Friday, May 20

మా మూడో హనీమూన్ అనే.......-10



మొన్నటి మా యాత్ర

# పటౌడీ--ఇదొక పట్టణం. ఓ కోట, అందులో మహమ్మదీయ నవాబులతో పరిపాలించబడేది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్నరోజుల్లోనే, ఈ కోట ఓ వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో పటౌడీ నవాబు "అఖ్తర్ ఆలీ ఖాన్" (సీనియర్ పటౌడీ అంటారు) మన దేశ క్రికెట్ జట్టుకి సారధి. (మన తెలుగువాడు సీ కే నాయుడు కూడా అప్పట్లో మన జట్టుకి సారధి!)పటౌడీ జూనియర్ "మన్సూర్ ఆలీ ఖాన్" కూడా మన క్రికెట్టు జట్టుకి సారధి గా వ్యవహరించాడు. ఆయనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా టాగోర్ (ఆవిడ హిందూ--బెంగాలీ) ని వివాహం చేసుకొన్నాడు. నేటి హీరో "సైఫ్ ఆలీ ఖాన్" (వీడు పటౌడీ అని పెట్టుకోలేదెందుకో!) వాళ్ల కొడుకు. 

ఇప్పుడు వాళ్ల పేలస్ ని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేశారు. అప్పుడప్పుడూ వాళ్లు వచ్చి, అక్కడ బస చేసి వెళుతూంటారట. మేము ఆ కోటని బయటినించే చూశాము. పేలస్ ని చూడ్డానికి ప్రయత్నించాము.

(ఆ విషయాలు ఇంకోసారి.)

ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ దగ్గరలోనే ఓ "ఉడిపీ" హోటెల్ వుంది అనీ, కరోల్బాగ్ ఆర్యనివాస్ తరవాత అంత ఫేమస్ అనీ, అక్కడ టిఫిన్లు చేసి వెళదామనీ మా చెల్లెలు ప్రపోజల్. తీరా డ్రైవరుకి ఆ హోటెల్ రూట్ తెలియదట. తన సెల్ లో తనకి తెలిసున్నవాళ్లందరినీ అడిగేసి, చాలా ఖష్ట పడుతున్నాడు.

నేను, "మాకు ఆకళ్లు లేవు, వద్దులే, ముందు మీ యింటికి చేరే మార్గం చూడు" అనేశాను. 

వాళ్ల వూళ్లో రోజు విడిచి రోజే కరెంటు వుంటుంది. అదీ పగలు వుండదు. అందుకని వాళ్లు ఎల్ పీ జీ తో పనిచేసే గీజరు పెట్టుకొన్నారు. దాంతో వాళ్ల అమ్మాయి వేడి చేసి వుంచిన నీళ్లతో మా స్నానాలకి యేర్పాట్లు చేసేశారు. ఇల్లంతా నీట్ గా సర్ది వుంది. పాపం మా చెల్లెలు పిల్లలూ, వాళ్ల నాన్నా యెంత కష్టపడ్డారో! వాళ్లకి మేము తెచ్చిన కానుకలు అందించేశాము--యెంత సంతోష పడ్డారో--ఆ చిరు కానుకలకే!

అప్పటికి 11-30 అయ్యింది. వాళ్లు నడిపిస్తున్న స్కూల్ హాస్టల్ నించి మాకు టిఫిన్లు తెచ్చేశారు మా బావగారు. పూరీ, కాలీఫ్లవర్/బఠాణీ సబ్జీ. లాగించేశాము.

అక్కడనించీ, "అక్కా! యేమి వండమంటావు?"

"చెల్లీ! సింపుల్గా పప్పు చేసి, చారు పెట్టెయ్యి. వూరగాయలు తెచ్చాము--టమాటా, గోంగూరా, కందిపొడీ, చల్ల మిరపకాయలూ, వడియాలూ......"

"మరి పప్పులోకి యేం వెయ్యమంటావు? టమాటానా, దోసకాయా.....ఇంకా మామిడికాయలు రావడంలేదు మాకు....!"

"అవేమీ వద్దు. ముద్దపప్పు చేసేయ్యి. నేను చల్ల మిరపకాయలూ, వడియాలూ వేయించేస్తాను. వదిన చారు పెట్టేస్తుంది."

"అయ్యో! మీరందరూ అవన్నీ చేసేస్తుంటే, చారు పెట్టలేనా! నేను పెట్టేస్తానమ్మా!" అని మా ఆవిడ.

వంటలు పూర్తయ్యేసరికి 2-00! ఈ లోపల మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలు నించి, భోజనం లోకి ఓ యాభై "రోటీ"లూ, క్యాప్సికం/టమాటా కూరా, క్యాబేజీ/ఆలూ కూరా పట్టించుకొచ్చేశారు!

నేనూ, మా కాకినాడ బావగారూ--"అయ్యబాబోయ్!" అనేశాము!

మా కాకినాడ చెల్లెలుకి నేను పెట్టిన పేరు "పెసరట్ల పేరమ్మ". ఆట్లు వేసేసి అందరికీ తినిపించేస్తుంది. తను ఆఖరున యేమైనా మిగిలితే తింటుంది. అలాగే, అందరినీ మాటల్లో పెడుతూ, పనిలోపనిగా అన్నమూ, కూరలూ, పచ్చళ్లూ వగైరా వడ్డించేస్తూ, పీకల్దాకా మింగబెట్టేస్తుంది......మొదటిరోజు అలాగే బలయ్యిపోయాము మా ఇద్దరు బావగార్లతోసహా!

భోజనాలయ్యేటప్పటికి మూడున్నర! నాకు బయట హాల్లో పడకకి ఇచ్చిన మంచం మీద  కొంచెం యెండ పడుతూంటే, నా కాళ్ల సాక్స్ తీసేసి, ఆ యెండలో నా కాళ్లు పెట్టుకొని కాసేపు పడుక్కున్నాను.     

..........ఇంకా తరువాయి.

No comments: