Sunday, April 29

నాకు నచ్చే.....



......నమ్మ బెంగళూరు

బెంగళూరు వాతావరణమంటే నాకిష్టం. 

ఇప్పుడిప్పుడు 'నమ్మ మెట్రో' వగైరా పేర్లతో చెట్లు నరికేసి, బయటికి వస్తే నెత్తీ అవీ, అన్నీ మాడేలా తయారయ్యిందిగానీ (అక్కడికీ పర్యావరణ ప్రేమికులు ధరణాలూ అవీచేసి లాఠీ దెబ్బలు తినడం, కోర్టులకెక్కడం, కోర్టులు అధికారులకి మొట్టికాయలు వెయ్యడం లాంటివీ, వందేళ్ల వయసు చెట్లని కూకటివేళ్లతో పెకలించి వేరే చోట్ల నాటడం లాంటివి జరుగుతున్నాయిగానీ, పెద్ద ప్రభావం వుండటం లేదు!), లేకపోతే స్వర్గానికి బెత్తెడు దూరమే! మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖ వగైరాలతో పోలిస్తే మాత్రం లక్ష రెట్ల బెటరు! అందుకే నాకిష్టం.

మొన్న మళ్లీ ఓ పదిరోజులు బెంగళూరు వెళ్లి వచ్చాము......మా అబ్బాయి మార్తహళ్లి లో కొనుక్కున్న అపార్ట్మెంట్ గృహ ప్రవేశం చేయించడానికి.

ఈసారి మాతో వచ్చిన, ఇంతవరకూ బెంగళూరు చూడని వాళ్లకోసం, కేటీడీసీ వాళ్ల "న్యూ బెంగళూరు" ప్యాకేజీలో తీసుకెళ్లాను. 

మొట్టమొదట, "ఇస్కాన్" టెంపుల్. ఒకప్పుడు దివ్యప్రభతో, ఇసకేస్తే రాలని జనంతో కిటకిటలాడే "దేవాలయం". (ఇదివరకటి నా టపా చదివి వుంటే, అక్కడ నూట యెనిమిదో యెన్నో--నీళ్ల మధ్య గుండ్రని తిన్నెలూ, వాటిమీదనుంచి--బలవంతపు బ్రాహ్మణార్ధంగా, హరేరామ, హరేరామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ అందరినీ అరిపించడం (నేను హరే అల్లా; హరే యేసు అనడం) వగైరాలు గుర్తుండే వుంటాయి.

ఇప్పుడవేవీ లేవు. క్యూలు ఖాళీ, కేంటీన్లు ఖాళీ, గుడి ఖాళీ--ఒక్క కేటీడీసీ టూరిస్టులు తప్ప, అక్కడ భక్తిపారవశ్యాన్ని సూచించే వింత డ్యాన్సులు చేసే "భక్తులు" తప్ప, యెవరూ లేరు! 

ప్రసాదం మాత్రం వేడివేడిగా, రుచిగా వుంది. 

ఇంక అక్కడ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలూ, ఫోటోలూ, పూసలదండలూ, వెండీ వగైరా కుందులూ, అనేక చేతి వుత్పత్తులూ--మామూలుగానే రేట్లు వందల్లో! (నేనే వాటికి అధికారినైతే, యేమాత్రం కక్కుర్తిలేకుండా అందరికీ వుచితంగా పంచిపెట్టించేవాణ్ని! అదేమీ బీదవాళ్లు కట్టిన గుడి కాదుకదా? పైగా వాళ్లు అక్కడ వ్యాపారం చెయ్యనఖ్ఖరలేదుకదా?)

(అక్కడే బ్రేక్ ఫాస్ట్. మాకు టైములేక పార్సెల్ చేయించుకున్నాము.)

యేదీ శాశ్వతం కాదు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిందీ గుడి!

తరవాత 1970 ల్లో కట్టిన--యేక శిలా హనుమాన్ విగ్రహం వుండే గుడీ, రాజరాజేశ్వరి (మధుర మీనాక్షి కాపీ) గుడీ. 

.........మిగతా మరోసారి

Monday, March 12

పైవాడు.....



......కోరితే

మొన్నీమధ్య, మావాడు (సన్నిహిత బంధువు) తో "ఛాట్" చేస్తూ, "ఇన్షా అల్లా" అని యేదో వ్రాశాను. దానికి వాడు "బాబాయ్! మతం మార్చావా? యెప్పుడూ?" అని క్రొశ్నించాడు. వెంటనే నేను, "అసలు పై వాడనేవాడొకడు వుండేడిస్తే, మనం యేపేరుతో పిలిచినా పలక్క ఛస్తాడా? ఈ మాత్రానికి మతాలూ, మార్పిళ్లూ యెందుకు?" అనగానే, అటునుంచి....అహ్హహ్హహ్హ!

నిజంగా, ఉర్దూలో ఆమాట నాకు చాలాబాగా నచ్చుతుంది. మిగిలినభాషల్లో అలాంటి "సంక్షిప్త" మహార్థాలిచ్చే మాటలు లేవు. ఇంగ్లీషులో బై గాడ్స్ గ్రేస్ అనీ, తెలుగులో దేవుడు మేలు చేస్తే అనీ, హిందీలో అగర్ భగవాన్ చాహే.....ఇలా యెన్ని వున్నా, ....."దేవుడు కోరితే", "దేవుడు అనుమతిస్తే", "పైవాడి శెలవైతే".....లాంటి అర్థాలు చెప్పే ఈ మాటకి సాటి అయినది లేదు!

అందుకే......"ఇన్షా అల్లా!"

Saturday, March 3

నా గురించి........

మరో.......సింహావలోకనం - 2


మరి సాధించిందేమిటి? అంటే.....

నా వొక్కడి గొప్ప అని చెప్పనుగానీ, కొంతమంచి జరిగింది. ముఖ్యంగా నాలుగు విషయాల్లో.

  • రైల్వేల విషయంలో, విజిలెన్స్ దర్యాప్తులు జరిగి, కొన్ని చర్యలు తీసుకొన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో, తత్కాల్ విషయంలో కొంత సంస్కరించారు. (ఇప్పుడు మళ్లీ "నాలుగు నెలల" ముందే రిజర్వేషన్ అంటున్నారు. అది అంత అవసరం అనిపించడం లేదు నాకు).


  • తి తి దే వారు కూడా దర్యాప్తులూ అవీ జరిపి, కొన్ని సంస్కరణలు తెచ్చారు. ముఖ్యంగా అప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు గారు, సేవా టిక్కెట్ల విషయంలో, ప్రత్యేక దర్శనాల విషయంలో, క్యూలైన్ల విషయంలో కొంత సౌకర్యం కల్పించారు. భక్తి ఛానెల్ ని సంస్కరించారు. 


  • మన తెలుగు విషయంలో, ఈనాడు వారు కొంత మారారు/మార్చారు. ఇంకా చాలా చోట్ల తెలుగులో కొంత అభివృధ్ధి జరిగింది.


  • ఆర్ బీ ఐ వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మొన్ననే, ముథూట్, మణప్పురం లాంటి సంస్థల విషయంలో కొన్ని చర్యలకి శ్రీకారం చుట్టారు.


ముఖ్యమైనవి ఇవి. చిన్నచిన్నవాటి గురించి వ్రాయడం లేదు.

ఈ విషయాల్లో నాతో యేకీభవించినవారికీ, ఆ టపాలు తగినవారి దృష్టికి తీసుకెళ్లినవాళ్లకీ, చర్యలు తీసుకొనే భాగ్యం కలిగించినవారికీ మా మనః పూర్వక కృతజ్ఞతలు.

ఇలాగే కొనసాగాలని నా ఆకాంక్ష.

Sunday, February 26

నా గురించి........



మరో......."సింహావలోకనం"

"బ్లాగులోకం" లో "బిగ్ బ్యాంగ్" యెప్పుడు జరిగిందో నాకు తెలీదుగానీ, అప్పట్లో యేర్పడ్డ ఓ "వూర్ట్" మేఘం లో ఓ చిన్న "కాస్మిక్" ధూళి రేణువుగా, "ఏ సిటిజెన్ అఫ్ ది వరల్డ్" అని బ్లాగు ప్రారంభించి, "తెంగ్లిష్" లో "సింహావలోకనం" అనే శీర్షికతో ఓ టపా వ్రాశాను--2007 మే లో. (తరవాత తెలుగు బ్లాగుల గురించి తెలుసుకొని, దాన్ని "ఓ ప్రపంచ పౌరుడు" గా మార్చాను. అందుకేనేమో--నా మొదటి టపా ఇప్పుడు కనపడడం లేదు.)

ఇప్పుడు, ఓ నాలుగేళ్లు పూర్తయ్యాక, ఐదో యేట మరో "సింహావలోకనం". 

అనేక "సామాజిక" లు వచ్చాయి. కానీ వాటివల్ల యెవరికీ యే మేలూ జరగడంలేదు. పైగా కీడు జరిగిన దాఖలాలున్నాయి. ఒకాయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరింపబడడం, ఇంకొకాయన మంత్రి పదవి వూడినంత పని అవడం, ఇంకొకరెవరో తమ పేరున ట్వీట్లు వగైరా నిర్వహిస్తున్నారని వాపోయే వాళ్ల అభియోగాలు--ఇవన్నీ వింటూనే వున్నాము కదా?

ఈ నాలుగేళ్లుగా, నేను అనేక బ్లాగులని వ్రాస్తూ, ఒక్కో విషయం మీదా ఒక్కోటపా ప్రచురిస్తూ, నా ప్రస్థానం సాగిస్తున్నాను. ఈ మార్గంలో, అనేక భూషణ, దూషణ, తిరస్కారాలు యెదుర్కొన్నాను. అయినా, "ఐ లవ్ బ్లాగింగ్!"

బ్లాగింగ్ ఒక్కటే ఆరోగ్యకరమైన విధానం. "నా బ్లాగు, నా య్హిష్టం" అని వ్రాసుకోవచ్చు.  మీ అభిప్రాయాలని జనులందరికీ (చదివేవాళ్లకు మాత్రమే) ప్రకటించవచ్చు. మనకెలాగూ వాక్ స్వాతంత్ర్యం మన రాజ్యాంగమే ఇచ్చేసింది! 

కానీ కొందరు "వెధవ" మంత్రులు, అంతర్జాలం మీదా నియంత్రణ విధించాలని వాదిస్తున్నారు. (మంత్రి వెధవలు అనకూడదు!) కానీ, మొత్తం దేశవ్యాప్తంగా కంప్యూటర్లనీ, ఐ పీ లనీ వగైరాలని  నిషేధిస్తే తప్ప, ఆ నియంత్రణ వీరికి సాధ్యమా?

సరే, పోనివ్వండి. ఆ గొడవలు పెద్దవాళ్లు చూసుకుంటారు. 

నాకు స్వతహాగా అనేక విషయాలు నచ్చవు. సహజత్వానికి భిన్నంగా వుండేవి, వుండవలసిన విధంగా వుండనివి, కొంచెం యెక్కువగా వుంటున్నవి......ఇలా.....పర్ ఫెక్షనిస్ట్ అంటారే, అలా అన్నమాట. (సహజత్వం, వుండవలసిన.....లాంటివేమిటో అడగద్దు.) 

అలాంటి వాటిని నా టపాల్లో యెత్తి చూపుతూ వుంటాను. కొంచెం ఘాటుగానే వ్రాశాను. నా కోపాన్ని ప్రదర్శించడం లో యేమాత్రం సందేహించలేదు. నా పేరు "కచ్చశ్రీ" గా మార్చుకోమన్నవాళ్లు కూడా వున్నారు. అయినా, నా పంథా మార్చుకోలేదు.

అప్పటికింకా "కొలవెరి" అనే పదం నాకు తెలీదు గానీ, ఇప్పుడు చెప్పగలను--నాకు కొలవెరి వుందికాబట్టే నా టపాలు అలా వుంటాయి అని!

నా టపాలవల్ల (నా వొక్కడివల్లే అని చెప్పను) కొన్ని మార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆయనెవరో చెప్పినట్టు, యే ఒక్కరి ఆలోచన కొంచెం మారినా, నా ఆశయం నెరవేరినట్టే.

నాకు ఆశ్చర్యకరమైన విషయం యేమిటంటే, నేను యెన్ని టపాలు వ్రాసినా, "అక్కడ కామా లేదు, అక్కడ ఫుల్ స్టాప్ మరిచారు, మన "వు"చ్చారణ అనకూడదు, "వు"దాహరణ అన కూడదు....." లాంటి వ్యాఖ్యలు వస్తాయి తప్పితే, నేను వ్రాసిన "విషయాల" గురించి, ధైర్యంగా, యేకీభవిస్తూనో, ఖండిస్తూనో--ఒక్క.....ఒకే ఒక్క....వ్యాఖ్య.....ఇప్పటివరకూ రాలేదు!

ఈ విషయంలో, నా టపాలమీద వచ్చిన వ్యాఖ్యలకి ప్రతి వ్యాఖ్యగా అనేక సార్లు వ్రాయడం, ఒక్కోసారి టపాల్లోనే వ్రాయడం కూడా జరిగింది. అనేకమందితో వాదప్రతివాదనలు సాగించడం కుడా జరిగింది. 
  
.........మిగతా మరోసారి

Friday, January 27

బ్లాగుసోదరులకి విజ్ఞప్తి



నా క్రొత్త బ్లాగు

నా "కృష్ణశ్రీ" బ్లాగుని రెండుగా భాగించి, "కృష్ణశ్రీ స్వగతాలు" కొనసాగిస్తూ, రెండోదానికి "కృష్ణశ్రీ విసుర్లు" అని పేరు పెట్టాను. 

కానీ, మన "సంకలినుల్లో" అది కనిపించడం లేదు. వాటికి లింకు పెట్టుకొనే వోపిక లేదు నాకు.

అందుకే, దయచేసి, ఈ క్రింది లింకు తెరిచి, నా టపాలు చదువుతారని ఆశిస్తూ, 



మీ

కృష్ణశ్రీ

Saturday, January 21

శతజయంతీ వగైరా......



......కార్యక్రమాలు

ప్రసక్తి వచ్చిందికాబట్టి, మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలూ, నా షష్టిపూర్తీ, మా అమ్మగారి సహస్రచంద్ర దర్శనం కార్యక్రమాల గురించి మా అబ్బాయీ, కోడలూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటన ప్రచురిస్తున్నాను. 


12-12-2011 (సోమవారం) మా తాతగారు కీ.శే. అమ్మనమంచి నరసింహ మూర్తిగారి శతజయంతి.
సంవత్సరమంతా, ఆయన శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ, 12-12-2012 (బుధవారం) సమాపనోత్సవాలు
నిర్వహించాలని సంకల్పం.

వాటితోపాటు, మా మామ్మగారు శ్రీమతి అమ్మనమంచి లక్ష్మీ కాంతం (నరసింహ మూర్తిగారి భార్య)
సహస్రచంద్ర దర్శనోత్సవం”,
మా నాన్నగారు అమ్మనమంచి కృష్ణ శాస్త్రి (విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ అధికారి)
షష్టిపూర్తి మహోత్సవం
వరసగా మూడురోజులలో నిర్వహించాలని సంకల్పించాము.

ఉత్సవాలకి మా తాతగారి
మిత్రులూ, సహోద్యోగులూ, శిష్యులూ, ప్రశిష్యులూ, మరేవిధంగానైనా ఆయనకి పరిచయస్తులు, వారి వారి వారసులు;

అలాగే
మా మామ్మగారి (పిరాట్ల కొండయ్య గారి కుమార్తె) తరఫు బంధు మిత్రులూ, పరిచయస్తులూ, వారి వారసులూ;

మా
నాన్నగారి సహాధ్యాయులు, సహోద్యోగులు, బ్లాగ్ మిత్రులూ, వారి వారి వారసులూ,
మా అమ్మగారి (దర్భా లక్ష్మణ శర్మ గారి కుమార్తె కృష్ణ భారతి) తరఫు బంధు మిత్రులూ, వారి వారి వారసులూ
అందరూ, సకుటుంబ సపరివారంగా, ఆహ్వానితులే!

ఉత్సవాలకి అందరూ తప్పక విచ్చేయమని పత్రికా ముఖంగానే ఆహ్వానం. (రాబోయే ప్రకటనలు కూడా చూడండి).

దయచేసి, మీ రాకని తెలియపరుస్తూ, క్రింది ఈమెయిల్ అడ్రెస్ కి మెయిల్ పంపిస్తే, మీ వివరాలు రిజిస్టరు చేసుకోబడతాయి. అవసరమైతే, మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడతాయి.

రాదలచుకొని, రాలేకపోతున్నవారికిఅవసరానుగుణంగాతగిన యేర్పాట్లు జరపడానికి ప్రయత్నిస్తాము.

దయచేసి, అందరూ ఆహ్వానాన్ని మన్నించి, ప్రత్యక్షంగా కలిసి, ఉత్సవాలని జయప్రదం చెయ్యాలని మా ఆకాంక్ష.

ఇట్లు,

అమ్మనమంచి శశికాంత్ భరద్వాజ్ (Mobile : 94414 93523)
అమ్మనమంచి అరుణ రమ్య
అమ్మనమంచి నరసింహ మూర్తి శతజయంతి ట్రస్ట్, నరసాపురం.

(రిజిస్ట్రేషన్ అనేది కేవలం మీకు సరియైన సదుపాయాలు కల్పించి, మీరు మాతో ఆహ్లాదంగా గడపడానికి దోహదం చేసి, మరువలేనిదిగా చెయ్య్డానికి మాకు తోడ్పడాలనే.)

అలాగే, శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవం గురించి కూడా--ఇంకో టపా.

అందరూ ముందుగానే ప్లాను చేసుకుంటారని యేడాది ముందుగానే ఆహ్వానాలు పంపిస్తున్నాను. 

బ్లాగు మిత్రులందరూ తప్పక కలుస్తారని ఆశ! 

మీ సహయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ.....
Posted by Picasa

Friday, January 20

పురుషులూ.......



........పుణ్య పురుషులూ

రిటైర్ అయ్యాక యేవో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా, ఇంకేదైనా చేస్తే బాగుంటుందనిపించింది. 

మొన్న 12-12-2011న మా నాన్నగారి 100వ పుట్టినరోజు సందర్భంగా, కీ.శే. అమ్మనమంచి నరసిం హమూర్తి శతజయంతి ట్రస్ట్ అని స్థాపించి, యేడాది పొడుగునా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, 12-12-12 నాటికి సమాపనోత్సవాలు కొంచెం ఘనంగా నిర్వహించాలని తలపోశాను. 

పనిలో పనిగా మా పిల్లలు నాకు షష్టిపూర్తీ, మా అమ్మగారికి సహస్ర చంద్ర దర్శనోత్సవం కూడా జరిపిస్తే బాగుంటుంది అని, దాన్ని మూడురోజుల కార్యక్రమంగా మార్చారు. 

ఆ రోజులకి మా నాన్నగారి పరిచయస్తులూ, వారి వారసులూ, నా సహోద్యోగులూ, మిత్రులూ, వారివారసులూ, మా బంధు మిత్ర వర్గాన్ని ఆహ్వానించి, చక్కగా కార్యక్రమాలు నిర్వహించాలని, మొన్న 12-12-2011న శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించాము.

కొంతమంది అడిగారు--యేమి సేవలు చేస్తారు? అని. మా కార్యక్రమాలు అన్నీ వివరించి, ఈ రోజుల్లో యెన్నెన్నో ట్రస్టులూ, సేవా సంస్థలూ, లయన్స్, లయన్ లేడీస్, లియో, రోటరీ, రోటరాక్టు, కేటరాక్టు లాంటి సంస్థలున్నా, సామాన్యుడికి వుపయోగిస్తున్నవి చాలా తక్కువ వున్నాయి అని చెప్పాను.

తరువాత, మొన్నో విషయం తెలిసింది నాకు. అది మీకు చెప్పాలనే ఈ టపా.

మా ఇంటికి దగ్గరలోనే, గవర్నమెంట్ ఆస్పత్రి వుంది. ఆ ఆస్పత్రి వున్న సెంటర్లో సన్యాసిరావు అని ఒకతను ఓ కూరగాయలకొట్టు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. కులం రీత్యా రజకుడు. తన వ్యాపార సంబంధమై, తన ఇతర సమస్యలతో సతమతమౌతూ, ఆర్థికంగాకూడా అంతంతమాత్రమే గా గడుపుతున్నాడు.

ఒకరోజు, ఆస్పత్రికి వచ్చిన ఒకతను, అక్కడ ఇచ్చిన బ్రెడ్ తెచ్చి, "నేను ఈ బ్రెడ్ తినలేకపోతున్నాను, ఇది తీసుకొని, డబ్బులిస్తే, ప్రక్కన బండిలో వేస్తున్న దోశ కొనుక్కుంటాను" అని బ్రతిమాలాడట సన్యాసిరావుని. జాలిపడి, అలాగే ఇచ్చాడు. 

అది మొదలు, తానే అన్నం, కూరలూ వగైరాలు వండించి, ఆస్పత్రికి వచ్చేవాళ్లందరికీ--రోజుకి ఓ ఇరవైమందికి తక్కువగాకుండా "అన్నదానం" మొదలు పెట్టాడు!

ఇప్పుడు ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి, ఒక్కో రోజు ఖర్చు మొత్తం మేము భరిస్తాము అని కొనసాగిస్తున్నారు. యెవరూ చెయ్యనిరోజున తానే నిర్వహిస్తున్నాడు.

ఓ సామాన్యుడైన ఆ వ్యక్తి అలాంటి "బృహత్తర" కార్యక్రమం చేస్తున్నాడంటే.......పుణ్యపురుషుడు అనాలా వద్దా?

ఈ సోకాల్డు "సేవాదారులు" బుధ్ధి తెచ్చుకుంటే బాగుండును.

Monday, January 2

తమిళనాడులో.........


 ........గుళ్లూ, గోపురాలూ

31-12-2011 న వుదయమే చెన్నై నుంచి బయలుదేరి, శ్రీకాళహస్తి వెళ్లాము. ప్రాచీనమైన ఆలయం చాలా బాగుంది.

పాతిక ముఫ్ఫై అడుగుల యెత్తు రాతి స్థంభాలతో మంటపాలు, అద్భుతమైన శిల్పకళా. జనం పెద్దగా లేరు. అయినా ప్రత్యేక దర్శనమైతే త్వరగా అవుతుందని, టిక్కెట్లు తీసుకొన్నాము. దానిక్కూడా పకడ్బందీగా, ముందుకీ, వెనక్కీ వెళుతూ, ఆలయంలోకూడా ఓ ప్రదక్షిణం చేస్తూ, లోహపు బారికేడ్ క్యూలు. అంతా ముగిసి, గర్భాలయం వద్దకు చేరితే, అక్కడో పావుగంటపైగా క్యూల ఆపివేత—అర్చనలూ అవీ చేయించుకొనేవాళ్లకోసం అనుకుంటా. తీరా దేవుడిముందు నిలుచొని, తేరిపార చూద్దామనుకొనేసరికి, “వాంగో, వాంగో—పోయ్యా” పిలుపులూ, హడావిడీ! బయటికి వచ్చే క్యూలో వెనక్కాల యెవరూ లేకపోయినా, వున్న నలుగురినీ “వాంగో, వాంగో”లు—పాపం వాళ్లకి అలవాటయిపోయిందనుకుంటా—యేం చేస్తాం!

ఈశ్వర లింగం ప్రత్యేకంగా వుంది. సినిమాలలోనూ, భక్తకన్నప్ప విగ్రహాం ప్రక్కనా వున్న ఆకారం లో లేదు. పొడుగ్గా ఓ స్థంభం లా వుంది. ఓ ఐదడుగులుంటుంది. దానిమీద మూడు సర్పాకారాలు మనవైపు కనపడే విధంగా నిలువుగా చెక్కబడి వుండి, చిన్న చిన్న పడగలు లింగం కన్నా కొంచెం పైకి కనిపిస్తూ, బార్బ్డ్ వైర్ ఫెన్సింగుకి వాడే స్థంభాలని తలపించింది.

తరువాత అమ్మవారి దర్శనం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక. అక్కడా జనం పెద్దగా లేకపోయినా, క్యూ ఓ చుట్టుతిరిగి, గర్భ గుడి ముందరికి వచ్చేవరకూ హడావిడే. అయ్యాక “వాంగో”లు మామూలే.

ప్రసాదాలు కొనుక్కోవడం, వుచిత ప్రసాదం క్యూలు, డబ్బులిచ్చి, యేనుగుచేత నెత్తిమీద తొండంతో మొట్టించుకొనేవారూ, బయట కళా వస్తువులూ, బొమ్మలూ, పిల్లల ఆటవస్తువుల దుకాణాలూ అన్నీ మామూలే.

తిరిగి వస్తూ వరదయ్యపాళెం లో భోజనం చేసి చక్కావచ్చాము సాయంత్రానికి ఇంటికి.

మొన్న కేరళ ట్రిప్పులో చూడలేకపోయిన మథురా, రమేశ్వరమూ వగైరాలు ఈ సారి చూసి వద్దామనుకున్నా, ఓ రెండు రోజులు థానే సైక్లోను వల్ల ప్రణాళికలు రద్దయ్యాయి. వెళ్లడం పెద్ద పెద్ద ఏసీ కార్లలోనే, ఒళ్లలవకుండా వెళుతున్నాము అనుకుంటూ, వెళ్లడమేగానీ, బడలికా, నడుం, కాళ్ల నొప్పులూ మామూలే. (ఈ కార్ల కంపెనీలవాళ్లు కూడా, కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది అంటూ వినియోగదారులని మోసం చేసి, లక్షలు నొల్లుకుంటున్నారు!). ఈ సారీ అవన్నీ చూడ్డం కుదరలేదు.

మర్నాడు, 01-01-2012 వుదయమే 7-00 బయలుదేరి కంచి ప్రయాణం. కంచి ఇంకా దగ్గిర. “అన్నీ” చూసుకొని, షాపింగులు పూర్తి చేసుకొని, సాయంత్రానికల్లా చెన్నై చేరాలని ప్లాను.

కంచి దేవాలయాల పట్టణం. అనేక, పెద్ద పెద్ద, విశాలమైన, యెత్తైన, ఆలయాలూ, కోనేళ్లూ, ప్రాకారాలతో వుంటాయి. దానికి తోడు, “పట్టు సంఘాల” పరిశ్రమ వల్ల, ఆలయాలన్నీ 12-30 కి మూసేసి, మళ్లీ సాయంత్రం 4-00 కి తెరుస్తారుట. (దుకాణాల వాళ్లకి రోజుకి ఇన్ని అని పాసులు ఇచ్చేస్తారట. వాటిని వాళ్ల దుకాణం లో చీరలూ అవీ యెక్కువ కొన్న వాళ్లకి ఇచ్చేస్తారట దుకాణాలవాళ్లు. మొన్నీ మధ్య, ఆ పాసులు వాళ్లు ఆటోలవాళ్లకీ, బ్రోకర్లకీ అమ్మేసుకుంటున్నారనీ, వాళ్లు తిరిగి “భక్తులకి” రెండేసి, మూడేసి వేలకి అమ్మేసుకుంటున్నారనీ గొడవజరిగి, ఇప్పుడు ఆ పాసులు రద్దు చేశారట!)

ఇంక, మొదటిగా కామాక్షి అమ్మవారిని చూసి, తరవాత విష్ణు కంచీ, భోజనమూ, షాపింగూ, తరవాత శివకంచీ, తరవాత తిరుగు ప్రయాణం అనుకున్నాము.

కామాక్షి అమ్మవారి కోవెల చాలా పెద్దది. నాలుగువైపులా గోపురాలూ, యెత్తైన స్థంభాలతో మంటపాలూ, లోహపు కడ్డీల బారికేడ్ల క్యూ లైన్లూ అన్నీ మామూలే. విశేషం యేమిటంటే, ప్రత్యేక దర్శనాలు లేవు. ఆలయంలోపల గోడలమీద చక్కగా తమిళంలోనూ, హిందీలోనూ స్తోత్రాలు చెక్కారు—పాలరాతి టేబ్లెట్లమీద. అవి చదువుకుంటూ వెళితే టైము తెలియలేదు. క్యూ కదలడం, మళ్లీ ఓ ఇరవై ముఫ్ఫై నిమిషాలు ఆగిపోవడం మామూలే.

ఆంగ్ల సంవత్సరాది కూడా మనకి ఓ పర్వదినమైపోయింది. దానికి తోడు, యెర్ర బట్టలదీక్షాపరులు తండోపతండాలుగా బస్సులలో తరలి రావడం……ఇక చూసుకోండి….ఇసకవేస్తే రాలని జనం! (నల్లబట్టలవాళ్లకి ప్రతిగా ఈ యెర్రబట్టల దీక్షలు ప్రవేశపెట్టారట. వీళ్లు దేశంలోని అన్ని అమ్మవారి ఆలయలూ దర్శిస్తారట ఈ సీజన్లో.)

యెంత తొందరగా అనుకున్నా, మూడు గంటలూ పట్టేసి, మళ్లీ వరదరాజ స్వామి కోవెల చేరేసరికి, “దుకాన్ బంద్!” అక్కడో గంట కూర్చొని, ఫలహారాలు కానిచ్చేసి, బయలుదేరి, షాపింగూ.

ప్రతీ దుకాణం వాడూ—“వూరికే చూడండి, కొనకపోయినా ఫరవాలేదు” అంటూ ఆహ్వనాలూ, "మీకు షార్టులూ, టీ షర్టులూ, మాకు చీరెలూ, పిల్లలకి డ్రెస్సులూ, మనవలూ, మనవరాళ్లకి డ్రెస్సులూ, బొమ్మలూ, పూజా మందిరంలోకీ, దేవుడి గూట్లోకీ, ప్రమిదలూ, దీపం సెమ్మెలూ, అత్తగారికి రుద్రాక్షమాలా, ఓ నెమలి విసెనకర్రా—" ఇలా ఆ లిస్టు పెరిగిపోతూ, మధ్యలో పిల్లలకి ఐస్ క్రీములూ, చాకలెట్లూ, గుడ్డేలూ, డ్రింకులూ…….సా…..గి పోతూ షాపింగు పూర్తయి, శివకంచి అనబడే “ఏకాంబరేశ్వర స్వామి” ఆలయానికి చేరాము.

అదో పెద్ద ప్రహసనం. ఆలయం చాలా బాగుంది. మామూలే. 3-30కల్లా గుడి తలుపులముందు చేరడం ప్రారంభించారు “భక్తులు”. ఈసక వేస్తే రాలని జనం మామూలే. రొజ రొజ రొజగా మాటలూ, చెమటలు కక్కుకుంటూ, నొక్కుకుంటూ, సొక్కుకుంటూ, ఇష్, అష్, అనుకుంటూ “కంచిగరుడసేవ”!  కొంతమంది వుత్తరాది భక్తులు, “జై భోలేనాథ్” అంటూ పాటలూ, సంకీర్తనలూ పాడుతున్నా, జనం గొడవలో అవన్నీ బూడిదలోపోసిన పన్నీరూ, అడవిగాచిన వెన్నెలా అయిపోతున్నాయి.

నిక్కీ, నీలిగీ, 4 దాటాకెప్పుడో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకటే తోపులాట. క్యూలూ, బారికేడ్లూ లేవు. తోసుకున్నవాడికి తోసుకున్నంత మహదేవా! తీరా లోపల కొంతదూరం వెళ్లాక, గుమ్మందగ్గర ఒకడు ప్రత్యక్షం—కండక్టర్లదగ్గరుండె టికెట్ ఇస్యూయింగ్ మెషిన్ ఒకటి చేతిలో పట్టుకొని, "ఇది ప్రత్యేక దర్శనం క్యూ—అందరూ ఐదేసి రూపాయలు చెల్లించి, టిక్కెట్లు తీసుకోవాలి. లేదా, వెనక్కి వెళ్లి, వుచిత దర్శనం క్యూలో చేరండి"—అని గదమాయిస్తున్నాడు. ఈ తోపులాటలు అలవాటులేని జనాలు ఛస్తారా! చచ్చినట్టు ఐదేసిరూపాయలూ సమర్పించుకొన్నారు. (ఆ ప్రక్కనే వున్న బయటికి వెళ్లే దారి నుంచి “ఇన్ ఫ్లుయెన్స్” వున్నవాళ్లని ఈ క్యూలో కలిపేస్తున్నారు ఆలయ సిబ్బంది!)

లోపల మళ్లీ “వాంగో, వాంగో”లు మామూలే. ఇక్కడ మామూలుగా ఓ మూడడుగుల శివలింగం వుంది. క్రిందభాగంలో ఒక చిన్న పంచో, తువ్వాలో చుట్టబెట్టారు (యేకాంబరుడు కదా అనేమో!). బయటికి వచ్చి,  ప్రాంగణం ఓ సారి చూసి, బయటికి వచ్చి, ప్రసాదాలు కొనుగోళ్లూ, పిల్లలకి నైవేద్యాలూ, ముగించుకొని గుడి బయటికి చేరాం.

(ఇక్కడ కూడా, “దుకాణాల” సంగతీ, యేనుగు తొండం మొట్టులూ వగైరాలు మామూలే. యెక్కడా భక్తులకి సూచనలిచ్చే బోర్డులు లేవు. వున్నా, తమిళంలోనే వున్నాయి. ఆలయ ముఖ్య గోపురం బయటే చెప్పులు వదిలితే, తిరిగి వచ్చేసరికి అవన్నీ గుట్టలు పోసేసి వుంటున్నాయి! లోపల మళ్లీ “వుచిత” పాదరక్షల నిలుపు స్థలం వేరే వుంది! బయట, గోపురానికి యెడం ప్రక్కన టాయిలెట్లు వున్నాయి. అవి వుచిత సేవలు. కానీ అక్కడొకడు దౌర్జన్యంగా మనిషికి రెండేసి రూపాయలు వసూలు చేసేస్తున్నాడు. గుడిలో--ఫారినర్స్ కి కూడా, దర్శనం వుచితం, యెవరికీ డబ్బులు ఇవ్వొద్దు—అని బోర్డులు పెట్టారు! మరి టాయిలెట్లకి—అక్కడ అధికారిక బోర్డు, తమిళం లోనైనా యేమీ లేకుండా డబ్బులు దండుకుంటున్నారంటే, సంబంధిత శాఖలవాళ్లు……….???!!!)

కాస్త కాఫీ తాగి, “ఇప్పుడెక్కడికి?” అంటే, మధ్యాహ్నం నుంచీ, "కంచికి వచ్చి బల్లిని ముట్టుకోకుండా వెళ్లడమేమిటీ? యేమైనాసరే తిరిగి వరదరాజ కోవెలకి వెళ్లవలసిందే" అంటూ సణుగుతున్న మా “యేమండీ” (మా మనవడి భాషలో మా ఆవిడ!) “బల్లిని తాకిన గాలినే ముట్టుకుంటున్నాము, చాల్లెండి, బయటనుంచే ఓ దణ్నం పెట్టేసుకొని, ఇంటికి వెళ్లిపోదాము!” అంది.

తిరిగి, సాయంత్రం 8-00 కల్లా క్షేమంగా ఇంటికి చేరాము.

అవండీ మా యాత్రా విశేషాలు.

(ఈ పుణ్యక్షేత్రాల నిర్వహణ గురించీ కొన్ని “ఇమ్ ప్రూవ్ మెంట్స్” విషయంలో నా  సలహాలు మరో టపాలో!)

Monday, November 21

కొలతలూ......3



......మానాలూ

ఇంకా, దమ్మిడీనే 'పైస' అని కూడా అనేవారేమో. యాగాణీ అంటే రెండు పైసలు అనుకుంటా. (ఈ నాణాలు నేను చూడలేదు. యెన్ని గవ్వలైతే ఒక పైసాగా పరిగణించేవారో కూడా నాకు తెలీదు).  

అప్పట్లో, పెద్ద కాణీలు, జార్జి 5 త్ కింగ్-ఎంపరర్ బొమ్మతో వుండేవి. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడే "గేట్ వే ఆఫ్ ఇండియా" ఆయనకి స్వాగతం చెప్పడానికి అప్పటి బొంబాయిలో నిర్మించారు(ట). విశ్వకవి రవీంద్రుడు ఆ సందర్భంగానే, "జనగణమన" వ్రాశాడు అని కొంతమంది వ్రాసిన చరిత్ర!  

రెండో ప్రపంచ యుధ్ధం రోజుల్లో, పొదుపు కోసం చిన్న సైజు కాణీలూ, తరవాత "చిల్లు కాణీలు" ప్రవేశపెట్టారు. అంటే యేమీలేదు--కాణీలో మధ్యభాగాన్ని తొలగించి, అంచుమాత్రమే ముద్రించేవారు. ఆ కాణీలని పిల్లల మొలత్రాళ్లలో కూడా కట్టేవారు--దిష్టి తగలకుండా(ట)! 

తరవాత, జార్జి 6 త్ తో కూడా కాణీలు ఇతర నాణాలూ వచ్చాయి. స్వతంత్రం వచ్చాక, ఆ చిన్న కాణీల మీద  పరుగెడుతున్న గుర్రం బొమ్మ ముద్రించేవారు.

కాణీ పైన వుండే అర్థణా దగ్గరనుంచీ, రూపాయి వరకూ చివర 'కాసు' చేర్చేవారు--అర్థణాకాసు, అణాకాసు......ఇలా. 

ఇంకా, అణాకాసుని 8 వృత్తాకార కోణాలతో, వెనుకవైపు చక్కటి డిజైన్ మధ్య ఇంగ్లీషులో వన్ అణా అనీ, తెలుగులో ఒక అణా అనీ ముద్రించేవారు! ఇవి దేశవ్యాప్తంగా చలమణీలో వుండేవి అని మరిచిపోకండి--అదీ అప్పట్లో తెలుగుకి వున్న గుర్తింపు. 

ఇప్పుడు ఒక రూపాయి, రెండు రూపాయలూ, ఐదు రూపాయలూ నాణాలన్నీ ఒకే సైజులో గుండ్రంగా ముద్రించేబదులు, ఇలా చక్కటి డిజైన్లలో ముద్రిస్తే యెంత బాగుండును? మళ్లీ అలాంటి అందమైన నాణాలని చూడగలమా? దువ్వూరివారేమంటారో! 

ఇంక, అణా కి 12 పైసలు. రూపాయికి 16 అణాలు--అంటే, రూపాయికి 192 పైసలు. 

లెఖ్ఖల్లో, 1000 పైసలని, రూపాయలూ, అణాలూ, పైసలూ లోకి మార్చమనీ--ఇలా మా ప్రాణాలు తీసేవారు! (మీరెవరైనా చెయ్యగలరేమో ప్రయత్నించండి!)

(బ్రిటిష్ వాళ్ల పౌండ్ కి 20 షిల్లింగులు, ఒక్కో షిల్లింగుకి 12 ఓ 16 ఓ పెన్నీలు వుండేవి. ఆ లెఖ్ఖలు కూడా మమ్మల్ని చంపేవి! తరవాత వాళ్లు కూడా పౌండ్ కి 100 పెన్నీలుగా మార్చుకున్నారు--ఇంటర్నేషనల్ కరెన్సీగా మారాక)

ఇంకో చిత్రమేమిటంటే, నిజాం పాలనలోనేకాదు....మనకి స్వతంత్రం వచ్చాకా, నిజాం రాష్ట్రం మన దేశంలో విలీనం చెయ్యబడ్డాక కూడా, "తెలంగాణా వంద" చాలకాలం చెలామణీలో వుండేది. అంటే వంద వస్తువులు అంటే వాళ్ల లెఖ్ఖ 192!

(మా పెద్ద దొడ్డ, పెళ్లికాగానే భర్తతో నిజాం పాలనా కాలంలోనే హైదరాబాదు వెళ్లిపోవడంతో పక్కా తెలంగాణా భాషా, యాసా, కట్టూ బొట్టూ, ఆచారాలు వచ్చేశాయి ఆవిడకి. ఆవిడ, మనకి ఆవకాయలకోసం మామిడికాయలు 'మన వంద' 3 రూపాయలకి ఇస్తున్నారంటే, "మాకూ మూడు రూపాయలే--కానీ, తెలంగాణా వంద! ముక్కలు కొట్టి కూడా ఇస్తారు!" అని మా అమ్మని వుడికించేది! తనకి పిల్లలు చిన్నగా వున్నప్పుడే భర్తృవియోగం కలగడంతో, ఆవిడే మార్కెట్ కి వెళుతూండేది. తేడా అల్లా ఆవిడ చెప్పులు వేసుకొనేది కాదు. దాంతో మార్కెట్లో అందరూ "ఆంధ్రావాలీ" అని గుసగుసలు పోయేవారట. పిల్లలైతే, గేలి చేస్తున్నట్టుగా చిత్రంగా చూస్తూ వెనుకబడేవారట! అలా అని ఆవిడని యెవరూ అవమానించడమో, వివక్ష చూపడమో జరిగేది కాదట! ఇప్పటి "ప్రత్యేక తెలంగాణా వాదులకి" ఈ విషయాలు తెలుసోలేదో మరి)

యెక్కడో ములిగి యెక్కడో తేలాం అనుకుంటా. 

కరెన్సీ, నాణాలూ గురించి ఈ మాత్రం చాలనుకుంటా.

.....కొనసాగింపు మరో టపాలో

కొలతలూ......2



......మానాలూ

మనదేశంలో 20వ శతాబ్దం మొదట్లో కూడా, గవ్వలకి కూడా (చిల్లి గవ్వలకీ, గుడ్డి గవ్వలకీ కూడా!) విలువ వుండేది!

ఢిల్లీ పరిపాలకుడు షేర్షా సూరీ అనుకుంటా--దేశం మొత్తమ్మీద "నాణాలని" ప్రవేశపెట్టాడు. 

సముద్ర గుప్తుడూ వగైరాలు అప్పట్లో బంగారునాణాలు చలామణీలోకి తెచ్చారు.

బ్రిటీష్ వాళ్లు ద్రవ్యం "లీగల్ టెండర్" ప్రవేశపెట్టి, నాణాలూ, నోట్లూ ముద్రించేవారు (అంతకు ముందు నోట్లు లేవు--ఒక్క తుగ్లక్ విడుదలచేసిన 'తోలు' నోట్లు తప్ప!).

మా చిన్నప్పుడు "విచ్చు రూపాయి" అని ఖచ్చితంగా ఒక్క తులం వెండితో ఒక రూపాయి నాణాలు వుండేవి. ఒక సారి మా వైజయంతీ హాలులో నేను సినిమా టిక్కెట్లు తీసుకొన్నప్పుడు చిల్లర తిరిగి ఇస్తూ, ఓ వెండి రూపాయిని కూడా మామూలు వాటితో ఇచ్చేశాడు. (అది ఇప్పటికీ మా అమ్మగారు తన డబ్బుల పెట్లో జాగ్రత్త చేశారు!)

మహమ్మదీయ రాజులు ప్రవేశపెట్టిన నాణాల్లో అతి చిన్నది "దమడీ" (దమ్మిడీ) అనుకుంటా. తరవాత కాణీ, యాగాణీ--ఇలా వుండేవనుకుంటా నాణాలు. (దమ్మిడీ ముండకి యాగాణీ క్షవరమా? అనే సామెత అప్పుడు పుట్టింది--ఇప్పటికీ వాడుకలో వుంది!)

నా చిన్నప్పటి నాణాలూ, నోట్లూ విషయానికొస్తే.......

ద్రవ్యానికి (డబ్బుకి) మానం :

2 కాణీలు = ఒక అర్థ అణా
2 అర్థణాలు = ఒక అణా
2 అణాలు = ఒక బేడ
2 బేడలు = ఒక పావలా
2 పావలాలు = ఒక అర్థ రూపాయి
2 అర్థరూపాయలు = ఒక రూపాయి

ఒకరూపాయి నాణాలూ, నోట్లూ కూడా వుండేవి. తరవాత రెండూ, ఐదూ, పదీ, వందా, వెయ్యీ--మాత్రమే నోట్లు వుండేవి. పాత సినిమాల్లో ఇవన్నీ చూడొచ్చు.....వినొచ్చు!  

.....కొనసాగింపు మరో టపాలో

Sunday, November 20

కొలతలూ......


(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని
"మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.)

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు!

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు = ఒక గిద్ద
2 గిద్దలు = ఒక అరసోల
2 అరసోలలు = ఒక సోల
2 సోలలు = ఒక తవ్వ
2 తవ్వలు = ఒక శేరు
2 శేర్లు = ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు = ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు = ఒక కుంచం
24 కుంచాలు = ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు = ఒక గజము
220 గజములు = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....

http://krishnasree.blogspot.com/2008/11/4-2-1-2-1-2-2-1-2-1-2-1-2-1-8-1-20-1.html

లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

కొనసాగింపు.....


మానాల గురించి

(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని "మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.) 

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు! 

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు=ఒక గిద్ద
2 గిద్దలు=ఒక అరసోల
2 అరసోలలు=ఒక సోల
2 సోలలు=ఒక తవ్వ
2 తవ్వలు=ఒక శేరు
2 శేర్లు=ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు=ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు=ఒక కుంచం
24 కుంచాలు=ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు         = ఒక గజము
220 గజములు     = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు        = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....


లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

Wednesday, November 16

బాలల.......



......చదువులు

బాలల దినోత్సవం రోజున--14-11-2011 న--ఈనాడులో శ్రీధర్ కార్టూన్....కాస్త నవ్వు పుట్టించినా, కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి. అందులో....

ఓ పిల్లాడు ప్రథానిని "అప్పుడు పేదవాళ్లకు లాంతర్లూ, కిరోసిన్, పుస్తకాలూ, చదువూ....అందుబాటులో వుండేవా సార్?" అని అమాయకంగా, దీనంగా, హాచ్చెర్రెంగా అడుగుతున్నాడు!

నిజంగా, తన తలపాగాని అలాగే వూడదీసి, ఆ చిప్పలో నీళ్లు నింపుకొని, అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించాలాయనకీ.....అది చూస్తే.

"మీరలా అనడాన్‌కి గుట్కా లేదు....రూల్స్ వొప్పుకోవు.....మన అధిష్టానమ్మ పెర్మిషన్ లేకుండా అలాంటి నిర్ణయాలు దీసుకోరాదు. కోర్ కమిటీలో చర్చించాక, మీకు ఆదేశాలిస్తాం...అంతవరకూ, తలపాగా తగిలించేస్కొని, వెయిట్ చెయ్యండ్రి" అని కి కు రె అన్నట్టు ఆయనకి వినిపించిందేమో! ఆయన ఆ పని చెయ్యడానికి ప్రయత్నించలేదు. 

నా అయిదో యేట, విజయదశమినాడు, మా నాన్నగారి ఆధ్యాత్మిక గురువు చల్లా కృష్ణమూర్తి శాస్త్రి (ఆయనపేరే నాకు పెట్టారు.) చేత నా అక్షరాభ్యాసం మొదలై, అదేరోజు, జీడీఎం (గోదావరి డెల్టా మిషన్) ఎలిమెంటరీ స్కూలుకి (పసుపుగోచీ అలాగే వుంచుకొని, దానిమీద నిక్కరు చొక్కా వేసుకొని, చంకలో పలకతో, అప్పటికే ఆ స్కూల్లో చదువుతున్న మా అన్నయ్య స్నేహితులతో, పరుగు పరుగున స్కూలుకి వెళ్లడం నా కళ్లకి కట్టినట్టు కనిపిస్తూంది....ఇప్పటికీ!) వెళ్లి, ఒకటో తరగతిలో, పిల్లలందరికీ పప్పు బెల్లాలూ, కణికలూ, ఐదారుమందికి పలకలూ, సీనియర్ విద్యార్థులకి యెక్కాల పుస్తకాలూ పంపిణీ పూర్తయ్యాక, మరియా టీచర్ నా పలక మీద "అ, ఆ" అని వ్రాసిచ్చి దిద్దుకోమని చెప్పడం, వెనుక ఖాళీగావున్న ఓ "నేలబల్ల" మీద కూర్చొని, నేను దిద్దడం మొదలెట్టడం...పావుగంటైనా నేను దిద్దుతూనే వుండడం...ప్రక్కనున్నవాడు 'తీసుకెళ్లి టీచరుకి చూపించు' అనడం, నేను (అప్పటికే ఆవిడ చుట్టు మూగి వున్న పిల్లల్లో కాస్త చోటుచెసుకొని) పట్టుకెళ్లి  చూపించడం, ఆవిడ అవి చెరిపేసి, మళ్లీ "అ, ఆ" లు వ్రాసిచ్చి దిద్దమనడం.....నా మూడో యేటనే అ ఆలు నేర్చేసుకొని వుండటంతో ఆ "చదువు"ని ఎంజాయ్ చెయ్యడం.....! ఇవన్నీ ఇప్పటికీ "డేజావూ" నాకు!

.......మరోసారి.

Monday, August 15

ఆర్య వైద్యశాల, కొట్టక్కళ్



ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యశాల

కేరళలోని తిరువనంతపురంలో వుంది ఈ వైద్య శాల. కొన్ని తరాలుగా తమ కుటుంబంలో వస్తున్న ఆయుర్వేద విద్యతో, వైద్య రత్నం పీ ఎస్ వరియర్ అనే ఆయన మొదటిసారిగా యేర్పాటు చేశాడు ఈ వైద్య శాలని. అప్పటినుంచీ ఈ వైద్య విధానాన్ని కొనసాగిస్తూ, పరిశోధనలతో ఇంకా అభివృధ్ధి చేస్తూ, మన భారతీయ వైద్యానికి ప్రాచుర్యం కల్పించడమే కాదు, తక్కువ ఖర్చుతో అనేక మొండి రోగాలని సైతం నయం చేస్తూ, ప్రపంచదేశాలలోని ప్రజలని ఆకర్షిస్తోంది ఈ వైద్య శాల. ఇప్పటి ముఖ్య వైద్యుడు పీ కే వరియర్ కి భారత ప్రభుత్వం "పద్మ విభూషణ్" ఇచ్చి గౌరవించింది.

వారికి కేరళలోనే, అలువ (అల్వేయి), కొచ్చి (కొచ్చిన్) లలోనే కాకుండా, బెంగుళూరు, ఢిల్లీల్లో కూడా శాఖలు వున్నాయి.

లాభార్జన ధ్యేయం కాకుండా, ప్రజా సేవ ముఖ్యంగా కొనసాగుతున్న ఈ వైద్యశాలలు ఇంకా అభివృధ్ధిలోకి రావాలి అని కోరుకుందాం.

Thursday, August 11

స్టాప్ గేప్



.....యేమయిపోయారో???

నాటపాల్లో చాలా గేప్ వచ్చింది--యెందుకు అనుకుంటున్నారా?

జూన్ 11న బయల్దేరి, బెంగుళూరు వెళ్లాము. అక్కడనించే మా నాలుగో హనీమూన్, మేము చక్కగా చేసిన హనీమూన్, ప్రారంభం అయ్యింది!

రెండునెలలు దక్షిణ భారత దేశమంతా తిరిగి, ఓ పెద్ద ఘన కార్యం సాధించి, తిరిగి మొన్న 4న తిరిగి వచ్చాము. ఓ వారం రోజులు ఇంటా బయటా వ్యవహారాలు చక్కబెట్టి, ఇప్పుడు మళ్లీ నా టపాలు మొదలు!

యేమంటారు? మూడు తరవాతే నాలుగు అంటారా? వోకే! అవీ, ఇవీ అన్నీ--సరేనా?







Monday, July 11

మా మూడో హనీమూన్ అనే.......-16

మొన్నటి మా యాత్ర

సినిమా అయి బయటికి వచ్చాక, ఇంక మ్యూజియంలో "క్లైమాక్స్"! 
 
"మొత్తం మ్యూజియానికీ, గుడికీ, ఢిల్లీకీ, దేశానికీ, ప్రపంచానికీ 'హై లైట్'; అది చూడని వాళ్ల జన్మ వ్యర్థం: మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి కదండీ?" ఇలాంటి కామెంట్లు అనేకం పొందిన "నదీ యాత్ర". 
 
అంటే, ఓ పది పదిహేను మంది పట్టే బోటులో కూర్చోపెట్టి, దానిని అండర్ గ్రవుండ్లో వున్న ఓ నదిలాంటి ప్రవాహంలోకి, పెద్ద చైన్లూ, పళ్ల చక్రాలూ సాయంతో, పంపిస్తారు. అక్కడ, 'సబ్ డ్యూడ్' లైటింగులో, ఈ ప్రక్కా, ఆ ప్రక్కా లైఫ్ సైజు బొమ్మలతో, వాటిమీద స్పాట్ లైట్లతో ప్రదర్శన కొనసాగుతుంది. స్పీకరులో, అది సరయూ నదిలోనో, గంగా నదిలోనో, మన జీవన వాహినిలోనో జరుగుతున్న యాత్ర అంటూ, ఒక్కొక్క దృశ్యాన్నీ, అందులోని వాళ్ల పేర్లనీ, చరిత్ర (ఇతిహాసం) నీ చెపుతూ, వూరేగిస్తారు మనని. 
 
రామాయణ భారతాలదగ్గరనుంచీ, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడూ, శుశ్రుతుడూ దగ్గరనుంచి, అక్బరూ, షాజహాన్ల నుంచి, ఝాన్సీ లక్ష్మీ, శివాజీ, ఇతర రాజులూ, స్వతంత్ర పోరాటం నుంచి, అన్నీ చూపించి, చివరగా, ఇదంతా ఆ "స్వామినారాయణుడి" చలువ--అనే సందేశంతో ముగుస్తుంది ఆ యాత్ర. బోట్లు పైకి వచ్చి, మనం బయటికి! 
 
హమ్మయ్య! మ్యూజియం అయిపోయింది. 
 
కొంచెం గాలి పీల్చుకొంటూ, కారిడార్లలో నడుస్తూ, అసలు "గుడి" ని చేరతాం. 
 
గుడి చుట్టూ అనేకవందలమంది జనాలు--యెవరి వ్యాసంగంలో వాళ్లు. ఓ ప్రక్క అభివృధ్ధిలో భాగంగా, పాడయిపోయిన "టైల్స్" స్థానంలో క్రొత్తవి వేస్తూ, కొన్నిచోట్ల సిమెంటూ, కాంక్రీటు తో ఇంకేవో కడుతూ, పనివాళ్లు. చెప్పులు వదిలే స్టాండ్లలో రద్దీ. 
 
మేము మా చెప్పులని, కొంతమందిలాగ, ఓ ప్రక్కన పెట్టి, ఇంతకుముందే గుడి చూసేసిన మా ఢిల్లీ బావగారిని వాటికి కాపలా పెట్టి, ఇదివరకు "బిర్లా" టెంపుళ్లూ, "ఇస్కాన్" టెంపుళ్ల మెట్లెక్కినప్పటి అనుభూతులని తలుచుకొంటూ, అనేక మెట్లెక్కి, మధ్యలో ఆగుతూ, ఆయాసపడుతూ, చివరికి గుడి లోకి చేరాం. 
 
అక్కడ, క్రమ అష్టభుజకారంలో అనుకుంటా, ఓ నిర్మాణం. అందులో ఓ నలభై అడుగులో యెంతో యెత్తున్న "స్వామి నారాయణుడి" విగ్రహం. విగ్రహమంతా అనేక విలువైన రాళ్లతో అలంకరించబడి వుంది. నాకు విగ్రహంలో వివేకానందుడి చాయలు కనిపించాయి--లేదంటే, ఓ మహారాజు గెటప్ లో!. 
 
ఆ ఆష్ట భుజాలకీ మళ్లీ ఎక్స్టెన్షన్లు! వాటిలో అనేక మతాల శైలులూ, సీలింగుతో సహా అనేక "నీల కంఠ చరిత్ర" దృశ్యాలూ, అంతా బంగారం, వెండీ, విలువైనవనిపించే రాళ్లూ--అదీ ఆయన వైభోగం! (ఆ "దేవుడికి" భక్తిగా దణ్నం పెట్టినవాడెవడూ కనపళ్లేదు--నోరు తెరుచుకొని అద్భుతాలని చూస్తున్నవాళ్లు తప్పితే!) 
 
ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి లేదు. తాజ్ మహల్ దగ్గరలోలా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఫోటోగ్రాఫర్లు లేరు! ఆ గుడివాళ్లు అమ్మే ఫోటోలూ అవీ మాత్రమే 'కొనుక్కోవాలి!' వాటిల్లో మనం వుండం కదా! 
 
ఆ వందల యెకరాల నిర్మాణంలో మా ఆడవాళ్లకి నచ్చింది యేమిటంటే--ఆ గుడిచుట్టూ వున్న ఆవరణని, కొన్ని వందలమంది మధ్యలోనుంచి, చాకచక్యంగా నడుపుకుంటూ, వెనుక తిరుగుతున్న "బ్రష్"లతో, డిటర్జెంటూ, నీళ్లూ కలిపిన నీళ్లతో, నేలని శుభ్రం చేస్తూ పోతున్న చిన్న చిన్న రోలర్ల లాంటి మెషీన్లు! ఇలాంటివి మనక్కూడా వుంటే, ఇల్లు వొత్తుకోడం బాధ తప్పేదికదా? అంటూ నిట్టూర్చారు వాళ్లు! 
 
మళ్లీ బయటికి వెళ్లే దారిలోంచి బయలుదేరిన చోటికి వచ్చేసరికి అక్కడ--బయటే వుండిపోయిన మా కాకినాడ బావగారి దర్శనం, పరామర్శలూ!      

.......తరువాయి మరోసారి.

Saturday, July 2

మా మూడో హనీమూన్ అనే.......-15


మొన్నటి మా యాత్ర

ఇంక ఆ సినిమాలో విషయం యేమిటంటే........సరిగ్గానే వూహించారు.....స్వామినారాయణ్ గా మారిన నీలకంఠ అనేవాడి కథే! (నీలకంఠుడంటే తెలుసుకదా? శివుడు).

ఆ కుర్రాడు సరయూ నదీతీరంలో ఓ పల్లెలో జన్మించాడట. చిన్నప్పుడే చేపలు పట్టుకొనేవాళ్లని తిట్టీ, తుఫానులు ఆపీ, ఇంకా యేవేవో చేశాడు. యెనిమిదేళ్ల వయసులో ఓ రాత్రి, ఓ నిశ్చయానికి వచ్చి, అర్థరాత్రి వర్షం కురుస్తూ వుండగా పొంగి ప్రవహిస్తున్న సరయూనదిలో దూకేశాడు--తన అన్వేషణ కొనసాగించడానికి వీలుగా. (శంకరాచార్యులు తన యేడవ యేటనే సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించి, తల్లి వొప్పుకోకపోవడంతో వూరుకుని, ఒకరోజు కాలడిలో ఓ నదిలో తనకాలు మొసలి పట్టుకుంటే, 'అమ్మా! యెలాగా చనిపోయేలా వున్నాను. నాకు సన్యాసానికి అనుమతి ఇవ్వవూ?' అనివేడుకొంటే, ఆవిడ ఇచ్చేసిందనీ, చిత్రంగా మొసలి వెళ్లిపోయి, ఆయన అప్పుడే సన్యసించాడనీ విన్నారా?) అక్కడినుంచీ ఆయన ప్రయాణం, దారిలో జరిగిన బోళ్లు అద్భుతాలూ........(నాకు గుర్తున్నంతవరకూ కొన్ని)

ఒక వూళ్లో అదేదో ప్రసిధ్ధ దేవాలయం, ఓ మఠం వుంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఇళ్లలో జొరబడి, తలుపులు మూసేసుకుంటారు. కారణం--ఓ భయంకరమైన సిం హం ఆ వూల్ళొకి వచ్చి, కనిపించినవాళ్లని చంపి తినేస్తూంటుంది. నీలకంఠ సాయంత్రంపూట ఆ వూరు చేరి, గుడిముందర ఓ చెట్టు చుట్టూ వున్న చపటామీద కూర్చొని, తపస్సులో ములిగిపోదామనుకుంటాడు. వూరి జనమందరూ, చివరికి ఆ మఠం ప్రథాన్ కూడా అతణ్ని హెచ్చరిస్తారు, బ్రతిమాలుతారు--అయినా వినడు. కాసేపటికి సిం హం రానే వస్తుంది! దానితో వాడు, "నాలో నీమీద ప్రేమ మాత్రమే వుంది! నీక్కూడా నామీద ప్రేమ మాత్రమే వుండాలి" అనడంతో అది తోకముడిచి, అతన్ని నాకుతూ కుక్కలా పడి వుంటుంది తెల్లవార్లూ. ప్రొద్దున్న చూసిన జనాలకి.....అద్భుతం!

హిమాలయ పర్వతాల్లో వున్న ఓ వూళ్లో, మంచు పడడం ప్రారంభమయ్యే సమయానికి, అక్కడి గుళ్లనీ, మఠాలనీ, ఆశ్రమాలనీ, జనావాసాలనీ ఖాళీ చేసి, కొండల క్రిందరికి వెళ్లిపోతూంటారు అందరూ. అందరూ అలా క్రిందికి దిగిపోతూ వుండగా, పైన ఓ మహంతుడు వుంటాడు....నీలకంఠ పైకె యెక్కి వస్తూండడం చూస్తాడు. వెంటనే అందరినీ తోసుకొంటూ క్రిందకి వచ్చేసి, 'బాబూ! అందరూ క్రిందికి వెళ్లిపోతున్నారు. నీవేమిటి పైకి వస్తున్నావు?' అనడుగుతాడు. వాడు 'నేను పైకే వెళతాను.' అంటాడు. "అహా! యేమినాభాగ్యమూ! నీవేనా నా తండ్రీ! యెప్పటినించో నీకోసం యెదురు చూస్తున్నాను! ఆ మహానుభావుడివి నీవేనన్నమాట! ఇంకెవ్వరూ వూరు వదిలి పోవలసిన పని లేదు. స్వామి వచ్చేశాడు!" అని ప్రకటించేస్తాడు. అందరూ సుఖంగా అక్కడే వుండిపోతారు. (ఇంక మంచు పడనే పడదు! మరి గంగా, సింధు, బ్రహ్మపుత్ర లాంటి జీవనదుల గతి ఆ సంవత్సరం యేమయ్యిందో?!)

అంతలాగ అన్ని ఆశ్రమాలలోనూ, మఠాలలోనూ సాక్షాన్నారాయణ స్వరూపుడిగా పరిగణించబడ్డవాడు, రామానుజుల ఆశ్రమానికి వచ్చి, ఆయన యెక్కడో పర్యటనలో వుంటే, ఆశ్రమాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ వుంటాడు. రామానుజులు తిరిగి రాగానే, ఆయన ఇంకా సముద్రంలోనో, నదిలోనో వుండగానే తెలిసేసుకొని, "నీలకంఠా! ఇప్పటికి వచ్చావా! ఇంక ఈ ఆశ్రమం నీదే. అన్ని బాధ్యతలూ నీవే!" అంటూ.....ప్రాణాలు విడుస్తాడు (అనుకొంటా!)

మధ్యలోనో, చివర్లోనో, వాడు యువకుడై, ఓ రాజుగారి దర్బారుకి వెళితే, అక్కడ ఆ రాజుగారు తన వారసుడిగా వీణ్ని ప్రకటించో యేదో.......మొత్తానికి రత్న ఖచిత; వజ్ర వైడూర్య భూషిత; స్వర్ణ సిం హాసనారూఢుడై, "ఆయనే స్వామి నారాయణుడు!" అనిపించుకొంటాడు.

నా దృష్టిలో ఈ సినిమా "హైలైట్" యేమిటంటే, "ఎగ్ జాక్ట్ గా" శంకరాచార్యుడిలాగానే, నీలకంఠ కూడా--సరయూనదీ తీరం నుంచి బయలుదేరి, అరేబియా సముద్రం నుంచీ, హిందూకుష్ పర్వతాలూ, టిబ్బెట్, నేపాల్, బెంగాల్ మీదుగా కన్యాకుమారి వరకూ చేరి, మళ్లీ బయలుదేరిన చోటుకే రావడం--ఆయన "అడుగుజాడల" రూపంలో ఆ మార్గాన్ని స్క్రీన్ మీద చూపించడం!

నాకు అర్థమైనది, శంకరుడు శైవుడు! ఆయనకి ప్రతిగా స్వామి నారాయణుడు! దానికోసం ఇంత "కల్ట్ బిల్డింగ్!". అదీ.

మన సోకాల్డ్ "సర్వసత్తాక గణతంత్ర, స్వతంత్ర, 'సర్వమతసమభావనా', 'సర్వసౌభ్రాతృత్వ ' ప్రజాస్వామ్య భారత దేశంలో ఇవన్నీ అవసరమా??!!    

.......తరువాయి మరోసారి.

ప్లాస్టిక్ (సంచుల) నిషేధం


ఆంధ్రలో అత్యుత్సాహం

ఆంధ్రదేశంలో ఇవాళ (01-07-2011) నుంచీ  అమల్లోకి వచ్చిందట--40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ సంచులపై నిషేధం! (ఇప్పటికే 20 మైక్రాన్లపై విజయం ఇరగదీశారట! తరవాత 70 మైక్రానులలోపు పై నిషేదమట!). మళ్లీ దండుకోడాలు మొదలన్నమాట. 
 
ఇంక పత్రికలవాళ్లు చెప్పిన కారణాలే చెపుతూ, సమస్యా పరిష్కారాలు సూచిస్తూ, పండగ చేసుకొంటున్నారు. వాళ్ల రాతల ప్రకారం, ప్లాస్టిక్ నిషేధంలో చెన్నై మొదటి స్థానం లో వుందట. రెండో స్థానం బెంగుళూరుదట. అసలు వీళ్లకీ సమాచారం యెవరిస్తారో? 
 
గత సంవత్సరం ఇవేరోజుల్లో నేను చెన్నైలో ఓ వారం పదిరోజులు వున్నాను. అక్కడ మెయిన్ రోడ్లతో సహా పెద్ద హోటళ్ల దగ్గరనుంచీ, పళ్ల దుకాణాల దగ్గరనించీ, బజ్జీ బళ్లవరకూ అందరూ ప్లాస్టిక్ కవర్లలోనే విక్రయిస్తున్నారు! ఈ యేడాదిలోనే నిషేధంలో ప్రథమ స్థానానికి వెళ్లిపోయింది అని నేను అనుకోను. 
 
బెంగుళూరులో కూడా అదే పరిస్థితి. అది రెండో స్థానంలో యెలా వుందో మరి! బెంగుళూరులో మాత్రం, ఆ సంచులు తయారుచేసేవాళ్లమీద మాత్రమే కేసులు పెడుతున్నారు అనీ, వినియోగదారుల మీద పెట్టడం లేదు అనీ అంటున్నాయి పత్రికలు. అదేమయినా కొంత నిజమేమో. 
 
ఇంక మొన్నటి మా మూడో హనీమూన్ లో భాగంగా, ఢిల్లీ, హర్యాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్ లలో అనేకచోట్ల పర్యటించాము. అన్నిచోట్లా యధేచ్చగా సంచుల వినియోగం జరుగుతూంది. ప్రసిధ్ధ పర్యాటక స్థాలాల్లో సైతం, పర్యావరణం పేరుతో తలతిక్క విధానాలు అవలంబించడం తప్ప, ప్లాస్టిక్ నిషేధం లేదు. యెక్కడా 'రీసైకిలు కోసం చెత్తబుట్టలు ' అంటూ కనపడలేదు. 
 
బెంగుళూరులో మాత్రం, యెంపికచేసిన కొన్ని యేరియాల్లో, మహానగరపాలికె పారిశుధ్య పనివాళ్లు పోగుపడిన చెత్తని--కాయితాలు వేరుగా, అట్టపెట్టెలు వేరుగా, లోహపు మూతలూ, వస్తువులూ వేరుగా, ప్లాస్టిక్ కవర్లూ, పాలపేకెట్లూ వేరుగా, ప్లాస్టిక్ సీసాలు వేరుగా, గాజు సీసాలు వేరుగా--ఇలా తమ చేతులతో బస్తాల్లో నింపి మోసుకెళ్లడం చూశాను. తరువాత అవి యేమి చేస్తున్నారో. 
 
ఇంక మా నరసాపురం లాంటి చిన్న వూళ్లలో, మునిసిపాలిటీ వుద్యోగులు మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తారు--నిషేధం అమలుకోసం జనాలని ఇరగదీస్తూ. 
 
ఇప్పటికి మాత్రం, కమీషనరుగారి ఇంటి చుట్టుప్రక్కలా, ప్రభుత్వాధికారుల ఇళ్ల చుట్టు, రోజుకి మూడు నాలుగుసార్లు చెత్త యెత్తీ, ఇళ్లనుంచి సేకరించీ, ట్రాక్టరు తొట్లలో నింపి, తిన్నగా డంపింగ్ యార్డులో దిమ్మరించి వస్తున్నారు. ఆ సోకాల్డ్ యార్డులు నిండిపోయి, చెత్త ఓ పర్వతం అంత యెత్తు అయిపోయాక, కొత్త డంపింగ్ యార్డు కోసం భూసేకరణ చేస్తున్నారు. (వీటిల్లో కూడా కుంభకోణాలు మామూలే!). మరి ఆ మాత్రానికి 20 మైక్రానులైతే యేమిటి; వెయ్యి మైక్రానులైతే యేమిటి? సామాన్య జనాలని వేధించడం తప్ప! 
 
ఇంకో గమనార్హమైన విషయం యేమిటంటే, ఇదివరకు "మానుష వ్యర్థాలని" సేకరించే పని చేసే కులం వాళ్లే ఇప్పుడు కూడా పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. ఇంకా "సెప్టి క్లీన్"లు నిర్వహిస్తున్నవాళ్లు కూడా వాళ్లే! మరి ఆ కులంవాళ్లని యేమి వుధ్ధరించినట్టు? 
 
ఇప్పటికైనా ప్రభుత్వాలు వూరికే మీడియాలో ప్రచారం కోసం కాకుండా, చిత్తశుధ్ధి తో "సరైన చర్యలు" తీసుకొంటే మంచిది. 
 
ప్రజలందరూ సంతోషిస్తారు.   

Sunday, June 26

మా మూడో హనీమూన్ అనే.......-14




మొన్నటి మా యాత్ర



......తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*.



*పురాతన కాలం నుంచీ, మన ఆచారాల ప్రకారం, సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, అనుష్టానాలన్నీ కానిచ్చుకొని, "ఖాళీ కడుపుతో" (ఇంకా అరగడం మొదలెట్టని, సగం అరిగిన, ఇంకా అరుగుతున్న, పూర్తిగా అరిగిన--పదార్థాలేవీ కడుపులో లేకుండా); యూరినరీ బ్లాడర్ కూడా ఖాళీగా, (అందుకే పుష్కరిణిలో స్నానం చెయ్యమనేవారు. అక్కడ బ్లాడర్ ఖాళీ అయిపోతుంది యెవరికైనా! ఆ నీళ్లు నిరంతరం పుష్కరిణిలోంచి బయటికి వెళ్లిపోయి, కొత్తనీళ్లు పైనుంచి నిండే యేర్పాట్లు వుండేవి. ఇప్పుడా యేర్పాట్లు మృగ్యమై, ఆ "పవిత్ర" పుష్కరిణిల్లోనే మునిగి, చర్మ, ఇతర రోగాలు తెచ్చుకుంటున్నారు!) దైవదర్శనానికి వెళ్లేవారు. సూర్యోదయం అయ్యేటప్పటికి దర్శనం ముగించుకొని బయటికి వచ్చేవారు. ఇప్పుడు మన సినిమాలూ, మీడియా పుణ్యమా అని, భక్తి వెర్రితలలు వేసి, "గుళ్లోకి వెళ్లడం" పుట్టిన రోజు, పెళ్లిరోజుల్లాంటి యేదో ఒక సందర్భమో, లేదా, ఒక దేవుడికి ప్రత్యేకించిన వారం కాబట్టి ఆ దేవుడి గుడికి వెళ్లడమో, ఓ "రిచువల్" గా కొనసాగిస్తూ, పొద్దున ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి, టిఫిన్లూ గట్రా లాగించి, గెస్టులనీ, వేడుకలనీ ముగించి, (దాంతోటే ముఖం కడుక్కునేవాళ్లు ఓ పెగ్గు బిగించి), తీరుబడిగా నిక్కీ, నీలిగీ, డ్రైవరు వచ్చాక (వాడు అంతకు ముందే వాడి ఇష్టదైవం గుళ్లోకి వెళ్లి, ముఖాన బొట్టూ, చెవిలో పువ్వూ వగైరాలతో వచ్చేసి వుంటాడు) అప్పుడు బయలుదేరుతారు. అప్పటికే స్వామికి భోగం అయిపోయి, భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చేసినా, దర్శనమూ, మిగిలిన "ప్రసాద వినియోగమూ" జరుగుతూనే వుంటుంది మధ్యాహ్నం 3-00 అయినా! అలాగే ఈ స్వామి నరాయణ్ గుడివద్దా, పాపం దూరం నుంచీ వస్తారుకదా--క్యూ లైన్ల చుట్టూ వున్న అనేక రెస్టారెంట్లూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ, బేకరీలూ, ఇతర షాపులూ పూర్తి రద్దీగా వుండి, గబగబా తినేసి, అప్పుడు క్యూలలో చేరుతున్నారు! (లోపల అనుమతించబడవుకదా? ఓ నాలుగైదు గంటలపాటైనా 'గ్రైండరు ' ఆడకుండా వుండడమే!? అమ్మో!



ఇక, మ్యూజియం లోకి అంటే మొదటగా వున్న ఓ చిన్న గదిలోకి వెళతాము. అర్థ చంద్రాకారంలో బెంచీలు (ఓ 50 మంది కూర్చోడానికి సరిపోతాయి) వేసివున్నాయి. గది చీకటిగా వుంటుంది. అందులో, 10,000 వాట్ పీ ఎం పీ వో స్పీకర్లూ, యెక్కడినుంచో స్పాట్ లైట్ పడే యేర్పాటూ, మధ్యలో ఓ 'పెద్ద ' మనిషి, ఓ 'పెద్ద ' రాతిని చెక్కడానికి ప్రయత్నిస్తూ వున్న శిల్పం, వెనక "బ్రహ్మ ప్రతీ మనిషినీ ఇలా చెక్కుతాడు....." లాంటి యేదేదో వ్యాఖ్యానం, "వాడే స్వామి నారాయణుడు" అంటూ ఓ పది నిమిషాల్లో ముగింపూ, అక్కడ లైట్లు వేసేసి, అందరినీ ఇంకో ప్రక్క గదిలోకి తోలడం!

ఆ రెండో గదిలో, ఓ అరణ్యం, నదీ సెట్టింగూ, సహజత్వం వుట్టిపడే ఆవులూ దూడలూ, ఓ ప్రక్క నీలకంఠ అనేవాడి ఇంటి సెట్టూ, వాళ్ల అమ్మా నాన్నానో, పెంచినవాళ్లో--వాళ్ల బొమ్మలూ, ఇంకో మూల, ఓ ఆశ్రమంలో ఋషులకి ఙ్ఞానోదయం కలిగిస్తున్న నీలకంఠ. వెనుక వ్యాఖ్యానం మామూలే....నీలకంఠ ఆ వూళ్లో ఆ ఇంట్లో పుట్టాడు, ఆ నదిలో ములిగేవాడు, చిన్నవయసులోనే ఋషులకి బోధించి, ఙ్ఞానోదయం చేసేవాడు.....వగైరా! మళ్లీ మూడో గదిలోకి తోలడం.

మూడో గది ఓ కారిడార్ లా వుండి, మళ్లీ అడవి జంతువుల బొమ్మలూ, చెట్లూ, నదీ, అద్దాలలో నీలకంఠ, ఋషులూ, రాజులూ వగైరా బొమ్మలూ, తరవాత గదిలోకి ప్రవేశం. అక్కడ ఓ ప్రక్క సామాన్య జనం బొమ్మలూ, మధ్యలో రామానుజాచార్యులో యెవరో, ఆయన శిష్యులూ, ఈ ప్రక్క రాజుగారి దర్బారూ! అక్కడ, రామానుజులు--ఇప్పటినుంచీ నీపేరు 'స్వామి నారాయణ్' అని ప్రకటించడం, జనం 'సాధు, సాధు ' అనడం, రాజుగారు లేచొచ్చి, "స్వామి నారాయణునికి స్వాగతం" అనడం, వగైరా. తరువాత ఇంకో గది.

(అప్పటివరకూ, యే గదిలో యేమి వుంటుందో, యెక్కడ కూచోవాలో, యెక్కడ నుంచుంటే చక్కగా అన్నీ కనిపిస్తాయో, బయటికి యెప్పుడువెళ్లాలో--ఇలాంటి కన్ ఫ్యూజన్ లో వుంటారు జనం. అక్కడికి వచ్చేసరికి వాళ్ల "బ్రెయిన్ ట్యూనింగ్" దాదాపు పూర్తి అయి, సుశిక్షిత సైనికుల్లా ముఖాన ఆశ్చర్యానందాలతో సాగిపోతూ వుంటారు!)

ఆ గదిలో ఓ చెరువూ, అందులో చేపలు పట్టేవాళ్లూ, ఓ పర్వతం, దాని దగ్గర నీలకంఠా, "చేపలని పట్టుకోవద్దు. వాటిని చంపి తినొద్దు" అంటూ నీలకంఠ వాటిని నదిలో పారెయ్యడం, పల్లెవాళ్లు ఆగ్రహించడం, అంతలో పెద్ద తుఫాను రావడం, నీలకంఠ నీళ్లలో దూకి, పైకి వచ్చేసరికి ఆ పల్లెవాళ్లు ధనవంతులయిపోవడం! ఇలా యేదో. (ఆ బొమ్మల కదలికలూ, మాటలూ, తుఫాను వగైరాలు చిన్న పిల్లలకి అద్భుతంగా వుంటాయి. వొప్పుకోవచ్చు.)

అలా ఓ పది గదులో యెన్నో వున్నాయి. (అక్కడ తెగుతున్న టిక్కెట్లని బట్టి, తరవాత గదుల్లో టైములు అడ్జస్ట్ చెయ్యబడతాయి). అవన్నీ పూర్తయితే, మళ్లీ ఓ మినీ థియేటరు లోకి ప్రవేశం. అందులో ఓ యేడెనిమిది వందలమంది పడతారు. 70' X 70' అనుకుంటా--పెద్ద స్క్రీను. ఫుల్ స్టీరియో డొల్బీ సౌండ్ సిస్టం వగైరాలతో. ఆ థియేటరు నిండేవరకూ, గ్యాప్. టాయిలెట్లకి వెళ్లేవాళ్లూ, అక్కడ దొరికే ఐస్క్రీములూ, చాక్లెట్లూ లాంటివి కొనుక్కొని తినేవాళ్లూ, పిల్లలని రిలాక్స్ చేసేవాళ్లూ....థియేటరులో కూర్చొని సేదదీరేవాళ్లూ...ఇలాగ. నేను నా సెల్ఫ్ హిప్నోసిస్ లోకి వెళ్లి, ఓ ఇరవై నిమిషాలు రిలాక్స్ అయ్యాను. అప్పుడు సినిమా మొదలు. ఆ సినిమా యెవరు తీశారో, తీయించారోగానీ, థియేటర్లలో రిలీజు చేస్తే, రెండో ఆటకి జనం వుండరు! చిత్రం మాత్రం అద్భుతంగా వుంది!



.......తరువాయి మరోసారి.