Monday, January 17

విందు భోజనాలు

వంటలూ.....పిండివంటలూ

....పంచభక్ష్యాలూ.....పరమాన్నాలూ!

(యెలాగూ "సుష్టు భోజనాల" గురించి వచ్చింది కాబట్టి--బ్లాగుల్లోకూడా వంటలేనా అని విసుక్కున్న వీడేమిటీ.....వంటలూ అంటూ మొదలెట్టాడు.....అని కొక్కిరించకుండా--చదవండి మరి!)

వంటలు అంటే, మనం రోజూ వండుకుని తినేవి--పప్పూ, కూరా, పచ్చడీ, చారూ/పులుసూ--లాంటివి.

పిండివంటలంటే, ప్రత్యేకంగా, అదనపు రుచీ, అనుభవం కోసం వండుకొనేవి.

వాటిలో......

భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, లేహ్యాలూ, చిత్రాన్నాలు--ఇవీ పంచ భక్ష్యాలు.

ఇంకా పరమాన్నాలు!

భక్ష్యాలు అంటే--బాగా నమిలి తినాల్సినవి--బొబ్బట్లూ, గారెలూ, ఫేణీలూ, పోణీలూ, చక్కిలాలూ--ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

భోజ్యాలు--అంటే అంత కష్ట పడఖ్ఖర్లేకుండా, తేలిగ్గా నిమిలి, మింగేవి--జాంగ్రీలు, జిలేబీలు, బూరెలు, కజ్జికాయలు--ఇలాంటివికూడా చాలా వున్నయి.

చోష్యాలు అంటే--జుర్రుకొనేవి--కాజాలూ, బాద్షాలూ, చంద్రకళలూ--ఇలాంటివి.

లేహ్యాలు అంటే--నోట్లో వేసుకొని, అంగిటికి అంటించుకొంటేచాలు, కరిగిపోయి గొంతులోకి వెళ్లిపోయేవి--అంటే చప్పరించేవి--రవకేసరి, సత్యనారాయణ ప్రసాదం, హల్వా, కోవా, ఇప్పటి ఐస్ క్రీములూ--ఇలాంటివి.

చిత్రాన్నాలు అంటే, "పులిహోర, యెలిహోర, మెలిహోర, కలహోర, పుళిందుహోర, చక్కెర పొంగలి, పొంగలి, క్షీరాన్నం (దధ్యోదనం)". ఇంకా నేటి పలావులూ, బిర్యానీలూ, ఫ్రైడ్ రైస్ లూ!

పరమాన్నాలు అందరికీ తెలుసు--అన్నం పరమాన్నం, సగ్గుబియ్యం పాయసం, సేమ్యా పాయసం--ఇలా! 

బ్రాహ్మణులూ, క్షత్రియులూ, కోమట్లూ, ఆపైన కమ్మవారూ, కాపులూ....ఇలా అందరూ తమ "కులోచితంగా" శతాబ్దాల తరబడీ ఇలాంటి విందులు ఇస్తూనే వున్నారు--వాళ్ల తాహతునిబట్టీ! తినేవాళ్లు లొట్టలువేసుకొంటూ తింటూనే వున్నారు!

(మరో టపా ఖచ్చితంగా వనభోజనాల ముగింపు గురించే!)

2 comments:

Anonymous said...

మీ టపాలు అన్నీ చాలా informative గా ఉంటాయి కృష్ణశ్రీ గారూ!! చాలా సంతోషం.

- Srinivas

A K Sastry said...

డియర్ (అన్నోన్) శ్రీనివాస్!

మీకు నచ్చినందుకూ, అమాట చెప్పినందుకూ చాలా సంతోషం.

ధన్యవాదాలు.