Thursday, February 24

ప్లాస్టిక్ వినియోగం



సంచులపై నిషేధం

ఇదొక ప్రభుత్వ, బుర్రోవాదుల వెర్రి!

20 మైక్రాన్ల లోపు మందంగల ప్లాస్టిక్ సంచులని నిషేధించగానే యేమిజరిగింది?

చిన్నసైజు ప్రభుత్వోద్యోగుల పంట పండింది! కొంచెం పెద్ద ఫ్యాన్సీ, కిరాణా, డిపార్ట్ మెంటల్ స్టోర్లూ వగైరాలనించి ఖచ్చితంగా వెయ్యి రూపాయలూ, కొంచెం చిన్న షాపుల నుంచి రూ.500/-, చిన్న చిన్న బజ్జీలబళ్లూ, కూరగాయల దుకాణాలూ, పళ్ల కొట్లూ వగైరాలనించి రూ.250/- యెవరికీ మినహాయింపు ఇవ్వకుండా, వసూలు చేసుకున్నారు!

మరి కేసుల మాటేమిటి?

చుట్టుప్రక్కల పల్లెలనించి పనికోసం పట్టణాలకి వచ్చి, సాయంత్రం తిరిగి వెళుతూ తమ సంపాదనలోంచి కావలసిన వస్తువులు కొనుక్కొని, సంచీ తెచ్చుకోలేదు కాబట్టి, ఓ పావలా పెట్టి ప్లాస్టిక్ సంచీ కొనుక్కొని, దాంతో ఇంటికి బయలుదేరినవాళ్లని, ముఖ్యంగా ఆడవాళ్లని పట్టుకొని, రూ.100/- కడతావా చస్తావా అని బెదిరించి, సంచీలో సరుకులతోసహా "స్వాధీనం" చేసుకొని కేసులు వ్రాశారు!

మళ్లీ ఓ పదిహేనురోజుల తరవాత షాపులని చుట్టేసి, "మేం కవర్లు వాడడం మానేశాం మొర్రో" అంటున్నా, "బోర్డు పెట్టలేదు" అనో, మేమూ కేసులు వ్రాసుకోవాలికదా, ఓ 500 ఇవ్వండి, 250 కి రసీదు ఇస్తాములెండి! అంటూ మళ్లీ దండుకున్నారు.

ఇప్పుడింక, 40 మైక్రానుల వరకూ నిషేధించే యోచన చేస్తున్నారట!

అసలు ఈ "నిషేధం" యెందుకు?

వాళ్లు చెప్పే కారణాలు--పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనీ, పశువులు వాటిని తినేసి, చచ్చిపోతున్నాయి అనీ, వాటిలో వేడి వేడి పదార్థాలు పట్టుకెళ్లడంతో, రసాయనిక చర్య జరిగి, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారనీ--అంతే!

ఈ అంశాలకి తగ్గ ఋజువులు వున్నాయా? వుండవు. పర్యావరణం సంగతి ప్రక్కనపెట్టి, మిగిలినరెండిటి గురించీ మాట్లాడుకొంటే--యే పశువులు చచ్చిపోతున్నాయి? పోషించుకునేవాళ్లెవరూ అంత నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ సంచులు కలిపి వాటికి ఆహారం పెట్టరు కదా? యెటొచ్చీ, రోడ్లమీద తిరుగుతూ, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ, రోడ్లప్రక్కన అడ్డమైన చెత్తా తింటూ, రోడ్డు మధ్యన తీరిగ్గా పడుకొని నెమరు వేసుకొనే--యెవరికీ చెందని పశువులేనేమో!

ఇంక, వేడి పదార్థాలవల్ల ఆరోగ్యం చెడిపోయి, హాస్పటళ్లలో పడ్డవాళ్ల సంఖ్య యెంత? రికార్డులేమైనా వున్నాయా?

ఇంక పర్యావరణం విషయానికొస్తే--నిజమేనండీ, వొప్పుకున్నాం--"ప్లాస్టిక్" వల్ల (కేవలం సంచులవల్లనే కాదు!) నష్టం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్ సంచి, భూమిలో శిథిలమవడానికి "లక్ష సంవత్సరాలు" పైగా పడుతుందంటారు. సరే. 

దీనికి పరిష్కారంగా, "బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్" కనిపెట్టారు. అంటే, అది భూమిలో తొందరగా శిథిలమైపోతుందన్నమాట. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం! అందుకని దానితో ఇప్పటివరకూ సామాన్యులు వాడే వస్తువులేమీ తయారు చెయ్యబడడంలేదు. 

ఇక రెండో పరిష్కారం, "రీ సైక్లింగ్". అంటే, ఓ సారి వాడేసిన వస్తువులని, మళ్లీ కరిగించి, ఆ ప్లాస్టిక్ తో మళ్లీ కొన్ని వస్తువులని తయారు చేసి అమ్ముకోవడం. 

ఇప్పటికీ, కొన్ని కోట్ల కోట్ల "వాటర్ బాటిళ్లూ"; "కూల్ డ్రింక్ బాటిళ్లూ"; కాఫీ, టీ, మంచినీళ్ల గ్లాసులూ; ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. ఇంకా, వాల్ మార్ట్, స్పెన్సర్స్, పీటర్ ఇంగ్లండ్, పార్క్ అవెన్యూ, వాన్ హ్యూసెన్ లాంటివాళ్లూ, బట్టల షాపులవాళ్లూ పెద్ద పెద్ద (పైన తాళ్లతోసహా) ప్లాస్టిక్ సంచులలోనే వాళ్ల వస్తువులని కొనుగోలుదార్లకి ఇస్తున్నాయి! (మన చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఇంకా చిన్న పట్టణాల్లోని బట్టల షాపుల వాళ్లూ--రెండు కర్రలతో, బిగ్ షాపర్ అనబడే--గోగునార, జనపనార సంచులని ఇచ్చేవి. ఇప్పుడు అవి కూడా మానేశాయి అనుకుంటా).

ఇంక, పరుపులూ, దిళ్లూ నించి, ఎఫ్ ఎం సీ జీ లవరకూ, ఎలెక్ట్రానిక్ వుత్పత్తులవరకూ అన్నీ యెంతెంత పెద్ద ప్లాస్టిక్ కవర్లలో అమ్మబడుతున్నాయో అందరికీ తెలుసు! ప్రతీ బడ్డీ కొట్టులోనూ దండలు, దండలుగా వ్రేళ్లాడే వక్కపొడి, గుట్కా (ఈమధ్య సుప్రీం కోర్టు వీటిమీద కళ్లెర్రజేసింది!) షాంపూ, కేశతైలం, లేస్, బింగో, హల్దీరామ్‌స్, ఇంకా స్థానిక వుత్పత్తులు--పచ్చళ్లూ, అప్పడాలూ, జంతికలూ, చెగోడీలూ, పప్పుచెక్కలూ--లాంటివాటిగురించి చెప్పనఖ్ఖరలేదు.

మరి, 20 మైక్రాన్లో యెంతో వున్న సంచులు చేసుకున్న పాపం యేమిటీ?

ఇక్కడో చిన్న లెఖ్ఖ--ఒక పచ్చి అరటిపండు ముగ్గవేస్తే, రెండోరోజుకి (అంటే ఒకరోజులో) పండిపోతుంది. మరి ఓ గోదాములో లక్ష పచ్చి అరటి పళ్లని ముగ్గవేస్తే, అవి యెన్నాళ్లకి పండుతాయి? మామూలు లెఖ్ఖ ప్రకారం లక్ష రోజులేకదా?

........మిగతా మరోసారి.

2 comments:

Anonymous said...

"ఇక్కడో చిన్న లెఖ్ఖ--ఒక పచ్చి అరటిపండు ముగ్గవేస్తే, రెండోరోజుకి (అంటే ఒకరోజులో) పండిపోతుంది. మరి ఓ గోదాములో లక్ష పచ్చి అరటి పళ్లని ముగ్గవేస్తే, అవి యెన్నాళ్లకి పండుతాయి? మామూలు లెఖ్ఖ ప్రకారం లక్ష రోజులేకదా?"

Excellent!. With a simple example you have explained the fundamental problem with corrupt Bureaucracy & Political system in India.

This system (Bureaucracy & Political) don't bother who is sitting at the top (corrupt and anti-national Italian Sonia), as long as they are allowed to loot and suppress Indians.

Ordinary people are suffering. When can we see the people's revolution in India?

A K Sastry said...

పై అన్నోన్!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.