Wednesday, April 20

మా మూడో హనీమూన్ అనే.......-8



మొన్నటి మా యాత్ర

$భోజనాలు

ఓ రాత్రీ, ఓ పగలూ అప్పటికే ప్రయాణించడంతో ప్యాంట్రీ కారు వాడికి నా సంగతి కొంత బాగానే తెలిసింది. రాత్రి 'డిన్నర్' అంటూ వాడో పుస్తకం, పెన్సిలూ పట్టుకొని వచ్చేసరికి వాడిని విషయించేశాను. "డిన్నర్లో యేమి ఇస్తావు? యెప్పుడు ఇస్తావు? రోటీ చావల్ అయితే యెంతా? వట్టి రోటీనే అయితే యెన్ని ఇస్తావు? యెంతా? వట్టి చావల్ అయితే యెన్ని కప్పులు ఇస్తావు? కూరలు ఇస్తావా? వూరగాయే గతా?" ఇలా ముత్యాల ముగ్గులో మాడా లాగ! 

వాడు బెదిరిపోయి, రెండు భోజనాలు--రోటీలతో, రెండు భోజనాలు వట్టి చావల్ తో అని చెపితే......ఒక ప్లేటులో రెండు+రెండు=4 చపాతీలూ, సబ్జీ తెచ్చాడు--100 రూపాయలకి! సరే, మరి చావల్ మాటేమిటి అంటే, మళ్లీ రొట్టెలు లేకుండా, చావల్ తోనే రెండు ప్లేట్లు తెచ్చాడు--ఒక్కోటీ 80 రూపాయలకి!

అలాగే అడ్జస్ట్ అవ్వక తప్పింది కాదు మరి!

*వెయిటింగ్ రూములకి

ఒకటో ప్లాట్ ఫామ్‌కీ, బయటికి వెళ్లడానికి క్రిందికి దిగవలసిన మెట్లకీ మధ్యలో వున్నాయి వెయిటింగ్ రూములు. ముందు ఓ చిన్న రూము--వాష్ బేసిన్ల గట్లతో. ఆ ప్రక్కన పార్టిషన్. దాని వెనకాల యేముందో చూడలేదు నేను. వాష్ బేసిన్ల దగ్గర కొంతమంది పళ్లు తొమేసుకొంటున్నారు. సబ్బులతో ముఖాలు కడిగేసుకుంటున్నారు. ఆ రూముకి బోర్డు యేమీ లేదు. (బహుశా--ఆ మ కా వాళ్లకోసమేమో?)

తరవాత "జనరల్" రూము. విశాలంగా వుంది. ఫేన్లూ గట్రా వున్నాయి. స్టీలు బెంచీలు వున్నాయి....వాటిమీద పడుకోకుండా ప్రతీ సీటుకీ మధ్య 4 అంగుళాల యెత్తు స్టీలు గోడలు కూడా వున్నాయి. కిటికీల వద్ద కూడా కొంచెం యెత్తుగా గట్టుల్లా వున్నాయి. మేము వెళ్లేసరికి, అలాంటి కిటికీ గట్టు మీద అప్పటివరకూ నిద్రించినవాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దానిముందు వున్న స్టీలు బెంచీ ఖాళీగానే వుంది. సరే. కిటికీల దగ్గర లగేజీలు పెట్టుకొని బెంచీమీద కూర్చొన్నాం. 

ఆ రూముకి ప్రక్కనే "జంట్స్" రూము వుంది. జనరల్ లో టాయిలెట్లూ వగైరాలు లేవు. అందుకని ఇంకేదైనా రూములోకి వెళ్లవలసిందే. మేము మిక్సెడ్ డబుల్స్ కావడంతో, జనరల్ లోనే కూర్చొన్నాము. 

దాని ప్రక్కనే, "లేడీస్" రూము వుంది. వివరణ అఖ్ఖర్లేదుగా.

ఇక్కడ విశేషమేమిటంటే, వెయిటింగు రూములు యెంత వెడల్పుతో వున్నాయో వాటి ముందు "కారిడార్" అంత వెడల్పూ వుంది! అంటే, కావాలంటే ఇంకో నాలుగు వెయిటింగ్ రూములు కట్టొచ్చు! లేదా వున్నవాటినే పెద్దవి చెయ్యొచ్చు! (మన బుర్రోవాదులకి ఇలాంటివి తట్టవు కదా! యెంత 'వేస్ట్' ఐతే అంత మంచిది గుత్తేదారులకి మరి!) 

ఆడవాళ్లు లేడీస్ కి వెళ్లి, బ్రష్ లూ, అవీ చేసేసి వచ్చారు. కాఫీలు అక్కడకి రావు కదా? నడవలేరు, మెట్లు దిగలేరు, యెక్కలేరు! మరెలా? ప్లాట్ ఫామ్ ఒకటి మీదగానీ కాఫీ షాప్ లేదు! అవసరం అలాంటిది. యెక్కడలేని వోపికా తెచ్చుకొని, వెళ్లి, కాఫీలు తాగి వచ్చారు. పైగా, కాఫీ చాలా బాగుంది! మీరూ వెళ్లండి అని సలహా!

మేము తక్కువ తిన్నామా? జంట్స్ లోకి వెళ్లి, పనులయ్యాక మెట్లు దిగి, క్రిందకి....బయటికి వెళ్లే మార్గంలో వెళ్లి, అక్కడ ఓ 24 గంటల రెస్టారెంట్ వుంటే, అందులో సెల్ఫ్ సర్వీస్ కాఫీలు కొనుక్కొని, కూర్చొని, ఆస్వాదిస్తూ త్రాగి, వెనక్కి వచ్చాం. 

విషయమేమిటంటే, ఈ వెయిటింగ్ రూములు కనీసం స్లీపర్ క్లాస్ టిక్కెట్లు వున్నవాళ్లకే. కానీ యెవడూ చెక్ చేసిన పాపాన పోవడం లేదు. "సర్వమంగళ తన మాంగల్యమునెంత మదినమ్మినిదో!" అన్నట్టు. యే టెర్రరిస్ట్ అయినా...!....పాపము శమించుగాక!

#ఇంకో విషయం వ్రాయడం.

పగలు జర్నీలో మన రాష్ట్ర సరిహద్దుల్లో యెక్కడో ఒక ముసలవ్వ (కనీసం 60 యేళ్లు వుంటాయి) యెక్కింది--ఓ పెద్ద బుట్టని ఇద్దరు మగాళ్లు మోసుకొచ్చి, యెక్కించగా. ఆబుట్టలో ఓ ఐదారు వందల కమలాఫలాలు (సంత్రాలు) వుంటాయి--రకరకాల సైజుల్లో, రకరకాల 'పండిన' స్థితుల్లో. చాకచక్యంగా వాటిని --ఒకే సైజువి, బాగా పండినవి కొన్నీ, కొంచెం తక్కువ పండినవి కొన్నీ--ఇలా వేరే ప్లాస్టిక్ కవర్లలో ఓ ఐదేసి చొప్పున సర్దేసి, పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! ఇరవై రూపాయలకే!" అంటూ అమ్మొచ్చింది. అప్పటికి ఓ రాత్రీ, ప్రొద్దున్నా ప్రయాణం చేసి, ప్యాంట్రీ కార్ వాడు పెట్టిన టిఫిన్లు తినీ, కాఫీ టీలు తాగీ, జిహ్వ చచ్చిపోయి వున్నారేమో--అందరూ కొనేశారు. మళ్లీ ఆవిడ రెండో రవుండ్ తిరగడం, మళ్లీ అందరూ కొనెయ్యడం! మధ్యాహ్న భోజనాలు అయ్యాక కొంత గేప్. మళ్లీ ఆవిడ, కొంచెం పెద్ద సైజు పళ్లనీ, కొంచెం తక్కువ పండిన వాటినీ ఐదేసి చొప్పున పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! 15 రూపాయలకే!" అంటూ వస్తే, మళ్లీ అందరూ......హాం ఫట్! సాయంత్రం 4 గంటలకల్లా బుట్ట ఖాళీ చేసుకొని, డబ్బులని రొండిలో దోపుకొని, దిగి వెళ్లిపోయిందామె! నిజంగా, ఆ వయసులో ఆమె కష్టానికీ, తెలివికీ తగిన ఫలితం వచ్చిందా.......అంటే.....యేమో! ఆ పైవాడికే తెలియాలి!

..........ఇంకా తరువాయి.

No comments: