కొత్త పథకం
చాలా రోజులే అయ్యింది ఈ వార్త చదివి. అప్పణ్ణించీ వ్రాద్దామనుకొని కూడా వ్రాయలేదు. ఇప్పుడు నిమజ్జనాల హడావిడిలో మళ్లీ గుర్తొచ్చి వ్రాస్తున్నాను.
హైదరాబాదులో తీవ్రవాదుల కుట్రల్ని తిప్పి కొట్టేందుకూ, నిఘా విభాగాన్ని పటిష్ట పరచేందుకూ, ఐదు కోట్ల ఖర్చుతో 155 కెమేరాలను కొనుగోలు చెయ్యడానికి టెండర్లు కూడా పిలిచేశారట, ఆగస్ట్ నెలాఖరుకి ప్రక్రియ పూర్తయిపోతుందట.
ఈ కెమేరాలని కీలక స్థానాల్లో పెట్టి, కంట్రోలు రూముకి అనుసంధానం చేస్తారట. అవి వందమీటర్ల దూరం లో వున్నా, వస్తువుని స్పష్టంగా చూపిస్తాయట. యెటుకావాలంటే అటు వీటిని తిప్పుకుంటూ, కంట్రోలు రూము నించే వీటిని నియంత్రించవచ్చట. రాత్రీ, పగలూ, వర్షం, మంచూ యేదైనా, చక్కగా పనిచేస్తాయట.
భవిష్యత్తులో వీటిని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తారట. ఇంకో 12 అదనపు కంట్రోలు రూముల్ని యేర్పరుస్తారట. ఇంకా 5 మొబైల్ వీడియో కెమేరాలని కూడా యేర్పాటు చేసుకొని, (టీవీ వాళ్లలా) సంఘటనల్ని చిత్రీకరిస్తారట!
(పోతే పోయాయి ఓ ఐదు కోట్లు కెమేరాలకీ, మరో యాభై కోట్లు కంట్రోలురూములకీ, మొబైల్ కెమేరాలకీ అనుకున్నా) ఈ నిఘా వ్యవస్థ కార్యరూపం దాలిస్తే, ప్రజలు నిశ్చింతగా వుండొచ్చు! అని ఆ నాటి వార్త.
ఆగస్ట్ నెలాఖరు గడిచింది, సెప్టెంబరు నెలాఖరు కూడా వస్తోంది, నిమజ్జనాలు అయిపోతున్నాయి, మరి ఈ నిఘా వ్యవస్థ యేమయ్యిందో?
అయినా మన పిచ్చి గానీ, మందమైన చర్మం గలిగి, ఆరు చేతులున్న కోతి లా, మిగిలిన నాలుగు ఇంద్రియాల్నీ ఆ చేతులతో మూసేసుకొని వుండే మన వ్యవస్థకి, ఈ కెమేరాలూ అవీ యెందుకు? (ఆయనే వుంటే, మంగలాడెందుకన్నట్టు!)