ఆంధ్రలో అత్యుత్సాహం
ఆంధ్రదేశంలో ఇవాళ (01-07-2011) నుంచీ అమల్లోకి వచ్చిందట--40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ సంచులపై నిషేధం! (ఇప్పటికే 20 మైక్రాన్లపై విజయం ఇరగదీశారట! తరవాత 70 మైక్రానులలోపు పై నిషేదమట!). మళ్లీ దండుకోడాలు మొదలన్నమాట.
ఇంక పత్రికలవాళ్లు చెప్పిన కారణాలే చెపుతూ, సమస్యా పరిష్కారాలు సూచిస్తూ, పండగ చేసుకొంటున్నారు. వాళ్ల రాతల ప్రకారం, ప్లాస్టిక్ నిషేధంలో చెన్నై మొదటి స్థానం లో వుందట. రెండో స్థానం బెంగుళూరుదట. అసలు వీళ్లకీ సమాచారం యెవరిస్తారో?
గత సంవత్సరం ఇవేరోజుల్లో నేను చెన్నైలో ఓ వారం పదిరోజులు వున్నాను. అక్కడ మెయిన్ రోడ్లతో సహా పెద్ద హోటళ్ల దగ్గరనుంచీ, పళ్ల దుకాణాల దగ్గరనించీ, బజ్జీ బళ్లవరకూ అందరూ ప్లాస్టిక్ కవర్లలోనే విక్రయిస్తున్నారు! ఈ యేడాదిలోనే నిషేధంలో ప్రథమ స్థానానికి వెళ్లిపోయింది అని నేను అనుకోను.
బెంగుళూరులో కూడా అదే పరిస్థితి. అది రెండో స్థానంలో యెలా వుందో మరి! బెంగుళూరులో మాత్రం, ఆ సంచులు తయారుచేసేవాళ్లమీద మాత్రమే కేసులు పెడుతున్నారు అనీ, వినియోగదారుల మీద పెట్టడం లేదు అనీ అంటున్నాయి పత్రికలు. అదేమయినా కొంత నిజమేమో.
ఇంక మొన్నటి మా మూడో హనీమూన్ లో భాగంగా, ఢిల్లీ, హర్యాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్ లలో అనేకచోట్ల పర్యటించాము. అన్నిచోట్లా యధేచ్చగా సంచుల వినియోగం జరుగుతూంది. ప్రసిధ్ధ పర్యాటక స్థాలాల్లో సైతం, పర్యావరణం పేరుతో తలతిక్క విధానాలు అవలంబించడం తప్ప, ప్లాస్టిక్ నిషేధం లేదు. యెక్కడా 'రీసైకిలు కోసం చెత్తబుట్టలు ' అంటూ కనపడలేదు.
బెంగుళూరులో మాత్రం, యెంపికచేసిన కొన్ని యేరియాల్లో, మహానగరపాలికె పారిశుధ్య పనివాళ్లు పోగుపడిన చెత్తని--కాయితాలు వేరుగా, అట్టపెట్టెలు వేరుగా, లోహపు మూతలూ, వస్తువులూ వేరుగా, ప్లాస్టిక్ కవర్లూ, పాలపేకెట్లూ వేరుగా, ప్లాస్టిక్ సీసాలు వేరుగా, గాజు సీసాలు వేరుగా--ఇలా తమ చేతులతో బస్తాల్లో నింపి మోసుకెళ్లడం చూశాను. తరువాత అవి యేమి చేస్తున్నారో.
ఇంక మా నరసాపురం లాంటి చిన్న వూళ్లలో, మునిసిపాలిటీ వుద్యోగులు మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తారు--నిషేధం అమలుకోసం జనాలని ఇరగదీస్తూ.
ఇప్పటికి మాత్రం, కమీషనరుగారి ఇంటి చుట్టుప్రక్కలా, ప్రభుత్వాధికారుల ఇళ్ల చుట్టు, రోజుకి మూడు నాలుగుసార్లు చెత్త యెత్తీ, ఇళ్లనుంచి సేకరించీ, ట్రాక్టరు తొట్లలో నింపి, తిన్నగా డంపింగ్ యార్డులో దిమ్మరించి వస్తున్నారు. ఆ సోకాల్డ్ యార్డులు నిండిపోయి, చెత్త ఓ పర్వతం అంత యెత్తు అయిపోయాక, కొత్త డంపింగ్ యార్డు కోసం భూసేకరణ చేస్తున్నారు. (వీటిల్లో కూడా కుంభకోణాలు మామూలే!). మరి ఆ మాత్రానికి 20 మైక్రానులైతే యేమిటి; వెయ్యి మైక్రానులైతే యేమిటి? సామాన్య జనాలని వేధించడం తప్ప!
ఇంకో గమనార్హమైన విషయం యేమిటంటే, ఇదివరకు "మానుష వ్యర్థాలని" సేకరించే పని చేసే కులం వాళ్లే ఇప్పుడు కూడా పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. ఇంకా "సెప్టి క్లీన్"లు నిర్వహిస్తున్నవాళ్లు కూడా వాళ్లే! మరి ఆ కులంవాళ్లని యేమి వుధ్ధరించినట్టు?
ఇప్పటికైనా ప్రభుత్వాలు వూరికే మీడియాలో ప్రచారం కోసం కాకుండా, చిత్తశుధ్ధి తో "సరైన చర్యలు" తీసుకొంటే మంచిది.
ప్రజలందరూ సంతోషిస్తారు.
2 comments:
గురువుగారూ మా తాడిపత్రిలో గత 5 సంవత్సరాలనుంచి ప్లాస్టిక్‍పై నిషేదం బాగా అమలుచేస్తున్నారు.
డియర్ చిలమకూరు విజయమోహన్!
మీ తాడిపత్రి ఘనమే! చాలా సంతోషం.
ఆ చేత్తోనే, నేను నా 'ప్లాస్టిక్......' టపాలలో లేవనెత్తిన ఇతర అంశాలగురించి--హోటళ్లో టిఫిన్ ప్లేట్లలో అరిటాకుల బదులు వేస్తున్న ప్లాస్టిక్ కాయితాలగురించీ, చట్నీలూ, సాంబారూ, పెరుగూ వగైరాల ప్యాకింగ్ గురించీ, ఇంకా, ప్లాస్టిక్ మంచి నీళ్ల సీసాలూ, గ్లాసులూ, ప్లాస్టిక్ అరిటాకులూ వగైరాలగురించీ, వ్యర్థాల సార్టింగూ, రీసైకిలింగూ వగైరాలమీద ఓ చిన్న టపా వదిలి, నాకు లింకు ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను.
ధన్యవాదాలు.
Post a Comment