Saturday, November 27

సూ ఋ సంస్థలు - 11

ఆగడాలా......ఆవకాయ తోకా!

అనుకున్నాను....మధ్యలో ఈ ఆవకాయ "తోక" యేమిటీ.....తొక్కైనా కాకుండా అంటారని.

మా చిన్నప్పుడు మా ఆవిడ తరఫు (అప్పటికి మా ఆవిడ కాలేదు లెండి) బంధువొకాయన ఓ ప్రైవేటు రికార్డు ఇచ్చాడు. ఒకాయన తన కొడుకుని 'చల్దివణ్ణాల గదిలో' ఆవకాయ వేసుకు తినమని వొదిలేస్తాడు. ఆ కుర్రాడు, 'నాన్నా' అని పిలుస్తూవుంటాడు. ఆయన 'యెందుకూ' అంటూ వుంటాడు. మొదట, ఆవకాయకి పళ్లొచ్చాయీ అనీ, ఆవకాయ కరుస్తోందీ అనీ, ఆవకాయకి తోకొచ్చిందీ అనీ, చివరికి ఆవకాయ పరిగెడుతోందీ అనీ జవాబిస్తూ వుంటాడు. అదన్నమాట.

ఇంతకీ, సూ ఋ సంస్థల "ఆగడాలని" అరికట్టాలని వొకటే గోల అందరూ....మీడియా సహా. 

తీసుకున్న అప్పు తీర్చమనడం ఆగడమా?

మొన్న (22-11-2010) ఈనాడులో 'చేకూరి శ్రీరామ్' అనే ఆయన (ఈయన దేనిలో నిపుణుడో వాళ్లు వ్రాయలేదు) సంపాదకీయం ప్రక్కనే ఓ వ్యాసం వ్రాశాడు. ఓ వందకోట్లతో ఓ పథకం ప్రారంభించి, 72 గ్రామీణ బ్యాంకులకీ మూలధనం గా పంచిపెట్టి.....ఇలా అంతర్జాతీయ స్థాయి వరకూ పనికొచ్చే 11 పాయింట్లు (అచ్చం ఓ గొప్ప బుర్రోవాదిలా) వ్రాశాడు. చివరిదాకా చదివితే, 'ఇవన్నీ జరిగేవేనా?' అనిపిస్తుంది.

పక్కింటికి యేదోపని మీద వచ్చిన సూ ఋ సంస్థ ప్రతినిధిని ఓ అరగంటసేపు నిలబెట్టి, మాక్కూడా అప్పిస్తారా? అని అడిగి, వాయిదా కన్నా యెక్కువ కట్టెయ్యచ్చుకదా? మా బరువే తీరిపోతుంది కదా! వడ్డీ యెంతైనా పరవాలేదు--కట్టేసేవాళ్ళం మాకేమిటి! పదో తారీకు దాకా అఖ్ఖర్లేదు--ఒకటో తారీకు కల్లా కట్టేస్తాం, మరి వెంటనే పని అయిపోతుందా? అని, రేషన్ కార్డూ, వోటరు కార్డూ జెరాక్సులు తీసుకొని, బ్యాంకులో యెకవుంటు తెరిచి, చెక్కుబుక్కు ఇచ్చేదాకా బ్యాంకువాళ్లని విషయించి, అది పట్టుకొని సూ ఋ సంస్థ దగ్గరకి వెళ్లి, సంతకాలు చేసేసి, వాళ్లిచ్చిన చెక్కు పట్టుకొని మళ్లీ బ్యాంకుకి వచ్చి, మార్చుకొని ఋణం సొమ్ముని అనుభవించడం యెందుకు?

తిరిగి చెల్లించవలసొచ్చేటప్పటికి కాళ్లు చల్లబడి, "మీవన్నీ ఆగడాలు, మేము కట్టం, గట్టిగా అడిగితే ఆత్మ హత్య చేసుకొంటాం!" అనడం యెందుకు?

వీటికి పరిష్కారం చూడకుండా, ఆర్డినెన్స్ లు అనీ, అథారిటీలు అనీ, బ్యాంకులని బలి చేస్తాము అనీ వీళ్లు విఱ్ఱవీగడం యెందుకు?

చివరికి ఆవకాయకి తోక రావడమే కాదు, పరిగెట్టి పారిపోతుంది కూడా!

యేమంటారు?

Friday, November 26

స్వవిషయం

ఈ మధ్య టపాలు వ్రాయడం లేదు. 

కారణం....సమయం దొరకకపోవడమే! అంత యేమి పాటుపడిపోతున్నారు.....అనెయ్యకండి.

దీపావళికి బెంగుళూరు నించి మా అబ్బాయీ, కోడలూ మనవణ్ణి తీసుకొని వచ్చారు 20 రోజులు పైగా సెలవు పెట్టుకొని. ఇంక నిజం గా బయటి ప్రపంచం తెలియలేదు.

రాత్రి 8 అయ్యేసరికల్లా, అమెరికానించి మా మనవలు (అమ్మాయి కొడుకులు) ఇద్దరూ వెబ్ కేమ్ లో వాళ్ల విద్యా ప్రదర్శనలూ, మమ్మల్నందరినీ ఇంటర్వ్యూలు.

దీపావళి తరవాత నవమి నాడు మా తండ్రిగారి ఆబ్దీకం--మా అన్నదమ్ములూ, చెల్లెళ్లూ, వాళ్ల పిల్లలూ, మనవడూ, మనవరాలూ అందరూ వచ్చారు--మా చిన్నతమ్ముడూ, మరదలూ, వాడి ఇద్దరుకొడుకులూ తప్ప.

మొన్న 22న మా మనవడి మూడో పుట్టిన రోజు (రెండు నిండాయి). అదో హడావిడి.

ఇక, మా బ్యాంకు నించి నాకు రావలసిన దాదాపు పాతిక లక్షలని ఇవ్వకుండా, వేలికీ కాలికీ వేస్తూ, జాప్యం చేస్తున్న బుర్రోవాదులూ! ఇప్పటికి వాళ్ల బుర్రలు వుపయోగించి, నా సొమ్ము నాకు ఇవ్వడం ప్రారంభించారు విడతలుగా!

వీటన్నింటి మధ్యా ఇంక సమయం యెక్కడ! మెయిల్స్ చెక్ చేసుకోడానికి కూడా సమయం లేదు. 

కంప్యూటర్ ఆన్ చెయ్యగానే, మా మనవడు వొళ్లో చేరి, వరసగా బా బా బ్లాక్ షీప్ నుంచీ, చందమామ చందమామ నుంచీ, ఆటల దగ్గరనుంచీ, వాడిష్టం వచ్చినట్టు అన్నీ నొక్కేసి, "క్లోజ్", "షట్ దౌం" అనేవరకూ! ఇంకెక్కడి ఇంటర్నెట్!

ఇదిగో, ఇప్పటికి మళ్లీ మేమిద్దరూ మిగిలాం లంకంత కొంపలో!

మళ్లీ మొదలెట్టాను--మిమ్మల్ని సుత్తితో బాదడం.

రడీయేనా?