మొన్నటి మా యాత్ర
......ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!
@ "పిచ్చోడిలా వున్నావే! యేమి చేసి వస్తారు?"
(సంభాషణ హిందీలో జరుగుతూంది).
"స్మోక్ చేసి వచ్చారు."
"మీరు చూశారా?"
"చూడక్కర్లేదు. మీ జేబులోని సిగరెట్టు పెట్టే చెపుతూంది" అంటూ, ఆ పెట్టెని తీసేసుకొని, తన పేంటు జేబులో పెట్టేసుకున్నాడు.
(ఆ సమయంలో మా పెట్టెలోని టాయిలెట్లలో యెవరో వుండడంతో, వెస్టిబ్యూల్ దాటి, ప్రక్క పెట్టెలోని టాయిలెట్లోకి వెళ్లాను. మా సంభాషణ వెస్టిబ్యూల్ లో జరుగుతోంది.)
"జేబులో పెట్టె నేరం కాదుకదా?"
"ఇక్కడ బోర్డు చూడండి--250/- రూపాయల జుర్మానా!"
"అది 'పబ్లిక్ ప్లేసులో' తాగిన వాళ్లకి. టాయిలెట్లో తలుపు వేసుకున్నాక, అది నా ప్రైవేట్ ప్లేసు. అది నేరం అని యెవరు చెప్పారు? పైగా నువ్వు చూడలేదు కదా?"
"ఇప్పుడే చలాన్ వ్రాయగలను. 250/- కట్టండి."
"నీదగ్గర రుజువేముందని కట్టమంటావు? సిగరెట్టు పెట్టె నీజేబులో వుంది!"
(అప్పుడే పెట్టెలో టీలు అమ్మేవాడొకడు అక్కడికి వచ్చాడు. ఆ పోలీసు తనజేబులోంచి ఆ సిగరెట్టు పెట్టెని తీసి, మళ్లీ నా చొక్కాజేబులో పెట్టడం చూశాడు. నేను వాణ్ని అడిగాను)
"బాబూ! నువ్వేమి చూశావో వ్రాస్తాను. సంతకం పెట్టు"
"మధ్యలో నన్ను ఇరికించకండి బాబూ" అంటూ వాడు వెళ్లిపోయాడు.
(అక్కడ చీకటిగా వుండడంతో వాడి నేం ప్లేట్ కనిపించడంలేదు.)
"అసలు నీ పేరేమిటి? నువ్వు డ్యూటీలోనే వున్నావా? నీ ఐడీ కార్డు యేది?"
"అవన్నీ అడిగితే, ఇప్పుడే కేసు వ్రాసేసి, వచ్చే స్టేషనులో ఆర్పీఎఫ్ వాళ్లకి అప్పగిస్తాను!"
"యేమని వ్రాస్తావు కేసు?" (యెదురుగా కనిపిస్తున్న ప్రయాణీకులని కూడా అడిగాను.) "బాబూ! మీరుకూడా చూశారుకదా? సిగరెట్టుపెట్టెని నా జేబులో పెట్టబోయాడు. పైగా కేసు అంటున్నాడు! ఇందాకా జరిమానా అన్నాడు."
"సరే! జుర్మానా కట్టెయ్యండి. కేసు వ్రాయను."
"నేను లుంగీ, షర్టులో వున్నాను. నాదగ్గర డబ్బుల్లేవు. అయినా, అసలు నీ బాధ యేమిటి? నేను నిజంగా నేరం చేసినా, ప్రథమ తప్పిదం క్రింద వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యాలి, మళ్లీ అదే నేరం చేస్తే పట్టుకోవాలి."
"సరే. వదిలేస్తాను. పదినిమిషాల్లో జరిమానా కట్టండి! లేకపోతే వచ్చే స్టేషనులో......"
"డబ్బులకోసం మా ఆడవాళ్లదగ్గరికి వెళ్లానంటే, గొడవ అవుతుంది. అందరూ వచ్చేసి దెబ్బలాడతారు. నీ కేసు సంగతి యేమవుతుందో చూసుకో!"
"సరే. ఓ పావుగంటలో ఓ 100 తెచ్చి ఇవ్వండి. లేకపోతే.....! మీ బెర్త్ నెంబరు చెప్పండి."
"నాది ఇవాళ అంటే 04-03-2011 న, విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్-లింకు ఎక్స్ ప్రెస్ లో, ఎస్ 2 లో బెర్త్ నంబరు 65" కాస్త గట్టిగానే, అందరూ వినేలా చెప్పాను.
(నిజానికి ఈ "కరప్ట్" వాళ్లందరూ పేరూ, డెజిగ్నేషన్ అడగ్గానే లొంగిపోతారు. కానీ మనం కూడా అనువుగానిచోట అధికులమనరాదు కదా? ఆర్పీఎఫ్ వాళ్లు కేసులు పెట్టడానికి ఈ స్టేషను కాదని ఆ స్టేషనూ అంటూ, మన ప్రయాణాన్ని ఆపేసి, తిప్పడం పేపర్లలో చదువుతూ వుంటాము కదా? అందుకని, కామ్‌గా మా ఆవిడని అడిగి, ఓ వంద తీసుకెళ్లి, వాడి జేబులో పెట్టాను.)
"మీ పెట్టె మీరు తీసేసుకోండి!" అని నా జేబులో పెట్టబోయాడు.
"నీదగ్గరే వుంచు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు తీసుకొంటాను కదా!"
"నేను ఇంకో గంటలో రైలు దిగిపోతాను. ఈ లోపల మీ యిష్టం."
"మరి రాత్రి భోజనం సంగతి తరవాత మాటేమిటి?"
(అప్పటికి ఝాన్సీ స్టేషన్ రాబోతూంది. ఆరూ యేడు లోపల వచ్చేస్తుందని మా ప్రక్కవాడు--మమూలు టిక్కెట్టు కొనుక్కొని, రిజర్వేషన్ బోగీ యెక్కినవాడు--చెప్పాడు.)
"మీరు యెలాగైనా కాల్చుకోండి--కానీ పోలీసులెవరూ లేకుండా చూసుకొని కాల్చండి!" అని అమూల్యమైన సలహా ఇవ్వడం కొసమెరుపు. తరవాత వాడెప్పుడు దిగిపోయాడో నేను చూడలేదు. వాడి సలహా మాత్రం పాటించాను.
..........ఇంకా తరువాయి.
No comments:
Post a Comment