Wednesday, March 30

మూడో హనీమూన్ అనే.... - 2

మొన్నటి మా యాత్ర

మాది ఓ చిన్న చక్రాల సూట్ కేస్; ఓ బిగ్ షాపర్ లో రెండు దుప్పట్లూ, లుంగీ, టవలూ వగైరా రైల్లో వాడుకునే వాటితో--అంతే లగేజి.

కాకినాడలో మా చెల్లెలుదీ, బావగారిదీ రెండు చిన్న ఎయిర్ బ్యాగులు. అంతే. తరవాత, కాకినాడలో షాపింగ్ చేసి, మా ఢిల్లీ చెల్లెలు ఆదేశం ప్రకారం--వాళ్ల అత్తగారూ, తోటికోడళ్లూ వాళ్లకి మేము పెట్టవలసిన బట్టలూ, తను మాకు పెట్టవలసిన బట్టలూ (అక్కడ మంచి చీరలూ వగైరా దొరకవు కాబట్టి), తనకో వాచీ వగైరాలు కొనేసి, ఇంకో పెద్ద ఎయిర్ బ్యాగ్ నింపేశారు. 

అది కాకుండా, వెళ్లేది ఢిల్లీ వైపు కాబట్టి, మన తిండి దొరకదు అని ఇంకో బిగ్ షాపరూ! అందులో........

(నేను అంటానూ--మర్నాడు పొద్దున్న వరకూ అంధ్రాలోనే వుంటాము, ప్యాంట్రీ కార్ కూడా వుంది.....యెంతైనా వాడు పెట్టేవి కాస్త తినబుల్ గానే వుంటాయి కాబట్టి అన్నీ మోసుకెళ్లఖ్ఖర్లేదూ అని. మా బావగారేమో--నాకసలు తిండి ప్రాబ్లెం లేదు--ప్రతీ స్టేషన్లోనూ "బ్రెడ్ ఆమ్‌లెట్" దొరుకుతుంది--అని ప్రకటించేశారు. ఆయన చిన్నప్పటినించీ వాళ్ల నాన్నగారి వుద్యోగరీత్యా యెప్పుడూ రైలు ప్రయాణాలు చెయ్యడంతో, ఆకలికి మండినప్పుడు ఆమ్‌లెట్లు తినడం అలవాటు చేసుకొన్నారు! ఆయనవీ, వాళ్ల నాన్నగారూ, అమ్మగారూ వాళ్ల ప్రయాణాలగురించి వ్రాయాలంటే ఓ పెద్ద గ్రంథమౌతుంది!)

ఇంక సమస్యల్లా ఆడవాళ్ల గురించే. ఇద్దరూ ఒకలాంటివాళ్లే! మా ఆవిడ మసాలా వాసన దూరం నించి సోకినా, చేతిలో వున్నది పారేస్తుంది! చెల్లెలైతే, "పార్టీల్లోనూ అక్కడా అయితే మొహమాటానికి యెంగిలి పడతాం. మన ఇంట్లోనూ, ప్రయాణం లోనూ యెలాగ?" అంటుంది. అందుకని, బయలుదేరిన రోజు రాత్రీ, ఆ మర్నాడు ప్రొద్దున్నా, ఆ రాత్రీ కి సరిపడా అన్నం వండేసి, పెరుగులో కలిపేసి, ఓ పెద్ద కేసెరోల్ లో పెట్టేశారు. (తరవాత్తరవాత ఆ కేసెరోలే 8, 9 మంది ఆకలి తీర్చింది మరి!)

అది కాకుండా, మా బావగారు కాకినాడలో ఓ ప్రసిధ్ధ దుకాణం లో ఓ బస్తాడు--కారప్పూసా, మిక్స్చరూ, జంతికలూ, చెగోడీలూ వగైరా--అన్నీ అరకేజీలనుకుంటా--ఇంకా బ్రెడ్డులూ (స్లైస్డూ, ఫ్రూటూ, బన్నులూ) 
........నింపేశారు. అక్కడకి ఓ సూట్ కేసూ, మూడు ఎయిర్ బ్యాగులూ, రెండు బిగ్ షాపర్లూ, ఆడవాళ్లిద్దరివీ రెండు బస్తాల్లాంటి హేండ్ బ్యాగులూ--అవీ మా లగేజి.

మా డ్రైవరు చాకచక్యం పుణ్యమా అని అంత లగేజీతో మేం నలుగురూ మా అల్టో కారులో సామర్లకోట చేరాం అన్నమాట. అక్కడేమో మా బండి మూడో ప్లాట్ ఫాం మీదకి (అంటే ప్రక్కకి) వస్తుంది! మళ్లీ కూలీలకి ఓ వంద రూపాయలకి బేరమాడి, (రైలు రాగానే వాళ్లే మా కంపార్ట్ మెంటులో లగేజి యెక్కించేలా) ప్లాట్ ఫాం మీద ఓ కిలో మీటరు నడిచి (కంపార్ట్ మెంట్ ఇంజను దగ్గరే వుంటుంది మరి!), రైలు రాగానే దాంట్లో పడ్డాం.

..........ఇంకా తరువాయి.

Monday, March 28

మూడో హనీమూన్ అనే



మొన్నటి మా యాత్ర  

ఈ మధ్య ఒకటి రెండు తప్ప, వరసగా టపాలు వ్రాయలేకపోయాను. యెందుకంటే.....మీరు సరిగ్గానే వూహించారు.....దేశమ్మీద తిరగడానికి పడ్డాను. 

హర్యాణాలో వుంటున్న మా ఆఖరు చెల్లెలు యెప్పటినించో రమ్మంటుంటే, వుద్యోగం లో సెలవలు లేవని వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు వుద్యోగానికి గుంటకట్టి గంటవాయించాను కాబట్టి, సరదాగా తిరిగొద్దామని బయలుదేరాను. 

మా రెండో చెల్లెలు, బావగారు కాకినాడ నుంచి బయలుదేరతామనడం తో, మార్చి 3వ తారీఖున "నిజాముద్దీన్ లింక్/దక్షిణ్ ఎక్స్ ప్రెస్" కి సామర్లకోటనించి నలుగురికీ రిజర్వేషన్ చేయించాను. 

రెండో తారీఖుని మా కారులో బయలుదేరి, ఆ రాత్రి కాకినాడలో చిన్న చిన్న షాపింగులు చేసుకొని, ఆ మర్నాడు మధ్యాహ్నం 3-30 గంటలకి సామర్లకోట బయలుదేరాము. రైలు 4-20 కి. కొంచెం లేటుగా వచ్చి, సుమారు 5-00 కి బయలుదేరింది మా రైలు.

ఢిల్లీ, హర్యాణా, హిమాచల్, యూపీ, రాజస్థాన్లు తిరిగి, మొన్న 24 న మధ్యాహ్నం 2-30 కి తిరిగి సామర్లకోటచేరి, కాకినాడలో ఆ రాత్రి వుండి, మర్నాడు వుదయం బయలుదేరి ఇంటికి వచ్చాము. 

మిగతా ఒక్కొక్క టపాలోనూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను.