Thursday, February 17

స్కామాయణం



కుంభకోణాలు

ఒక దాని గురించి రాద్దామనుకొంటూండగానే ఇంకొకటి బయటికి వస్తూంది!

కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ, ఇప్పుడు ఎస్ బ్యాండ్!

ఇంకా రాష్ట్రంలో--జగనే కాకుండా ఎమార్, ఇప్పుడు దిలారా!

మన్మోహనేమో, అమాయక చక్రవర్తిలా మొహం పెట్టి, మీడియా వాళ్లు ఇలా బయటపెట్టుకుంటూ పోతే, మన దేశం 'స్కాముల దేశం' గా ప్రసిధ్ధికెక్కేస్తుంది--మీరు బయట పెట్టొద్దు అంటున్నాడు!

2జీ లో, రాజాకి 'నిబంధనలకి దూరంగా యేమీ చెయ్యద్దు' అని మాత్రమే సలహా ఇచ్చాడట ఆయన. ఆ తరవాతేమి జరిగిందో తనకి తెలియదట. పైగా మీరందరూ "ఆ శెట్టిగారిలా" మాట్లాడితే యెలా? అని విసుక్కుంటున్నాడట!

ఆ శెట్టిగారి కథేమిటి అంటారా? వెనకటికి "ఇవాళ పొద్దున్నే లక్ష రూపాయల నష్టం" అన్నాడట. అదెలా? అనడిగితే, "నేను కొన్న భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్టుకి నిన్న తీసిన డ్రా లో లక్ష రూపాయల బంపర్ ప్రైజు తగల్లేదు. మరి రావలసిన సొమ్ము రాకపోవడం నష్టమే కదా?" అన్నాట్ట.

మన్మోహన్ కూడా, రావలసిన 1,76,000 కోట్లు రాలేదని అదంతా నష్టం అంటే యెలాగ? అని క్రొశ్నిస్తున్నాడు!

మరి ఎస్ బ్యాండుకి సంబంధించి, ఓ రెండు లక్షల కోట్లట! ఆ శాఖకి మంత్రి ఆయనేనట! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే, ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు. పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ? అని ఓ వాదన!

ఇంక దర్యాప్తులూ శిక్షల సంగతి ఆ దేవుడే యెరుగు.

మన రాష్ట్రం విషయానికొస్తే, దిలారా వ్యవహారం లో, బొటానికల్ గార్డెన్, బర్డ్ పార్క్, ఇంకేదో నిర్మిస్తామని, స్టార్ హోటెళ్లూ, మల్టీప్లెక్స్ లూ, పబ్బులూ, బార్లూ కట్టేస్తున్నారట. పైగా యెవడాపుతాడో చూస్తామంటూ, గోతులు తవ్వేస్తున్నారట!

ఈజిప్టు తరహా ఆందోళన మన దేశం లో రాదు యెందుకంటే మనది అల్రెడీ ప్రజాస్వామ్య దేశం కదా! అని కూడా మన ప్రథాన మంత్రే సెలవిచ్చారు. యెంత ధీమానో!  

బాగుంది కదూ?

No comments: