మెంట్లో అందరి సెల్లులూ మోగుతూనే వుంటాయి--ముచ్చటైనవేకాదు భయంకరమైన రింగ్ టోన్లతో సహా--మాట్లాడుతూనే వుంటారు), కాస్త రిలాక్సుడుగా కూర్చొనే సరికి, "చిన్నన్నయ్యా! బావగారు బ్రెడ్ తెచ్చారుగానీ, జామ్ మర్చిపోయారు. తరవాత అరిటిపళ్లు కూడా కొనుక్కుంటే బాగుంటుంది" అని ఓ సలహాత్మక సూచన. 

ఇంతలో వచ్చింది--యేమిటీ? మూర్చా?--కాదు రాజమండ్రి.....అంటే నిజంగా మనదగ్గరకి వచ్చింది అనికాదు.....మన రైలు రాజమండ్రి అనే వూర్లో వున్న స్టేషనుకి చేరింది.....అని! 

సరే.....పళ్లూ అవీ అంటూ రైలు దిగబోతే, మా ఆవిడ "యేమండీ.....మీరు దిగొద్దు. కిటికీ ప్రక్కకి వస్తే కొందాము.....అంతే!" అనీ, చెల్లెలు కూడా "వొద్దు......దిగొద్దు....మళ్లీ యెక్కడం కష్టం" అనీ సతాయింపు. 

అయినా మనం వింటామా! రాజమండ్రిలో యెంత ముష్టి రైలు అయినా ఓ 10 నిమిషాలు ఆగకపోదు. ఆ టైములో ప్లాట్ ఫామ్ మూడుసార్లు చుట్టి రావచ్చు! అందుకని దిశేశా (ఇది మా మనవడి మాట--దిగేశా కి బదులు). 

తీరా చూస్తే, మనది ఇంజను ప్రక్క బోగీ! అంటే ప్లాట్ ఫామ్ కి ఓ చివర--ముష్టివాళ్లు పడుక్కొని విశ్రాంతి తీసుకొనేచోట ఆగుతుంది. వెనక్కి నడుచుకొంటూ వెళితే, ఓ అర ఫర్లాంగు దూరం లో "కిసాన్" వాళ్ల స్టాల్. ఇంకో ప్రక్క ఓ బండీ, దానిమీద అరటిపళ్లూ. ఆకు పచ్చ అరటిపళ్లు తగ్గాయి ఈ మధ్య యెందుకో. అలాంటివే పసుపుపచ్చవి వస్తున్నాయి. 

డజను 40 కి బేరమాడి (నా మొహం! బేరమేమిటీ.....అన్నీ ఫిక్సెడ్ రేట్లు.....కొనౌపోతే నీ ఖర్మ!) రెండు డజన్లు తీసుకొని, ఇంకో ప్రక్కన వున్న "కిసాన్" వారి స్టాల్ కి వెళితే, ఓ డజను యెండిపోయిన యాపిల్స్, ఈకలు పీకేసిన కోళ్లలా వ్రేళ్లాడగట్టబడ్డ రెండో మూడో అనాసపళ్లూ మాత్రం వున్నాయి. జామ్ లూ గట్రా యేమీ లేవు. సరే, వెనక్కి నడిచి, కిటికీలోంచి పళ్లు అందించేలోగా రైలు కూత వేసింది! 

..........ఇంకా తరువాయి.

No comments: