Thursday, April 10

మా కొత్త కాపురం - 4


నేనూ, నా రాక్షసి

ఇంక మేము విజయవాడలో వుండగా దోచుకున్న జీవితకాలానికి సరిపోయే సంపదలు.........

శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన (స్టేట్  బ్యాంక్ వుద్యోగి)  ఫి సొ (విజయవాడ ఫిలిం సొసైటీ) స్థాపించి, బ్యాంకువాళ్ళందరికీ ఆహ్వానాలు పంపగానే చేరిన మొదటివాళ్లలో ఒకణ్ని నేను.

ఆ సొసైటీ సౌజన్యంతో, ప్రపంచ ప్రఖ్యాత చలన చిత్రాలు చూసే భాగ్యం కలిగింది. విట్టోరియా డిసికా బైసికిల్ థీవ్స్ నుంచి, ప్రాంతీయ అవార్డు చిత్రాలవరకూ యెన్నో...........ప్రతీ ఆదివారం ఒక్కో థియేటర్లో ప్రదర్శించేవారు.

సాధ్యమైనంత ముందుగా వెళ్లి, అనేక మంది ప్రముఖ రచయితల్నీ, పాత్రికేయులనీ, దర్శకులనీ, కవి పండితులనీ దగ్గరగా చూసి, వీలైతే వాళ్ల దగ్గరగా కూర్చొని ఆ సినిమాలు చూడడం చక్కటి అనుభవం. వాళ్లని పరిచయం చేసుకోవాలంటే భయం!

అలా ప్రఖ్యాత రచయితలు డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావుగారినీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారినీ, శ్రీ శ్రీ నీ, బాలచందర్ నీ, అలా చాలామందిని దగ్గరగా చూస్తూ, వాళ్ల వ్యాఖ్యలు వినడం....అదో అదృష్టం.

సత్యజిత్ రే అపూ ట్రయాలజీ--పథేర్ పాంచలి, అపరజితొ, అపుర్ సంసార్; గోపీ గైన్‌-బాఘా బైన్‌ లాంటి అన్నిసినిమాలూ, శ్యాం బెనెగల్, మృణాళ్ సేన్‌, పుట్టణ్ణ కణగల్, బీ వీ కారంత్, శివరామ్‌ కారంత్ లాంటి మహామహుల సినిమాలూ, బెంగాలీ, తమిళ, కన్నడ, మళయాళ, ఒరియా, మరాఠీ లాంటి అన్ని భాషల్లోనూ యెన్నొసినిమాలు.

గోపీ గైన్‌-బాఘా బైన్‌ లో "హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ" మాంత్రికుడి వేషం, ఆయన డ్యాన్‌సు చెయ్యడం....కన్నడం లో అమరీష్ పురీ తొలి చిత్రం "కాడు", వంశవృక్ష, సంస్కార, ఆంథోనీ మళయాళ చిత్రం "నిర్మాల్యం"--ఇలా అన్నీ మరిచిపోలేని చిత్రాలే!

ఇంకా, వేసవికాలం లో ఓపెన్‌ ఎయిర్ లో అనేక రష్యన్‌, ఇటాలియన్‌, జపనీస్....ఇలా అన్ని భాషల చిత్రాలూ-రోజుకి రెండేసి అయినా చూసెయ్యడం, ఒకసారైతే, హనుమంతరాయ గ్రంథాలయం లో (బాక్సులు రాత్రే తిరిగి ఇచ్చెయ్యాలని) మూడు పూర్తి నిడివి రష్యన్‌ చిత్రాలు.....మధ్య చిన్న విరామాలతో, రాత్రి 3 గంటలవరకూ చూసెయ్యడం--ఇవన్నీ కూడా మరచిపోలేనివే!

ఇంకో చిత్రమైన విషయం, మృణాళ్ సేన్‌ దే అనుకుంటా, "మాయాదర్పణ్" అనే చిత్రం, సబ్ టైటిల్సు లేకుండా పుర్తిగా చూడడం! దాంతో అందరూ బంగ్లా భాషలో ఎక్స్‌పర్ట్‌ లయిపోయాం! యెలా అంటారా.....కా, కే, కి, లాంటి మాటలకి యేమిటి? యెవరు? యెందుకు? అని అర్థాలు అని తెలిసిపోయి, ఒకళ్లని ఒకళ్లు ఇంక అలాగే పలకరించేసుకుని, నవ్వేసుకునేవాళ్లం. నిజంగా ఆ సినిమా ఓ పనిష్మెంటు.

ఇంతకీ ఆ మూడు గంటల సినిమాలో దాదాపు ఒకటే సీను.....ఓ అమ్మాయి మాటి మాటికీ హాల్లో సోఫాలని ఓ గుడ్డతో దులిపేస్తూ, తుడిచేస్తూ వుంటుంది......సినిమా పుర్తయి బయటికి వచ్చాక, ప్రఖ్యాతులతో సహా, అందరిలోనూ రిజిస్టరు అయిపోయిన సీను అదే!

అక్కణ్ణుంచీ, మా ఆవిడ ఇల్లు తుడుస్తున్నా, వంటింట్లో స్టౌ శుభ్రం చేసుకుంటున్నా, "ఓహో! దర్పణం చేస్తున్నావా" అని యేడిపించేవాడిని. ఆ గుడ్డలు మురికి అయిపొతే, నా పాత బనీనో, లుంగీయో ఇచ్చేసి, "ఇంక హేపీగా దర్పణం చేసేసుకో" అనేవాడిని. ఆ తరువాతకూడా, మా పిల్లలూ, ఇప్పుడు మా తమ్ముడి పిల్లలూ కూడా ఆవిడని అలాగే యేడిపించడం అలవాటు చేసేసుకున్నారు! ఆవిడ రాక్షసిలా పడిపోతుంది "మరి శుభ్భరాలు రమ్మంటే యెలా వస్తాయి....నేనుకాబట్టి చేస్తున్నాను లంకంత కొంపని." అంటూ, తడి మోప్ తో తుడిచిన అరగంటవరకూ అన్ని ఫేన్లు (అన్ని కాలాల్లోనూ) వేసేసి (అది త్వరగా ఆరడానికట) యెవ్వరినీ పుర్తిగా ఆరేవరకూ అడుగులు వేయనివ్వదు!

నేను గవర్నర్ పేట బ్రాంచి లో వుండగా, సేవింగ్స్ కవుంటర్లో వున్నప్పుడు, ఎకవుంట్ తెరవడానికి వచ్చిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికీ, ఉషాబాల గారికీ, ఫారాలు ఇచ్చి, పూర్తి చేయించి, వారిని మేనేజరుకి పరిచయం చేసి, (వారికీ నాకూ పరిచయం అల్లా వారి రచనలు మాత్రమే!) పావుగంటలో పాసుబుక్కులు చేతిలో పెట్టాను. అదో గొప్ప అనుభవం. అలగే ఓ ప్రఖ్యాత కార్టూనిస్ట్ కి కూడా. ఆయన స్పెసిమెన్‌ సిగ్నేచర్ ఇమ్మంటే, కార్టూన్‌ మీద ఆయన చేసే సంతకమే ఇవ్వడంతో, ఆయన్ని పోల్చుకొని, అడిగితే, ఆయన యెంత సంతొషించాడో!

ఇంకొంత మరోసారి.

Thursday, April 3

మా కొత్త కాపురం - 3


నేనూ, నా రాక్షసి

......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

టిక్కెట్లు చేతిలో పడగానే, గబగబా బ్యాంకు పని పూర్తిచేసుకొని, ఇంటికి చేరి, హడావుడి పెట్టేసేవాణ్ని".......ఐదు నిమిషాల్లో బయలుదేరాలి, ఊఁ....రెడీ...."అంటూ. "అబ్బ యెక్కడికో చెప్పరూ....తెమలాలి తెమలాలి అంటారు" అంటూ తాపీగా తయారై వచ్చేది. 

ఊర్వశి, మేనక, అలంకార్ లాంటి వాటికైతే నడుస్తూనే, గవర్నర్ పేట లో వినోదా, అప్సర, జైహింద్, లక్ష్మీ, నవరంగ్, సూర్యారావుపేటలోని విజయా, లాంటి వాటికైతే రిక్షాకి ముప్పావలా, వన్‌ టౌన్‌ శేష్ మహల్, శ్రీనివాస, మారుతీ, సరస్వతీ లాంటి వాటికైతే రూపాయి రిక్షాలో!

దారిపొడుగునా యేవేవో మాట్లాడుతున్నా, తనకి టెన్‌షన్‌....మధ్యమధ్యలో "యెక్కడికండీ" అంటూ. చివరిదాకా యేదేదో చెపుతూ, చివరికి నిజం చెప్పగానే, "హబ్బా! మరి చెప్పరేం?" అంటూ ఆనందం.

డి కే పట్టమ్మాళ్ కచేరికి అంటూ, నవరంగ్ లో ఇంగ్లీషు సినిమాకి తీసుకెళ్లిపోతే, "చూశారా....నిజమే అనుకొని మంచి చీర కట్టుకొచ్చేశాను" అంటూ గొణుగుళ్లూ.

తరుచూ సినిమా వాళ్లు కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం వస్తూండేవారు. నాకు మొదటినించీ వాళ్లని చూడాలని పెద్ద ఆసక్తి లేకపోయినా, తనకి మాత్రం దగ్గరనుంచి వాళ్లని చూడడం భలే ఆనందం. అలా జయప్రద, రజనీకాంత్, కమల్ హాసన్‌, ఎస్ పీ బాలూ, బాలచందర్, నారాయణ రావు, రాజబాబు, రమాప్రభ, జయసుధ, ప్రభ, లాంటి చాలా మందిని ఫిలిం ఛాంబర్ హాలు దగ్గరో, ఎగ్జిబిషన్‌ లోనో చూసే వాళ్లం. తరవాత సినిమాకి వెళితే, మా వెనక వరసలోనే వాళ్లు కూర్చొని సినిమా చూస్తూండడం......మరీ థ్రిల్లింగ్ అనుభూతి.

ఎగ్జిబిషన్‌ లో జైంట్ వీల్ యెక్కడం, ముంజేయి అంత పొడుగు పెద్ద కోన్‌ లలో ఐస్ క్రీములు తినడం, అలాగే గొప్ప గొప్ప వాళ్ల మీటింగుల కి హాజరవ్వడం, ముఖ్యంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అబ్రహాం టి కోవూర్ లాంటి వాళ్లని దగ్గరగా చూడడం గొప్ప అనుభూతులు. 

ఇంక ఇలాంటి కార్యక్రమాలు లేని రోజుల్లో, గాంధీ పార్కు కో, ప్రకాశం బేరేజి కో, కనక దుర్గ గుడికో, గాంధీ హిల్ కో షికార్లు. అప్పట్లో అవన్నీ పెద్ద రణగొణల్లేకుండా ప్రశాంతంగా వుండేవి. 

దుర్గ గుడికైతే, అక్కడివరకూ రిక్షాలో వెళ్లిపోయి, మెట్ల క్రింద ఈప్రక్కా ఆ ప్రక్కా వుండే ఒకటి రెండు దుకాణాల దగ్గర చెప్పులు విడిచేసి, ఓ వాళ్లిచ్చే వెదురుబుట్టలో కొబ్బరకాయీ, పువ్వులూ, హారతి కర్పూరం, అగరొత్తులూ వగైరా కొనుక్కొని, మెట్లెక్కి, వెనుక కోనేట్లో కాళ్లు కడుక్కొని, దుర్గని దర్శించుకొని, తిరిగి శివాలయానికి నడుచుకుంటూ వచ్చే దారిలో చెట్లక్రింద వుండే సిమెంటు సోఫాల్లో కూర్చొని, శివాలయం మీదుగా క్రిందికి మెట్లమీద దిగి వచ్చేసేవాళ్లం. యెక్కడానికి యెన్నో మెట్లు వుండేవి కాదు. దిగడానికి ఇంకా తక్కువ. రాజబాబు ఐతే, తన స్కూటర్ మీద ఘాట్ రోడ్డులో మాకన్నా ముందే పైకెక్కేసేవాడు. ఆ కొండ మీద మేము తప్ప, ఒకటో రెండో జంటలు మాత్రమే వుండేవి. దైవభక్తితో పాటు, సరదాగా గడపడానికి కూడా బాగుండేది. 

అలాగే బ్యారేజీ మీద కొంత దూరం వెళ్లి, కాసేపు అక్కడ గడపడం, గాంధీ హిల్ మీదకి వెళ్లి, మ్యూజియం చూడ్డం, అక్కడ చిన్న రైల్లో కొండ చుట్టు తిరగడం, గాంధీ పార్కు 8 గంటలకి మూసేసేవరకూ వుండి, తరవాత ఇంటికి చేరడం, తరవాత గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె!

ఇంకొంత మరోసారి.

Thursday, March 27

మా కొత్త కాపురం - 2


నేనూ, నా రాక్షసి

భోజనాలసంగతలా వుంచితే, విజయవాడ జీవితం చాలా బాగుండేది. 

మా గాంధీనగర్ బ్రాంచి లో నాతోపాటు కొత్తగా చేరినవాళ్లు (కొద్దిగా ముందూ వెనకా) మణి అనే అమ్మాయీ, లక్ష్మీనారాయణ, రమణ, సోమయాజులు, కనకరత్నం అనే ఓ అమ్మాయి, ఉదయ శంకర్ అనే ఓ ప్రొబేషనరీ ఆఫీసరు. సీనియర్లు కవుంటర్లు చూసుకుంటూంటే, ఆ ప్రక్క సీట్లలో మమ్మల్ని కూర్చోబెట్టి, పని నేర్చుకునే అవకాశం కలిగించేవారు. సీనియర్ ఆఫీసర్ చౌదరి గారయితే, "ఇది బ్రాంచి కాదు ప్రొబేషనర్స్ ట్రెయినింగ్ కాలేజ్" అంటూ గంటకోసారి బహిరంగంగా గట్టిగా విసుక్కొనేవారు.

ముఖ్య విషయం యేమిటంటే, సినిమా డిస్త్రిబ్యూటర్ ల ఆఫీసులన్నీ గాంధీనగర్ లోనే వుండి, వాళ్ల ఎకవుంట్లన్నీ మా బ్రాంచి లోనే వుండేవి. సినిమావాళ్ల ఎకవుంట్లన్నీ మద్రాసులో మా టి నగర్ బ్రాంచి లో వుండడంతో, రోజూ టీ టీ ల ద్వారా కొన్ని లక్షలు (ఒక్కొక్కళ్లూ 1 నుంచి 5 లక్షలు) రోజూ పంపిస్తూ వుండేవారు. దానికోసం బస్తాలకొద్దీ రకరకాల నోట్లు జమ చేసేవారు. వాళ్లకి చేసిన సర్వీసుకి సంతోషించి, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకి మొదటిరోజు, మొదటి ఆట టిక్కెట్లు ముందే మాకు యెన్ని అడిగితే అన్ని ఇచ్చేసేవారు. దాంతో, ఆ వూళ్లో వున్న ఇతర బ్రాంచీలవాళ్లు కూడా మాకు ఫోన్లు చేసి మరీ రిజర్వు చేసుకొనేవారు. ప్రతీ కొత్త సినిమాకీ 20 నుంచి 30 టిక్కెట్లు వుండేవి మా బ్యాంకు వాళ్లవి. 

గవర్నర్ పేట బ్రాంచిలో ప్రసాద్, రాజబాబు కూడా మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంక సినిమాహాల్లోకి వెళ్లగానే, మారాజబాబు తన పని ప్రారంభించేవాడు. మేం యెవరు చెప్పగానే అన్ని టిక్కెట్లూ యెప్పటికప్పుడు చెపుతూండడంతో, సీట్లు నాలుగోచోటా, ఐదో చోటా, ఇంకొన్ని ఇంకోచోటా, వేరే వేరే వరసల్లో వచ్చేవి. దాంతో, మా పక్క సీట్లవాళ్లని బతిమాలి, సీట్లు మార్పిస్తూ, మా వాళ్లందరినీ ఒకే వరసలో కూర్చోబెట్టే సరికి అరగంట పట్టేది. "ఇంకో అరగంట టైమిస్తే, మీ సత్యనారాయణపురం వాళ్లందరినీ ఒక వరసలోకి చేర్చేగలను" అంటూ కాలరెగరేసేవాడు.

రెండు మూడు వారాలయ్యేటప్పటికి, మొదటిరోజే యెగబడని వాళ్లకి పాస్ లు పంపించేవారు. ఒక్కో పాస్ మీదా నలుగురు వెళ్లిపోవచ్చు. అలా వెళ్లడానికి వీలు పడని వాళ్లు అవి మళ్లీ మాకు ఇచ్చేసేవారు. మేము మళ్లీ తయార్. (ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా లంచాలు అంటారేమో).

నాకు అంతకు ముందు సినిమాల మీద అంత వ్యామోహం వుండేదికాదు గానీ, కొత్త వుద్యోగం, కావలసినంతా సమయం, అదే ముఖ్యమైన వినోదం కావడంతో, అందరితోపాటే నేనూ. అందరిలోకీ ముందుగా పెళ్లి చేసుకున్నవాణ్ని నేనే. చెప్పద్దూ, మా ఆవిడకి చిన్నప్పటి నుంచీ ప్రతీ సినిమా చూడడం అలవాటు అని తరవాత తెలిసింది. ఇప్పటికీ పాత సినిమాలలో చెలికత్తెల వరకూ అందరిపేర్లూ చెప్పేస్తుంది. గొంతు అంత బాగుండదుగానీ, పాటలు వరస యేమాత్రం తప్పకుండా పూర్తిగా పాడేస్తుంది. 

ఇంకేముంది......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

ఇంకొంత మరోసారి.

Wednesday, March 19

మా కొత్త కాపురం



నేనూ, నా రాక్షసీ......

"పోదురూ బడాయి. అందరూ నిజమనుకోగలరు. ఈ వయసులో కొత్తకాపురం యేమీటీ?" అంటూ ముసిముసిగా బుగ్గలు నొక్కుకొంది నా రాక్షసి.

"మొన్ననే కదా మన మూడో హనీమూన్‌ గురించి వ్రాశాను. మరేం ఫర్వాలేదులే. అయినా నేను వ్రాస్తున్నది మన  'అప్పటి' కొత్త కాపురం గురించిలే". అన్నాను.

"అయినా ఆ శీర్షిక యేమిటీ" అంది కొరకొరా చూస్తూ. 'అదంతేలే' అని నీళ్లు నమిలేశాను. 

అప్పుడెప్పుడో శ్రీశ్రీ ఆరుద్ర గురించి చెప్పినట్టు, 'రాక్షసి' అంటే మా ఆవిడ ఒప్పుకోదు, నా భార్యా 'మణి' అంటే నేనొప్పుకోను. ఈ తగాదా యెవరు తీర్చేను!

1975 నుంచీ నిత్యనూతనంగా (అంటే యెప్పటికప్పుడు పరగడుపే) సా......గుతున్న మా కొత్తకాపురం సంగతులే వ్రాస్తున్నవి.

విజయవాడలో తను కాపురానికి వచ్చేసరికి, అవడానికి మా అన్నయ్యా, వదినా తో కలిసే అయినా, వాళ్లు యెక్కువగా వుండేవారు కారు. దాంతో మా 'ప్రత్యేక' కాపురం "గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె".

ఉదయం యేదో టిఫిన్‌ చేసి, వేడివేడి బెడ్ కాఫీతో నిద్రలేపితే, టిఫిన్‌ తిన్నాక, మరోసారి కాఫీ త్రాగి, 7.45 కల్లా బ్యాంకుకి బయల్దేరి, 8.00 కి నా సీట్లో వుండేవాడిని. మళ్లీ లంచి కి 12.30 కి బయలుదేరి, ఇంట్లో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి. మళ్లీ 3.00 కి బ్రాంచి. (అది షిఫ్ట్ బ్రాంచి. సాయంత్రం 5.30 వరకూ వుండేది.)

అప్పట్లో గ్యాస్ కొత్త. మా యింట్లో "నూతన్‌" స్టవ్వే. నేను లంచికి ఇంటికి చేరేసరికి, వేడివేడిగా అన్నం, పప్పూ, కూరా, చారూ వడ్డించేది. అందుకోసం నిమిషాలతో సహా ప్లాను వేసుకొనేదనుకుంటా. కంచం లో వడ్డిస్తూ, "ఐదువేళ్లూ దోపెయ్యకండి. వేడి" అంటూ వార్నింగూ. ప్రక్కనే టేబులు ఫ్యాన్‌ తిరుగుతున్నా, నెమ్మదిగా వూదుకుంటూ నేను పప్పు కలుపుకొని తినేసరికి, తను మజ్జిగలోకి వచ్చేసేది! తనకి అంత వేడి కావాలి మరి! 

తరవాత గ్యాసూ, కుక్కరూ వచ్చిన తరవాతకూడా, అన్నీ కుక్కర్లోనే పెట్టేసి, వేడి వేడిగా వడ్డించవలసిందే.

నేను సరదాగా యెలాగైనా తన భోజనం ఆలస్యం అవ్వాలని ప్లాన్లు. 

నేనసలే మితభాషిని. "అన్నం పెట్టు" అనడానికి 'అన్నమెట్టు' ని షార్ట్ కట్ లో ".....మెట్టు" అనీ, "నెయ్యి వెయ్యి" అనడానికి 'నెయ్యెయ్యి'  ని "...యెయ్యి" అనీ, "నూనె వెయ్యి" అనడానికి ".......నెయ్యి" అనీ, "కూర వెయ్యి" అనడానికి ".....రెయ్యి" అనీ, "చారొయ్యి" అనడానికి ".....రొయ్యి" అనీ, "పచ్చడెయ్యి" అనడానికి "....డెయ్యి" అనీ, "పులుసొయ్యి" అనడానికి ".....సొయ్యి" అనీ, "మజ్జిగ పొయ్యి" అనడానికి "....గొయ్యి" అనీ, "పెరెగెయ్యి" అనడనికి "......గెయ్యి" అనీ........ఇలా ఒకదానికీ మరోదానికీ చిన్న తేడాలతో కన్‌ఫ్యూజ్ చేసేవాడిని. 

మొదట్లో తాను కూడా ఎంజాయ్ చేస్తూవుండేది గానీ, రాను రానూ నా కుట్రని కనిపెట్టేసింది. నా వొకాబులరీలో ఎక్స్ పర్ట్  అయిపోయి, తన భోజనం మాత్రం ఒక్కనిమిషం ఆలస్యం కాకుండా చూసుకొంటూనే, నాకు వడ్డించేది. 

ఇలాక్కాదు అని, 'నెయ్యి' అని, తను నూనె వడ్డించగానే, "అదేమిటి? నేను నెయ్యి అంటే నువ్వు నూనె వేస్తావేమిటీ" అని క్రాస్ ఎక్జామినేషన్‌ మొదలెట్టేవాణ్ని. దానికి సమాధానం చెప్పేసరికి కొంత కాల నష్టం. దాంతో, "ఇంక నేను చెప్పను బాబూ" అనేది. చెప్పకపోతే, నేను తినడం మానేస్తాను అని నా మారాం. కొన్నాళ్లు కొనసాగింపు. 

ఇంకొన్నాళ్లకి "మీరు తినకపోతే మానెయ్యండి బాబూ, నా అన్నం చల్లారిపోతుంది" అనేదాకా వచ్చించి. నేను తక్కువ తిన్నానా. "చెప్పేవరకూ నిన్నూ తిననివ్వను" అని తన చేయి పట్టేసుకునేవాణ్ని. ఇంక తప్పక నేను ప్రశ్న వెయ్యకముందే తను వ్యాఖ్యానం చెప్పేసి, తను తినెయ్యడం మొదలెట్టింది! ఇంక ఆఖరి అస్త్రం కూడా అయిపోవడంతో నేను పని కానిచ్చేసేవాడిని. 

కానీ, ఓ వార్నింగ్ మాత్రం అప్పుడే ఇచ్చేసింది. "మీరేం వేషాలు వేసినా మనిద్దరం వున్నప్పుడే. మూడో మనిషి ముందు.......జాగ్రత్త!" అని.

తరవాత మాపిల్లలు పుట్టాక కూడా, ఇప్పటికీ అదే మా మధ్య లక్ష్మణ రేఖ. యెవరిముందయినా సరదాలూ, వేళాకోళాలూ బంద్. ఇంకేం చేస్తాము? యేకొన్ని నిమిషాలో తప్ప, యెప్పుడూ యమ సీరియస్.

ఇప్పుడిప్పుడు, తన పని కొంత తగ్గించుకొనేందుకు పప్పూ కూరా వగైరాలు కొంచెం ముందు వండేసి, అన్నం మాత్రం కుక్కర్లో కరెక్టుగా తినడానికి 20 నిమిషాల ముందు మాత్రమే పడేస్తుంది. 

నేనూ ఓ ట్రిక్ నేర్చుకోక తప్పలేదు. పప్పూ అవీ వేడిగానే వున్నా, వేళ్లు కాలేంత కాకపోవడంతో, అన్నం వడ్డించగానే దానిమీద పప్పు పరిచేసి, చల్లబరిచేసుకుంటాను. 

అలా మా అన్యోన్య భోజనాలు కానిస్తున్నాము.

..................మరి కొంత మరోసారి.

Thursday, February 27

కొన్ని దశాబ్దాల క్రితం........


తూనికలూ, కొలతలూ వగైరా

మా చిన్నప్పుడు మన ప్రభుత్వం అప్పటివారకూ చెలామణిలో వున్న బ్రిటిష్ కొలతలూ అవీ మార్చి, మెట్రిక్ పధ్ధతిని ప్రవేశపెట్టారు. ఆ పధ్దతికి అలవాటు పడడానికి ప్రజలకి చాలా కాలం పట్టింది. రూపాయలు, అణాలు, పైసలు, పోయి నయా పైసలు, రూపాయలు వచ్చినా, ఒకటీ, రండూ, ఐదూ, పదీ పైసల నాణాలు ముద్రించినా, పావలా ని 25 పైసలుగా, అర్థరూపాయిని 50 పైసలుగా, ముద్రించారు. అలాగే, పంపులూ, యేబులాలూ, వీశెలూ పోయి, కిలోలూ, అరకిలోలూ, గ్రాములూ, గిద్దలూ, అవీ పోయి, లీటర్లూ వచ్చాయి. అడుగులూ, గజాలూ, ఫర్లాంగులూ, మైళ్లూ పోయి, మీటర్లూ, కిలో మీటర్లు వచ్చాయి. దాంతో కొన్ని తమాషాలూ జరిగేవి.

వుదాహరణలు కొన్ని.........

ధాన్యం, బియ్యం బస్తా అంటే 24 కుంచాలు కొలిచేవారు. మా నాన్నగారు బియ్యం బస్తా ఇంటికి పంపిస్తే, గోనె సంచి పట్టుకెళ్లి పోవాలని బియ్యం మా ఇంటి హాల్లో దిమ్మరించి వెళ్లిపోయేవాడు. అమ్మ నన్ను వెనకింటివాళ్లదగ్గరకి వెళ్లి, కుంచం తెమ్మనేది. (వాళ్లు రైతులు. ధాన్యం కొలవడానికి కుంచం వుండేది వాళ్లింట్లో). నేను కుంచం తెస్తే అమ్మ అవి కొలిచి, బియ్యం జాడీలో నింపేది. 24 కుంచాలూ యెప్పుడూ వచ్చేవి కాదు. ఆఖరు కుంచం లో సగానికి కాస్త పైకే వచ్చేవి. నాన్న రాగానే అమ్మ ఫిర్యాదు--షావుకారు మోసం చేశాడని. షావుకారుని అడిగితే, ధాన్యం కొలిచే కుంచం తో కొలిస్తే అంతే, బియ్యం కుంచంతో కొలుచుకోండి అనేవాడు. వాళ్ల కొట్లో కుంచానికీ, మేము కొలిచే కుంచానికీ షేపులో తేడా వుండేది. కానీ కొలత ఒకటే వుండాలికదా? (ఇలాంటి వాటి నివారణకోసమే ప్రభుత్వం నిర్దిష్ట కొలతలని ప్రవేశపెట్టి మంచిపని చేసింది). నేను కుంచం తెచ్చి అమ్మకి ఇస్తూ, లోపల చింతపండు యేమైనా అంటించారేమో చూసుకో అని జోక్ చేసేవాణ్ణి--ఆలీబాబా 40 దొంగల ప్రభావంతో!

అలాగే, మధ్యాహ్నం పూట ఓ సైకిలు మీద వెనుక ఓ పెద్ద క్యాన్‌ పెట్టుకొని, మూతని డబడబలాడిస్తూ శేరూ బేడ పాలెయ్ అంటూ ఒకడు వచ్చేవాడు. (వెన్నతీసేసిన పాలు అలా అమ్మేవారు. పితికిన పాలైతే రేటు దాదాపు రెట్టింపు వుండేది). వాడికి పావలా (25 నయాపైసలు) నాణెం ఇచ్చి, శేరు పాలు పోయించుకుని, తిరిగి 13 పైసలు ఇస్తావా ఛస్తావా అని వాడితో దెబ్బలాడేవాళ్లం. (బేడ అంటే రెండు అణాలు అంటే 12 పైసలే కదా?). వాడు ఛస్తే ఒప్పుకొనే వాడు కాదు. కావాలంటే, రెండు శేర్లు పోసేస్తాను తీసుకోండి అనేవాడు!

అగ్గిపెట్టె 2 పైసలు వుండేది. అప్పుడు విమ్‌కో వాడు తన గుర్రపు డెక్క మార్కు అగ్గిపెట్టెని 3 పైసలకి పెంచాడు. దాణ్ని అర్థణా అనే వాళ్లు. అయినా, 5 పైసలు ఇస్తే రెండు అగ్గిపెట్టెలు ఇచ్చేసేవాడు.

బట్టల దగ్గరకి వస్తే, మా ఆస్థాన టైలరు భూషణం అని వుండేవాడు. అతన్ని యెవరికి యెంత గుడ్డ తీసుకోవాలి అని అడిగి, బట్టల షాపుకి తీసుకెళ్లేవారు నాన్న. వాడు గజాల కొలత చెపితే, కొట్లో మీటర్ల కొలత! మేం చెప్పిన కొలతలని షాపువాడు మీటర్లలోకి మార్చి, మొత్తానికి గుడ్డలు చించి ఇచ్చేవాడు. తీరా భూషణం దగ్గరకి తీసుకెళ్తే, ఈ గుడ్డ సరిపోదండి. ఇంకొంచెం కొనాలి అనేవాడు. షాపువాడు సరిపోతుందన్నాడు, యెలాగోలా కానెచ్చెయ్యి అంటే, సరేలెండి, అవసరమైనచోట సైనుగుడ్డ అతుకులు పెట్టేస్తాను అని ఒప్పుకొనేవాడు. తీరా కుట్టిన బట్టలు ఇంటికి తెచ్చేసరికి, అమ్మ చూడండి యెంత బిగుతుగా కుట్టేశాడో....కనీసం ముప్పాతిక మువ్వీసం గుడ్డ దొబ్బేసి వుంటాడు అనేది! (గజాన్ని నాలుగు భాగాలు చేస్తే, ఒక్కొక్కటీ ఓ పాతిక, ఆ పాతికని 4 భాగాలు చేస్తే, ఒక్కోటీ ఓ వీసం).

ఇక్కడ నాకో ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది.

ఒకతను టైలరు దగ్గరకు  గుడ్డ తీసుకెళ్లి, టోపీ కుట్టమంటే, వాడు టేపుతో కొల్చుకొని, సరే అన్నాడట. తిరిగి వెళ్తూ, ఇంకా గుడ్డ మిగిల్తే వాడు దొబ్బేస్తాడేమో అని ఆలోచించి, మళ్లీ రెండు టోపీలు కుట్టు అన్నాడట. దర్జీ మళ్ళీ గుడ్డ కొలిచి, సరేలే అన్నాడట. ఈ లెఖ్ఖన ఇంకా చాలా మిగలచ్చు అనుకొని, పోనీ 3 టోపీలు కుడతావా? అన్నాడట. దర్జీ ముఖం చిట్లించి, మీరు కుట్టమంటే అలాగే అన్నాట్ట. 4 టోపీలు కుట్టగలవా? అని అడిగితే, మీ ఇష్టమే, కుట్టమంటే కుడతాను అన్నాట్ట. సరే, 5 టోపీలు కుట్టేయి అన్నాడట. దర్జీ, సరే, అంతకన్నా యెక్కువ కుట్టడం మాత్రం నావల్ల కాదు అంటే, సరే అని అప్పటికి తృప్తిగా వెళ్ళాడట. టోపీలు తీసుకోడానికి వస్తే, దర్జీ తన ఐదు వేళ్లకీ ఐదు టోపీలు పెట్టుకొని, చూపించి, నామాట నిలబెట్టుకొన్నాను చూడండి! అన్నాడట.

ఇప్పటికీ టైలర్లు వాళ్ల గురువూ, వాడి గురువూ నేర్పించినట్టు......ఛాతీ 32.....అంటూ అంగుళాల్లోనే కొలతలు తీసుకుండారు. పొడుగు సరిపోతుందా? ఇంకో అంగుళం పెంచమంటారా? అని అడుగుతూ వుంటారు గమనించండి.

(మరి కొన్ని మరోసారి)

Friday, January 17

చిన్నప్పటి జ్ఞాపకాలు


మళ్లీ చదవాలని వుంది

1960 ప్రాంతాల్లో, ఆంద్రప్రభ సచిత్ర వారపత్రికలో, విద్వాన్ విశ్వం తన మాణిక్యవీణ మీటడం మొదలుపెట్టిన రోజుల్లో అనుకుంటా, "కథ కాని కథ" అని ఓ శీర్షిక మొదలుపెట్టి, పాఠకులని అలాంటివి వ్రాయమని, ప్రచురించేవారు.

వాటిలో నేను చదివిందీ, ఎప్పటికీ మరిచిపోలేనిది ఒక కథ. (యథాతథంగా వ్రాయలేనుగానీ, నాకు గుర్తున్నట్టు--వ్రాస్తున్నాను)

"నల్లులని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన విధానం--కేవలం రూ.5/- లకే--ఫలితం గ్యారంటీ" అని ఓ ప్రకటన చూసి, అది తెప్పించుకుంటే, ఓ పార్సెల్ వచ్చింది. అందులో పెద్ద గోళీ కాయలంత గుండ్లు రెండు ఉన్నాయి. ఒక దానిమీద "ఎ" అనీ, ఇంకోదానిమీద "బి" అనీ వ్రాసి వుంది. వాటితో వచ్చిన కాయితంలో, "నల్లులని చంపే విధానం=ఒక్కో నల్లుని పట్టుకొని, ఎ గుండు మీద వుంచి, బి గుండుతో బలంగా మోదండి" అని, క్రింద షరా: నల్లు చచ్చేలా మోదే బాధ్యత మాత్రం మీదే! అనీ--వ్రాసి వుంది".

అదండీ కథ కాని కథ!

ఇంక, ఆ రోజుల్లోనే, పిల్లకోసం "బాలప్రభ" విభాగం నిర్వహించేవారు. అందులో శ్రీ వీ ఎస్ సుక్తాంకర్ వ్రాసిన ఓ పిల్లల నవల అనువాదం "వనసీమలలో....." పేరుతో ప్రచురించారు. 

".......ఇంత వయసువచ్చినా ఇంకా అమ్మా అంటూ యేడుస్తున్నావు
--సిగ్గులేదా" అంటూ "ముసలి నాయకుడు" హీరోని తిట్టడంతోననుకుంటా నవల మొదలవుతుంది. కథనం మొత్తం ఉత్తమ పురుషలో హీరో చెపుతున్నట్టు సాగడంతో, హీరో పేరు తెలియదు. హీరో స్నేహితులు గోబో, వాళ్ల చెల్లెలు ఫలీనా వగైరాలతో, అడవుల్లో వాళ్లు పడే కష్టాలూ, మూడో చెయ్యి కలిగిన మానవులు సాగించే మారణహోమం, ముసలినాయకుడు ఆపదల్లో వున్నవాళ్లని కాపాడడం, వుచ్చుల్లోనుంచి కూడా సమర్థంగా తప్పించడం లాంటి ఆసక్తికర కథనాలతో నవల వేగంగా చదివించి (మళ్లీ వారం యెప్పుడు వస్తుందా అని అత్యంత ఉత్కంఠతో యెదురు చూసేవాళ్లం!), ఒక తరం కథ పూర్తి చేసి, చివరికి హీరో తలమీద యెగురుతున్న ఈగలు "ఈయనెవరనుకున్నావు? ఇప్పుడు ముసలి నాయకుడు!" అని చెప్పుకుంటూండడంతో ముగుస్తుంది!

ఇంతకీ ఆ హీరో వాళ్లూ--అడవిలో జింకలూ, దుప్పులూ!

ఇలాంటి నవల మళ్లీ ఇప్పటి వరకూ రాలేదు. యెక్కడైనా దొరుకుతుందో లేదో తెలీదు. 

మళ్లీ యెవరైనా ప్రచురిస్తే చదవాలని వుంది. అందరిచేతా చదివించాలని వుంది!