Saturday, August 28

వోటింగ్ మెషీన్లూ..........

...........యెన్నికలూ

నేనిదివరకే చెప్పాను--ఎలెక్ట్రానిక్ వోటింగ్ మేషీన్లని టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం--అని.

ఇప్పుడు, జేపీ (లోక్ సత్తా) ఈవీయెం లతో రిగ్గింగ్ జరుగుతుందనడానికి యెలాంటి ఆధారాలూ లేవనీ, కొందరు సదుద్దేశ్యం తో, కొందరు దురుద్దేశ్యం తో వీటిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు అనీ అన్నారు!

మరి సాంకేతిక నిపుణుడు హరి ప్రసాద్ మాటేమిటి?

వివిధ ప్రదేశాలనించి ఈవీయెం లని రప్పించి, సభాముఖం గా వాటిని టాంపరు చేసి చూపించమన్న యెన్నికల సంఘాం సవాలుని స్వీకరించి, యెవరూ నిరూపించలేక పోయారు.

మరి హరి ప్రసాద్ ఓ మెషీన్ ని దొంగిలించి, తన యింట్లోనో లాబ్ లోనో దాని పనిచేసే విధానం మార్చేసి, ప్రదర్శన ఇస్తాను, ఇది తప్పుగా ప్రవర్తిస్తుంది--అనడం యెంత హాస్యాస్పదం!

ఒక మెషీన్ ని మారిస్తే, అదేవిధం గా అన్ని లక్షల మెషీన్లూ యెలా మారిపోతాయి?

(ఆయన మీద దొంగతనం కేసుపెట్టడం వేరేసంగతి--ఆయన్ని విడుదల చెయ్యాలని కోరడం సమంజసమే)

ఇక, ఢిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఒమేశ్ సైగల్, సమాచార హక్కు ద్వారా తాను, ఈవీయెం చిప్ లపై ప్రోగ్రాం లు వ్రాయడానికి విదేశీ సంస్థల నుంచి బెల్, ఈసీఐఎల్ సేవలు వినియోగించుకున్నాయి అని వెల్లడించారు.

మెషీన్లు చక్కగా పని చేస్తున్నంతవరకూ, ప్రొగ్రాం యెవరు వ్రాశారు అనే మీమాంస అనవసరం కదా? అయినా ఆయన అన్నట్టు విచారణ జరిపిస్తే పోయేదేమీ లేదు.

ఇంక, అమెరికా లాంటి దేశాలూ, ఇతర ప్రజాస్వామిక దేశాలూ ఈ మెషీన్లని వాడక పోవడానికి కారణం వొక్కటే--వోటు వేసినట్టు నిర్ధారిస్తూ 'బీప్' వస్తుంది గానీ, ఫలానా గుర్తుకే వోటు పడింది అని నిర్ధారణగా వోటు వేసినవారికి తెలియదు!

దీనితో నేనుకూడా యేకీభవిస్తాను.

ఈవీయెం లలో గుర్తులు అంటించే ప్రాంతాన్ని పారదర్శకం చేసి, క్రింద ప్రతి గుర్తుకీ ఓ చిన్న బల్బు పెట్టి, వోటు వెయ్యగానే సంబంధిత గుర్తు క్రింద బల్బు వెలిగేలాగ చెయ్యగలిగితే, సమస్య పరిష్కారం అయిపోతుంది!

మన శాస్త్రఙ్ఞులు ప్రయత్నిస్తే బాగుంటుంది.

Sunday, August 22

తెలుగు బ్లాగుల

సంకలినులు

ఇవాళ ఈనాడులో (21-08-2010) తెలుగు బ్లాగుల సంకలినుల గురించి వ్యాసం వచ్చింది. ముఖ్యం గా వీవెన్ కూడలి, భా రా రె హారం, జాలయ్య జల్లెడ, భరద్వాజ్ మొదలైనవాళ్ల మాలిక గురించి వ్రాయడం జరిగింది. ఇంకా ప్రవీణ్ శర్మ సంకలిని కూడా ప్రస్తావించడం జరిగింది--ఇంకో సంకలినితో సహా.

అమ్మాయి సుజాత చక్కగా వ్రాసింది. (వృత్తి ధర్మం గా వ్రాశాను అనే అంటుంది లెండి).

ఇక చూస్కోండి--బ్లాగుల్లో, కామెంట్లలో రెచ్చిపోయారు కొంతమంది. 

ఈ సంకలినులు స్థాపించి, నిర్వహిస్తూ, తెలుగు భాషకీ, బ్లాగర్లకీ సేవ చెయ్యడం బాగానే వుంది. కానీ, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవలసిన అవసరం వుందా?

ఇక్కడ ఒకటే కనిపిస్తూంది--పర్సనల్ ఇగోలూ, కుల పిచ్చిలూ!

అసలు బ్లాగుల్లో "అనోనిమస్" గా, "అఙ్ఞాత" గా కామెంట్లు చెయ్యడం యెందుకు అనుమతించబడుతోంది?

ఒక వివాదాస్పదమైన విషయం లో తాము నిజం చెప్పగలిగి వుండీ, తమ అధికార స్థానం వల్లో, తమ సంస్థ నిబంధనలకి లోబడో వ్యాఖ్యానించలేనివాళ్లు, తమ అభిప్రాయాలని బయటపెట్టడానికి!

అప్పట్లో బ్లాగులు లేకపోవచ్చుగానీ, నిక్సన్ వాటర్ గేట్, క్లింటన్ సెక్స్ స్కాండల్ లాంటివి బయటపెట్టినవాళ్లు ఈ అఙ్ఞాతలే!

అలాంటి వున్నతమైన ఆదర్శంతో అనుమతించబడ్డ ఈ వ్యాఖ్యల్ని, తమ మెదడుకి తోచినట్టు, తమ నోటి దురద తీర్చుకోడానికి వుపయోగించడం యెందుకో--యెవరికి వారు అలోచించుకోవాలి.

పువ్వులూ, పళ్లూ, పురుగులూ, పేకముక్కలూ, చిన్నపిల్లలూ మొదలైన ఫోటోలు పెట్టుకోకండి! మీ ఫోటో పెట్టుకోండి! (శరత్ ఇప్పటికే ముందడుగు వేశాడు)

పప్పులూ, వుప్పులూ, చిన్నప్పటి ముద్దుపేర్లూ, కలలో తోచిన పేర్లూ వదలిపెట్టండి--మీ పేర్లు వ్రాయండి!

తెలుగు బ్లాగు లోకం చక్కగా వర్థిల్లాలంటే--ఇలా చేస్తే బాగుంటుందని నా సలహా!

తరవాత మీ యిష్టం!

Tuesday, August 17

వుద్యోగ విరమణ

నాకూ స్వాతంత్ర్యం వచ్చింది

నిజం!

కారణాలేమయితేనేం--నా వుద్యోగానికి నేను సమర్పించిన రాజీనామా 13-08-2010 నించీ ఆమోదించబడింది.

ఇక నాకు స్వాతంత్ర్యం వచ్చినట్టేకదా?

దాదాపు 37న్నర సంవత్సరాలుగా, తెల్లారి లేచి, ఓ ప్రక్క కాలకృత్యాలు తీర్చుకుంటూనే, "ఇవాళ బ్యాంకులో చెయ్యవలసిన ముఖ్యమైన పనులేమిటి, రాబోయే సమస్యలేమిటి, వాటిని యెలా అధిగమించాలి, ముఖ్యం గా సహనం కోల్పోకుండా, అన్నీ భరిస్తూ వుద్యోగం యెలా చేసుకోవాలి" ఇలాంటి ఆలోచనల్తో సమయానికి బ్యాంకుకి చేరుకొని, సీట్లో కూర్చొని--పొద్దుణ్ణించీ చేసుకున్న ఆలోచనలు గాలికి పోగా, రొటీన్ గా చక చకా పని చేసుకొని, మధ్యలో లంచి చేసి, సాయంత్రం బయటపడి, కాసేపు కొలీగ్స్ తో ఖబుర్లాడుకొని, ఇంటికి చేరడం అనే రొటీన్ నించి విముక్తి--యెంత స్వాతంత్ర్యం!

ఇక నించీ 'ఫ్రీ బర్డ్' అనుకొంటే సంతోషం గానే వుంది.

ఇక చెయ్యవలసిన పనులు, వాటి ప్లానింగ్ వీటిపై దృష్టి పెట్టాలి అనుకుంటూండగానే, ముందు ఈ జీవితానికి అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నాను!

మిగిలిన ముచ్చట్లు తరవాత.

Thursday, August 12

విశిష్ట గుర్తింపు

"ఆథార్" సంఖ్య

ఓ యాభయ్యేళ్ల క్రితమే, ప్రపంచాన్ని తమ సంగీతం తో వుర్రూతలూపిన "బీటిల్స్" అనే నలుగురు కుర్రాళ్లు వుండేవారు.

కంప్యూటర్లు ఇంకా రాని రోజుల్లోనే, వాళ్ల దేశ ప్రభుత్వం, వాళ్లకి పుట్టుకతోనే "విశిష్ట గుర్తింపు సంఖ్యలు" కేటాయించిందట--అందరు ప్రజలకీ ఇచ్చినట్టే! అది చిన్న దేశమే అయి వుండచ్చు, జనాభా తక్కువే అయి వుండవచ్చు--అయినా మనసుంటే మార్గముంటుందని నిరూపించింది కదా?

ఇక మన విషయానికొస్తే--సామాన్యుడిక్కూడా "విశిష్ట గుర్తింపు" వస్తోందంటే సంతోషమే కానీ--

ఇన్‌కమ్ టేక్స్ వాళ్ల పాన్ నెంబర్ల వ్యవహారం చూశాముకదా--ఒక్కోళ్లకీ పాతిక దాకా కేటాయించేసి, తరవాత జుట్లు పీక్కుని--ఒకటే వుపయోగించుకోవాలి, లేకపోతే అది నేరం అంటున్నారు!

రేషన్ కార్డులన్నారు; అందులో రంగులన్నారు; లంచమిస్తే రంగులు మారేవంటారు; డూప్లికేట్లు వచ్చాయన్నారు; బోగస్ వి వచ్చాయన్నారు; స్మార్ట్ కార్డులన్నారు; ఐరిస్ కార్డులన్నారు; బయో మెట్రిక్ అన్నారు--ఇప్పుడు కొన్ని వేల కోట్లతో "ఆథార్" సంఖ్యలంటున్నారు!

ఇప్పటివరకూ ఇలాంటి కార్డులకి యెన్ని కోట్లు ఖర్చుపెట్టారో యెవరైనా స. హ. దరఖాస్తు ద్వారా సేకరిస్తే బాగుండును.

ఇప్పుడు, ఈ ఆథార్ ప్రారంభం మన రాష్ట్రం లోనే చెయ్యడానికి నెలాఖరున ముహూర్తం పెట్టారట. తొలివిడత హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జారీ చేస్తారట.

ఈ ఆథార్ కి ఆథారం యేమిటో తెలుసా?

రాష్ట్ర "పౌర సరఫరాల శాఖ" వద్ద 'అందుబాటులో' వున్న మూడు కోట్లమంది ప్రజల సమాచారం అధారంగా జారీ చేస్తారట!

ఇక యెంత అందంగా వుంటాయో ఈ ఆథార్ సంఖ్యలు వేరే వూహించుకోవాలా!

మన రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో పెట్టుకుంటే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే!

భారతీయుడు సినిమాలో కమల్ హాసనో, యేదో సినిమాలో చిరంజీవో అన్నట్టు, లంచం, లంచం, లంచం అంటూ డైలాగు చెప్పుకోవాలి.

ఈ బాధలు పడలేక, నీ రేషన్ కార్డూ వద్దు, నువ్వూ వద్దు అని దశాబ్దం క్రితమే వదిలేసిన నాలాంటివాళ్లని ఇప్పుడు వంటగ్యాస్ బుక్ చేసుకోవాలంటే, "రేషన్ కార్డు లేదు" అని తాశీల్దారు దగ్గరనించి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు! (యెంతో కాదు లెండి--నూట యాభై మాత్రమే ఖర్చయ్యింది నాకు దానికోసం)

వోటరు లిస్టులు సవరించాలని ప్రభుత్వం ఆదేశించడం, సవరింపు పూర్తయిందని పేపర్లలో చదవడమే!

జనాభా లెఖ్ఖలు మొన్న ఏప్రియల్ 1 నించే మొదలయ్యాయట!

వూళ్లన్నీ తిరిగినప్పుడెలాగూ లేదు, ఈ వూరు చేరి 3 సంవత్సరాలైనా, ఈ విషయాల్లో మా దగ్గరకి వచ్చిన ఎల్ కే (అద్వానీ) యెవడూ లేడు!

గుడ్డిలో మెల్ల యేమిటంటే, ఓ పెద్దాయనకి ఈ ఆథార్ కార్డుల పని అప్పగించారట--కాబట్టి ఆ చిత్రగుప్తుడు వీళ్ల లెఖ్ఖలని యెలా సరిపెడతాడో చూద్దాం!   

అంతకన్నా యేం చెయ్యగలం!