Monday, May 24

పశువులక్లాస్

“పందావన్ ఎక్స్ ప్రెస్”

మొన్నామధ్య శశిథరూర్ అనే ఓ మంత్రిగారు, ‘మీరు క్యాటిల్ క్లాస్ (పశువుల తరగతి) లోనే ప్రయాణిస్తారా?’ అని అడిగిన ప్రశ్నకి, ‘తప్పకుండా’ అని జవాబిచ్చాడట తన బ్లాగు లో!

“అదుగో! పశువుల తరగతి అంటావా! హాత్తెరికీ” అంటూ రెచ్చిపోయారు కొంతమంది.

‘క్యాటిల్’ అంటే, మచ్చికయిన, పాలిచ్చే జంతువులు అని అర్థం అనుకుంటా.

మరి వీటిలో, పందులూ, గాడిదలూ వున్నాయోలేదో నాకు తెలీదు.

కానీ, ఆ క్లాస్ కి చక్కటి వుదాహరణ చెన్నై నించి బెంగళూరు వెళ్ళే ‘బృందావన్ ఎక్స్ ప్రెస్!‘

ఇదో చిత్రమైన రైలు. ఉదయం 7-15 కి చెన్నై సెంట్రల్ లో బయలుదేరి, 11-00 కల్లా బెంగళూరు చేరుతుంది. ఇంజన్ తరవాత ఓ ఐదారు ‘అన్ రిజర్వుడు‘ బోగీలు, మూడు ‘ఏ సీ’ బోగీలు, ఓ పేంట్రీ కార్, ఓ పదిహేను ‘రిజర్వుడు‘ బోగీలు—ఇదీ ఆ రైలు. అన్నీ ‘సిట్టింగ్ సీట్లే!’

ఉదయంపూట ఆహ్లాదం గా ప్రయాణం, దాదాపు నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం కదా అని ముచ్చటపడి రిజర్వేషన్ చేయించుకొని, యెక్కాము చెన్నై లో.

రిజర్వేషన్ లో నే తమాషా వుంది. ఒక్కో బోగీలో దాదాపు 100 సీట్లు వున్నాయి. మనం యెన్ని సీట్లు రిజర్వ్ చేసుకున్నా, రెండుకన్నా యెక్కువ సీట్లు ఒకేచోట రావు. నాలుగు సీట్లు చేసుకుంటే, నాలుగు చోట్ల వస్తాయి—ఇంకా నయం—ఒకే బోగీ లో వస్తాయి. ఉదాహరణకి, 17, 49, 62, 83 వచ్చాయి అనుకుందాం. మనం కాస్త మంచివాళ్ళలా కనిపించే వాళ్ళ ప్రక్కన మనకి రిజర్వ్ అయిన సీటు చూసుకొని, లగేజి పెట్టుకొని, అక్కడనించి నెంబర్లు వెతుక్కుంటూ మన పక్కసీట్లలోకి వచ్చేవాళ్ళని బతిమాలి, మన ఇతరనెంబర్లలో వాళ్ళని కూర్చోమని, వాళ్ళ నెంబర్లో మనం సెటిల్ అవుతాము. కాట్పాడి వచ్చేవరకూ, ఈ తతంగం సరిపోతుంది.

టీటీ వచ్చి, రిజర్వేషన్లు చెక్ చేస్తాడు—యే నెంబరు సీటు లోనూ అది రిజర్వు చేసుకున్నవాళ్ళు వుండరుగా? ఓకే,ఓకే అంటూ టిక్కులుపెట్టేసుకొని, వెళ్ళిపోతాడు. మాకు ఓ తమిళ ఆచారి వచ్చాడు టీటీ గా.

జాలార్ పేట వచ్చేసరికి, రిజర్వేషన్లున్నవాళ్ళు యెక్కడం పూర్తి అయిపోతుంది. ఈ లోపల, అనేకమంది, రిజర్వేషన్ లేనివాళ్ళు బోగీలో జొరబడిపోయి, సీట్లమధ్యనా, తలుపుల దగ్గరా, టాయిలెట్ల ముందూ, పిల్లా, మేకా, తట్టా బుట్టా తో సెటిల్ అయిపోతారు!

ఆ మధ్యలోనే, పద్మవ్యూహాల్లోని అభిమన్యుళ్ళలా, అనేకమంది—టీ, కాఫీ, వడా, సమోసా, దోశ దగ్గర నించి, పూసలూ, పిల్లలబొమ్మలూ, పుస్తకాలూ, పళ్ళూ, కూరగాయలూ—ఇలా అవతారాలుమార్చుకుంటూ—హాకర్లు! వాళ్ళు అమ్మని వస్తువంటూ వుండదు.

ఈ లోపల, టీ టీ రిజర్వు చేసుకొని రైలు యెక్కలేకపోయిన వాళ్ళ సీట్ల నెంబర్లు గుర్తిస్తాడు. (అప్పటికే, రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తున్నవాళ్ళు కొంతమంది ఆయనని ‘సార్! మాకు నాలుగు సీట్లు, మాకు రెండు సీట్లు—అంటూ దేబిరిస్తూ వుంటారు.) అలాంటివాళ్ళదగ్గర, వీలైనంత గుంజి, ఖాళీ సీట్లు కేటాయిస్తాడు. అవి కూడా ఒక చోట వుండవు కదా? మళ్ళీ వాళ్ళు వచ్చి, ‘ఆడవాళ్ళు వున్నారు, ప్లీజ్—మీరు యెదురుసీట్లో సర్దుకుంటారా?’ ఇలా అడ్జస్ట్ మెంట్లు మొదలు! (మా ‘పందాచారి ‘ అయితే, ఇలాంటివాళ్ళకి మద్దతు ఇచ్చి, రిజర్వు చేసుకున్న సీట్లవాళ్ళని దౌర్జన్యం గామీ సీటులోకి మీరు వెళ్ళిపోండి అని తరిమేశాడు!)

సరే—బంగారుపేట లో కూడా, యెక్కేవాళ్ళు యెక్కుతూనే వుంటారు—రిజర్వేషన్ లేకుండా! ఇక కే ఆర్ పురం వస్తుందనగా, మొదలవుతాయి యుధ్ధాలు—సెటిల్ అయిపోయిన వాళ్ళకీ, దిగేవాళ్ళకీ!

ఒకావిడ, తన బేగ్ క్రింద వేసుకొని, దానిమీద గుమ్మానికి అడ్డం గా కూర్చొని, ఒళ్ళో పిల్లాణ్ణిపెట్టుకొని, అందరినీ చెరిగేస్తోంది! ఆవిడకి మద్దతు—చుట్టూ నిలుచున్నవాళ్ళు—గుమ్మానికి అడ్డం గా!

ఓ పెద్దమనిషి పాపం, నిలుచున్నవాళ్ళలో ఒకణ్ణి, ‘మీరు ఇక్కడ దిగుతారా?’ అనడిగాడు—లేదు అంటే, కొంచెం జరగమనే వుద్దేశ్యం తో. దానికి అతని సమాధానం—‘నేనే కాదు—ఇంకో అయిదువందల మంది దిగుతారు. రైలు ఐదు నిమిషాలు ఆగుతుంది—అప్పుడే అందరూ దిగాలి!’ అని.

అడ్డం గా కూర్చున్న ఆవిడని ఇంకోపెద్దమనిషి, ‘కొంచెం పక్కకి తప్పుకో, మేము దిగాలి‘ అంటే, ఆవిడ సమాధానం ‘నేనుకూచోడానికే చోటు లేక పోతే, నీకు దిగడానికి చోటివ్వాలా? దిగితే దిగు, లేకపోతే మానెయ్యి!’ అని. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన, ‘లోపల సీట్లు ఖాళీ అవుతున్నాయికదా, వెళ్ళి కూర్చో, మాకు దారి ఇవ్వు‘ అంటే, ఆవిడ, ‘నువ్వెవరు—నాకు చెప్పడానికి?’ అంటూ కళ్ళెర్రజేసింది!

ఇక రైలు అగేసరికి, ఒకళ్ళనొకళ్ళు గెంటుకుంటూ, తోసుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ, అతికష్టం మీద బయట పడి, యెవరినో బతిమాలి, లగేజీలు కిటికీల్లోంచి బయటపడెయ్యమని, అందుకొంటూ, కదులుతున్న రైలు ప్రక్కన పరిగెడుతూ—బ్రతుకు జీవుడా! అని ప్రయాణం ముగించాలి!

యెలా వుందండి మన ‘పందావన్ ఎక్స్ ప్రెస్?’

Tuesday, May 11

'చొప్పించబడ్డ వార్తలు '

చెల్లింపు వార్తలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 'చెల్లింపు వార్తల'పై మరిన్ని అధికారాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి కట్టబెట్టాలని సూచించిందట. ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచించిందట.

కొన్ని వార్తా సంస్థలు తమ పత్రికలోని వార్తల స్థలాన్ని అమ్ముకుంటున్నాయని ఆ కమిటీ తన నివేదికలో వెల్లడించిందట.

ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి, పార్లమెంటు వ్యవస్థకు పెనుముప్పని హెచ్చరించిందట.

సవరణ చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరముందని స్పష్టం చేసిందట.

ప్రెస్ కౌన్సిల్ ఉపకమిటీ ఇచ్చిన నివేదిక పై యేం చర్యలు తీసుకున్నారో తెలెపాలని మంత్రిత్వ శాఖని కమిటీ కోరిందట.

మరి శాఖ యేం చెపుతుందో!

Thursday, May 6

"ప్రకటన"

చేస్తున్నవారు : "ఏకే రైట్ టు జస్టిస్.కామ్"

ప్రకటన యేమిటంటే :

"యెనభై ఆరో యెన్నో అభియోగాలు నిజమని నిరూపింపబడి, దోషిగా నిర్ధారణ అయిన 'అజ్ మల్ కసబ్' కి సరైన శిక్ష విధించే అవకాశం మా .కామ్ కి ఇవ్వాలని తగిన న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"ఆ శిక్ష అమలుచెయ్యడానికి ఉత్సాహపడే పౌరులెవరైనా ముందుగా మా .కామ్ లో రిజిష్టర్ చేసుకోవాలి. (రిజిష్ట్రేషన్ వివరాలకోసం మా .కామ్ సందర్శించండి)

"ఆ నేరస్థుడికి కూడా మానవహక్కులు వుంటాయనేవాళ్ళెవరైనా వుంటే, వాళ్ళని కూడా వీడితో సమం గా శిక్షించడానికి మాకు అనుమతి ఇవ్వాలని కూడా అదే న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"వాడికి విధించాలనుకుంటున్న శిక్ష యేమిటంటే--

"ఇండియా గేట్ లో మృతవీరుల స్మారక చిహ్నం యెదురుగా, ఓ స్థంభం పాతి, వాడిని గొలుసులతో కదలడానికి వీల్లేకుండా కట్టేస్తాం. అతని దగ్గరకి వెళ్ళడానికీ, అతని ముందు ఒకే సెకన్ వుండడానికీ, తిరిగి రావడానికీ ఒకే మనిషి పట్టే విధంగా క్యూ లైన్ యేర్పాటుచేసి, నడవక్కర్లేనివిధం గా యాంత్రిక పరికరాలని నిర్మిస్తాం.

"శిక్ష యేమిటంటే, యెవరైనా సరే తమ దగ్గర వున్న ఆయుధాలతో అతన్ని, తమకి తోచిన అతని అవయవాన్ని, కొయ్యడం గానీ, పొడవడం గానీ చెయ్యవచ్చు.

"అవి యెంత పదునైన ఆయుధాలైనా అయి వుండవచ్చు. 

"ముఖ్య నిబంధన యేమిటంటే--యే ఆయుధం అయినా 'మూడంగుళాలు పొడవూ, ఒక అంగుళం వెడల్పూ మించి వుండకూడదు '. (ఆయుధాలు ముందుగానే పరిశీలించబడి, అనుమతించబడతాయి).

"ఈ శిక్ష అమలవుతూండగా, మా సొంత టీవీ ఛానెల్లో 24 గంటలూ, ప్రపంచ వ్యాప్త 'లైవ్' కవరేజ్ వుంటుంది. (మధ్యలో ప్రకటనలకి మా వాణిజ్య విభాగాన్ని సంప్రదించండి)

"వాణ్ణి సమర్ధించే 'మానవహక్కులవాళ్ళకి' కూడా, వాడి ప్రక్కనే, ఇలాంటి శిక్షలకే యేర్పాట్లు చెయ్యబడతాయి.

"వాడి సానుభూతిపరులెవరైనా వున్నా, క్యూ లైన్లలో అందరితోపాటు వెళ్ళి, ఇదివరకు యెవరైనా కోసిన చోట కుట్లు వేసుకోవచ్చు, పొడవబడ్డ చోట, మందులు రాసుకోవచ్చు!

"ఈ మొత్తం కార్యక్రమం 48 గంటలపాటు మాత్రమే అమలవుతుంది. ఇంకొక్క సెకను కూడా పొడిగింపబడదు. గమనించండి. (ఒకళ్ళిద్దరు అటూ యిటూగా 1,72,800 మందికి మాత్రమే అవకాశం!) తొందరపడండి.

"గమనిక : ఈ శిక్షల ముఖ్యోద్దేశ్యం--ప్రపంచం లో యే తల్లైనా, 'తోటకూర నాడే' తన బిడ్డని 'ఉగ్రవాదివి కాకురా కన్నా!' అని వేడుకోవాలని.

"తరవాత మీ యిష్టం".

(ప్రకటన ఫూర్తయింది)

సూచన : యేమీ చెయ్యలేని నా కడుపు మంటని తీర్చుకోడానికి మాత్రమే ఈ ప్రకటనని రూపొందించాను. ఇది నిజమని యెవరూ నమ్మవద్దని నా మనవి. ఇట్లు : కృష్ణశ్రీ)

Sunday, May 2

పెట్రో ధరలు

వడ్డనకిది సమయమా?!

'ఆహార ద్రవ్యోల్బణం ఓ రెండు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది' అని శరద్ పవార్ చెప్పి ఆ సమయం గడిచిపోయింది అనుకుంటా.

తరవాతోసారి, 'నా వ్యవసాయ శాఖకీ, ద్రవ్యోల్బణానికీ యేమిటి సంబంధం?' అని విసుక్కున్నాడు.

ఇప్పుడు 'చూశారా! తగ్గిపోతోంది?' అంటున్నాడు.

(పాపం ఆయన క్రికెట్ కుంభకోణాలనే పట్టించుకుంటాడా, తన మంత్రిత్వ శాఖనే పట్టించుకుంటాడా, తరువాత ప్రథాని కావడానికి యెత్తులే వేస్తాడా! యెన్నని చూసుకోగలడు ఒకేసారి! మధ్యలో ఫోను ట్యాపింగులొకటీ!)

ఇదే సమయం లో యూ పీ యే ప్రభుత్వం 'పెట్రో ధరల నియంత్రణ ఎత్తివేత ' గురించి గంభీరం గా ఆలోచిస్తోందట. కేంద్ర మంత్రులతో సాధికార కమిటీని నియమించేశారట. దీని నాయకుడు, ఇంకెవరు--ప్రణబ్ ముఖర్జీయే! (వీరు తీసుకొనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం అమోదం అఖ్ఖర్లేదట!)

మే 7 తో పార్లమెంట్ సమావేశాలు ముగిశాకే నిర్ణయం వెలువడుతుందట.

ఈ చర్య వల్ల పెట్రోలు ఓ 6 రూపాయల చిల్లరా, డిజిల్ ఓ 5 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట. ఇక వంట గ్యాస్ ఓ 270 రూపాయలూ, కిరొసిన్ ఓ 18 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట.

ఇంకా, ఒకవేళ అంతర్జాతీయ ధరలకు అనుగుణం గా దేశీయ చిల్లర ధరల్ని పెంచాల్సి వస్తే, ఈ సాధికార సంఘం విడతలవారీగా పెంచొచ్చుట!

సరైన సమయం లో సరైన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఈ ప్రభుత్వం నిర్ణయం సబబేనంటారా?

గత ఎన్ డీ యే హయాములో, కొన్ని కోట్లతో ఆయిల్ పూల్ ఎకౌంట్ నిర్వహించి, దాంట్లో పెట్రో ధరల హెచ్చు తగ్గుల్ని సరిదిద్దేవారు. తరవాత, విపరీతమైన హెచ్చు తగ్గులు వుండవు అని నిర్ధారణ అయ్యాక, ఆ పూల్ రద్దు చేసి, ధరలని నిర్ణయించే అధికారం ఆ కంపెనీలకే వదిలేశారు అనుకుంటా. 

అప్పట్లో, ఫలానా రోజు నించి ధర 2 పైసలు తగ్గింది, మళ్ళీ ఫలానా రోజు నించి 5 పైసలు పెరిగింది--ఇలా రెండేసి మూడేసి రోజులకి కూడా మారుతూ వుండేవి ధరలు.

మరి యూ పీ యే వచ్చాక, ఆయిల్ పూల్ అవసరం అనిపించలేదనుకుంటా! పైగా, మురళీ దేవరా అస్తమానూ--పాతిక పెంచుతాను, యాభై పెంచుతాను అనుమతి ఇవ్వండి--అని అడుగుతూ వుంటాడు ప్రభుత్వాన్ని. 

ఇదిగో--ఇప్పుడు పులిమీద పుట్ర!

ఇంకెక్కడి ధరలు తగ్గడం!

తూర్పుకి తిరిగి దణ్ణం పెడదామా?