Thursday, April 10

మా కొత్త కాపురం - 4


నేనూ, నా రాక్షసి

ఇంక మేము విజయవాడలో వుండగా దోచుకున్న జీవితకాలానికి సరిపోయే సంపదలు.........

శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన (స్టేట్  బ్యాంక్ వుద్యోగి)  ఫి సొ (విజయవాడ ఫిలిం సొసైటీ) స్థాపించి, బ్యాంకువాళ్ళందరికీ ఆహ్వానాలు పంపగానే చేరిన మొదటివాళ్లలో ఒకణ్ని నేను.

ఆ సొసైటీ సౌజన్యంతో, ప్రపంచ ప్రఖ్యాత చలన చిత్రాలు చూసే భాగ్యం కలిగింది. విట్టోరియా డిసికా బైసికిల్ థీవ్స్ నుంచి, ప్రాంతీయ అవార్డు చిత్రాలవరకూ యెన్నో...........ప్రతీ ఆదివారం ఒక్కో థియేటర్లో ప్రదర్శించేవారు.

సాధ్యమైనంత ముందుగా వెళ్లి, అనేక మంది ప్రముఖ రచయితల్నీ, పాత్రికేయులనీ, దర్శకులనీ, కవి పండితులనీ దగ్గరగా చూసి, వీలైతే వాళ్ల దగ్గరగా కూర్చొని ఆ సినిమాలు చూడడం చక్కటి అనుభవం. వాళ్లని పరిచయం చేసుకోవాలంటే భయం!

అలా ప్రఖ్యాత రచయితలు డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావుగారినీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారినీ, శ్రీ శ్రీ నీ, బాలచందర్ నీ, అలా చాలామందిని దగ్గరగా చూస్తూ, వాళ్ల వ్యాఖ్యలు వినడం....అదో అదృష్టం.

సత్యజిత్ రే అపూ ట్రయాలజీ--పథేర్ పాంచలి, అపరజితొ, అపుర్ సంసార్; గోపీ గైన్‌-బాఘా బైన్‌ లాంటి అన్నిసినిమాలూ, శ్యాం బెనెగల్, మృణాళ్ సేన్‌, పుట్టణ్ణ కణగల్, బీ వీ కారంత్, శివరామ్‌ కారంత్ లాంటి మహామహుల సినిమాలూ, బెంగాలీ, తమిళ, కన్నడ, మళయాళ, ఒరియా, మరాఠీ లాంటి అన్ని భాషల్లోనూ యెన్నొసినిమాలు.

గోపీ గైన్‌-బాఘా బైన్‌ లో "హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ" మాంత్రికుడి వేషం, ఆయన డ్యాన్‌సు చెయ్యడం....కన్నడం లో అమరీష్ పురీ తొలి చిత్రం "కాడు", వంశవృక్ష, సంస్కార, ఆంథోనీ మళయాళ చిత్రం "నిర్మాల్యం"--ఇలా అన్నీ మరిచిపోలేని చిత్రాలే!

ఇంకా, వేసవికాలం లో ఓపెన్‌ ఎయిర్ లో అనేక రష్యన్‌, ఇటాలియన్‌, జపనీస్....ఇలా అన్ని భాషల చిత్రాలూ-రోజుకి రెండేసి అయినా చూసెయ్యడం, ఒకసారైతే, హనుమంతరాయ గ్రంథాలయం లో (బాక్సులు రాత్రే తిరిగి ఇచ్చెయ్యాలని) మూడు పూర్తి నిడివి రష్యన్‌ చిత్రాలు.....మధ్య చిన్న విరామాలతో, రాత్రి 3 గంటలవరకూ చూసెయ్యడం--ఇవన్నీ కూడా మరచిపోలేనివే!

ఇంకో చిత్రమైన విషయం, మృణాళ్ సేన్‌ దే అనుకుంటా, "మాయాదర్పణ్" అనే చిత్రం, సబ్ టైటిల్సు లేకుండా పుర్తిగా చూడడం! దాంతో అందరూ బంగ్లా భాషలో ఎక్స్‌పర్ట్‌ లయిపోయాం! యెలా అంటారా.....కా, కే, కి, లాంటి మాటలకి యేమిటి? యెవరు? యెందుకు? అని అర్థాలు అని తెలిసిపోయి, ఒకళ్లని ఒకళ్లు ఇంక అలాగే పలకరించేసుకుని, నవ్వేసుకునేవాళ్లం. నిజంగా ఆ సినిమా ఓ పనిష్మెంటు.

ఇంతకీ ఆ మూడు గంటల సినిమాలో దాదాపు ఒకటే సీను.....ఓ అమ్మాయి మాటి మాటికీ హాల్లో సోఫాలని ఓ గుడ్డతో దులిపేస్తూ, తుడిచేస్తూ వుంటుంది......సినిమా పుర్తయి బయటికి వచ్చాక, ప్రఖ్యాతులతో సహా, అందరిలోనూ రిజిస్టరు అయిపోయిన సీను అదే!

అక్కణ్ణుంచీ, మా ఆవిడ ఇల్లు తుడుస్తున్నా, వంటింట్లో స్టౌ శుభ్రం చేసుకుంటున్నా, "ఓహో! దర్పణం చేస్తున్నావా" అని యేడిపించేవాడిని. ఆ గుడ్డలు మురికి అయిపొతే, నా పాత బనీనో, లుంగీయో ఇచ్చేసి, "ఇంక హేపీగా దర్పణం చేసేసుకో" అనేవాడిని. ఆ తరువాతకూడా, మా పిల్లలూ, ఇప్పుడు మా తమ్ముడి పిల్లలూ కూడా ఆవిడని అలాగే యేడిపించడం అలవాటు చేసేసుకున్నారు! ఆవిడ రాక్షసిలా పడిపోతుంది "మరి శుభ్భరాలు రమ్మంటే యెలా వస్తాయి....నేనుకాబట్టి చేస్తున్నాను లంకంత కొంపని." అంటూ, తడి మోప్ తో తుడిచిన అరగంటవరకూ అన్ని ఫేన్లు (అన్ని కాలాల్లోనూ) వేసేసి (అది త్వరగా ఆరడానికట) యెవ్వరినీ పుర్తిగా ఆరేవరకూ అడుగులు వేయనివ్వదు!

నేను గవర్నర్ పేట బ్రాంచి లో వుండగా, సేవింగ్స్ కవుంటర్లో వున్నప్పుడు, ఎకవుంట్ తెరవడానికి వచ్చిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికీ, ఉషాబాల గారికీ, ఫారాలు ఇచ్చి, పూర్తి చేయించి, వారిని మేనేజరుకి పరిచయం చేసి, (వారికీ నాకూ పరిచయం అల్లా వారి రచనలు మాత్రమే!) పావుగంటలో పాసుబుక్కులు చేతిలో పెట్టాను. అదో గొప్ప అనుభవం. అలగే ఓ ప్రఖ్యాత కార్టూనిస్ట్ కి కూడా. ఆయన స్పెసిమెన్‌ సిగ్నేచర్ ఇమ్మంటే, కార్టూన్‌ మీద ఆయన చేసే సంతకమే ఇవ్వడంతో, ఆయన్ని పోల్చుకొని, అడిగితే, ఆయన యెంత సంతొషించాడో!

ఇంకొంత మరోసారి.

Thursday, April 3

మా కొత్త కాపురం - 3


నేనూ, నా రాక్షసి

......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

టిక్కెట్లు చేతిలో పడగానే, గబగబా బ్యాంకు పని పూర్తిచేసుకొని, ఇంటికి చేరి, హడావుడి పెట్టేసేవాణ్ని".......ఐదు నిమిషాల్లో బయలుదేరాలి, ఊఁ....రెడీ...."అంటూ. "అబ్బ యెక్కడికో చెప్పరూ....తెమలాలి తెమలాలి అంటారు" అంటూ తాపీగా తయారై వచ్చేది. 

ఊర్వశి, మేనక, అలంకార్ లాంటి వాటికైతే నడుస్తూనే, గవర్నర్ పేట లో వినోదా, అప్సర, జైహింద్, లక్ష్మీ, నవరంగ్, సూర్యారావుపేటలోని విజయా, లాంటి వాటికైతే రిక్షాకి ముప్పావలా, వన్‌ టౌన్‌ శేష్ మహల్, శ్రీనివాస, మారుతీ, సరస్వతీ లాంటి వాటికైతే రూపాయి రిక్షాలో!

దారిపొడుగునా యేవేవో మాట్లాడుతున్నా, తనకి టెన్‌షన్‌....మధ్యమధ్యలో "యెక్కడికండీ" అంటూ. చివరిదాకా యేదేదో చెపుతూ, చివరికి నిజం చెప్పగానే, "హబ్బా! మరి చెప్పరేం?" అంటూ ఆనందం.

డి కే పట్టమ్మాళ్ కచేరికి అంటూ, నవరంగ్ లో ఇంగ్లీషు సినిమాకి తీసుకెళ్లిపోతే, "చూశారా....నిజమే అనుకొని మంచి చీర కట్టుకొచ్చేశాను" అంటూ గొణుగుళ్లూ.

తరుచూ సినిమా వాళ్లు కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం వస్తూండేవారు. నాకు మొదటినించీ వాళ్లని చూడాలని పెద్ద ఆసక్తి లేకపోయినా, తనకి మాత్రం దగ్గరనుంచి వాళ్లని చూడడం భలే ఆనందం. అలా జయప్రద, రజనీకాంత్, కమల్ హాసన్‌, ఎస్ పీ బాలూ, బాలచందర్, నారాయణ రావు, రాజబాబు, రమాప్రభ, జయసుధ, ప్రభ, లాంటి చాలా మందిని ఫిలిం ఛాంబర్ హాలు దగ్గరో, ఎగ్జిబిషన్‌ లోనో చూసే వాళ్లం. తరవాత సినిమాకి వెళితే, మా వెనక వరసలోనే వాళ్లు కూర్చొని సినిమా చూస్తూండడం......మరీ థ్రిల్లింగ్ అనుభూతి.

ఎగ్జిబిషన్‌ లో జైంట్ వీల్ యెక్కడం, ముంజేయి అంత పొడుగు పెద్ద కోన్‌ లలో ఐస్ క్రీములు తినడం, అలాగే గొప్ప గొప్ప వాళ్ల మీటింగుల కి హాజరవ్వడం, ముఖ్యంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అబ్రహాం టి కోవూర్ లాంటి వాళ్లని దగ్గరగా చూడడం గొప్ప అనుభూతులు. 

ఇంక ఇలాంటి కార్యక్రమాలు లేని రోజుల్లో, గాంధీ పార్కు కో, ప్రకాశం బేరేజి కో, కనక దుర్గ గుడికో, గాంధీ హిల్ కో షికార్లు. అప్పట్లో అవన్నీ పెద్ద రణగొణల్లేకుండా ప్రశాంతంగా వుండేవి. 

దుర్గ గుడికైతే, అక్కడివరకూ రిక్షాలో వెళ్లిపోయి, మెట్ల క్రింద ఈప్రక్కా ఆ ప్రక్కా వుండే ఒకటి రెండు దుకాణాల దగ్గర చెప్పులు విడిచేసి, ఓ వాళ్లిచ్చే వెదురుబుట్టలో కొబ్బరకాయీ, పువ్వులూ, హారతి కర్పూరం, అగరొత్తులూ వగైరా కొనుక్కొని, మెట్లెక్కి, వెనుక కోనేట్లో కాళ్లు కడుక్కొని, దుర్గని దర్శించుకొని, తిరిగి శివాలయానికి నడుచుకుంటూ వచ్చే దారిలో చెట్లక్రింద వుండే సిమెంటు సోఫాల్లో కూర్చొని, శివాలయం మీదుగా క్రిందికి మెట్లమీద దిగి వచ్చేసేవాళ్లం. యెక్కడానికి యెన్నో మెట్లు వుండేవి కాదు. దిగడానికి ఇంకా తక్కువ. రాజబాబు ఐతే, తన స్కూటర్ మీద ఘాట్ రోడ్డులో మాకన్నా ముందే పైకెక్కేసేవాడు. ఆ కొండ మీద మేము తప్ప, ఒకటో రెండో జంటలు మాత్రమే వుండేవి. దైవభక్తితో పాటు, సరదాగా గడపడానికి కూడా బాగుండేది. 

అలాగే బ్యారేజీ మీద కొంత దూరం వెళ్లి, కాసేపు అక్కడ గడపడం, గాంధీ హిల్ మీదకి వెళ్లి, మ్యూజియం చూడ్డం, అక్కడ చిన్న రైల్లో కొండ చుట్టు తిరగడం, గాంధీ పార్కు 8 గంటలకి మూసేసేవరకూ వుండి, తరవాత ఇంటికి చేరడం, తరవాత గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె!

ఇంకొంత మరోసారి.