Sunday, September 6

రాజకీయం

రాచకం


ఇవాళతో నాలుగు రోజులుగా మన రాష్ట్రం లో ప్రభుత్వం లేదు! (వుంటే, ఇడుపులపాయ ముందు 15 కిలోమీటర్ల మేర 'ట్రాఫిక్ జాం' అవకపోను!)  


సంతాపదినాలు అయ్యేవరకూ 'అధిష్టానం' ఆలోచించదట.  


ఈ లోపల కాకాలు బాకాలు మొదలెట్టారు!  


హనుమంతుడికి రక్తం వుడికిపోతోందట!  


కేకే సాగిలపడిమరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ్యాలంటున్నాడు!  


'అనుభవం లేకపోయినా ఫరవాలేదు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి--రాజీవ్ ప్రథాని అయినప్పుడు ఆయనకి అనుభవం లేదు కదా?' అన్నాడు కాకా.  


'రాజీవ్, ఇందిరల కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది. నా రక్తం వుడుకుతోంది!' అన్నాడు వీ హెచ్!  


రాజీవ్ యేమి త్యాగాలు చేసి ప్రథాని అయ్యాడో? ఇందిరని కుట్రదారులు చంపడం రాజీవ్ త్యాగమా?  


వై యెస్ ని కూడా యే తీవ్రవాదులో చంపేసివుంటే, అప్పుడు జగన్ త్యాగం చేసినట్టేనేమో--ఈయనకి అభ్యంతరం లేకపోనేమో మరి!  


'123.....133 లెఖలు కాదు--మెజారిటి వుంటే తీర్మానం చేసి, దేశాన్ని అమ్మేద్దామా? సభలో ఎమ్మెల్యేలెంతమంది మద్దతు ఇచ్చినా, సోనియా కాదంటే అది శిరోధార్యం! (వాళ్ళు నోరుమూసుకోవాలి)' అని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యాలు చెపుతున్నాడు కేకే!  


ఇలాచేసే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది ఇందిర--వీళ్ళ దన్ను చూసుకొనే! అప్పుడే మరిచిపోయారా?  


నందో రాజా భవిష్యతి!  

Wednesday, August 26

ఫుణ్యభూమి

యుగాలూ—భూమి
‘శ్రీమద్భాగవతం’ లో కృతయుగాదిగా జరిగిన పరిణామాలూ, అవతారాలూ వర్ణించబడ్డాయి.  


వేదాలు రచింపబడడం, మత్స్యావతారుడు వాటిని సోమకాసురుణ్ణించి రక్షించడం—ఇది జరిగింది కృతయుగం చివరి కొన్నివేల సంవత్సరాల్లో. యెందుకంటే, అప్పటికి ‘శ్రీ మహావిష్ణువు’ ‘స్థితికారుడు’ గా స్థాపించబడ్డాడు.  


అప్పటికి, భూమి లేదు—అంటే, ఉత్తరఖండం, దక్షిణఖండం మాత్రమే, పూర్తిగా మంచుతో కప్పబడివుండేవి. అక్కడక్కడా దక్షిణఖండంలో మనుషులుండేవారు. ఉత్తరఖండంలో మనుషులు లేరు.  


తరవాత, కృత యుగం లోనే, కూర్మావతారం కూడా జరిగింది. (అప్పటికి మానవ స్త్రీలు కూడా ‘గుడ్లు’ పెట్టేవారు—దేవతలవంటివాళ్ళ సంగతి తెలియదు. ఉదా:- అనూరుడూ, గరుత్మంతుడూ—వీళ్ళు పుట్టాక దేవతల సేవకి వెళ్ళిపోయారు!)  

తరవాత, వరాహావతారం అవసరం వచ్చి, తన కోరలమీద భూమిని (దక్షిణ ఖండాన్ని) తేల్చి, జరిపుకుంటూపోవడం తో ఆ ఖండం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైన ఖండాలుగా విడిపోయి, ‘ఉత్తరఖండాన్ని’ కలిసి (ఢీకొని) నేటి అఖండ ప్రపంచం, మధ్యలో సముద్రాలతో యేర్పడింది. (ఇప్పటి భూకంపాలకీ, అగ్నిపర్వతాలకీ, సునామీలకీ ఇదేకారణం!)  


అలా ఢీకొన్న రెండు భూభాగాల వల్లనే, ‘ఆండీస్’, ‘ఆల్ప్స్’, ‘హిమాలయాలు’ లాంటి మహాపర్వతాలు యేర్పడ్డాయి.  


ఇక ‘భరత ఖండానికి’ వస్తే, ఆగస్త్య మహర్షి పూనుకొనేవరకూ హిమాలయ పర్వతాలూ, వింధ్య పర్వతాలూ, తూర్పు-పడమర కనుమలూ పెరుగుతూనేవున్నాయి. 


హిమాలయాలకీ, వింధ్యకీ మధ్యలో సముద్రం యెక్కువగా వుండి పోవడంతో, అగస్త్యుడు ఆ సముద్రాన్ని ‘అవుపోసన’ పట్టి, తన కమండలంలో నిక్షిప్తం చేసి, వింధ్యపర్వతాలని దాటుతూ, తన కాలి బొటనవేలితో వింధ్యుడి నెత్తిమీద నొక్కి, ‘నేను మళ్ళి నీ నెత్తిమీదకి వచ్చేదాకా నీ పెరుగుదల ఆగిపోవుగాక!’ అని దక్షిణానికి వచ్చేశాడు.  


అలా ‘భరతఖండం’ మధ్యలో సముద్రాలు లేకుండా, ఒకటిగా నిలిచింది.  


తరవాత సంగతి మరోసారి. 




Tuesday, August 25

గాయత్రి

మంత్రాలూ—గాయత్రి
మంత్రాలనేవి ‘కర్మలు ’ చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి! (అవి ‘బ్రహ్మ’ కర్మలైనా, ‘అపర’ కర్మలైనా!) 

యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని, పురోహితులు వాటిని నేర్చుకొని, ప్రజలచేత చేయిస్తారు.

 చెయ్యవలసిన కర్మ యేమిటో, యెందుకు చేస్తున్నామో ‘సంకల్పం’ చెప్పుకుంటారు ముందు. అదే పురోహితులు చెప్పి, మధ్యలో కర్మిష్టుల్ని ‘మమ’ అనుకోమంటారు అందుకే!

 ఇక మంత్రాలని ‘చదవ కూడదు’ ‘జపించాలి’ లేదా, ‘అనుష్టించాలి’. గాయత్రి విషయానికొస్తే, అది వూరికే చదివేది కాదు. యెందుకంటే— 

శిశువు జన్మించినప్పటినించీ (ఆడైనా, మగైనా) కొన్ని ‘జాతక కర్మలు’ నిర్దేశించారు—బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి—వీటిలో కొన్ని ఆడ శిశువులకీ, కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం.

 ఇక మగ పిల్లలకి ‘గర్భాష్టమం’ లో చేసే జాతక కర్మ పేరు—వుపనయనం. (దాన్నే ‘ఒడుగు’ అంటారు) ఇది యెందుకు చేస్తారంటే—శిశువుకి 8 సంవత్సరాలు వయసు (తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా—అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు. అంతే కాకుండా, బాలారిష్టలన్నీ గడిచి, ఒక ధీమా వస్తుంది—అందుకని, ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు—అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా!

 ఇక ఙ్ఞానార్జనకి మూలం ‘విద్య’. దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి—వాటికోసం, ఒడుగు లోనే ‘బ్రహ్మోపదేశం’ చేయిస్తారు—తండ్రి చేతగానీ, ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ. ఆ ఉపదేశం లో భాగంగానే, యఙ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రి ని ఉపదేశిస్తారు! అక్కడితో, విద్యార్జనకి అర్హత లభించినట్టే!

 అక్కడి నించి, అనుష్టానాలు మొదలు అవుతాయి—ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి!

 టూకీగా అదీ సంగతి.

 ఇక ‘భూర్భువహ్ స్వహ్’ అంటే, మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు. వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు. అలా భూమికి పైన 7, భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు.

 పైనుండేవి క్రమం గా 1.భూ లోకం, 2.భువర్లోకం, 3.స్వర్లోకం, 4.మహర్లోకం, 5.జనలోకం, 6.తపోలోకం, 7.సత్యలోకం (ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట).

 వీటిని మంత్ర రూపంలో—‘ఓం భూ: ఓం భువ: ఓం స్వ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం~ సత్యం’ అని చెప్పి ‘ఓం తత్సవితుర్వరేణ్యం…….’ ఇలా సాగుతుంది.

 గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు. అవి భూలోకం (అంటే మనం వున్నది—ఇది అందరికీ తెలిసిందే) భువ:+లోకము= భువర్లోకం అంటే, మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది. ఇక స్వ:+లోకము=స్వర్లోకం అంటే, మేఘాలకి పైన వున్నది. (దీన్నే పొరపాటుగా ‘స్వర్గం’ అని వ్యవహరిస్తున్నారు—నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం) మనిషి చనిపోయాక, జీవుడు (అంటే ఆత్మ) ఇక్కడవరకూ చేరడమే కష్టం. ఆతరవాత ‘ఆటోమేటిక్ ప్రమోషన్లు’—ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు!

 అదిగో—అదీ గాయత్రి వుద్దేశ్యం! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా, ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో!

 ఇక ‘మంత్రాలకి చింతకాయలు రాల్తాయా’ అనకుండా వాటిని విశ్వసించేవారికి, వాటి మహిమపై నమ్మకం వుంటే, ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ‘సైడ్ ఎఫెక్టు’లూ, బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి?

 ఇంకొక మాట—ఇవన్నీ నమ్మినా, నమ్మకపోయినా—నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు. కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే!

 యేమంటారు?

 (ఇందులో కొంత పదార్థం (మేటర్) నా ‘హేతువాదం’ బ్లాగులో రావలసింది—సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను.)


Monday, August 24

విశ్వసనీయత

కాకుల్లెక్కలు
నిజం గా కాకుల్లెక్కలైతే, లెక్క ఓ పదివేలదాకా అటూ ఇటూ అయినా యెవరికీ నష్టం వుండదు.

కాని అతి ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వ లెక్కల్లోనే తేడాలు వుంటే?

స. హ. చట్టం పుణ్యమాని, మన వున్నత న్యాయస్థానం పుణ్యమాని—ఇలాంటి విచిత్రాలు బయటకొస్తున్నాయి!

ఎం బీ టీ నేత అంజదుల్లా ఖాన్ ముఖ్యమైన మూడు అంశాలమీద ఆయన తెప్పించుకున్న సమాచారం కాకుల్లెక్కలని మించి పోవడం తో ఆయన మన వున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు!

ఆ ప్రశ్నలు—1. రాష్ట్రం లో యెంత మంది ‘ఆయుధాలు’ కలిగి వున్నారు? 2. క్రిమినల్ చరిత్ర వున్నవారికి ఆయుధాలున్నాయన్న మాట వాస్తవమేనా? 3. లైసెన్స్ లు మంజూరు చేసే అధికారం యెవరెవరికి వుంది?—ఇవీ!

యెంత ముఖ్యమైన ప్రశ్నలో వేరే చెప్పాలా!

2007 లోనే దరఖాస్తు చేసినా, స్పందన కరువై, స. హ. శాఖ కమిషనరుకి అప్పీలు దరఖాస్తు చేశారట. మొదటి అప్పీలుకి స్పందన లేక, రెండో అప్పీలు చేస్తే, ఆయన ‘వారం లోగా’ సమాచారం అందించాలని రాష్ట్ర హోం శాఖని ఆదేశించారట!

హోం శాఖ లెక్కల ప్రకారం క్రిమినల్ కేసులున్న వాళ్ళెవరిదగ్గరా లైసెన్స్ లు లేవన్నారట!

మరి ఆయన అంతకు ముందే కలెక్టర్లూ, పోలీసుల దగ్గర్నించీ తెప్పించుకున్న సమాచారం ప్రకారం—కర్నూలు లో లైసెన్స్ వున్న వ్యక్తి పై 17 క్రిమినల్ కేసులు వున్నట్టు చెప్పారట!

ఇంకా విచిత్రం యేమిటంటే, హోం శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తం గా 19,757 లైసెన్స్ లుండగా, జిల్లాల లెక్కల ప్రకారం 21,324 వున్నాయట!

మరి దాదాపు 2,600 లైసెన్స్ లు హోం శాఖకి తెలియకుండా, యెవరు జారీ చేశారో!

లైసెన్స్ లకి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించేలా హోం శాఖ ని ఆదేశించాలనీ, అప్పటివరకూ కొత్త లైసెన్స్ లు మంజూరు చేయడం గానీ, గడువు ముగిసినవాటిని పునదుద్ధరించడం గానీ చేయకుండా వుత్తర్వులు ఇవ్వాలని వున్నత న్యాయ స్థానాన్ని కోరారట.

విచారణ చేపట్టబడింది.

అంత సుకుమారమైన గేదె శరీరాలు యెవరికున్నాయో బయట పడుతుందా? లేక దున్నపోతుమీద వానేనా!?

చూద్దాం!


Tuesday, August 11

మాయగాడి మరో మోసం

‘కోలా కృష్ణమోహనరావు’
—యూరో లాటరీ తగిలిందని నమ్మించి, కొంతమందిని కోట్లలో ముంచి ఇంకా పదేళ్ళు కూడా కాలేదేమో!
వాడి కేరేక్టరుతో సినిమాలు కూడా తీశారు! చట్టం వాడినేమీ చెయ్యలేకపోయిందని గుర్తు.

అప్పటిలో వాడు సంపాదించినదానితోనే యేమో, ఇథియోపియా లో 120 యెకరాల ప్రభుత్వ భూముల్ని కొని, గులాబీ తోటలు పెంచుతున్నాడట!

ఇప్పుడు మళ్ళీ ‘ఇథియోపియా లో వుద్యోగాలు’ పేరుతో తన www.srisaiflora.com ద్వారా ఓ 65 మంది నిరుద్యోగుల నించి దాదాపు ఒకటిన్నర కోట్లు వసూలు చేసి, వాళ్ళని ముంచాడట! (పాపం నిరుద్యోగులు మరి!)

ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, పోలీసులకప్పగిస్తే, వీరు ‘విచారించి’, ఎస్ ఆర్ నగర్ పోలీసులకప్పగిస్తాం, వారూ ‘విచారిస్తారు’ అంటున్నారట!

ఈ వరస చూస్తుంటే, ఈ సారి కూడా వాడికేమీ అవదు అనిపించట్లేదూ?

‘తోటకూర నాడే’ వాడి కాళ్ళు విరగ్గొట్టి వుంటే, ఇప్పుడు తీరిగ్గా ‘విచారించ’ వలసిన అవసరం తప్పేది కదా?

అయినా ఇప్పటికీ ‘బంగారం మెరుగు పెడతాం’ అంటూ వచ్చే అపరిచితులకి ఇంట్లో బంగారం అంతా అప్పచెప్పి, తరవాత లబో దిబో మంటున్న ఆడ మళయాళం వున్నారంటే, యేమనుకోవాలి!

అదంతే!

Monday, August 10

గుళ్ళో పాటల భక్తి

పాటల భక్తి
ఈ మధ్య ప్రతీ గుడిలోనూ అనేక రకాలైన భక్తి రికార్డులు గంటలతరబడీ వాయించేస్తున్నారు!
వీటిలో రకరకాల పాటలు వుంటున్నాయి! ‘జజ్జనకడి జనారే’ వరసలతోసహా….
ఇవి కాక ‘చ్హాంట్’ లంటూ ఒకే పదాన్నో, మంత్రాన్నో పదే పదే వల్లించే రికార్డులు కొన్ని!
అసలు ఆడవాళ్ళకి గాయత్రీ మంత్రానికి అర్హత లేదు—వాళ్ళు జంధ్యాలు వేసుకో కూడదు కదా?
అయినా, ఓ ఆడమేళం గాయత్రీ మంత్రాన్ని, వాళ్ళిష్టం వచ్చినట్టు ‘చ్హాంట్’ చేస్తున్న రికార్డొకటి!
అది ఇలా సాగుతుంది—“ఓం భూర్ భువహ స్వాహా! తత్స వితుర్వ రేణ్యం! భరుగో దెవస్య ధీమహీ! ధియో యోనహా ప్రత్యోదయాత్!”
పీటమీద కర్రతో తాళం వాయించుకుంటూ, అదే వరసలో పాడడం వల్ల ‘వచ్చిన రాగాలూ, తీసిన దీర్ఘాలూ’ ఇవి! (శంకరాభరణం శంకర శాస్త్రిగారికీ, పట్టాభి భాగవతార్ కీ క్షమాపణలతో!)
‘భూర్ భువహ్ స్వహ్’ అంటే అవి ‘భూ, భువ, స్వ’ (భూలోక, భువర్లోక స్వర్లోకాలు) లోకాలు అనీ, ‘స్వహ్’ కీ ‘స్వాహా’ దేవికీ యేమీ సంబందం లేదనీ—వీళ్ళకి యెవరు చెపుతారు?
‘భరుగో దెవస్య’ కాదు ‘భర్గో దేవస్య’ అనాలని యెవరు చెపుతారు?
‘ధియో యోనహా’ కాదనీ, “ధీయోయోనహ్’ అనీ యెవరు చెపుతారు?
‘ప్రత్యోదయాత్’ అనక్కర్లేదు ‘ప్రచోదయాత్’ అనాలని యెవరు చెపుతారు?
మనం చెప్పినా వాళ్ళు వింటారా! రికార్డుని మార్చి మగాళ్ళతో సరిగ్గా పాడిస్తారా! ఇప్పటి వరకూ అమ్ముడైన రికార్డులని నాశనం చేస్తారా! ఈ గుళ్ళలో వాటిని వేయడం మానేస్తారా! ఒరే వెధవల్లారా ఇది తప్పు అని యెవరైనా వాళ్ళకి చెప్పేస్తారా!
మన పిచ్చి గానీ, యేదైనా యెంత భ్రష్టు పడితే జనాలకి అంతానందం!
ఇవి వింటూంటేనే మనశ్శాంతి కలిగి, జన్మ తరించినట్టనిపిస్తోందట కొంతమందికి మరి!
యెవరి పిచ్చి వాళ్ళకానందం అని యెవరన్నారో!

Sunday, August 9

యెన్నికల యంత్రాలు

వోటేసే యంత్రాలు
మనం వోట్లు వెయ్యడానికి పనికొచ్చే యంత్రాలని, ‘వాటంతట అవే వాటికి కావలసినవాళ్ళకి వోట్లు వేసే యంత్రాలు’ అని ప్రచారం చేసి, వాటిని నిషేధించాలంటున్నారు కొంతమంది నయా మేథావులు!

వీళ్ళకి వంత పాడుతున్నారు—రాజకీయ పార్టీలవారు! (మరి రిగ్గింగులకీ, సైక్లింగులకీ కుదరడం లేదుగదా! బూత్ కేప్చరింగు చేద్దామన్నా, పోలింగు అధికారి ఒకే బటన్ నొక్కి, పోలింగుని రద్దు చేసేస్తున్నాడు! బేలట్ పెట్టెల్లో ఇంక్ పొయ్యడానికి లేదు—అందుకని, గొడ్డళ్ళతో ఈ వీ ఎం లని నాశనం చేసినా, ఫలితం రీ పోలింగే! అందుకని, ఆడలేక మద్దెల ఓడు అంటూ, తమ స్వయంకృతాలని కప్పిపుచ్చుకోజూస్తున్నారు!)
2004 యెలక్షన్లకి మీదగ్గర సిబ్బంది పేర్లు ఇస్తే, యెలక్షన్ డ్యూటీలు వేస్తాం అని రిటర్నింగు అధికారి అడగగానే, మా బ్యాంకు బ్రాంచిలో తనతో సహా అందరి సిబ్బంది పేర్లూ వ్రాసిచ్చేశాడు—తెలిసీ తెలియని మా మేనేజరు!

దాంతో, అందరికీ, యెలక్షన్ విధులు కేటాయిస్తూ, ఫలానా రోజు మీటింగుకీ, శిక్షణకీ రమ్మని తాఖీదులొచ్చేసరికి, కళ్ళు తేలేశాడు—బ్యాంక్ యెలా నడిపించాలి సిబ్బంది లేకుండా—అనుకుంటూ!

సరే—తరవాత, పొరపాటుని అధికారులకి విప్పిచెప్పి, బ్యాంకు నడవడానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నామనుకోండి!

కానీ శిక్షణ తరగతులకి మాత్రం తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పడంతో, మా సబ్ మేనేజరూ, నేనూ కూడా శిక్షణకి హాజరవ్వడం, మా అదృష్టం కొద్దీ ఈ వీ ఎం లని క్షుణ్ణంగా పరిశీలించి వాటితో రకరకాల ప్రయోగాలు చేసి, మొదటిసారి దేశ వ్యాప్తంగా నిజమైన యెన్నికలు జరగబోతున్నాయి అని సంతోషించాము!
తీరా పోలింగు రోజున పొద్దున్నే టీవీలో ‘ఫలానా చోట ఈ వీ ఎం లు మొరాయించాయి’ ‘ఫలానా చోట ఈ వీ ఎం లు లేటుగా ప్రారంభమయ్యాయి’ అంటూ వార్తలు వస్తుంటే, ఆశ్చర్యపోయాను!

ఇక్కడో మాట చెప్పుకోవాలి—అంతకు ముందే కొత్తగా ‘టీవీ 9’ ప్రారంభమై, వెలుగులోకి వస్తోంది! (నిజానికి టీవీ 9 రావడంతోనే మీడియా వెర్రితలలు వెయ్యడం మొదలు పెట్టింది! ముఖ్యం గా రవిప్రకాష్ మొదట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు—తరవాత తల బొప్పి కట్టాక మానేశాడానుకోండి!) మొట్టమొదట ఈ వీ ఎం లు మొరాయించాయి అని అన్నవాడు రవి ప్రకాషే!

నిజానికి ఈ వీ ఎం లు ‘మొరాయించవు’—వాటిని ప్రారంభించడానికి ముందు చెయ్యవలసిన ప్రక్రియలు—అభ్యర్థుల లిస్ట్ అందులో యెక్కించడం, మిగిలిన బటన్లని డమ్మీలుగా చెయ్యడం, నెంబర్లనీ వాటినీ నోట్ చేసుకొని, ‘టాంపర్ ప్రూఫ్’ గా సీలు చెయ్యడం—ఇలాంటివి! యెంత శిక్షణ పొందినా, పోలింగు సిబ్బంది ఈ విషయాల్లో తడబడం సహజం! అప్పుడు ఇతర అధికారులో, కంపెనీ వారో వచ్చి, వాటిని సరిగా ప్రారంభించేలాగ చేసేవారు—దానికి కొంత సమయం పట్టేది!

నేను చాలెంజి చేసి చెపుతున్నాను—వీటిని టాంపర్ చెయ్యడం యెవరి తరమూ కాదు!

మరి ఈ మధ్య ‘జనచైతన్య వేదిక’ వారు కొంత మంచి చేస్తున్నారు—మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా జనచైతన్యం కలిగించడం మొదలైనవి చేస్తూ.

వీరికేమొచ్చిందో—ఈ వీ ఎం లు టాంపర్ చెయ్యడం ద్వారా, పోలైన ప్రతీ అయిదో వోటో, ఎనిమిదో వోటో--ఇలా ఒకే అభ్యర్థికి పడేలా చెయ్యచ్చు అంటున్నారు!

వాళ్ళు సొంతంగా వాళ్ళకి తోచినట్టు ఈ వీ ఎం ల్లాంటివి తయారు చేసి, ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు! సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు కొంతమందితో!

మనిష్టం వచ్చినట్టు మనమే ఓ మెషీను తయారు చేసుకొని, దాన్ని వక్రం గా నడిపించి, అసలు మెషీన్లు కూడా ఇలా వక్రం గానే నడుస్తాయి అంటే, అది యేం నిరూపించినట్టూ?

మరి వీళ్ళెవరికి కొమ్ముకాస్తున్నట్టు?

(కొన్ని రోజుల క్రితం నేను తయారు చేసుకున్న టపా—కొన్ని తుదిమెరుగులు దిద్ది ప్రచురించాలని వుంచినది—ఇప్పుడు ప్రచురిస్తున్నాను! మెరుగుల సంగతి తరవాత!)




Saturday, August 8

నైతికత

తప్పుడు బిల్లులు
తప్పుడు మెడికల్ బిల్లులు సమర్పించి లక్షల రూపాయలు సంపాదించిన మాజీ ఎం ఎల్ యే యెర్నేని రాజా రమచందర్—తప్పు చెయ్యడం, నాకు తెలియక చేశానననడం బాగానే వుంది.

చిన్న కోర్టు దగ్గరనించీ, రాష్ట్ర వున్నత న్యాయ స్థానం దాకా ఇది తప్పు అని చెప్పాక కూడా, ఈ సిగ్గులేని గవర్నమెంట్ ప్రత్యేకం గా ఓ జీ ఓ వెలువరించి అతను నిర్దోషి అంది!

శాసన సభ నైతికవిలువల కమిటీ, కేసు ఉపసం హరించుకోమని సలహా ఇచ్చింది!

ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయ స్థానం వీళ్ళందరికీ అక్షింతలు వేసింది!

చిన్న ప్రభుత్వోద్యోగి ఎల్టీసీ వాడుకుని, బస్ టిక్కెట్లలో ఓ టిక్కెట్ పొరపాటుని పారేసుకొని, దాని బదులు ఇంకో టిక్కెట్ సంపాదించి బిల్లు పెట్టుకొంటే, తరవాత వాడి ఉద్యోగం తీసేసిన కేసులు వున్నాయి!

మరి ఎం ఎల్ యే అయితే వూడి పడ్డాడా!




Friday, August 7

జూదాలు

ఫ్యూచర్స్
ఫ్యూచర్స్ ఎక్స్చేంజీలవల్లే ధరలు పెరగలేదు’ అంటున్నాడు—నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎం డీ, సీ ఈ వో శ్రీ ఆర్ రామశేషన్!

‘ప్రస్తుతం సరకుల ధరలు భగ్గుమనడానికి ఈ ఎక్స్చేంజీలూ కొంతవరకూ కారణమనే అభిప్రాయం ప్రజల్లో వుంది. కానీ అందులో యేమాత్రం నిజం లేదు.సరకుల ధరలు పెరగడానికి గిరాకీ-సరఫరాల్లో అంతరాలే కారణం.’ అని ఆయన స్పష్టం చేశారుట.

‘మా పని కేవలం సరకుల ఫ్యూచర్స్ కాంట్రాక్టుల వర్తకానికి వీలు కల్పించడమే…సరకుల ధరల హెచ్చు తగ్గుల్లో మాకు ప్రమేయం వుండదు.’ అన్నారటాయన.

‘ఈ ఎక్స్చేంజీలలో రైతుల భాగ్యస్వామ్యం పెరగడానికి ఇంకా సమయం పడుతుంది. ఇతరదేశాలతో పోలిస్తే మాత్రం మనదేశం లో రైతుల భాగస్వామ్యం అధికం గానే వుంది’ అని కూడా అన్నారట!

ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలనీ, నోటికొచ్చిన లెఖ్ఖలనీ వల్లించేవాళ్ళని చెప్పుతో కొట్టాలా వద్దా?

యే ఎక్స్చేంజీ లోనైనా యే ఒక్క రైతు అయినా సభ్యుడిగా వున్నాడేమో చెప్పమనండి! వున్నది అందరూ స్పెకులేటర్లూ, కాంట్రాక్టర్లూ కాదా? గిరాకీ సరఫరాల్ని నియంత్రిస్తున్నది వీళ్ళ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు కాదా?
ఇక రెయిన్ ఫాల్ ఇండెక్స్ ప్రవేశ పెడతారట! అంటే యేమిటో!

ఫలానా నెలలో ఫలానా రోజుని ఫలానా చోట వర్షం వస్తుందా రాదా—వస్తే యెంత వస్తుంది—వస్తే యెంత ఇస్తావు—రాకపోతే నేనెంత ఇవ్వాలి—ఇలాంటి పందాలా?

క్రికెట్ లో ఫలానారోజు ఫలానా ఆటగాడు సెంచరీ కొడతాడనీ, కొట్టడనీ, సెంచరీ సంగతి దేవుడురుగు అసలు డక్ అవుట్ అవుతాడనీ, అవడనీ—ఇలా పందాలు వేసుకోవడం చట్టవిరుద్ధం!

మరి వీటినికూడా యే గేం స్ ఇండెక్స్ పేరుతోనో ఓ ఎక్స్చేంజీ లో పెట్టేస్టే, కోట్లు సంపాదించుకోవచ్చేమో—రామశేషన్ లు ఆలోచించాలి!

చిన్న పిల్లల్ని కాసేపు అల్లరి చెయ్యకుండా, యేడవకుండా కాలక్షేపం చేయించడానికి, ఓ బొమ్మలు/ఫోటోలు వుండే పుస్తకం తీసుకొని, ఒక్కొక్క పేజీని చేతితో మూసి, ‘బొమ్మొస్తుందా రాదా?’ అని, వాళ్ళు వొస్తుంది అంటే, పేజీ తిప్పి బొమ్మ వస్తే—నువ్వే నెగ్గావు—నా అరచేతిమీద ఒకటి కొట్టు అనీ, బొమ్మ రాకపోతే—నేనే నెగ్గాను—నీ అరచేతిమీదొకటి కొడతాను—అనీ—ఇలాంటి ఆట ఙ్ఞాపకం రావడం లేదూ?

దీంతొటే మనం చిన్నపిల్లలకి ‘స్పెక్యులేషన్’ నేర్పిస్తున్నామా?

అయినా ఇలాంటి చాలెంజి లు లేకపోతే సరదా యేముంది అనేవాళ్ళు కూడా వున్నారు—వాళ్ళనేమనాలి?


Wednesday, August 5

నెత్తిన చేతులు

ఇంకో మహా మాయగాడు!
గుడిపల్లి చంద్రశేఖర రెడ్డి అని, నల్గొండవాసి తన భార్య, మరదలితో కలిసి చేస్తున్న మోసాలకి అంతులేదట!

ఈయన చేసేదేమిటంటే, ఓ పట్నం లో, ఖరీదైన ప్రాంతం లో కుటుంబంతో సహా అద్దెకుదిగి, రెండుకార్లూ, సెల్ఫోన్లూ వాడుతూ, ఫోన్ లో అవతలవాళ్ళతో అస్తమానూ కోట్లాది రూపాయల లావాదేవీలు గురించి మాట్లాడుతూ, డాబూ దర్పం ప్రదర్శించి, యెదటివారిని--అడగగానే, అడిగినంత డబ్బు ఇచ్చేలాగ మాయ చేసి, తరవాత రాత్రికి రాత్రే మకాం యెత్తేస్తాడట!

ఈయన చేసినవాటిలో కొన్ని—

ప్రొద్దుటూరు లో ఓ మహిళ బ్యాంకు ఖాతాలో పది లక్షలు వున్నాయని గమనించి, వారం లోజుల్లో ఇచ్చేస్తానని 7 లక్షలు తీసుకున్నాడట.

ఆయన భార్య కూడా, తిరుపతిలో పెళ్ళికి వెళ్ళివచ్చేక ఇచ్చేస్తానని, ఆవిడ దగ్గరే ఓ 3 తులాల బంగారు నెక్లెస్ తీసుకుందట.

మరదలు తక్కువ తిందా!—కొంత బంగారం కొని, కొంత మొత్తం చెల్లించి, 30 వేలు అరువేసి, దానికి ఆవిడని జామీనుగా పెట్టిందట.

ఇంకొకావిడని వీ ఐ పీ దర్శనం చేయిస్తానని తిరుమల తీసుకెళ్ళి, 15 తులాల బంగారం కాజేశాడట.

ఇవన్నీ చేసి, రాత్రికి రాత్రి మకాం యెత్తేశాడట—ఓ కారులో—రెండో కారూ, ఓ మోటర్ సైకిలూ వదిలేసి!

పోలీసులు కూపీ లాగుతుంటే, 2007 నించీ అనేక చోట్ల ఆయనమీద దాఖలైన కేసులన్నీ బయటకొస్తున్నాయట!

ఇవన్నీ ఒకెత్తు, ఓ ఆఫీసు పెట్టి, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులనించి (పాపం నిరుద్యోగులు!) భారీగా డబ్బు గుంజి, 27-07-2009 న పరారయ్యాడట.

శభాష్!

మోసపోతున్నవాళ్ళలారా—ఇకనైనా మేలుకుంటారా?


Sunday, July 26

లాలూ మూర్ఖహ…….


……….అగ్రేసరీ ‘మమత’!
‘తురంతో’ (అంటే హిందీలో తురంత్) పేరుతో కొత్త ‘నాన్ స్టాప్’ రైళ్ళు రేపు ఆగష్ట్ ఒకటి నించీ ప్రారంభిస్తుందట!

ఇప్పటికే ప్రతిపక్షాలవాళ్ళూ, పత్రికలవాళ్ళు విమర్శించినట్టు—ఇదేమైనా సబబైన ఆలోచనా!

హౌరా నించి, ఢిల్లీ దాకా యెక్కడా ఆగకుండా, ప్రయాణించేవారు, ప్రతీరోజూ సగటున యెంతమంది వుంటారు? మరి ట్రైన్ అంతా ఖాళీగా వెళ్ళిపోవలసిందేనా? (బహుశా మమత తన పరివారంతో మొత్తం ట్రైన్ అంతా నింపి, హాయిగా ప్రయాణించొచ్చు అనేమో!)

మనకోటి ఇచ్చారట—హైదరాబాద్ నిజాముద్దీనో యేదో—మరి హైదరాబాద్ లో యే ట్రైన్ చూసినా, కంపార్ట్ మెంట్ కి ఓ పదిమంది కన్నా యెక్కువ వుండరు—మిగిలినవాళ్ళంతా సికింద్రాబాదులోనో, ఆ తరవాత స్టేషన్లలోనో యెక్కుతారు!

మరి ఈ తురంతో ఆ పదేసిమంది ప్రయాణీకులతోనే ప్రయాణించి, నిజాముద్దీన్ చేరితే, రైల్వే లాభాలసంగతి దేవుడెరుగు—మూడో క్లాసు కుర్రాడికి వొచ్చే లెఖ్ఖలైనా రావా మమతాదీకి?

వాడు మేనేజిమెంట్ గురూ గా లెక్చర్లు ఇస్తే, ఈవిడ ‘గణిత గుర్విణి’గా లెక్చర్లు ఇస్తుందేమో ఇక!

ఇండియ దటీజ్ భారత్ ప్రజల్ని ఈ మూర్ఖులనించి దేవుడైనా రక్షించగలడా అని!


Wednesday, July 8

నెత్తిన చేతులు!

మరో మనీ సర్క్యులేషన్!
1970 ల మొదట్లోనే శ్రీ మహీధర రామ మోహన రావు ఆంధ్ర పత్రిక వీక్లీలో ‘మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!’ అని అది యెన్ని కోట్ల రూపాయల మోసమో లెఖ్ఖలతో సహా వ్రాశారు.

ఇదివరకో టపాలో వ్రాశాను—అప్పట్లో ఓ అయిదు పేర్లు, అడ్రెస్ లు ఇచ్చి, అలాంటివి కొన్ని పదుల కాగితాలు తెలిసిన వాళ్ళకీ, అడ్రెస్ లు తెలిసిన వాళ్ళకీ పంపించి, పై పేరు తొలగించి, క్రింద మీ పేరు చేర్చుకొని, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి—ఈ లోగా, పైనున్న అయిదు మందికీ ఒక్కొక్క రూపాయి మాత్రమే మణియార్డరు చెయ్యండి! అంటూ! అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయల మోసం, ఈ రోజుల్లో అయితే, కొన్ని కోట్ల కోట్లు మోసం అవుతుంది!

పైగా దీనికి మోడరన్ పేర్లు పెట్టారు—‘నెట్ వర్క్ మార్కెటింగ్’ ‘చైన్ మర్కెటింగ్’—ఇలా!

‘క్వాంటం ‘, ‘నీడ్ ఫుల్’, ‘డైయొటెక్’ లాంటి సంస్థల్ని పోలీసులు ఆట కట్టించారు—వేలల్లో ఫిర్యాదులు అందాక!

ఈ మధ్య ‘ఆర్ ఎం సీ మనీ సర్క్యులేషన్’ అనే ఓ చెన్నై సంస్థ, ప గో జి లో ఇలాంటి స్కీమే మొదలెట్టిందట—‘మీరు రూ.6,800/- చెల్లించండి—మీకో విలువైన కానుక వస్తుంది—అది కాక, మీరు చేర్పించిన వాళ్ళు కట్టే దాంట్లో 50% మీకే చెందుతుంది’ అంటూ కొన్ని వేల మందినించి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారట!

ఇంకా పోలీసులు మేలుకోలేదు—మన జనాలు నిద్ర నటిస్తూనే డబ్బులు కట్టేస్తున్నారు!

(నిద్ర నటించేవాళ్ళని చస్తే లేపలేం కదా!)




Sunday, July 5

ఆర్థిక వ్యవస్థ

ద్రవ్యోల్బణం
ఇది ఈ మధ్య ‘మైనస్’ లోకి వచ్చిందట!

అసలు ద్రవ్యోల్బణం లెక్కించడానికి ఒక సంవత్సరాన్ని ‘బేస్ ఇయర్’ గా తీసుకొంటారు! అప్పుడున్న ధరల్ని ఇప్పటి ధరల్తో పోల్చి, నూటికి యెంత శాతం పెరిగాయో లెక్కించి, అవన్నీ క్రోడీకరించి, ఇప్పుడు ద్రవోల్బణం ఇన్ని పాయింట్లు అని ప్రకటిస్తారు.

మరి యెప్పుడు ప్రవేశపెట్టారో, ‘క్రితం సంవత్సరం ఇదే వారం లో వున్న’ ధరలపై ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారట! ఇప్పుడు ప్రభుత్వం, మీడియా ప్రకటిస్తున్నవి అవే! మరి ఇదేం కాకుల్లెక్కో తెలియదు!

క్రితం సంవత్సరం ఇదే రోజుల్లో ద్రవ్యోల్బణం 12 శాతం దగ్గర వుంది—దాంతో పోలిస్తే, ఇప్పుడు ‘మైనస్’ లోకి వచ్చిందన్న మాట! అదే 1990 లేదా 2000 బేస్ ఇయర్ తీసుకుంటే, యే రెండువందల శాతమో పెరిగి వుండచ్చు! (నిజం లెక్ఖల్లోకి వెళ్ళకుండా సరదాగా వ్రాస్తున్నాను!)

కేజీ కందిపప్పు 79 రూపాయలట! ఇది యెందుకు? ఫ్యూచర్స్ ట్రేడింగ్ వల్ల కాదంటారా?

ఇక ‘వడ్డీ రేట్లలో ఫ్యూచర్స్’ ప్రవేశ పెడతారట మన బీ ఎస్ యీ, ఎన్ ఎస్ యీ ల లో!

మన సోకాల్డ్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ తుమ్మల కిషొర్ ఇంకా ‘బ్యాంకులు వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలి, మెర్జర్లు జరిగి పెద్ద బ్యాంకులు యేర్పడాలి’ అనే అంటున్నాడు గాని, దీని గురించి ఇంకా మాట్లాడలేదు!

మన ‘నెట్’ స్నేహితుల్లో యెవరైనా ‘ఆర్థిక నిపుణులు’ దీని పై ఒక టపా వ్రాసి, నాకు తెలియపరిస్తే, వారికి ఋణపడి వుంటాను!

సరేనా?




Friday, July 3

పిచ్చి పిచ్చి బడ్జెట్లు

బ్రేకుల్లేని మమత రైలు!

……..వచ్చేసింది!

నాన్ స్టాప్ రైళ్ళని ప్రవేశపెడతాను…డబుల్ డెక్కర్లు వేస్తాను…..ఇలాంటి ప్రతిపాదనలతో!

లాలూ అప్పుడే ఫక్కున నవ్వేశాడు! ‘ఆచరణయోగ్యం కాని ప్రతిపాదనలు…..బ్రిడ్జిల మీదా, సొరంగాల లోనూ యెలా ప్రయాణిస్తాయి?’ అంటూ!

మరి నాకు మమత కనీసం అయిదో క్లాసు అయినా చదివిందా అని అనుమానం వచ్చింది!

ఇప్పటికే, డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతున్న రైళ్ళు, ఆపిన రైళ్ళ పెట్టెలు వెనక్కి వేగం గా నడుస్తూ వెళ్ళిపోవడం, యెవరో యెక్కి, యేదో నొక్కితే, వేగంగా వెళ్ళిపోతున్న లోకల్ రైళ్ళూ, ఇలాంటివన్నీ చూస్తున్నాం!

యేమాత్రం సాంకేతిక అధ్యయనం చెయ్యకుండా, కక్కుర్తి బెర్తులు బిగించి, బోగీల్ని తగలబెట్టి, అనేక మందిని చంపిన చరిత్ర మన రైల్వేలది!

గంటకి నాలుగు వందల మైళ్ళూ, ఆరు వందల మైళ్ళూ ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు కనిపెట్టిన వెర్రి జపాన్ వాళ్ళకి కూడా రాలేదు—ఇంత అద్భుతమైన డబుల్ డెక్కర్ ఆలోచన!

ఇప్పటికే, కొన్ని రూట్లలో, రైలు 60 కిలోమీటర్ల వేగాన్ని దాటితే, వెనుక వున్న స్లీపర్ బోగీలు యెలా వూగుతున్నాయో, గునుపు వక్రపు మలుపుల్లో చివరి బోగీలు యెంత పక్కకి ఒరిగిపోతున్నాయో, అందులో ప్రయాణాలు చేసే మనకి తెలుసు!

ఇక డబుల్ డెక్కర్లు వేస్తే—ప్రత్యేక పధకం క్రింద ప్రతీ బోగీలోనూ తాటికాయంత యెర్రని అక్షరాలతో ‘దేవుని స్మరింపుము ‘ అని వ్రాయించాలేమో! (మన పాత ప్రైవేటు బస్సుల్లో వుండేలాగ! ఆ బస్సులలో ముందుభాగం లో ఇలా వ్రాసి వుండేది! ఇక పక్కల్ని ‘హరే రామ హరే రామ స్త్రీలు రామ రామ పురుషులు హరే హరే అనీ వ్రాసి వుండేవి! అవి చదువుకొని జోకులు వేసుకొనేవాళ్ళం)

అసలు విద్యుద్దీకరణ జరిగిన లైన్లలో, వైర్లు యెంత యెత్తున వెయ్యాలి? వాటికి యెంతెంతెత్తు స్థంభాలు నాటాలి, వాటికి యెంత ఖర్చు అవుతుంది—ఇలాంటి అయిదోతరగతి చదివిన వాళ్ళకి వచ్చే సందేహాలైనా మమతకి రాలేదంటే…….!

మామూలు రైళ్ళకి సైతం ఇరవైమూడేసి బోగీలు తగిలించి, అవి ఆగే స్టేషన్లలో అంతంత పొడుగు ప్లాట్ ఫారాలే ఇంకా నిర్మించడం మన వల్ల కాలేదు!

సింగిల్ ట్రాక్ రూట్లలో, ఓ రైలు ప్లాట్ ఫారం మీద ఆగి వుంటే, ఇంకో రైలు ప్లాట్ ఫారం లేనివైపు ఆగడం, ప్రయాణీకులు లగేజీలతో, పిల్లలతో నానా ఇబ్బందీ పడడం జరుగుతోంది!

నాన్ స్టాప్ రైళ్ళంటే, ఇప్పటికే కొన్ని స్టేషన్ల ముందు సిగ్నల్ లేక, కనీసం అరగంటపాటు ఆగిపోతున్న సో కాల్డ్ సూపర్ ఫాస్ట్ రైళ్ళూ, ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతున్న చోట్ల, పది కిలోమీటర్ల వేగానికి తగ్గిపోవడం, లేకపోతే పాపం ఆ పనివాళ్ళమీదనించి దూసుకు పోతుండడం…..ఇలాంటి పరిస్థితుల్లో ఇవి సాధ్యమేనా? దీనికేమైనా సాంకేతిక అధ్యయనం చేశారా? (అయిదో క్లాసు చదివిన వాళ్ళకొచ్చే….!)

సో కాల్డ్ మేనేజిమెంట్ గురు లాలూ అయినా, యెప్పుడైనా, ట్రాక్ పక్కన యే రూట్లో అయినా, తీసేసిన చెక్క స్లీపర్లూ, ఇనప స్లీపర్లూ, పట్టాలూ కనీసం పది అడుగుల యెత్తున పేర్చి వుండడం, అవి శిథిలమై పోతూ వుండడం గమనించాడా? వాటిని అమ్మేసో, రీసైకిల్ చేసో ఉపయోగించుకుంటే, రైల్వేలకి కొన్ని లక్షల కోట్ల నిధి జమ అవుతుందని గమనించారా? ఆక్రమణకి గురైన వేలాది యెకరాల రైల్వే స్థలాలగురించి ఇంక మాట్లాడవలసిందేమీ లేదు!

ఇక మధ్యలో మన సత్రకాయి, వన్ మ్యాన్ ఆర్మీ చిరంజీవి ‘మన ఎం పీ లు యేం చేస్తున్నారు’ అంటాడు! మన ఎం పీ లు మంద లాంటి మందమైన చర్మమున్న మందలే అన్న విషయం ఇంకా తెలియనట్టు!

‘యెవరో వస్తారని, యేదో చేస్తారని యెదురుచూసి’ మోసపోతున్న ఓ సగటు భారతీయుడా! నిన్ను ఆ దేవుడంటూ వుంటే, వాడు రక్షించుగాక!


Thursday, July 2

'కొవ్వు ' ప్రతినిథులు

‘మంద’……నాధం!
ఓ గ్రామీణ బ్యాంకు మేనేజరుని మంద జగన్నాథం ‘మ్యాన్ హ్యాండిల్’ చెయ్యడం ‘దృశ్య మీడియా’ చక్కగా చూపించింది!

ఓకటి రెండు ఛానెళ్ళయితే, వాడు అటోసారీ, ఇటోసారీ విసిరిన చెయ్యిని, కనీసం పదహారు సార్లు ‘రిపీట్’ షాట్స్ చూపించి, సామాన్యులు ‘ఆ! అన్నిసార్లు కొట్టేశాడా! సచ్చినోడు!’ అనుకునేలా చూపించాయి!

ఆ బ్యాంకు మేనేజరు పాపం ఇంకా చాలా ‘భవిష్యత్తు’ వున్నవాడనుకొంటా! అందుకే, కాం గా వుండిపోయాడు!

మిగిలిన బ్యాంకు వుద్యోగులందరూ కట్టు కట్టి మంద చేత క్షమాపణ చెప్పించ వలసి వచ్చింది! (అది కూడా యెలా చెప్పాడు? ‘…..బాధ కలిగిస్తే, బహిరంగం గా……..అన్నట్టు!’ అని, తన నరం లేని నాలుకని వెయ్యి మెలికలు తిప్పి! దానికే బ్యాంకు ‘యూనియన్’ల ప్రతినిధులు ‘సంతోషం’ వ్యక్తం చేశారు!)

నేనే ఆ బ్యాంకు మేనేజరునైతే, వాడు నా దగ్గరకి వచ్చి, ఫలానా వాడికి లోన్ ఇంకా యెందుకు ఇవ్వలేదు?’ అని అడగ్గానే, ‘సార్! నేను మీకు బహిరంగ క్షమాపణ చెప్పాలి—మీడియా కూడా వున్నారు కదా, ప్లీజ్! బయటికి పదండి—చెపుతాను!’ అని బయటికి తీసుకెళ్ళి, ‘కెమేరా వైపు తిరగండి సార్’ అని వాడి వెనక్కాల కొంచెం దూరంగా నించొని, లాగి నడ్డి మీద తన్నేవాణ్ణి!

వాడు లుంగలు చుట్టుకు పడిపోగానే, మీడియా మైక్ లలో “నీ బ్రతుకేమిటిరా? అవిశ్వాస తీర్మానానికి వోటు వేసినీందుకు యెన్ని కోట్లు తిన్నావు? వీడికి రికమెండ్ చేసినందుకు యెంత తిన్నావు? నువ్వా నన్ను అడిగేది?” అని అరిచేవాణ్ణీ!

తరవాత సంగతి తరవాత!

(అలాంటి హీరో యెవరైనా వుంటే, వాడిని ఆహ్వానించండి—లేదా, నా దగ్గరకు వాణ్ణి పంపించండి)


Monday, June 22

'వితరణా?'

'గాలి ' దాతృత్వం--2
మళ్ళీ గాలి సోదరులు ఇంకో నలభై అయిదు లక్షలు పెట్టి, ఈ సారి శ్రీశైల మల్లన్న 'వాయూలింగానికి ఓ కిరీటం చేయించి ఇచ్చారట! దాన్ని ఇవాళనించీ అలంకరిస్తారట! అదండీ సంగతి!

Sunday, June 14

'వితరణా?'

'గాలి ' దాతృత్వం


‘……..ఆయనా! చాలా మంచివాడు—దైవ భక్తీ, పాపభీతీ వున్నవాడు!’ అంటూంటారు సామాన్యం గా యెవరైనా మంచివాళ్ళు అని చెప్పాల్సి వచ్చినప్పుడు.

కానీ, ‘దైవ భక్తి’ అన్నది—సూరదాసూ, తులసీదాసూ, కబీరుదాసూ, రామదాసూ, తుకారాం, జయదేవుడు, చైతన్యప్రభు, గాంధీ—లాంటి వాళ్ళకే సాధ్యమౌతుంది! మనది ‘అవసరార్థం’ భక్తి!

ఇక పాపభీతి అంటారా! శ్రీపతి, షిరిడీ, శబరిమల—ఇలాంటివేకాదు—యే వూరిలోని చెరువుగట్టూ, కాలవగట్టూ వీధిమూలా వేంచేసిన యే దేవుడి గుడి దగ్గర చూసినా అక్కడ మూగుతున్న ‘భక్త’ జనాలే సాక్ష్యం!

మరి మన గాలి జనార్దనరెడ్డి యే బాపతు?

యెందుకంటే, పాపం 45 కోట్లు ఖర్చుపెట్టి, 7 వేలకి పైగా వజ్రాలతో, కోటీ యెనభైమూడు లక్షల ఖరీదైన ఒకే పచ్చతో కూడా ఓ బంగారు కిరీటం చేయించి, శ్రీగిరి శ్రీపతి వేంకటేశ్వర స్వామి కి ‘దానం’ చేశాడట!

ప్రపంచం మొత్తానికే కోటీశ్వరుడు ‘వారెన్ బఫెట్’ తన యావత్తు ఆస్థినీ, ఒక ట్రస్టు కి అప్పగించాడు—మానవ సేవకి ఉపయోగించమని! ఇంకా యేమన్నాడంటే, ‘నా సంతానాన్ని రోడ్డున పడవలసిన అవసరం లేకుండా కావలసినంత మాత్రమే వాళ్ళకు ఇచ్చాను! మిగిలినదంటా ఈ ట్రస్టు కే!’ అన్నాడు!

మా డ్రైవర్ కామెంట్—‘……45 కోట్లు పట్టికేళ్ళి వాడి నెత్తిమీద పెట్టాడట! యెవడికేమి వొరిగింది? దాంతో యెన్ని కోట్ల కుటుంబాలు బాగుపడేవో! ఈళ్ళంతా యెందుకు సంపాదిస్తన్నారో….అదంతా యేమి చేసుకుంటారో!’

ఆయన వయసు 67 యేళ్ళు!

ఇక మనం ‘నో కామెంట్’!

Sunday, June 7

ఓ మంచి విషయం

వికలాంగులకి సోలార్ బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీలు త్వరలో మార్కెట్ లోకి వస్తున్నాయట—గంటకు 25 కి.మీ. వేగం; యాక్సిలరేటర్ సిస్టం; పంక్చర్ ప్రూఫ్ టైర్లు—ఇవన్నీ కల వాహనం సుమారు 23 వేల రూపాయల్లో అమ్ముతారట!

మనం తలుచుకుంటే, దాన్ని 23 వందల రూపాయలకే అందించగలం—కదా?

Monday, June 1

Racist Australia

"I'm a citizen of the World"


ఆస్ట్రేలియా లో భారతీయుల్ని జాత్యహంకారులు మట్టుపెడుతున్నారు.

దానికి వ్యతిరేకంగా భారతీయులు ఆందోళన చేస్తుంటే, నడి రోడ్డున బైఠాయించిన వాళ్ళు ట్రఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నరంటూ పోలీసులు వాళ్ళలో ఓ పద్ధెనిమిది మందిని అరెష్ట్ చేసి, మిగిలినవాళ్ళని చెదరగొట్టారు! టీవీల్లో ‘విజువల్స్’ చూశారుగా?

ఆందోళనకారులు (ముందే అనుమతి తీసుకొని) ఓ ముఖ్య రహదారి పై (నాలుగు రోడ్ల కూడలో, మరోటో కాదు!) బైఠాయించారు. (ఆదే ఇండియాలో అయితే—కుడివైపో, యెడమవైపో మళ్ళి, ఇంకో దారి ద్వారా మళ్ళీ మెయిన్ రోడ్డు కి రావడానికి వీల్లేకుండా, వంతెనల దగ్గరో, ఇటూ అటూ కార్ఖానాలు వున్న చోటో బైఠాయిస్తారు—‘ట్రాఫిక్ ఆగితే కదా జనానికీ, ప్రభుత్వానికీ సమస్య తెలిసేది!’ అంటారు చోటా మోటా రాజకీయ రాస్తారోకో నాయకులు!)

బైఠాయించిన వారికి కనీసం ఓ పది గజాల దూరం లో పోలీసులు మోహరించారు. వాళ్ళు మామూలు లాఠీలే ధరించారు. వాళ్ళిచ్చిన టైము అయిపోగానే, ముచ్చటగా ఇద్దరిద్దరు పోలీసులు, ఒక్కొక్క ఆందోళనకారుణ్ణి, వెల్లకిలా రెండురెక్కలూ ఇద్దరూ పట్టుకొని, ఈడ్చుకొంటూ, పోలీసుల దగ్గరికి లాక్కు పోయి, అక్కడ నిలబెట్టి, అరెష్ట్ చేశారు! (తరవాత, స్టేషనుకి తీసుకెళ్ళి మందలించి విడిచి పెట్టారు)

మిగిలిన వాళ్ళని లాఠీలతొ ఝడిపించి, చెదరగొట్టారు!

ఇక మన అరెష్టులకి వస్తే, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఆజన్మ కక్షలు వున్నట్టు జనాల్ని మోకాళ్ళమీదా, నెత్తి మీదా, పెడరెక్కలు విరిచి వెనక గూళ్ళ మధ్యా, రెండు కాళ్ళ మధ్యా—లాఠీలతోనూ, బూటు కాళ్ళ తోనూ—వీర విహారం చేసే మన పోలీసులూ, నడుములు విరగడం అలవాటైపోయిన మన నారాయణా, రాఘవులూ ప్రత్యక్ష సాక్షులు!

మరి డీజీపీ యదవ్ హయాములో కోంచెం ఇంప్రూవ్ మెంట్ వుంటుందంటారా?

వుంటే అటా, ఇటా? చూద్దాం!

Tuesday, May 26

'దాల్ మే కుచ్ కాలా'

".....ముంబయికి చెందిన 'నేషనల్ రిఫైనరీ' నుంచి 54.93 లక్షల రూపాయల విలువైన 145 కేజీ ల బరువుగల బంగారు, వెండి నాణాలు ఎయిర్ ఇండియా విమానం ద్వారా హైదరాబాదు లోని 'పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' కి రవాణా అవబోతుండగా వాటిల్లోంచి, ఓ వంద కేజీల బంగారు, వెండి నాణాలు దోచుకోబడ్డాయట! ఎయిర్ ఇండియా భద్రతాదళ వుద్యోగిని కారుతో తొక్కి చంపేశారట! ఇంకో రవాణా కేంద్ర వుద్యోగి గాయ పడ్డాడట!

ఇదేదో 'పిచ్చి కథ ' లా లేదూ?

1. బంగారు నాణాలూ, వెండి నాణాలూ చెలామణిలో లేవు (కదా?)
2. ఈ రోజుల్లో బ్యాంకులు అమ్ముతున్న 'కాసుల 'ని నాణాలు అంటున్నా, అవి నిజంగా నాణాలు కాదు!
3. వెండి నాణాలు బ్యాంకులు కూడా అమ్మడం లేదు.
4. రిఫైనరీ అంటే, ముడి చమురుని శుద్ధి చేసేది! మరి ముడి చమురులో బంగారు, వెండి నాణాలు దిగబడ్డాయా?
5. పిడిలైట్ వారు ఫెవికాల్ లాంటి జిగుర్లు తయారు చేస్తారు-- మరి వీరికి బంగారు నాణాలూ, వెండి నాణాలెందుకో? కొంపతీసి వీటితోనే జిగుర్లు తయారు చేస్తున్నారా యేమిటి?

జవాబులేని ఈ ప్రశ్నలకి, ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారా?

చూద్దాం!

Monday, May 18

'ఆఖరి మజిలీ'

తమిళ పులి 'వేలుపిళ్ళై పిరభాకరన్ ' చివరికి వేటాడబడ్డాడు! (కాబట్టే అది 'చివర ' అయ్యింది!)
మొన్నేకదా అనుకున్నాము--'అల్టిమేట్ డెస్టినీ' చేరక తప్పదు--అని!

'గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యం కాదు--అది చేరుకొనే మార్గం కూడా ముఖ్యమే' అన్న సూక్తికి ఓ మంచి ఉదాహరణ పిరభాకరన్!

పనిలో పని, తమిళనాట యెన్నికలు అయిపోయి, ఫలితాలూ వచ్చేశాయి కదా! ఇక అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా యేర్పాట్లు చేశారట!

మంచిదేగా!

Sunday, May 17

'కార్టూన్'

'కార్టూన్'!

అంటే, అది యెవరిని ఉద్దేశించి గీసారో, వాళ్ళు కూడా హాయిగా నవ్వుకోవాలి!

ఆర్కే నారాయణ్ లాంటివాళ్ళూ, బాపు లాంటివాళ్ళూ వేసిన కార్టూన్లు చూసి, జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రథానులూ, ముఖ్య మంత్రులూ అలాగే నవ్వుకొనేవారు!

ఈ మధ్య యేమిటో, ఈనాడు కార్టూనిష్ట్ శ్రీధర్ వెర్రితలలు వేస్తున్నాడు!

ఇవాళ (17-05-2009) వేసిన కార్టూన్ చూశారా?

పాపం చిరంజీవిని అల్లు అరవింద్ అడుగుతున్నాడు--"బావా! 'మార్పూ, సామాజిక న్యాయం' అని రెండు సినిమాలు తీద్దామనుకుంటున్నాను, వాటిలో నటిస్తావా?" అనో, ఆ అర్థం వచ్చేలాగానో!

మొదటి విడతో, రెండో విడతో పోలింగు అయిపోగానే, రాశ్శేఖర్రెడ్డి 'పథకాలు ' అమ్ముకుంటున్నట్లో...యేదో కార్టూన్ వేశాడు!

వీటినే కాదూ--'చెడు రుచి ' కార్టూన్లు (కార్టూన్స్ ఇన్ బేడ్ టేస్ట్) అంటారు?

శ్రీధర్! ఈనాడు స్థాయిని తగ్గించొద్దు! (ఓ పక్క ఉండవిల్లి అరుణ్ కుమార్ నెగ్గాడాయె!)

Thursday, April 30

ఆత్తావియో ఖత్రొ

ఆత్తావియో ఖత్రొ చ్చి కి సీ బీ ఐ క్లీన్ చిట్!

‘ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం’ అంటున్న హెచ్ ఆర్ భరద్వాజ్!

Monday, April 27

తమిళపులి

దెబ్బతిన్న బెబ్బులి?

శ్రీలంక లో తమిళపులి ‘వేలుపిళ్ళై పిరభాకరన్ ‘ పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు!

శాంతికాముకులకీ, తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది!
మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది!

మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు?

ఒకటే సమాధానం—యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే, సహించలేదు, సహించ కూడదు!

భౌగోళికం గా, చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ, సాంస్కృతిక కారణాలవల్లొ, మత సంబంధమైన కారణాలవల్లొ, వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం!

తెల్లవాడి ‘విభజించి పాలించు’ జిత్తులకి తలొగ్గకుండా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే, ‘రెండు డొమీనియన్లు’ కి అంగీకరించకుండా వుంటే, మన పక్కలో బల్లెం—పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు!

1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే, కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే, మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు!

తరవాత, 1965, 1971 యుద్ధాల గురించీ, ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం!

భుట్టో మన దేశం మీద ‘వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం’ ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం!

ఇక పద్ధతులకి వస్తే, తమిళ పులి యెంచుకున్నది—సాయుధ పోరాటం! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం!

రాజకీయం కోసం అప్పటిదాకా ‘ఈళం’ కి మద్దతు ఇచ్చిన రాజీవ్, మధ్యలో తెడ్డు జాపినట్టు ‘ఐ పీ కే ఎఫ్’ పేరుతో జొరబడి, చివరకి హత్య చెయ్యబడ్డాడు!

ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు! హత్యలూ, హత్యా ప్రయత్నాలూ సాగించారు!

వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా, యేదో వంకతో దాన్ని తిరస్కరించడం, కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు!

చివరికి ‘అల్టిమేట్ డెస్టినీ’ కి చేరక తప్పదు కదా?

ఇది ప్రతీ ఉద్యమానికీ, ఉద్యమ నాయకునికీ, ప్రభుత్వాలకీ, విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి!

అయితే బాగుండును!

పీ ఎస్ :- ఇప్పుడే అందిన వార్త--కరుణానిధి చిదంబరం మీదా, చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా, మన్మోహన్ సోనియా మీదా, సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా, భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి, ఆ ప్రభుత్వం 'కాల్పుల విరమణ ' ప్రకటించిందట!

కరుణ తన 'నిరాహార దీక్ష ' విరమించారట!

Wednesday, April 22

జీవితం ఉచితం

ఉచితాల గురించి

‘కేపిటలిజం’-- నియంత్రణలేని విపణి వుండాలనీ, విపణిలో పరిస్థితులు ‘సరఫరా—గిరాకీ’ ల మీదే అధారపడాలనీ, సబ్సిడీలూ, ఉచితాలూ వుండకూడదు—అంటుంది!

కానీ, కొన్ని పరిస్థితులకి లోబడి, రాజకీయ లభ్ధి కోసం, అమెరికా లాంటి దేశానికి కూడా తప్పలేదు—కొన్ని ‘ఉచితాలు’ ప్రకటించకుండా!

అమెరికా లో వుండేవాళ్ళకి చాలా ముఖ్యమైనది ‘సోషల్ సెక్యూరిటీ నెంబరు’.

అక్కది ఉచిత పథకాల్లో ఒకటి, ‘సోషల్ సెక్యూరిటీ పధకం’.

దీని కింద, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి (పింక్ స్లిప్డ్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని) నెలకి ఇంత అని ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వడమే ఈ పథకం!

కొన్ని పరిణామాలవల్ల అక్కడి మాఫియా బలపడి, ‘మనీ లాండరింగ్’ లాంటివి పెరిగిపోయాయి అక్కడ! ‘స్లాట్ మెషీన్లు’, 'వెండింగు మెషీన్లు’ మొదలైనవి వాళ్ళ కంట్రోల్ లోనే వుంటాయి.

ఈ పధకంతో ‘లోన్ షార్కింగ్’ మొదలయ్యింది!

ఇప్పటికే, మనదేశం లో మాజీ ఫ్యాక్షనిష్టులూ, నడమంత్రపు సిరి రాజకీయులూ, మాఫియా లెవెల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. మనీ లాండరింగు కి మంచి ఉదాహరణలు సత్యం రామలింగ రాజూ, వై యెస్ జగన్ కంపెనీలూ!

ఇంక ఉచిత నగదు బదిలీ పధకం వస్తే, మనకి కూడా లోన్ షార్కింగ్ మొదలవుతుంది!

ఇప్పటికే, ప్రైవేటు బ్యాంకులూ, కొన్ని వ్యాపార సంస్థలూ వాటి వసూళ్ళకి గూండాలని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక ప్రతీ వూళ్ళోనూ వీధికో డజను చొప్పున వెలిసిన ‘మైక్రో ఫైనాన్స్’ సంస్థలు యెలా విచ్చలవిడిగా అప్పులిస్తున్నాయో, యెలా వసూలు చేసుకుంటున్నాయో తెలుసు కదా?

లోన్ షార్కింగ్ అంటే, ప్రజలకి వచ్చే నియమిత అదాయానికి ఇన్నిరెట్లు అని అప్పు ఇచ్చి, ప్రతీ నెలా ఆ అదాయం రాగానే, వడ్డీ వసూలు చేసుకు పోవడం! అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా పూర్తిగా కట్టలేక చేతులెత్తేసి, మాఫియా చేత వికలాంగులుగా చెయ్యబడ్డవారూ, చంపబడ్డవారూ కోకొల్లలు అక్కడ. ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!

మరి మన దేశం లో కూడా అలాంటి పరిస్థితులు రావని నిశ్చింతగా వుండగలమా?

ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్లా, గ్రూప్ లెండింగ్ ద్వారా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది!

ప్రభుత్వమూ, మీడియా ద్రవ్యోల్బణం రేటు ‘సున్నా’ దగ్గరకి వచ్చేసింది అనీ, వ్యతిరేక ద్రవ్యోల్బణం రావచ్చు అనీ, అది చాలా ప్రమాదకారి అనీ, ఓ ఊదరగొట్టేస్తున్నాయి!

ప్రభుత్వమేమో, కాకుల్లెక్కలు చెపుతూ, రిజర్వ్ బ్యాంకు మీద వత్తిడి తెచ్చి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేలాగ బోళ్ళు చర్యలు తీసుకొనేలాగ చేస్తోంది!

మరి కొన్ని లక్షలు మార్కెట్ లోకి వచ్చేస్తే అప్పుడు ద్రవ్యోల్బణం సంగతేమిటి?

ఉచితాలకి తోడు, ఋణ మాఫీలు కూడా ప్రకటిస్తుంటే, ఇక బ్యాంకుల అప్పులెవరు తీరుస్తారు? బ్యాంకుల లోని ప్రజా ధనానికి భద్రత యేముంటుంది?

పైగా, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతూవుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటే, జనం డబ్బెందుకు దాస్తారూ? యెప్పటికప్పుడు ఖర్చు పెట్టెయ్యరూ!

అలోచించండి మరి!

Wednesday, April 15

ఫ్యాషన్

ఫ్యాషన్

సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మేం పీయూసీ లో వుండగా, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఉపన్యాసకులు చెప్పిన జోక్ ఇది!

(ఆ మహానుభావుడికి అప్పట్లో ఓ 35 యేళ్ళు వుండి వుంటాయి. నీటుగా టక్ చేసుకొని వచ్చి, కుర్చీలో కదలకుండా కూర్చొని, ఉపన్యాసం ఇచ్చేవారు! మేము ఈ మాత్రం వాణిజ్యం గురించి నేర్చుకున్నామంటే, అది ఆయన భిక్షే! నేను చెయ్యెత్తి నమస్కరించేవారిలో ఆయనొకడు. ఆ తరవాత కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఆయన ఆ సంవత్సరంపాటూ మాకు చెప్పింది—సోల్ ట్రేడర్, పార్ట్ నర్ షిప్, జాయింట్ స్టాక్ కంపెనీలగురించి మాత్రమే!)

ఇక జోక్!

ఒక యువకుడు పారిస్ నగర వీధుల్లో, చంకలో ఓ ప్యాకెట్ పెట్టుకొని వేగం గా పరుగెడుతున్నాడట.

అంతలో ఓ స్నేహితుడు కనిపించి అడిగాడట “యెందుకలా కొంపలు మునిగిపోయినట్టు పరిగెడుతున్నావు?” అని.

పరుగు ఆపకుండానే జవాబిచ్చాడట ఆ యువకుడు—“మా ఆవిడ లేటెస్ట్ ఫేషన్ గౌను తెమ్మంది—పట్టుకెళ్తున్నాను—ఇంటికి చేరేలోగా మళ్ళీ ఫేషన్ మారి పోతే, మళ్ళీ ‘లేటెస్ట్’ ఫేషన్ తెమ్మంటుంది—అందుకే ఫేషన్ మారేలోగా ఇల్లు చేరాలి” అని వగర్చుకుంటూ పరుగు సాగించాడట!

అదీ జోకు!

మరి ఇప్పుడో?

ఈ నాటికికూడా ఫేషన్ రాజధాని పారిస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కదా?

Sunday, April 12

......ఉచితం

జీవితం ఉచితం

మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
“ఏమయ్యా! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు. నీ పనులన్నీ నేనే చేస్తాను.” అని.

తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు. “మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను.” అని.

ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు. కొందరు గిన్నెలు, గరిటెలు, మూకుళ్ళు, విస్తళ్ళు, కొనే పని మీద వున్నారు. కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు. మరికొందరు ఆవాలు, ధనియాలు, పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు—అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు. దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు. అందరూ పళ్ళు తోముకుని – ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం. మా ఆవిడ ఈ వార్త చదివి, “ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు” అంది. అప్పుడు నాకనిపించింది – రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క, కారబ్బూంది, సున్నుండలు, మిరపకాయబజ్జీలు, కోడి పలావు, చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను.


అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట. ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు “అన్న దుకాణం” తెరిచినా ఆశ్చర్యం లేదు. అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ, సరదా హత్యలూ, చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు. సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది. నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని – చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం. రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు.

మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది. సాధించాలన్న కృషే జీవితం. ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని, ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం, కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే, ఏదో ఒక పని చేయాలన్న తపన. చేసిన ప్రతిఫలం సమాజానికీ, దేశానికీ దక్కుతుంది.

లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే – ఉచితంగా భోజనం, పళ్ళపొడి, గావంచా, సినిమా టిక్కెట్లు – లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే – వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు.

* * *

—ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం, అంటే 10-9-1982 న, “ఆంధ్ర జ్యోతి” లో ‘జీవనకాలం’ అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం!

మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా?

రాలేదంటే దానికి బాధ్యులెవరు?

మనమేమీ చెయ్యలేమా?

ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి!

సత్తా జనాస్సుఖినోభవంతు!

Saturday, April 11

వినతి

నా బ్లాగు చదువరులకి.....

నేను నా ఇంటికి కొన్ని అలంకరణలు, మార్పు చేర్పులు చేయించిన కారణంగా నా 'సిస్టం' ని భద్రం చెయ్యవలసి రావడం మూలాన, ఈ మధ్య వ్రాయలేక పోయాను!

క్షంతవ్యుణ్ణి!

ఇదిగో! ఇక్కడనించీ, వీలైతే ప్రతీ రోజూ......!

ధన్యవాదాలు!

Tuesday, March 10

మిధ్య

“25,00,00,000” కోట్లు!

ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు అంచనాల ప్రకారం క్రితం యేడాదిన్నరలో ‘హరించుకుపోయిన’ ప్రపంచ సంపద (ట)! ఇది నిజం అంటోందట ఏ డీ బీ!

అసలు నిజం నేనెప్పుడొ చెప్పాను—‘ఊరువెలుపల పాడు కోనేటి చెంత……….’ అని!
అదే సంపద! అదే వృద్ధి! అదే హరించుకుపోవడం!

“గజం మిధ్య! పలాయనం మిధ్య!

కాదా?