Friday, January 20

పురుషులూ.......



........పుణ్య పురుషులూ

రిటైర్ అయ్యాక యేవో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా, ఇంకేదైనా చేస్తే బాగుంటుందనిపించింది. 

మొన్న 12-12-2011న మా నాన్నగారి 100వ పుట్టినరోజు సందర్భంగా, కీ.శే. అమ్మనమంచి నరసిం హమూర్తి శతజయంతి ట్రస్ట్ అని స్థాపించి, యేడాది పొడుగునా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, 12-12-12 నాటికి సమాపనోత్సవాలు కొంచెం ఘనంగా నిర్వహించాలని తలపోశాను. 

పనిలో పనిగా మా పిల్లలు నాకు షష్టిపూర్తీ, మా అమ్మగారికి సహస్ర చంద్ర దర్శనోత్సవం కూడా జరిపిస్తే బాగుంటుంది అని, దాన్ని మూడురోజుల కార్యక్రమంగా మార్చారు. 

ఆ రోజులకి మా నాన్నగారి పరిచయస్తులూ, వారి వారసులూ, నా సహోద్యోగులూ, మిత్రులూ, వారివారసులూ, మా బంధు మిత్ర వర్గాన్ని ఆహ్వానించి, చక్కగా కార్యక్రమాలు నిర్వహించాలని, మొన్న 12-12-2011న శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించాము.

కొంతమంది అడిగారు--యేమి సేవలు చేస్తారు? అని. మా కార్యక్రమాలు అన్నీ వివరించి, ఈ రోజుల్లో యెన్నెన్నో ట్రస్టులూ, సేవా సంస్థలూ, లయన్స్, లయన్ లేడీస్, లియో, రోటరీ, రోటరాక్టు, కేటరాక్టు లాంటి సంస్థలున్నా, సామాన్యుడికి వుపయోగిస్తున్నవి చాలా తక్కువ వున్నాయి అని చెప్పాను.

తరువాత, మొన్నో విషయం తెలిసింది నాకు. అది మీకు చెప్పాలనే ఈ టపా.

మా ఇంటికి దగ్గరలోనే, గవర్నమెంట్ ఆస్పత్రి వుంది. ఆ ఆస్పత్రి వున్న సెంటర్లో సన్యాసిరావు అని ఒకతను ఓ కూరగాయలకొట్టు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. కులం రీత్యా రజకుడు. తన వ్యాపార సంబంధమై, తన ఇతర సమస్యలతో సతమతమౌతూ, ఆర్థికంగాకూడా అంతంతమాత్రమే గా గడుపుతున్నాడు.

ఒకరోజు, ఆస్పత్రికి వచ్చిన ఒకతను, అక్కడ ఇచ్చిన బ్రెడ్ తెచ్చి, "నేను ఈ బ్రెడ్ తినలేకపోతున్నాను, ఇది తీసుకొని, డబ్బులిస్తే, ప్రక్కన బండిలో వేస్తున్న దోశ కొనుక్కుంటాను" అని బ్రతిమాలాడట సన్యాసిరావుని. జాలిపడి, అలాగే ఇచ్చాడు. 

అది మొదలు, తానే అన్నం, కూరలూ వగైరాలు వండించి, ఆస్పత్రికి వచ్చేవాళ్లందరికీ--రోజుకి ఓ ఇరవైమందికి తక్కువగాకుండా "అన్నదానం" మొదలు పెట్టాడు!

ఇప్పుడు ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి, ఒక్కో రోజు ఖర్చు మొత్తం మేము భరిస్తాము అని కొనసాగిస్తున్నారు. యెవరూ చెయ్యనిరోజున తానే నిర్వహిస్తున్నాడు.

ఓ సామాన్యుడైన ఆ వ్యక్తి అలాంటి "బృహత్తర" కార్యక్రమం చేస్తున్నాడంటే.......పుణ్యపురుషుడు అనాలా వద్దా?

ఈ సోకాల్డు "సేవాదారులు" బుధ్ధి తెచ్చుకుంటే బాగుండును.

8 comments:

Anonymous said...

చాలా మంచి పనిచేస్తున్నారు, కొనసాగించండి.

కాముధ

శరత్ కాలమ్ said...

అనాలి.

buddhamurali said...

సన్యాసి రావుకు అభినందనలు. వీలుంటే అతని ఫోటో పెట్టండి

సుజాత వేల్పూరి said...

మొత్తానికి మమ్మల్ని ఎవరినీ పిలవకుండానే షష్టి పూర్తి చేసేసుకున్నారన్నమాట!:-)

సన్యాసి రావు లాంటి మనుషులు (నిజంగా మనుషులు) మనకిప్పుడు చాలామంది కావాలి. పుణ్యపురుషుడే అతడు! మీరు అతనికి ఆర్థిక సహాయం చేస్తున్నారా?

A K Sastry said...

డియర్ kamudha!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ శరత్!

నాతో యేకీభవించినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ budhdha murali!

మీ అభినందనలు అతనికి అందజేసి, ఆతని ఫోటో సంపాదిస్తాను.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ సుజాత!

ఇంకా జరుపుకోలేదమ్మా!

12-12-12 కి జరపాలని ప్లాను. మా అబ్బాయి ఇచ్చిన పత్రికా ప్రకటన ఇంకో టపాలో ప్రచురిస్తాను. మీ హాజరీ తప్పనిసరి. సహకరించండి.

నేను కూడా తప్పక చేస్తాను. అతను యేడాది పైగా ఆ కార్యక్రమం నడిపిస్తున్నా, ఇన్నాళ్లూ తెలుసుకోలేకపోయినందుకే సిగ్గుపడ్డాను.

పైగా అతను మానాన్నగారిదగ్గర చదువుకోడానికి మా ఇంటికి వచ్చేవాడు చిన్నప్పుడు. ఆతనికి నేనుకూడా పాఠాలు చెప్పాను!

అందుకే నేనింకా గర్విస్తున్నాను!