Wednesday, April 20

మా మూడో హనీమూన్ అనే.......-8



మొన్నటి మా యాత్ర

$భోజనాలు

ఓ రాత్రీ, ఓ పగలూ అప్పటికే ప్రయాణించడంతో ప్యాంట్రీ కారు వాడికి నా సంగతి కొంత బాగానే తెలిసింది. రాత్రి 'డిన్నర్' అంటూ వాడో పుస్తకం, పెన్సిలూ పట్టుకొని వచ్చేసరికి వాడిని విషయించేశాను. "డిన్నర్లో యేమి ఇస్తావు? యెప్పుడు ఇస్తావు? రోటీ చావల్ అయితే యెంతా? వట్టి రోటీనే అయితే యెన్ని ఇస్తావు? యెంతా? వట్టి చావల్ అయితే యెన్ని కప్పులు ఇస్తావు? కూరలు ఇస్తావా? వూరగాయే గతా?" ఇలా ముత్యాల ముగ్గులో మాడా లాగ! 

వాడు బెదిరిపోయి, రెండు భోజనాలు--రోటీలతో, రెండు భోజనాలు వట్టి చావల్ తో అని చెపితే......ఒక ప్లేటులో రెండు+రెండు=4 చపాతీలూ, సబ్జీ తెచ్చాడు--100 రూపాయలకి! సరే, మరి చావల్ మాటేమిటి అంటే, మళ్లీ రొట్టెలు లేకుండా, చావల్ తోనే రెండు ప్లేట్లు తెచ్చాడు--ఒక్కోటీ 80 రూపాయలకి!

అలాగే అడ్జస్ట్ అవ్వక తప్పింది కాదు మరి!

*వెయిటింగ్ రూములకి

ఒకటో ప్లాట్ ఫామ్‌కీ, బయటికి వెళ్లడానికి క్రిందికి దిగవలసిన మెట్లకీ మధ్యలో వున్నాయి వెయిటింగ్ రూములు. ముందు ఓ చిన్న రూము--వాష్ బేసిన్ల గట్లతో. ఆ ప్రక్కన పార్టిషన్. దాని వెనకాల యేముందో చూడలేదు నేను. వాష్ బేసిన్ల దగ్గర కొంతమంది పళ్లు తొమేసుకొంటున్నారు. సబ్బులతో ముఖాలు కడిగేసుకుంటున్నారు. ఆ రూముకి బోర్డు యేమీ లేదు. (బహుశా--ఆ మ కా వాళ్లకోసమేమో?)

తరవాత "జనరల్" రూము. విశాలంగా వుంది. ఫేన్లూ గట్రా వున్నాయి. స్టీలు బెంచీలు వున్నాయి....వాటిమీద పడుకోకుండా ప్రతీ సీటుకీ మధ్య 4 అంగుళాల యెత్తు స్టీలు గోడలు కూడా వున్నాయి. కిటికీల వద్ద కూడా కొంచెం యెత్తుగా గట్టుల్లా వున్నాయి. మేము వెళ్లేసరికి, అలాంటి కిటికీ గట్టు మీద అప్పటివరకూ నిద్రించినవాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దానిముందు వున్న స్టీలు బెంచీ ఖాళీగానే వుంది. సరే. కిటికీల దగ్గర లగేజీలు పెట్టుకొని బెంచీమీద కూర్చొన్నాం. 

ఆ రూముకి ప్రక్కనే "జంట్స్" రూము వుంది. జనరల్ లో టాయిలెట్లూ వగైరాలు లేవు. అందుకని ఇంకేదైనా రూములోకి వెళ్లవలసిందే. మేము మిక్సెడ్ డబుల్స్ కావడంతో, జనరల్ లోనే కూర్చొన్నాము. 

దాని ప్రక్కనే, "లేడీస్" రూము వుంది. వివరణ అఖ్ఖర్లేదుగా.

ఇక్కడ విశేషమేమిటంటే, వెయిటింగు రూములు యెంత వెడల్పుతో వున్నాయో వాటి ముందు "కారిడార్" అంత వెడల్పూ వుంది! అంటే, కావాలంటే ఇంకో నాలుగు వెయిటింగ్ రూములు కట్టొచ్చు! లేదా వున్నవాటినే పెద్దవి చెయ్యొచ్చు! (మన బుర్రోవాదులకి ఇలాంటివి తట్టవు కదా! యెంత 'వేస్ట్' ఐతే అంత మంచిది గుత్తేదారులకి మరి!) 

ఆడవాళ్లు లేడీస్ కి వెళ్లి, బ్రష్ లూ, అవీ చేసేసి వచ్చారు. కాఫీలు అక్కడకి రావు కదా? నడవలేరు, మెట్లు దిగలేరు, యెక్కలేరు! మరెలా? ప్లాట్ ఫామ్ ఒకటి మీదగానీ కాఫీ షాప్ లేదు! అవసరం అలాంటిది. యెక్కడలేని వోపికా తెచ్చుకొని, వెళ్లి, కాఫీలు తాగి వచ్చారు. పైగా, కాఫీ చాలా బాగుంది! మీరూ వెళ్లండి అని సలహా!

మేము తక్కువ తిన్నామా? జంట్స్ లోకి వెళ్లి, పనులయ్యాక మెట్లు దిగి, క్రిందకి....బయటికి వెళ్లే మార్గంలో వెళ్లి, అక్కడ ఓ 24 గంటల రెస్టారెంట్ వుంటే, అందులో సెల్ఫ్ సర్వీస్ కాఫీలు కొనుక్కొని, కూర్చొని, ఆస్వాదిస్తూ త్రాగి, వెనక్కి వచ్చాం. 

విషయమేమిటంటే, ఈ వెయిటింగ్ రూములు కనీసం స్లీపర్ క్లాస్ టిక్కెట్లు వున్నవాళ్లకే. కానీ యెవడూ చెక్ చేసిన పాపాన పోవడం లేదు. "సర్వమంగళ తన మాంగల్యమునెంత మదినమ్మినిదో!" అన్నట్టు. యే టెర్రరిస్ట్ అయినా...!....పాపము శమించుగాక!

#ఇంకో విషయం వ్రాయడం.

పగలు జర్నీలో మన రాష్ట్ర సరిహద్దుల్లో యెక్కడో ఒక ముసలవ్వ (కనీసం 60 యేళ్లు వుంటాయి) యెక్కింది--ఓ పెద్ద బుట్టని ఇద్దరు మగాళ్లు మోసుకొచ్చి, యెక్కించగా. ఆబుట్టలో ఓ ఐదారు వందల కమలాఫలాలు (సంత్రాలు) వుంటాయి--రకరకాల సైజుల్లో, రకరకాల 'పండిన' స్థితుల్లో. చాకచక్యంగా వాటిని --ఒకే సైజువి, బాగా పండినవి కొన్నీ, కొంచెం తక్కువ పండినవి కొన్నీ--ఇలా వేరే ప్లాస్టిక్ కవర్లలో ఓ ఐదేసి చొప్పున సర్దేసి, పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! ఇరవై రూపాయలకే!" అంటూ అమ్మొచ్చింది. అప్పటికి ఓ రాత్రీ, ప్రొద్దున్నా ప్రయాణం చేసి, ప్యాంట్రీ కార్ వాడు పెట్టిన టిఫిన్లు తినీ, కాఫీ టీలు తాగీ, జిహ్వ చచ్చిపోయి వున్నారేమో--అందరూ కొనేశారు. మళ్లీ ఆవిడ రెండో రవుండ్ తిరగడం, మళ్లీ అందరూ కొనెయ్యడం! మధ్యాహ్న భోజనాలు అయ్యాక కొంత గేప్. మళ్లీ ఆవిడ, కొంచెం పెద్ద సైజు పళ్లనీ, కొంచెం తక్కువ పండిన వాటినీ ఐదేసి చొప్పున పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! 15 రూపాయలకే!" అంటూ వస్తే, మళ్లీ అందరూ......హాం ఫట్! సాయంత్రం 4 గంటలకల్లా బుట్ట ఖాళీ చేసుకొని, డబ్బులని రొండిలో దోపుకొని, దిగి వెళ్లిపోయిందామె! నిజంగా, ఆ వయసులో ఆమె కష్టానికీ, తెలివికీ తగిన ఫలితం వచ్చిందా.......అంటే.....యేమో! ఆ పైవాడికే తెలియాలి!

..........ఇంకా తరువాయి.

Saturday, April 16

మా మూడో హనీమూన్ అనే.......-7



మొన్నటి మా యాత్ర

ఇంక ఆ రాత్రి $భోజనాలు చేశాక, నిద్రపోయాం. రాత్రి పదింటికే చలి మొదలయ్యింది. ఫ్యాన్లు కట్టేసి, పేంట్లు, చొక్కాలు, స్వెట్టర్లూ, సాక్సూ, జర్కిన్లూ, మఫ్లర్లూ, శాలువాలూ  వగైరాలతో బందోబస్తు చేసి దుప్పట్లు ముసుగేసినా, ఇంకా వణికిస్తున్న చలి. తెల్లవారుజామున 3 గంటలకే రైలు నిజాముద్దీన్ చేరాలి. అప్పుడు హడావిడిగా యెందుకని, ముందే అన్నీ సర్దేసుకున్నాము. 

ఈ ఆడవాళ్లు అసలు నిద్రపోతేనా! అలారం పెట్టుకొన్నది రెండున్నరకి. మధ్యలో యేవేవో మెస్సేజిలూ వాటి సౌండ్లూ, లేచి చూసుకోడాలూ, గుడగుడలూ. మమ్మల్ని కూడా లేపేశారు--రెండున్నర లోపలే! (నాకు ఇంకో నాలుగు సిగరెట్లు యెక్కువ ఖర్చయ్యాయి.)

అలా మొత్తానికి కొంచెం లేటుగా 4 గంటలకి చేరింది రైలు. ఢిల్లీలో పడ్డాం. లగేజీలు దింపుకొని, అక్కడవుండే మా మూడో (ఆఖరి) చెల్లెలుకి ఫోను చేద్దును కదా--డ్రైవరు ఇప్పుడే వచ్చాడు. నేను బయలుదేరి వస్తున్నాను. మీరు వెయిటింగ్ రూములో వుండండి. యెంతోకాదు....ఓ రెండుగంటల్లో వచ్చేస్తాను--అంది. 

సరే, మళ్లీ 180 రూపాయలకి పోర్టరుని మాట్లాడుకొని, ఒకటో ప్లాట్ ఫామ్ ప్రక్కన వుండే *వెయిటింగ్ రూములకి చేరాము. (ఆ స్టేషనుకి బయటికి వెళ్లడానికి రెండువైపులా మార్గాలు వున్నాయి. మేము దిగినది 'నిజాముద్దీన్ ' వైపు అంటారు. ఇంకోవైపుని 'సయ్యద్ కాలేషా' అనో యేదో అంటారు). 

మరిచాను దారిలో ఇంకో #చిన్న విషయం వ్రాయడం.

..........ఇంకా తరువాయి.

Saturday, April 9

మా మూడో హనీమూన్ అనే.......-6



మొన్నటి మా యాత్ర

......ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!

@ "పిచ్చోడిలా వున్నావే! యేమి చేసి వస్తారు?"

(సంభాషణ హిందీలో జరుగుతూంది).

"స్మోక్ చేసి వచ్చారు."

"మీరు చూశారా?"

"చూడక్కర్లేదు. మీ జేబులోని సిగరెట్టు పెట్టే చెపుతూంది" అంటూ, ఆ పెట్టెని తీసేసుకొని, తన పేంటు జేబులో పెట్టేసుకున్నాడు.

(ఆ సమయంలో మా పెట్టెలోని టాయిలెట్లలో యెవరో వుండడంతో, వెస్టిబ్యూల్ దాటి, ప్రక్క పెట్టెలోని టాయిలెట్లోకి వెళ్లాను. మా సంభాషణ వెస్టిబ్యూల్ లో జరుగుతోంది.)

"జేబులో పెట్టె నేరం కాదుకదా?"

"ఇక్కడ బోర్డు చూడండి--250/- రూపాయల జుర్మానా!"

"అది 'పబ్లిక్ ప్లేసులో' తాగిన వాళ్లకి. టాయిలెట్లో తలుపు వేసుకున్నాక, అది నా ప్రైవేట్ ప్లేసు. అది నేరం అని యెవరు చెప్పారు? పైగా నువ్వు చూడలేదు కదా?"

"ఇప్పుడే చలాన్ వ్రాయగలను. 250/- కట్టండి."

"నీదగ్గర రుజువేముందని కట్టమంటావు? సిగరెట్టు పెట్టె నీజేబులో వుంది!"

(అప్పుడే పెట్టెలో టీలు అమ్మేవాడొకడు అక్కడికి వచ్చాడు. ఆ పోలీసు తనజేబులోంచి ఆ సిగరెట్టు పెట్టెని తీసి, మళ్లీ నా చొక్కాజేబులో పెట్టడం చూశాడు. నేను వాణ్ని అడిగాను)

"బాబూ! నువ్వేమి చూశావో వ్రాస్తాను. సంతకం పెట్టు" 

"మధ్యలో నన్ను ఇరికించకండి బాబూ" అంటూ వాడు వెళ్లిపోయాడు. 

(అక్కడ చీకటిగా వుండడంతో వాడి నేం ప్లేట్ కనిపించడంలేదు.)

"అసలు నీ పేరేమిటి? నువ్వు డ్యూటీలోనే వున్నావా? నీ ఐడీ కార్డు యేది?"

"అవన్నీ అడిగితే, ఇప్పుడే కేసు వ్రాసేసి, వచ్చే స్టేషనులో ఆర్పీఎఫ్ వాళ్లకి అప్పగిస్తాను!"

"యేమని వ్రాస్తావు కేసు?" (యెదురుగా కనిపిస్తున్న ప్రయాణీకులని కూడా అడిగాను.) "బాబూ! మీరుకూడా చూశారుకదా? సిగరెట్టుపెట్టెని నా జేబులో పెట్టబోయాడు. పైగా కేసు అంటున్నాడు! ఇందాకా జరిమానా అన్నాడు."

"సరే! జుర్మానా కట్టెయ్యండి. కేసు వ్రాయను."

"నేను లుంగీ, షర్టులో వున్నాను. నాదగ్గర డబ్బుల్లేవు. అయినా, అసలు నీ బాధ యేమిటి? నేను నిజంగా నేరం చేసినా, ప్రథమ తప్పిదం క్రింద వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యాలి, మళ్లీ అదే నేరం చేస్తే పట్టుకోవాలి."

"సరే. వదిలేస్తాను. పదినిమిషాల్లో జరిమానా కట్టండి! లేకపోతే వచ్చే స్టేషనులో......"

"డబ్బులకోసం మా ఆడవాళ్లదగ్గరికి వెళ్లానంటే, గొడవ అవుతుంది. అందరూ వచ్చేసి దెబ్బలాడతారు. నీ కేసు సంగతి యేమవుతుందో చూసుకో!"

"సరే. ఓ పావుగంటలో ఓ 100 తెచ్చి ఇవ్వండి. లేకపోతే.....! మీ బెర్త్ నెంబరు చెప్పండి."

"నాది ఇవాళ అంటే 04-03-2011 న, విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్-లింకు ఎక్స్ ప్రెస్ లో, ఎస్ 2 లో బెర్త్ నంబరు 65" కాస్త గట్టిగానే, అందరూ వినేలా చెప్పాను.

(నిజానికి ఈ "కరప్ట్" వాళ్లందరూ పేరూ, డెజిగ్నేషన్ అడగ్గానే లొంగిపోతారు. కానీ మనం కూడా అనువుగానిచోట అధికులమనరాదు కదా? ఆర్పీఎఫ్ వాళ్లు కేసులు పెట్టడానికి ఈ స్టేషను కాదని ఆ స్టేషనూ అంటూ, మన ప్రయాణాన్ని ఆపేసి, తిప్పడం పేపర్లలో చదువుతూ వుంటాము కదా? అందుకని, కామ్‌గా మా ఆవిడని అడిగి, ఓ వంద తీసుకెళ్లి, వాడి జేబులో పెట్టాను.)

"మీ పెట్టె మీరు తీసేసుకోండి!" అని నా జేబులో పెట్టబోయాడు. 

"నీదగ్గరే వుంచు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు తీసుకొంటాను కదా!"

"నేను ఇంకో గంటలో రైలు దిగిపోతాను. ఈ లోపల మీ యిష్టం."

"మరి రాత్రి భోజనం సంగతి తరవాత మాటేమిటి?"

(అప్పటికి ఝాన్సీ స్టేషన్ రాబోతూంది. ఆరూ యేడు లోపల వచ్చేస్తుందని మా ప్రక్కవాడు--మమూలు టిక్కెట్టు కొనుక్కొని, రిజర్వేషన్ బోగీ యెక్కినవాడు--చెప్పాడు.)

"మీరు యెలాగైనా కాల్చుకోండి--కానీ పోలీసులెవరూ లేకుండా చూసుకొని కాల్చండి!" అని అమూల్యమైన సలహా ఇవ్వడం కొసమెరుపు. తరవాత వాడెప్పుడు దిగిపోయాడో నేను చూడలేదు. వాడి సలహా మాత్రం పాటించాను.   

..........ఇంకా తరువాయి.

Thursday, April 7

మా మూడో హనీమూన్ అనే..... -5



మొన్నటి మా యాత్ర

విజయవాడ దాటాక, టిఫిన్లూ, పెరుగన్నాలూ లాగించాక, నిద్రకి పడ్డాం. నాకు సాధారణంగా కారు/రైలు/బస్సుల్లో నిద్ర రాదు. అలాంటిది ఆ రోజెందుకో, భలే నిద్ర పట్టేసింది. 

మర్నాడు ప్రొదున్న, ఆడవాళ్లిద్దరూ బ్రష్ చేసేసి, ఆరింటికే ఒకసారి కాఫీ వస్తే తాగేశారు. తరవాతెప్పుడో నిద్రలేచిన మాకు 10-30 దాకా కాఫీ రాలేదు....టీ వాడు మాత్రం నిమిషానికోసారి.....తాగుతారా? ఛస్తారా? అన్నట్టు మా చుట్టే తిరిగాడు. 

అప్పటికి మహారాష్ట్రలోనో యెక్కడో తేలాం. 

నాష్తా అంటూ "వెజ్ కట్లెట్; సమోసా; బ్రెడ్ పకోడా" అని అరుస్తూ ఒకడు తిరిగాడు అంతసేపూ. ఈటార్సీ దాటామనుకొంటా. 

అప్పుడొకడు వచ్చాడు--"రోటీ భాజీ" అంటూ. నాలుగు ప్లేట్లు 80 రూపాయలకో యెంతకో 
కొనుక్కొని, అందరూ తినేశాం. (ఐ ఆర్ సీ టీ సీ వాళ్లు టిక్కెట్లలో మోసం చేస్తున్నారు--చర్య తీసుకోండి అంటే, వాళ్లని కేటరింగు నించి కూడా తప్పించి, మమతాదీ ఫేవరెట్లకి 'ప్రైవేటు ' కేటరింగ్ కి ఇచ్చేశారు--అదీ మన దౌర్భాగ్యం!)

ఇంకో గంటలో, "లంచ్?" అంటూ ఒకళ్లిద్దరు తిరగడం మొదలెట్టారు. టైము ఇంకా 12 కూడా కాలేదేమో. "లంచ్ లో యేమిస్తావు?" అనడిగాను (కానీ యెప్పుడిస్తావు అనడగలేదు!) "చపాతీ, సబ్జీ--యా చావల్, దాల్" అన్నాడు. సరే అనుకొని, రెండు చపాతీ సబ్జీ చెప్పాను. ఐదు నిమిషాల్లోనే హాజరు! 

ఆడాళ్లనిద్దరినీ తినెయ్యమన్నాను--వాళ్లు ఆకలికి తట్టుకోలేరుకదా అని. ఓ పావు గంట తరవాత కూడా, "లంచ్?" వాళ్లు తిరుగుతున్నారు! సరేలే, ఇంకేమీ దొరకదేమో అని, రెండు చావల్, దాల్ కి ఆర్డరు ఇచ్చాను. అప్పుడుకూడా, యెప్పుడిస్తావు అని అడగలేదు. 

మళ్లీ పది నిమిషాల్లోనే ప్రత్యక్షం! మా బావగారు పాపం, టేబ్లెట్లు వేసుకోవాలంటే తినక తప్పదని, తినేశారు--ఇంతకీ అది మన "పోపన్నం!" దాల్ పేరుతో ఓ నీళ్ల ద్రావకం, ఓ చిన్న వూరగాయ పౌచ్ ఇచ్చాడు! వాటికి రెండింటికీ 80 రూపాయలు! (నేను తిననే లేదు!)

మధ్యాహ్నం రెండు గంటలకి మళ్లీ మా వాళ్లు ముగ్గురూ కాస్త పెరుగన్నం తిన్నారు. (అప్పటికి ఇంకా 'బస్తాల ' అవసరం రాలేదు.)

నేను మళ్లీ నిద్రకి పడ్డాను.నాలుగింటికి మెలుకువ వచ్చింది. ఓ సిగరెట్టుకాల్చుకొద్దామని టాయిలెట్ కి వెళ్లాను. పని అయిపోయాక బయటికి వద్దును కదా........ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!  

..........ఇంకా తరువాయి.

Saturday, April 2

మా మూడో హనీమూన్ అనే..... -4



మొన్నటి మా యాత్ర

(ఇలా అయితే యాత్ర విశేషాలు యేడాదైనా తెమలవుగానీ, టూకీగా వ్రాసేసి, వివరణ అవసరమైనచోట్ల * గుర్తో యేదో వేసేసి, వేరే వ్రాస్తాను. సరేనా?)  

.......రైలు కూత వినపడింది* కదా?

*"రైలు కదిలిపోతూంది! యెక్కెయ్యండి" అని గోల. ఇంతకీ అది ప్రక్క లైనులోంచి వెళ్లిపోయిన ఓ గూడ్స్ రైలు! గూడ్స్ రైలు కూతకీ, ప్యాసింజరు రైలు కూతకీ (కారుకూతలకీ, రైలు కూతలకీ) తేడా చాలామందికి తెలియదు. తీరా నేను చూసేసరికి అప్పుడే మా రైలుకి సిగ్నలు ఇచ్చారు. వెంటనే యెక్కేశాను. 

అయినా, ఈ రైళ్లలో దిగి యెక్కడాలూ, సిగ్నళ్లు ఇవ్వడాలూ, కూతలు వెయ్యడాలూ, యే యే స్టేషన్లలో లగేజి లోడింగులు జరుగుతాయి, అక్కడ అవి అయ్యేవరకూ బ్రహ్మదేవుడు చెప్పినా రైళ్లు కదలవూ, యెక్కడెక్కడ, యెన్నెన్ని రైళ్లూ, గూడ్స్లూ, ఇంజన్లూ క్రాసింగులు అవుతాయి, అవతల లైన్లో యే రైలుని వొదిలారూ, మన రైలు యెప్పుడు వదులుతారూ--వగైరాలన్నీ నాకు 30 యేళ్లు వచ్చేటప్పటికే అవుపోశన పట్టేశాను. అందుకే నాకు భయం లేదు యెక్కలేకపోతానని!

రైలు నెమ్మదిగా బయలుదేరి, రాత్రి పదిగంటల ప్రాంతంలో విజయవాడ చేరింది. అప్పటిదాకా ఆకళ్లు యెవరికీ లేవు. (ఐదారుసార్లు కాఫీలు లాగించాము కదా!) కానీ, ఇంక నిద్రపోవాలికాబట్టి, తినెయ్యాలి. అక్కడ షెడ్యూల్డ్ స్టాప్ 20 నిమిషాలు. క్రిందికి దిగి, ప్లాట్ ఫామ్ మీద చూస్తే, ఓ వంద గజాల దూరం లో "ఇడ్లీ, వడా, దోశా" అని అరుస్తున్నారు. 

దిగబోతూ అందరినీ అడిగాను--యేమి తెమ్మంటారు? అని. "మాకేమీ వద్దు" అని కోరస్! నేను మాత్రం టిఫిన్ తెచ్చుకోదలిచి, ఓ వెండర్ని అడగ్గానే, 9 X 4 తగరం ప్లేట్లలో ప్యాక్ చెయ్యబడ్డ "వడా, దోశ" ని చూపించి, 25 రూపాయలు ఇమ్మన్నాడు. 

యెందుకైనామంచిదని రెండు ప్యాకట్లు తీసుకున్నాను.  

ఇదివరకు, ప్రతీ ప్లాట్ ఫామ్ మీదా, వేరే వేరే తట్టల్లో ఇడ్లీ, వడా, దోశా, పులిహోర, పెరుగన్నం--ఇలా అమ్మేవారు. ఓ ఆకులో రెండు ఇడ్లీ, రెండు వడా పెట్టించుకొని, నీళ్ల చట్నీ వేయించుకొని, అది కారిపోకుండా పెట్టెలో తమవాళ్లకి ఇవ్వడానికి యెన్నో ఫీట్లు చెయ్యాల్సి వచ్చేది!

విజయవాడ స్టేషన్ క్యాంటీనంటే--ప్రపంచం మొత్తమ్మీద 'అదుర్స్!' 

విజయవాడలో నెలకి వందా రెండువందలు జీతం సంపాదించుకొంటూ, అద్దెలు భరించలేనివాళ్లు--స్తేషన్లోనే వుంటూ, టిఫిన్లూ, భోజనాలూ చౌకగా తింటూ కాలం వెళ్లబుచ్చేవారు! ఇప్పుడా క్యాంటీనుకి అంత సీను వుందో లేదో చూసే భాగ్యం ఈ మధ్య కలగలేదు.

ఇప్పుడు, ఇడ్లీ, వడా, దోశా--మనిష్టం కాదు--వాళ్లు "వడా-దోశా"; "ఇడ్లీ-పులిహోరా"; "బ్రెడ్-పెరుగన్నం" లాంటి చిత్రమైన కాంబినేషన్లలో--యేమి పెడితే అది తినాల్సిందే! ఇక @చట్నీదో ప్రహసనం. పైగా, ఆ ప్యాకెట్లమీద ఆ రోజు తారీఖూ, ఎం ఆర్ పీ స్టాంప్ చేసి వున్నాయి! (ఎం ఆర్ పీ 20/- అయితే, వాడు 25/- వసూలు చేసి నన్నే మోసం చేసాడన్న విషయం తినే ముందు తెలిసింది!)   

..........ఇంకా తరువాయి.

Friday, April 1

మా మూడో హనీమూన్ అనే..... -3



మొన్నటి మా యాత్ర

హమ్మయ్య. 

రైలు (అన్నట్టు రైలు మన తెలుగు శబ్దమేకదూ? లేక "ధూమశకటం" అందామన్నా, ఇప్పుడు బొగ్గులూ లేవు, ధూమం లేదు మరి. డీజెల్ కి తెలుగు పేరు పెట్టబడినట్టు లేదు--ఆ శకటం అందామన్నా) బయలుదేరింది. 

బ్యాగులూ గట్రా సీట్ల క్రిందకి తోసేసి, అవసరమొచ్చేవి ప్రక్కనే పెట్టుకొని, హేండ్ బ్యాగులు ఆడవాళ్ల ప్రక్కన పెట్టుకొని, 'అందరికీ' ఫోనులు చేసేసి 'బండి యెక్కేశాం, కదిలిపోయింది, మళ్లీ తరవాత చేస్తాం' అని చెప్పేసి (ఇదివరకు యెవరినైనా బండి యెక్కించి, 'చేరగానే కార్డు ముక్క రాయండి' అనేవారు--ఆ కార్డు ముక్క చేరితే సంతోషం, లేదా చేరక ....స్తారేమిటీ...అని ఓ ధీమా వుండేది. ఇప్పుడా ధీమా కరువై, గంటగంటకీ మనం చెయ్యకపోతే వాళ్లే ఫోను చేసేసి, హమ్మయ్య అనుకొంటూ రాత్రంతా గడిపేస్తారు. తెల్లవార్లూ కంపార్ట్ మెంట్లో అందరి సెల్లులూ మోగుతూనే వుంటాయి--ముచ్చటైనవేకాదు భయంకరమైన రింగ్ టోన్లతో సహా--మాట్లాడుతూనే వుంటారు), కాస్త రిలాక్సుడుగా కూర్చొనే సరికి, "చిన్నన్నయ్యా! బావగారు బ్రెడ్ తెచ్చారుగానీ, జామ్ మర్చిపోయారు. తరవాత అరిటిపళ్లు కూడా కొనుక్కుంటే బాగుంటుంది" అని ఓ సలహాత్మక సూచన. 

ఇంతలో వచ్చింది--యేమిటీ? మూర్చా?--కాదు రాజమండ్రి.....అంటే నిజంగా మనదగ్గరకి వచ్చింది అనికాదు.....మన రైలు రాజమండ్రి అనే వూర్లో వున్న స్టేషనుకి చేరింది.....అని! 

సరే.....పళ్లూ అవీ అంటూ రైలు దిగబోతే, మా ఆవిడ "యేమండీ.....మీరు దిగొద్దు. కిటికీ ప్రక్కకి వస్తే కొందాము.....అంతే!" అనీ, చెల్లెలు కూడా "వొద్దు......దిగొద్దు....మళ్లీ యెక్కడం కష్టం" అనీ సతాయింపు. 

అయినా మనం వింటామా! రాజమండ్రిలో యెంత ముష్టి రైలు అయినా ఓ 10 నిమిషాలు ఆగకపోదు. ఆ టైములో ప్లాట్ ఫామ్ మూడుసార్లు చుట్టి రావచ్చు! అందుకని దిశేశా (ఇది మా మనవడి మాట--దిగేశా కి బదులు). 

తీరా చూస్తే, మనది ఇంజను ప్రక్క బోగీ! అంటే ప్లాట్ ఫామ్ కి ఓ చివర--ముష్టివాళ్లు పడుక్కొని విశ్రాంతి తీసుకొనేచోట ఆగుతుంది. వెనక్కి నడుచుకొంటూ వెళితే, ఓ అర ఫర్లాంగు దూరం లో "కిసాన్" వాళ్ల స్టాల్. ఇంకో ప్రక్క ఓ బండీ, దానిమీద అరటిపళ్లూ. ఆకు పచ్చ అరటిపళ్లు తగ్గాయి ఈ మధ్య యెందుకో. అలాంటివే పసుపుపచ్చవి వస్తున్నాయి. 

డజను 40 కి బేరమాడి (నా మొహం! బేరమేమిటీ.....అన్నీ ఫిక్సెడ్ రేట్లు.....కొనౌపోతే నీ ఖర్మ!) రెండు డజన్లు తీసుకొని, ఇంకో ప్రక్కన వున్న "కిసాన్" వారి స్టాల్ కి వెళితే, ఓ డజను యెండిపోయిన యాపిల్స్, ఈకలు పీకేసిన కోళ్లలా వ్రేళ్లాడగట్టబడ్డ రెండో మూడో అనాసపళ్లూ మాత్రం వున్నాయి. జామ్ లూ గట్రా యేమీ లేవు. సరే, వెనక్కి నడిచి, కిటికీలోంచి పళ్లు అందించేలోగా రైలు కూత వేసింది! 

..........ఇంకా తరువాయి.