Thursday, April 30

ఆత్తావియో ఖత్రొ

ఆత్తావియో ఖత్రొ చ్చి కి సీ బీ ఐ క్లీన్ చిట్!

‘ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం’ అంటున్న హెచ్ ఆర్ భరద్వాజ్!

Monday, April 27

తమిళపులి

దెబ్బతిన్న బెబ్బులి?

శ్రీలంక లో తమిళపులి ‘వేలుపిళ్ళై పిరభాకరన్ ‘ పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు!

శాంతికాముకులకీ, తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది!
మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది!

మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు?

ఒకటే సమాధానం—యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే, సహించలేదు, సహించ కూడదు!

భౌగోళికం గా, చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ, సాంస్కృతిక కారణాలవల్లొ, మత సంబంధమైన కారణాలవల్లొ, వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం!

తెల్లవాడి ‘విభజించి పాలించు’ జిత్తులకి తలొగ్గకుండా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే, ‘రెండు డొమీనియన్లు’ కి అంగీకరించకుండా వుంటే, మన పక్కలో బల్లెం—పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు!

1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే, కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే, మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు!

తరవాత, 1965, 1971 యుద్ధాల గురించీ, ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం!

భుట్టో మన దేశం మీద ‘వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం’ ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం!

ఇక పద్ధతులకి వస్తే, తమిళ పులి యెంచుకున్నది—సాయుధ పోరాటం! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం!

రాజకీయం కోసం అప్పటిదాకా ‘ఈళం’ కి మద్దతు ఇచ్చిన రాజీవ్, మధ్యలో తెడ్డు జాపినట్టు ‘ఐ పీ కే ఎఫ్’ పేరుతో జొరబడి, చివరకి హత్య చెయ్యబడ్డాడు!

ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు! హత్యలూ, హత్యా ప్రయత్నాలూ సాగించారు!

వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా, యేదో వంకతో దాన్ని తిరస్కరించడం, కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు!

చివరికి ‘అల్టిమేట్ డెస్టినీ’ కి చేరక తప్పదు కదా?

ఇది ప్రతీ ఉద్యమానికీ, ఉద్యమ నాయకునికీ, ప్రభుత్వాలకీ, విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి!

అయితే బాగుండును!

పీ ఎస్ :- ఇప్పుడే అందిన వార్త--కరుణానిధి చిదంబరం మీదా, చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా, మన్మోహన్ సోనియా మీదా, సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా, భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి, ఆ ప్రభుత్వం 'కాల్పుల విరమణ ' ప్రకటించిందట!

కరుణ తన 'నిరాహార దీక్ష ' విరమించారట!

Wednesday, April 22

జీవితం ఉచితం

ఉచితాల గురించి

‘కేపిటలిజం’-- నియంత్రణలేని విపణి వుండాలనీ, విపణిలో పరిస్థితులు ‘సరఫరా—గిరాకీ’ ల మీదే అధారపడాలనీ, సబ్సిడీలూ, ఉచితాలూ వుండకూడదు—అంటుంది!

కానీ, కొన్ని పరిస్థితులకి లోబడి, రాజకీయ లభ్ధి కోసం, అమెరికా లాంటి దేశానికి కూడా తప్పలేదు—కొన్ని ‘ఉచితాలు’ ప్రకటించకుండా!

అమెరికా లో వుండేవాళ్ళకి చాలా ముఖ్యమైనది ‘సోషల్ సెక్యూరిటీ నెంబరు’.

అక్కది ఉచిత పథకాల్లో ఒకటి, ‘సోషల్ సెక్యూరిటీ పధకం’.

దీని కింద, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి (పింక్ స్లిప్డ్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని) నెలకి ఇంత అని ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వడమే ఈ పథకం!

కొన్ని పరిణామాలవల్ల అక్కడి మాఫియా బలపడి, ‘మనీ లాండరింగ్’ లాంటివి పెరిగిపోయాయి అక్కడ! ‘స్లాట్ మెషీన్లు’, 'వెండింగు మెషీన్లు’ మొదలైనవి వాళ్ళ కంట్రోల్ లోనే వుంటాయి.

ఈ పధకంతో ‘లోన్ షార్కింగ్’ మొదలయ్యింది!

ఇప్పటికే, మనదేశం లో మాజీ ఫ్యాక్షనిష్టులూ, నడమంత్రపు సిరి రాజకీయులూ, మాఫియా లెవెల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. మనీ లాండరింగు కి మంచి ఉదాహరణలు సత్యం రామలింగ రాజూ, వై యెస్ జగన్ కంపెనీలూ!

ఇంక ఉచిత నగదు బదిలీ పధకం వస్తే, మనకి కూడా లోన్ షార్కింగ్ మొదలవుతుంది!

ఇప్పటికే, ప్రైవేటు బ్యాంకులూ, కొన్ని వ్యాపార సంస్థలూ వాటి వసూళ్ళకి గూండాలని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక ప్రతీ వూళ్ళోనూ వీధికో డజను చొప్పున వెలిసిన ‘మైక్రో ఫైనాన్స్’ సంస్థలు యెలా విచ్చలవిడిగా అప్పులిస్తున్నాయో, యెలా వసూలు చేసుకుంటున్నాయో తెలుసు కదా?

లోన్ షార్కింగ్ అంటే, ప్రజలకి వచ్చే నియమిత అదాయానికి ఇన్నిరెట్లు అని అప్పు ఇచ్చి, ప్రతీ నెలా ఆ అదాయం రాగానే, వడ్డీ వసూలు చేసుకు పోవడం! అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా పూర్తిగా కట్టలేక చేతులెత్తేసి, మాఫియా చేత వికలాంగులుగా చెయ్యబడ్డవారూ, చంపబడ్డవారూ కోకొల్లలు అక్కడ. ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!

మరి మన దేశం లో కూడా అలాంటి పరిస్థితులు రావని నిశ్చింతగా వుండగలమా?

ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్లా, గ్రూప్ లెండింగ్ ద్వారా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది!

ప్రభుత్వమూ, మీడియా ద్రవ్యోల్బణం రేటు ‘సున్నా’ దగ్గరకి వచ్చేసింది అనీ, వ్యతిరేక ద్రవ్యోల్బణం రావచ్చు అనీ, అది చాలా ప్రమాదకారి అనీ, ఓ ఊదరగొట్టేస్తున్నాయి!

ప్రభుత్వమేమో, కాకుల్లెక్కలు చెపుతూ, రిజర్వ్ బ్యాంకు మీద వత్తిడి తెచ్చి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేలాగ బోళ్ళు చర్యలు తీసుకొనేలాగ చేస్తోంది!

మరి కొన్ని లక్షలు మార్కెట్ లోకి వచ్చేస్తే అప్పుడు ద్రవ్యోల్బణం సంగతేమిటి?

ఉచితాలకి తోడు, ఋణ మాఫీలు కూడా ప్రకటిస్తుంటే, ఇక బ్యాంకుల అప్పులెవరు తీరుస్తారు? బ్యాంకుల లోని ప్రజా ధనానికి భద్రత యేముంటుంది?

పైగా, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతూవుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటే, జనం డబ్బెందుకు దాస్తారూ? యెప్పటికప్పుడు ఖర్చు పెట్టెయ్యరూ!

అలోచించండి మరి!

Wednesday, April 15

ఫ్యాషన్

ఫ్యాషన్

సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మేం పీయూసీ లో వుండగా, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఉపన్యాసకులు చెప్పిన జోక్ ఇది!

(ఆ మహానుభావుడికి అప్పట్లో ఓ 35 యేళ్ళు వుండి వుంటాయి. నీటుగా టక్ చేసుకొని వచ్చి, కుర్చీలో కదలకుండా కూర్చొని, ఉపన్యాసం ఇచ్చేవారు! మేము ఈ మాత్రం వాణిజ్యం గురించి నేర్చుకున్నామంటే, అది ఆయన భిక్షే! నేను చెయ్యెత్తి నమస్కరించేవారిలో ఆయనొకడు. ఆ తరవాత కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఆయన ఆ సంవత్సరంపాటూ మాకు చెప్పింది—సోల్ ట్రేడర్, పార్ట్ నర్ షిప్, జాయింట్ స్టాక్ కంపెనీలగురించి మాత్రమే!)

ఇక జోక్!

ఒక యువకుడు పారిస్ నగర వీధుల్లో, చంకలో ఓ ప్యాకెట్ పెట్టుకొని వేగం గా పరుగెడుతున్నాడట.

అంతలో ఓ స్నేహితుడు కనిపించి అడిగాడట “యెందుకలా కొంపలు మునిగిపోయినట్టు పరిగెడుతున్నావు?” అని.

పరుగు ఆపకుండానే జవాబిచ్చాడట ఆ యువకుడు—“మా ఆవిడ లేటెస్ట్ ఫేషన్ గౌను తెమ్మంది—పట్టుకెళ్తున్నాను—ఇంటికి చేరేలోగా మళ్ళీ ఫేషన్ మారి పోతే, మళ్ళీ ‘లేటెస్ట్’ ఫేషన్ తెమ్మంటుంది—అందుకే ఫేషన్ మారేలోగా ఇల్లు చేరాలి” అని వగర్చుకుంటూ పరుగు సాగించాడట!

అదీ జోకు!

మరి ఇప్పుడో?

ఈ నాటికికూడా ఫేషన్ రాజధాని పారిస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కదా?

Sunday, April 12

......ఉచితం

జీవితం ఉచితం

మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
“ఏమయ్యా! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు. నీ పనులన్నీ నేనే చేస్తాను.” అని.

తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు. “మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను.” అని.

ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు. కొందరు గిన్నెలు, గరిటెలు, మూకుళ్ళు, విస్తళ్ళు, కొనే పని మీద వున్నారు. కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు. మరికొందరు ఆవాలు, ధనియాలు, పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు—అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు. దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు. అందరూ పళ్ళు తోముకుని – ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం. మా ఆవిడ ఈ వార్త చదివి, “ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు” అంది. అప్పుడు నాకనిపించింది – రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క, కారబ్బూంది, సున్నుండలు, మిరపకాయబజ్జీలు, కోడి పలావు, చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను.


అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట. ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు “అన్న దుకాణం” తెరిచినా ఆశ్చర్యం లేదు. అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ, సరదా హత్యలూ, చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు. సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది. నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని – చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం. రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు.

మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది. సాధించాలన్న కృషే జీవితం. ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని, ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం, కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే, ఏదో ఒక పని చేయాలన్న తపన. చేసిన ప్రతిఫలం సమాజానికీ, దేశానికీ దక్కుతుంది.

లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే – ఉచితంగా భోజనం, పళ్ళపొడి, గావంచా, సినిమా టిక్కెట్లు – లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే – వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు.

* * *

—ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం, అంటే 10-9-1982 న, “ఆంధ్ర జ్యోతి” లో ‘జీవనకాలం’ అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం!

మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా?

రాలేదంటే దానికి బాధ్యులెవరు?

మనమేమీ చెయ్యలేమా?

ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి!

సత్తా జనాస్సుఖినోభవంతు!

Saturday, April 11

వినతి

నా బ్లాగు చదువరులకి.....

నేను నా ఇంటికి కొన్ని అలంకరణలు, మార్పు చేర్పులు చేయించిన కారణంగా నా 'సిస్టం' ని భద్రం చెయ్యవలసి రావడం మూలాన, ఈ మధ్య వ్రాయలేక పోయాను!

క్షంతవ్యుణ్ణి!

ఇదిగో! ఇక్కడనించీ, వీలైతే ప్రతీ రోజూ......!

ధన్యవాదాలు!