Tuesday, January 18

మన ఆచారాలు - 10

......భోజనాలు

తంబోలా నడుస్తూండగానే, భోజనాల ప్రహసనం ముగియగానే, పదార్థాలని వొబ్బిడి చెయ్యడం మొదలెడతారు--వంటపుట్టీ, అతని సహాయకులూ, నిర్వాహకుల్లో ఆ శాఖ చూసేవారూ. 

సాధారణంగా పదార్థాల్లో తక్కువ తక్కువగా మిగిలేవి--బాగున్న కూరలూ, బండ పచ్చడీ, అన్నం, సాంబారూ. ఇవన్నీ, చుట్టుప్రక్కలవాళ్లకీ, పాత్రలు తోమడానికీ, ఆకులు యెత్తడానికీ వొప్పుకున్నవాళ్లకీ చెల్లించేస్తారు.

ఇంక, యెక్కువగా మిగిలేవి--పులిహోరా, కాస్త కారం యెక్కువైన కూరా, రసం, పెరుగూ! అవి కావలసిన వాళ్లు వాళ్ల ఇళ్ల దగ్గర దింపేసుకుంటారు--పులిహోరా, వుంటే పెరుగూ మాత్రం ముఖ్య నిర్వాహకుల ఇళ్లకి చేరతాయి. (నిర్వాహకులూ, వాళ్ల కుటుంబాలూ వొళ్లు హూనం అయిపోయి వుంటారు కాబట్టి, ఆ రాత్రికి వాటితో సరిపెట్టుకుంటారు!)

ఇవీ, మిగతా పాత్ర సామానూ, టెంటూ వగైరాలు అన్నీ వ్యానుల్లో సర్దించబడి, ఆ తోట ఖాళీ చెయ్యబడేసరికి రాత్రి 8.00 అవుతుంది. 

వ్యానులూ, నిర్వాహకుల వాహనాలూ బయలుదేరతాయి--వీలైతే మళ్లీ యేడాది వస్తామేం? అని తోటకి టాటా చెపుతూ.

మర్నాడు, మిగిలిన బహుమతుల వస్తువులూ, సంభారాలూ తిరిగి ఇచ్చేసి, వాళ్ల ఎకవుంట్లు సెటిల్ చేసి, లెఖ్ఖలు చూసుకొంటే, కటా కటిగా సరిపోతాయి వసూలు చేసిన డబ్బులు. పదో పరకో పడితే, నిర్వాహకులే వేసుకొంటారు, మిగిలితే, మళ్లీ సంవత్సరానికి బ్రాటోవరు.

ఇళ్లకి వెళ్లేవాళ్లు "చాలా బాగా జరిపించారండీ!" అంటూ ఇచ్చే సర్టిఫికెట్ కన్నా నిర్వహకులకి కావలసిందేముంటుంది?

No comments: