Friday, January 27

బ్లాగుసోదరులకి విజ్ఞప్తి



నా క్రొత్త బ్లాగు

నా "కృష్ణశ్రీ" బ్లాగుని రెండుగా భాగించి, "కృష్ణశ్రీ స్వగతాలు" కొనసాగిస్తూ, రెండోదానికి "కృష్ణశ్రీ విసుర్లు" అని పేరు పెట్టాను. 

కానీ, మన "సంకలినుల్లో" అది కనిపించడం లేదు. వాటికి లింకు పెట్టుకొనే వోపిక లేదు నాకు.

అందుకే, దయచేసి, ఈ క్రింది లింకు తెరిచి, నా టపాలు చదువుతారని ఆశిస్తూ, 



మీ

కృష్ణశ్రీ

Saturday, January 21

శతజయంతీ వగైరా......



......కార్యక్రమాలు

ప్రసక్తి వచ్చిందికాబట్టి, మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలూ, నా షష్టిపూర్తీ, మా అమ్మగారి సహస్రచంద్ర దర్శనం కార్యక్రమాల గురించి మా అబ్బాయీ, కోడలూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటన ప్రచురిస్తున్నాను. 


12-12-2011 (సోమవారం) మా తాతగారు కీ.శే. అమ్మనమంచి నరసింహ మూర్తిగారి శతజయంతి.
సంవత్సరమంతా, ఆయన శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ, 12-12-2012 (బుధవారం) సమాపనోత్సవాలు
నిర్వహించాలని సంకల్పం.

వాటితోపాటు, మా మామ్మగారు శ్రీమతి అమ్మనమంచి లక్ష్మీ కాంతం (నరసింహ మూర్తిగారి భార్య)
సహస్రచంద్ర దర్శనోత్సవం”,
మా నాన్నగారు అమ్మనమంచి కృష్ణ శాస్త్రి (విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ అధికారి)
షష్టిపూర్తి మహోత్సవం
వరసగా మూడురోజులలో నిర్వహించాలని సంకల్పించాము.

ఉత్సవాలకి మా తాతగారి
మిత్రులూ, సహోద్యోగులూ, శిష్యులూ, ప్రశిష్యులూ, మరేవిధంగానైనా ఆయనకి పరిచయస్తులు, వారి వారి వారసులు;

అలాగే
మా మామ్మగారి (పిరాట్ల కొండయ్య గారి కుమార్తె) తరఫు బంధు మిత్రులూ, పరిచయస్తులూ, వారి వారసులూ;

మా
నాన్నగారి సహాధ్యాయులు, సహోద్యోగులు, బ్లాగ్ మిత్రులూ, వారి వారి వారసులూ,
మా అమ్మగారి (దర్భా లక్ష్మణ శర్మ గారి కుమార్తె కృష్ణ భారతి) తరఫు బంధు మిత్రులూ, వారి వారి వారసులూ
అందరూ, సకుటుంబ సపరివారంగా, ఆహ్వానితులే!

ఉత్సవాలకి అందరూ తప్పక విచ్చేయమని పత్రికా ముఖంగానే ఆహ్వానం. (రాబోయే ప్రకటనలు కూడా చూడండి).

దయచేసి, మీ రాకని తెలియపరుస్తూ, క్రింది ఈమెయిల్ అడ్రెస్ కి మెయిల్ పంపిస్తే, మీ వివరాలు రిజిస్టరు చేసుకోబడతాయి. అవసరమైతే, మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడతాయి.

రాదలచుకొని, రాలేకపోతున్నవారికిఅవసరానుగుణంగాతగిన యేర్పాట్లు జరపడానికి ప్రయత్నిస్తాము.

దయచేసి, అందరూ ఆహ్వానాన్ని మన్నించి, ప్రత్యక్షంగా కలిసి, ఉత్సవాలని జయప్రదం చెయ్యాలని మా ఆకాంక్ష.

ఇట్లు,

అమ్మనమంచి శశికాంత్ భరద్వాజ్ (Mobile : 94414 93523)
అమ్మనమంచి అరుణ రమ్య
అమ్మనమంచి నరసింహ మూర్తి శతజయంతి ట్రస్ట్, నరసాపురం.

(రిజిస్ట్రేషన్ అనేది కేవలం మీకు సరియైన సదుపాయాలు కల్పించి, మీరు మాతో ఆహ్లాదంగా గడపడానికి దోహదం చేసి, మరువలేనిదిగా చెయ్య్డానికి మాకు తోడ్పడాలనే.)

అలాగే, శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవం గురించి కూడా--ఇంకో టపా.

అందరూ ముందుగానే ప్లాను చేసుకుంటారని యేడాది ముందుగానే ఆహ్వానాలు పంపిస్తున్నాను. 

బ్లాగు మిత్రులందరూ తప్పక కలుస్తారని ఆశ! 

మీ సహయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ.....
Posted by Picasa

Friday, January 20

పురుషులూ.......



........పుణ్య పురుషులూ

రిటైర్ అయ్యాక యేవో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా, ఇంకేదైనా చేస్తే బాగుంటుందనిపించింది. 

మొన్న 12-12-2011న మా నాన్నగారి 100వ పుట్టినరోజు సందర్భంగా, కీ.శే. అమ్మనమంచి నరసిం హమూర్తి శతజయంతి ట్రస్ట్ అని స్థాపించి, యేడాది పొడుగునా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, 12-12-12 నాటికి సమాపనోత్సవాలు కొంచెం ఘనంగా నిర్వహించాలని తలపోశాను. 

పనిలో పనిగా మా పిల్లలు నాకు షష్టిపూర్తీ, మా అమ్మగారికి సహస్ర చంద్ర దర్శనోత్సవం కూడా జరిపిస్తే బాగుంటుంది అని, దాన్ని మూడురోజుల కార్యక్రమంగా మార్చారు. 

ఆ రోజులకి మా నాన్నగారి పరిచయస్తులూ, వారి వారసులూ, నా సహోద్యోగులూ, మిత్రులూ, వారివారసులూ, మా బంధు మిత్ర వర్గాన్ని ఆహ్వానించి, చక్కగా కార్యక్రమాలు నిర్వహించాలని, మొన్న 12-12-2011న శతజయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించాము.

కొంతమంది అడిగారు--యేమి సేవలు చేస్తారు? అని. మా కార్యక్రమాలు అన్నీ వివరించి, ఈ రోజుల్లో యెన్నెన్నో ట్రస్టులూ, సేవా సంస్థలూ, లయన్స్, లయన్ లేడీస్, లియో, రోటరీ, రోటరాక్టు, కేటరాక్టు లాంటి సంస్థలున్నా, సామాన్యుడికి వుపయోగిస్తున్నవి చాలా తక్కువ వున్నాయి అని చెప్పాను.

తరువాత, మొన్నో విషయం తెలిసింది నాకు. అది మీకు చెప్పాలనే ఈ టపా.

మా ఇంటికి దగ్గరలోనే, గవర్నమెంట్ ఆస్పత్రి వుంది. ఆ ఆస్పత్రి వున్న సెంటర్లో సన్యాసిరావు అని ఒకతను ఓ కూరగాయలకొట్టు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. కులం రీత్యా రజకుడు. తన వ్యాపార సంబంధమై, తన ఇతర సమస్యలతో సతమతమౌతూ, ఆర్థికంగాకూడా అంతంతమాత్రమే గా గడుపుతున్నాడు.

ఒకరోజు, ఆస్పత్రికి వచ్చిన ఒకతను, అక్కడ ఇచ్చిన బ్రెడ్ తెచ్చి, "నేను ఈ బ్రెడ్ తినలేకపోతున్నాను, ఇది తీసుకొని, డబ్బులిస్తే, ప్రక్కన బండిలో వేస్తున్న దోశ కొనుక్కుంటాను" అని బ్రతిమాలాడట సన్యాసిరావుని. జాలిపడి, అలాగే ఇచ్చాడు. 

అది మొదలు, తానే అన్నం, కూరలూ వగైరాలు వండించి, ఆస్పత్రికి వచ్చేవాళ్లందరికీ--రోజుకి ఓ ఇరవైమందికి తక్కువగాకుండా "అన్నదానం" మొదలు పెట్టాడు!

ఇప్పుడు ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి, ఒక్కో రోజు ఖర్చు మొత్తం మేము భరిస్తాము అని కొనసాగిస్తున్నారు. యెవరూ చెయ్యనిరోజున తానే నిర్వహిస్తున్నాడు.

ఓ సామాన్యుడైన ఆ వ్యక్తి అలాంటి "బృహత్తర" కార్యక్రమం చేస్తున్నాడంటే.......పుణ్యపురుషుడు అనాలా వద్దా?

ఈ సోకాల్డు "సేవాదారులు" బుధ్ధి తెచ్చుకుంటే బాగుండును.

Monday, January 2

తమిళనాడులో.........


 ........గుళ్లూ, గోపురాలూ

31-12-2011 న వుదయమే చెన్నై నుంచి బయలుదేరి, శ్రీకాళహస్తి వెళ్లాము. ప్రాచీనమైన ఆలయం చాలా బాగుంది.

పాతిక ముఫ్ఫై అడుగుల యెత్తు రాతి స్థంభాలతో మంటపాలు, అద్భుతమైన శిల్పకళా. జనం పెద్దగా లేరు. అయినా ప్రత్యేక దర్శనమైతే త్వరగా అవుతుందని, టిక్కెట్లు తీసుకొన్నాము. దానిక్కూడా పకడ్బందీగా, ముందుకీ, వెనక్కీ వెళుతూ, ఆలయంలోకూడా ఓ ప్రదక్షిణం చేస్తూ, లోహపు బారికేడ్ క్యూలు. అంతా ముగిసి, గర్భాలయం వద్దకు చేరితే, అక్కడో పావుగంటపైగా క్యూల ఆపివేత—అర్చనలూ అవీ చేయించుకొనేవాళ్లకోసం అనుకుంటా. తీరా దేవుడిముందు నిలుచొని, తేరిపార చూద్దామనుకొనేసరికి, “వాంగో, వాంగో—పోయ్యా” పిలుపులూ, హడావిడీ! బయటికి వచ్చే క్యూలో వెనక్కాల యెవరూ లేకపోయినా, వున్న నలుగురినీ “వాంగో, వాంగో”లు—పాపం వాళ్లకి అలవాటయిపోయిందనుకుంటా—యేం చేస్తాం!

ఈశ్వర లింగం ప్రత్యేకంగా వుంది. సినిమాలలోనూ, భక్తకన్నప్ప విగ్రహాం ప్రక్కనా వున్న ఆకారం లో లేదు. పొడుగ్గా ఓ స్థంభం లా వుంది. ఓ ఐదడుగులుంటుంది. దానిమీద మూడు సర్పాకారాలు మనవైపు కనపడే విధంగా నిలువుగా చెక్కబడి వుండి, చిన్న చిన్న పడగలు లింగం కన్నా కొంచెం పైకి కనిపిస్తూ, బార్బ్డ్ వైర్ ఫెన్సింగుకి వాడే స్థంభాలని తలపించింది.

తరువాత అమ్మవారి దర్శనం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక. అక్కడా జనం పెద్దగా లేకపోయినా, క్యూ ఓ చుట్టుతిరిగి, గర్భ గుడి ముందరికి వచ్చేవరకూ హడావిడే. అయ్యాక “వాంగో”లు మామూలే.

ప్రసాదాలు కొనుక్కోవడం, వుచిత ప్రసాదం క్యూలు, డబ్బులిచ్చి, యేనుగుచేత నెత్తిమీద తొండంతో మొట్టించుకొనేవారూ, బయట కళా వస్తువులూ, బొమ్మలూ, పిల్లల ఆటవస్తువుల దుకాణాలూ అన్నీ మామూలే.

తిరిగి వస్తూ వరదయ్యపాళెం లో భోజనం చేసి చక్కావచ్చాము సాయంత్రానికి ఇంటికి.

మొన్న కేరళ ట్రిప్పులో చూడలేకపోయిన మథురా, రమేశ్వరమూ వగైరాలు ఈ సారి చూసి వద్దామనుకున్నా, ఓ రెండు రోజులు థానే సైక్లోను వల్ల ప్రణాళికలు రద్దయ్యాయి. వెళ్లడం పెద్ద పెద్ద ఏసీ కార్లలోనే, ఒళ్లలవకుండా వెళుతున్నాము అనుకుంటూ, వెళ్లడమేగానీ, బడలికా, నడుం, కాళ్ల నొప్పులూ మామూలే. (ఈ కార్ల కంపెనీలవాళ్లు కూడా, కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది అంటూ వినియోగదారులని మోసం చేసి, లక్షలు నొల్లుకుంటున్నారు!). ఈ సారీ అవన్నీ చూడ్డం కుదరలేదు.

మర్నాడు, 01-01-2012 వుదయమే 7-00 బయలుదేరి కంచి ప్రయాణం. కంచి ఇంకా దగ్గిర. “అన్నీ” చూసుకొని, షాపింగులు పూర్తి చేసుకొని, సాయంత్రానికల్లా చెన్నై చేరాలని ప్లాను.

కంచి దేవాలయాల పట్టణం. అనేక, పెద్ద పెద్ద, విశాలమైన, యెత్తైన, ఆలయాలూ, కోనేళ్లూ, ప్రాకారాలతో వుంటాయి. దానికి తోడు, “పట్టు సంఘాల” పరిశ్రమ వల్ల, ఆలయాలన్నీ 12-30 కి మూసేసి, మళ్లీ సాయంత్రం 4-00 కి తెరుస్తారుట. (దుకాణాల వాళ్లకి రోజుకి ఇన్ని అని పాసులు ఇచ్చేస్తారట. వాటిని వాళ్ల దుకాణం లో చీరలూ అవీ యెక్కువ కొన్న వాళ్లకి ఇచ్చేస్తారట దుకాణాలవాళ్లు. మొన్నీ మధ్య, ఆ పాసులు వాళ్లు ఆటోలవాళ్లకీ, బ్రోకర్లకీ అమ్మేసుకుంటున్నారనీ, వాళ్లు తిరిగి “భక్తులకి” రెండేసి, మూడేసి వేలకి అమ్మేసుకుంటున్నారనీ గొడవజరిగి, ఇప్పుడు ఆ పాసులు రద్దు చేశారట!)

ఇంక, మొదటిగా కామాక్షి అమ్మవారిని చూసి, తరవాత విష్ణు కంచీ, భోజనమూ, షాపింగూ, తరవాత శివకంచీ, తరవాత తిరుగు ప్రయాణం అనుకున్నాము.

కామాక్షి అమ్మవారి కోవెల చాలా పెద్దది. నాలుగువైపులా గోపురాలూ, యెత్తైన స్థంభాలతో మంటపాలూ, లోహపు కడ్డీల బారికేడ్ల క్యూ లైన్లూ అన్నీ మామూలే. విశేషం యేమిటంటే, ప్రత్యేక దర్శనాలు లేవు. ఆలయంలోపల గోడలమీద చక్కగా తమిళంలోనూ, హిందీలోనూ స్తోత్రాలు చెక్కారు—పాలరాతి టేబ్లెట్లమీద. అవి చదువుకుంటూ వెళితే టైము తెలియలేదు. క్యూ కదలడం, మళ్లీ ఓ ఇరవై ముఫ్ఫై నిమిషాలు ఆగిపోవడం మామూలే.

ఆంగ్ల సంవత్సరాది కూడా మనకి ఓ పర్వదినమైపోయింది. దానికి తోడు, యెర్ర బట్టలదీక్షాపరులు తండోపతండాలుగా బస్సులలో తరలి రావడం……ఇక చూసుకోండి….ఇసకవేస్తే రాలని జనం! (నల్లబట్టలవాళ్లకి ప్రతిగా ఈ యెర్రబట్టల దీక్షలు ప్రవేశపెట్టారట. వీళ్లు దేశంలోని అన్ని అమ్మవారి ఆలయలూ దర్శిస్తారట ఈ సీజన్లో.)

యెంత తొందరగా అనుకున్నా, మూడు గంటలూ పట్టేసి, మళ్లీ వరదరాజ స్వామి కోవెల చేరేసరికి, “దుకాన్ బంద్!” అక్కడో గంట కూర్చొని, ఫలహారాలు కానిచ్చేసి, బయలుదేరి, షాపింగూ.

ప్రతీ దుకాణం వాడూ—“వూరికే చూడండి, కొనకపోయినా ఫరవాలేదు” అంటూ ఆహ్వనాలూ, "మీకు షార్టులూ, టీ షర్టులూ, మాకు చీరెలూ, పిల్లలకి డ్రెస్సులూ, మనవలూ, మనవరాళ్లకి డ్రెస్సులూ, బొమ్మలూ, పూజా మందిరంలోకీ, దేవుడి గూట్లోకీ, ప్రమిదలూ, దీపం సెమ్మెలూ, అత్తగారికి రుద్రాక్షమాలా, ఓ నెమలి విసెనకర్రా—" ఇలా ఆ లిస్టు పెరిగిపోతూ, మధ్యలో పిల్లలకి ఐస్ క్రీములూ, చాకలెట్లూ, గుడ్డేలూ, డ్రింకులూ…….సా…..గి పోతూ షాపింగు పూర్తయి, శివకంచి అనబడే “ఏకాంబరేశ్వర స్వామి” ఆలయానికి చేరాము.

అదో పెద్ద ప్రహసనం. ఆలయం చాలా బాగుంది. మామూలే. 3-30కల్లా గుడి తలుపులముందు చేరడం ప్రారంభించారు “భక్తులు”. ఈసక వేస్తే రాలని జనం మామూలే. రొజ రొజ రొజగా మాటలూ, చెమటలు కక్కుకుంటూ, నొక్కుకుంటూ, సొక్కుకుంటూ, ఇష్, అష్, అనుకుంటూ “కంచిగరుడసేవ”!  కొంతమంది వుత్తరాది భక్తులు, “జై భోలేనాథ్” అంటూ పాటలూ, సంకీర్తనలూ పాడుతున్నా, జనం గొడవలో అవన్నీ బూడిదలోపోసిన పన్నీరూ, అడవిగాచిన వెన్నెలా అయిపోతున్నాయి.

నిక్కీ, నీలిగీ, 4 దాటాకెప్పుడో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకటే తోపులాట. క్యూలూ, బారికేడ్లూ లేవు. తోసుకున్నవాడికి తోసుకున్నంత మహదేవా! తీరా లోపల కొంతదూరం వెళ్లాక, గుమ్మందగ్గర ఒకడు ప్రత్యక్షం—కండక్టర్లదగ్గరుండె టికెట్ ఇస్యూయింగ్ మెషిన్ ఒకటి చేతిలో పట్టుకొని, "ఇది ప్రత్యేక దర్శనం క్యూ—అందరూ ఐదేసి రూపాయలు చెల్లించి, టిక్కెట్లు తీసుకోవాలి. లేదా, వెనక్కి వెళ్లి, వుచిత దర్శనం క్యూలో చేరండి"—అని గదమాయిస్తున్నాడు. ఈ తోపులాటలు అలవాటులేని జనాలు ఛస్తారా! చచ్చినట్టు ఐదేసిరూపాయలూ సమర్పించుకొన్నారు. (ఆ ప్రక్కనే వున్న బయటికి వెళ్లే దారి నుంచి “ఇన్ ఫ్లుయెన్స్” వున్నవాళ్లని ఈ క్యూలో కలిపేస్తున్నారు ఆలయ సిబ్బంది!)

లోపల మళ్లీ “వాంగో, వాంగో”లు మామూలే. ఇక్కడ మామూలుగా ఓ మూడడుగుల శివలింగం వుంది. క్రిందభాగంలో ఒక చిన్న పంచో, తువ్వాలో చుట్టబెట్టారు (యేకాంబరుడు కదా అనేమో!). బయటికి వచ్చి,  ప్రాంగణం ఓ సారి చూసి, బయటికి వచ్చి, ప్రసాదాలు కొనుగోళ్లూ, పిల్లలకి నైవేద్యాలూ, ముగించుకొని గుడి బయటికి చేరాం.

(ఇక్కడ కూడా, “దుకాణాల” సంగతీ, యేనుగు తొండం మొట్టులూ వగైరాలు మామూలే. యెక్కడా భక్తులకి సూచనలిచ్చే బోర్డులు లేవు. వున్నా, తమిళంలోనే వున్నాయి. ఆలయ ముఖ్య గోపురం బయటే చెప్పులు వదిలితే, తిరిగి వచ్చేసరికి అవన్నీ గుట్టలు పోసేసి వుంటున్నాయి! లోపల మళ్లీ “వుచిత” పాదరక్షల నిలుపు స్థలం వేరే వుంది! బయట, గోపురానికి యెడం ప్రక్కన టాయిలెట్లు వున్నాయి. అవి వుచిత సేవలు. కానీ అక్కడొకడు దౌర్జన్యంగా మనిషికి రెండేసి రూపాయలు వసూలు చేసేస్తున్నాడు. గుడిలో--ఫారినర్స్ కి కూడా, దర్శనం వుచితం, యెవరికీ డబ్బులు ఇవ్వొద్దు—అని బోర్డులు పెట్టారు! మరి టాయిలెట్లకి—అక్కడ అధికారిక బోర్డు, తమిళం లోనైనా యేమీ లేకుండా డబ్బులు దండుకుంటున్నారంటే, సంబంధిత శాఖలవాళ్లు……….???!!!)

కాస్త కాఫీ తాగి, “ఇప్పుడెక్కడికి?” అంటే, మధ్యాహ్నం నుంచీ, "కంచికి వచ్చి బల్లిని ముట్టుకోకుండా వెళ్లడమేమిటీ? యేమైనాసరే తిరిగి వరదరాజ కోవెలకి వెళ్లవలసిందే" అంటూ సణుగుతున్న మా “యేమండీ” (మా మనవడి భాషలో మా ఆవిడ!) “బల్లిని తాకిన గాలినే ముట్టుకుంటున్నాము, చాల్లెండి, బయటనుంచే ఓ దణ్నం పెట్టేసుకొని, ఇంటికి వెళ్లిపోదాము!” అంది.

తిరిగి, సాయంత్రం 8-00 కల్లా క్షేమంగా ఇంటికి చేరాము.

అవండీ మా యాత్రా విశేషాలు.

(ఈ పుణ్యక్షేత్రాల నిర్వహణ గురించీ కొన్ని “ఇమ్ ప్రూవ్ మెంట్స్” విషయంలో నా  సలహాలు మరో టపాలో!)