Saturday, July 28

నా సోది...........



.........మళ్లీ మొదలు!

(ఇక్కడ వ్రాస్తున్న నిజాలు.......వూరికే మీకందరికీ తెలియజెప్పడానికే గానీ, యెవరినీ కించపరచడానికో, తప్పు పట్టడానికో మాత్రం కాదు. కొన్ని కొన్ని సంఘటనలు అలా...అలా..జరిగిపోతూ వుంటాయంతే! దాన్నే "లలాట లిఖితం" అంటారేమో! అందుకే నేను యెవరినీ యెప్పుడూ నిందించను.) 

చాలా కాలం అయిపోయింది టపాలు వ్రాసి. 

యెందుకంటే......, చావుతప్పి, కన్ను కాదుగానీ, కాలు లొట్టపోయి మళ్లీ మా వూరు చేరాను మొన్ననే. 

వెధవది......అలవాటైన ప్రాణం కదా.........వూరుకోదు. 

ఒకడు తెలంగాణా గురించి వాపోతాడు, ఇంకొకడు జగన్ నీ వాళ్లని వుతికి ఆరేస్తూంటాడు. ఇంకొకావిడ ఒకే వంటని యెన్ని రకలుగా చెయ్యొచ్చో, మన ముఖరవిందాన్ని యెలా చక్కబరచుకోవచ్చో వ్రాసేస్తూ వుంటుంది. ఇంకొకావిడ కణిక వ్యవస్థని దుయ్యబడుతూ వుంటుంది. ఒకాయన సినిమాలగురించీ, గాసిప్ ల గురించీ వ్రాస్తే మరొకాయన అమెరికా వగైరాలగురించీ, ఇంకొకాయన భార్య చీరలని లాండ్రీకి వెయ్యడం గురించి.........ఇలా యెవరి వ్యసనం వారిది!

నా వ్యసనం ప్రకారం ఇవాళ వ్రాస్తున్నది, 2000వ సంవత్సరం వరకూ అలాంటి వూరు ఒకటి వుంది అని కూడా తెలియని "రాయ దుర్గం" గురించి. 

2000వ సంవత్సరంలో, మా బ్యాంకు "పోలసీ" (దీనికి తగ్గ తెలుగు మాట నాకు తట్టడంలేదు--ఇంకా, అంతకు కొన్నేళ్ల ముందు, మేము మా యూనియన్ తరఫున "ఫలనా విషయంలో మీ పోలసీ యేమిటి?" అనడిగితే, "యే పోలసీ లేకపోవడమే మా పోలసీ" అని చమత్కరించేవాళ్లు మా వున్నతాధికారులు!) ప్రకారం, నేను పని చేస్తున్న మావూరు నుంచి రెండు మూడు జిల్లాలు దాటించి, కర్నూలు జిల్లాకి బదిలీ చేశారు. జిల్లా కర్నూలే గానీ, ఆ జోనల్ కార్యాలయం పరిధి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలూ, కర్నాటకలో కొంతభాగం వరకూ వుందిట! 

నా అదృష్టం కొద్దీ నాకు మహబూబ్ నగర్ బ్రాంచి లో వేశారు--అక్కడి మేనేజరు పాపం "కంప్యూటర్లు ప్రారంభించడానికి, సాయంత్రం వాటిని ఆపడానికి తెలిసివున్నవాళ్లు మా బ్రాంచిలో లేకపోవడం తో చాలా ఇబ్బందిగా వుంది. అవి తెలిసున్నవాళ్లని పంపించండి మహాప్రభో!" అని కొన్నాళ్లుగా మొరపెట్టుకొంటుంటే, ఆ పనికి నేను తగినవాణ్నని నన్ను పంపించారు. 

ఆ వూరి గొప్పతనం యేమిటంటే, అక్కడ పనిచేసే 90% వుద్యోగులు (ప్రభుత్వ, బ్యాంకు, ఇతర) హైదరాబాదు నుంచి ఉదయాన్నే "తుంగభద్ర" ఎక్స్ ప్రెస్ లో వచ్చి, డ్యూటీలు చేసుకొని, మళ్లీ సాయంత్రం అదే తుంగభద్ర ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు చేరతారు!

నేను నా భార్యతోసహా అక్కడే కాపురం పెట్టడంతో, ఆఫీసు భారం (కంప్యూటర్లకి సంబంధించినంతవరకూ) నామీదే పెట్టేసేవారు. ఇంకా నా సహజ గుణాలైన ఆలోచించడం, వ్రాయడం, మొదలైనవాటిని కూడా అందరూ వుపయోగించుకొనేవారు. రోజులు బాగానే గడిచి పోయాయి.

ఓ యేడాది గడిచేటప్పటికి, మా మేనేజరుకి ప్రమోషన్ వచ్చి, హైదరాబాదు బదిలీ చేశారు. ఆ లోపల మా అమ్మాయి పెళ్లి కుదిరి, పనులన్నీ పూర్తవడానికి వీలుగా ఓ నెల్లాళ్లు సెలవు మంజూరు చేయించుకొని వచ్చేశాను నేను.

నేను మళ్లీ తిరిగి డ్యూటిలో చేరడానికి వెళ్లేసరికి, కొత్త మేనేజరుగా వచ్చినాయన, "ఠాట్! ఇంత సీనియర్ని, ఇంత జీతం ఇచ్చి, అన్నేసిరోజులు సెలవుల్లో పంపించి, నేను భరించలేను......." అంటూ కర్నూలులో వున్న జోనల్ ఆఫీసులోని డెప్యుటీ జనరల్ మేనేజరు (ఆయన కూడా కొత్తగానే వచ్చాడు!) చెవినిల్లు కట్టుకొని పోరి, నాకు బదిలీ వుత్తర్వులని రప్పించి, నేను డ్యూటీకి రాకముందే నన్ను "రిలీవు" చేసినట్టు నోటీసుబోర్డులో తగిలించేశాడు. 

అంతవరకూ వాడి మొహం నేనూ, నా మొహం వాడూ చూసుకొని యెరగం! ఇవన్నీ నిబంధనలకి వ్యతిరేకం అయినా, అలాంటివాడిదగ్గర పనిచెయ్యడం అంత బుధ్ధి తక్కువ ఇంకేమీ వుండదు అనుకొని, జోనల్ ఆఫీసుకి వెళ్లిపోయాను......బదిలీ వుత్తర్వు కాపీలతో.

...........మిగతా మరోసారి.

6 comments:

ఆత్రేయ said...

తంతే .. జిలేబీల గంప లో పడ్డట్టు అయిందన్న మాట ( బూరెలు నాకంతగా నచ్చవ్ మరి)

A K Sastry said...

డియర్ ఆత్రేయ!

అవును బాబూ! వినేవాళ్లకి అలాగే వుంటుంది.....ఆ తన్ను అనుభవించినవాళ్లక్కదా......!

ధన్యవాదాలు.

ఆత్రేయ said...

:P

Chinni said...

అనంతపురం జిల్లా రాయదుర్గమా?

A K Sastry said...


డియర్ Chinni!

అవునమ్మా! ఆ రాయల వంశంవాళ్లు పరిపాలించిన ప్రస్తుత అనంతపురం జిల్ల రాయదుర్గమే!

ఇంకా వ్రాయాలిగానీ సమయం వుండడంలేదు.

ధన్యవాదాలు.

Chinni said...

అది మా ఊరే.. అలా పేరు చూసేసరికి సంతోషంగా అనిపించింది. వ్రాయండి దాని గురించి. ధన్యవాదాలు.