యుద్ధోన్మాదమా?
మన పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలనడం యుద్ధోన్మాదమా!
యుద్ధోన్మాదమంటే—1948 లో పాక్ ప్రదర్శించిందీ, 1962 లో చైనా చూపిందీ, తరవాత సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ పాక్ చెలరేగిందీ—అదీ యుద్ధోన్మాదమంటే!
ఇంకా, వియత్నం మీదా, అఫ్ఘాన్ మీదా, సద్దాం మీదా, అమెరికా వాడు చూపింది!
మరి, మన జనం యెందుకు ఉలిక్కిపడతారు యుద్ధం అనగానే?
మనది శాంతికాముక దేశం కాబట్టి—అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాము!
నిజంగానే మనది శాంతికాముక దేశం సరే! మన జాతి యెప్పుడో ఘోర యుద్ధాలు చేసీ, చూసీ, శాంతిని కోరుకుంది. అశోకుడంతటి వాడిని అహింసా పథానికి నడిపించిన కళింగ యుద్ధమే మన దేశంలో జరిగిన ఆఖరి అతిపెద్ద యుద్ధం!
తరవాత మన దేశం లో రాజులూ, చక్రవర్తులూ, సార్వభౌములూ యుద్ధాలు చేసినా, నష్టం వాళ్ళ (అంటే మన) వైపే వుండేది—యెందుకంటే మన సైనికులే తుపాకి గుళ్ళకీ, ఫిరంగి గుళ్ళకీ బలయి పోయేవారు!
అందుకే, అలాంటి మూర్ఖులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు ఆయుధాలు పనికి రావు అని, అహింసనీ, సత్యాగ్రహాన్నీ పరమాయుధాలుగా మలిచి, ప్రజల్లో దేశ భక్తి ని రగిల్చి, అందర్నీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించాడు మన జాతిపిత గాంధీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు!
ఆ తరంలో అందరికీ, దేశ భక్తి అనేదొకటి అన్నిటికన్నా ముందు వుండేది!
1962 లో మనకి ఆధునిక ఆయుధాలు లేక పోయినా, మన సైన్యం చాలా తక్కువైనా, మన ప్రజల దన్నుతో ధైర్యంగా పోరాడగలింది మన సేన. అప్పట్లో ‘దేశ రక్షణ నిధి’ స్థాపించి, పిలుపు ఇవ్వగానే, దేశ ప్రజలే స్వచ్చందంగా కోట్లాది రూపాయలు ధార పోశారు—నగదుగా, బంగారం గా, వస్తు రూపంలో—యెలా వీలైతే అలాగ!
1965 లో, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ‘వారానికొక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చుని రక్షణ నిధికి విరాళంగా ఇవ్వండి!’ అని పిలుపు ఇస్తే, దేశ ప్రజలందరూ వీలైనన్ని రోజులు ఒంటిపూట భోజనమే చేసి, పొదుపు చేసిన సొమ్ము విరాళాలిచ్చారు!
మహాత్ముడు ధనవంతులు సంపదకి దేశ ప్రజల తరుఫున ట్రస్టీలుగా వుండండి అంటే, ఆతరం అలాగే వుండేది! టాటాలు మొదలైనవాళ్ళు ఉక్కు కార్మాగారాల్ని స్థాపించినా, జౌళి మిల్లులు పెట్టినా, మన దేశ సంపద పెరగాలి, మనదేశం వర్ధిల్లాలి అనే భావించేవారు!
ధనికుల కుటుంబాల్లో పుట్టినా, జే ఆర్ డీ టాటా కూడా కష్టాలు అనుభవించాడు—వ్యాపారాభివృద్ధికి! ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు, బిర్లాలు, దాల్మియాలూ, రూయాలూ, వాడియాలూ, అంబానీలూ—ఇలా అందరూ!
యెంత దార్శనికుడు కాకపోతే, వంటనూనెల వ్యాపారం చేసుకునే ‘విప్రో’ అధిపతి ‘కంప్యూటరు’ వ్యాపారం లోకి దిగాడు?
కార్సన్ భాయ్ పటేల్ ఇంటింటికీ తిరిగి, తన ‘నిర్మా’ అమ్ముకొనేవాడట!
(యెక్కడో ఒక ధీరెంద్ర బ్రహ్మచారి—జయంతీ షిప్పింగ్--వుండేవాడనుకోండి) అయినా, ఆ తరం అందరిలో, దేశ భక్తి అనేది ఒకటి వుండేది!
సరే, తరవాతది, మా తరం!
—(ఇంకా వుంది)
2 comments:
Very well writte. Welcome back after a months gap.
Dear ps!
Thanks for your warm welcome!
By the way, why are you not commenting on my other blogs/posts?
Post a Comment