అధిష్ఠానం
మహాత్మా గాంధీ నించి, ఇందిరా పందీ సారీ ఇందిరా గాంధీ వరకూ (ఎమర్జన్సీ విధించాక ఆవిడని అలా అనేవాళ్ళం), సోనియా గాంధీ నించి రాబోయే రాహుల్ వరకూ--తెలుగువాళ్ళ పట్ల వాళ్ళ దృక్పథం--మారలేదు, మారదు, మారబోదు!
"1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికల్లో శ్రీ (తెన్నేటి) విశ్వనాధం విశాఖపట్నం నుంచి అఖండ విజయం సాధించారు.
ఆ సమయం లో ఆంధ్ర ప్రతినిధులు నలుగురు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు చెయిర్మన్ సర్దార్ పటేల్ ను కలుసుకోనడానికి వెళ్ళారు. వీరు (టంగుటూరి) ప్రకాశం గారికి వ్యతిరేకం గా ఢిల్లీలో ప్రచారం చేయడానికి వెళ్ళారన్న విషయం స్పష్టమౌతున్నది.
ఆప్పుడు తెన్నేటి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఇలా వుంది:
'ఈ నలుగురు ఆంధ్రులు సర్దార్ పటేల్ వద్దకు వ్యక్తిగతం గా వెళ్ళి వుండాలి (రాష్ట్ర పార్టీ అనుమతి తో కాదు). ఆంధ్ర ప్రాంత సభ్యులకు వారెంతమాత్రమూ ప్రతినిధులు కానేకారు. చెన్న రాష్ట్ర శాసన సభ్యులకు స్వేఛ్ఛగా తమ నాయకుని యెన్నుకునే హక్కున్నది. పరోక్షం గా కాని, అపరోక్షం గా కాని యెవరైనా వారిని నిర్బంధిస్తే, వారి హక్కులకు భంగం కలుగుతుంది.'
ఈ ప్రకటనను 'ఆంధ్ర కేసరికి ' తెలియకుండానే తెన్నేటి చేశారు.
ఆయన వుద్దేశ్యం--మద్రాసు ముఖ్యమంత్రి యెన్నికలలో కాంగ్రెస్ అధిష్టానవర్గం ప్రమేయం వుండరాదని, శాసన సభ్యులే స్వేఛ్ఛగా తమ నాయకుని (ముఖ్యమంత్రిని) యెన్నుకోవాలని!
...........చర్చించడానికి ఢిల్లీ రావలసిందిగా ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు మౌలానా ఆజాద్ తంతి పంపారు......'ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్ళకూడదు ' అని తెన్నేటి ఒక ప్రకటన చేశారు.
...........రాజాజీనే (చక్రవర్తుల రాజగోపాలాచారి ని--సియార్--అంటే హిందీలో జిత్తులమారి గుంటనక్క--అనేవారు) కాంగ్రెసుపార్టీ నాయకుడుగా, అంటే ముఖ్యమంత్రిగా యెన్నుకోవాలని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం మద్రాసు కాంగ్రెసు లిజిస్లేచర్ పార్టీ కి సూచించింది. 'మీరు హైకమాండ్ ఆదేశం పాటిస్తే పాటించండి. లేకపోతే, తత్పరిణామాల బాధ్యత మీదే' అన్న ధోరణిలో తిరిగి ఆజాద్ టెలిగ్రాం పంపించారు.
రాజాజీని నాయకుడుగా అంగీకరించాలన్న హైకమాండ్ ఆదేశాన్ని మద్రాసు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం లో 1946 ఏప్రిల్ 18 న వోటింగుకు పెడితే, రాజాజీకి అనుకూలం గా 38, వ్యతిరేకం గా 148 వోట్లు వచ్చాయి. ఈ సమావేశానికి ప్రకాశం గారి శిష్యుడు వి. వి. గిరి (తరవాత మన రాష్ట్రపతి అయ్యారు--ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డిని మోసం చేసి, అంతరాత్మ ప్రబోధం ప్రకారం వోట్లు వెయ్యమనడం వల్ల) అధ్యక్షత వహించారు.
..........కాగా ప్రకాశం గారు ఏ పరిస్థితిలోను ముఖ్యమంత్రి కారాదని కాంగ్రెసు హైకమాండ్, ముఖ్యం గా మహాత్మాగాంధీ ధృఢాభిప్రాయం.
ఈ విషయం లో మాత్రం గాంధీజీ వైఖరి ఏ విధం గానూ సమర్థనీయం గా కనిపించదు. ముఖ్యం గా--1942 నుంచి కాంగ్రెసు సిధ్ధాంతాలకు, ఆలోచనారీతికి వ్యతిరేకం గా వుంటూ, 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ప్రతిఘటించి, చివరికి పాకిస్తాన్ తీర్మానాన్ని సమర్థించి, ఆ స్వాతంత్ర్యోద్యమం చివరి ఘట్టం లో ఒక్కరోజు కూడా జెయిలుకి వెళ్ళకుండా, కాంగ్రెసు విథానాలను, మహాత్మా గాంధీ కార్యానుసరణ విథానాన్ని వెన్నుపోటు పొడిచిన--రాజాజీయే ముఖ్యమంత్రి కావాలని, అంతటి త్యాగధనుడు, మహా దేశభక్తుడు, ప్రజానాయకుడు అయిన ప్రకాశం గారు ముఖ్యమంత్రి కారాదని గాంధీజీ పట్టు పట్టడం ఆంధ్రులకేకాదు, తెన్నేటి విశ్వనాధం వంటి గాంధేయవాదులకు, నిష్పాక్షిక రాజకీయ పరిశీలకులకు సయితం అప్పటికీ, ఇప్పటికీ అర్థం కాని విషయం.
రాజాజీ గాంధీజీకి వియ్యంకుడు కావడమే ఇందుకు కారణమని అప్పటిలో కొందరు చేసిన ఆరోపణలు జాతిపితకు బంధుప్రీతిని ఆపాదించడం కావచ్చుకాని, మొత్తం మీద గాంధీజీ వైఖరి అప్పటిలో చాలామందికి అర్థం కాలేదు.
...........'పరిస్థితి ఇలా వుంది, యేమి చెయ్యమంటారో చెప్పండి ' అని వి. వి. గిరి....మౌలనా అజాద్ కు టెలిగ్రాము ఇవ్వగా, 'మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. ఇక మా సలహా దేనికి?' అంటూ నిష్ఠూరం గా సమాధానం ఇచ్చారు.
1946 ఏప్రిల్ 23న తిరిగి మద్రాసు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ప్రకాశం గారికి, సి. ఎన్. ముత్తురంగ మొదలియార్ కు పోటీ జరిగింది. అధిక సంఖ్యాకులు ప్రకాశాన్ని నాయకుడుగా యెన్నుకున్నారు."
(ఆ విధం గా అధిష్ఠానానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి గా యెన్నికైన శ్రీ టంగుటూరి ప్రకాశాన్ని--పదవి నించి దిగేదాకా నిద్రపోలేదు అధిష్ఠానం! ఆ విషయాలు తరవాత! ఇందులో "..." మధ్య వున్నదంతా తెన్నేటి విశ్వనాధం జీవిత చరిత్రనించి యథాతథం గా వ్రాయడం జరిగింది. బ్రాకెట్ల మధ్య వున్నవి నా వివరణలు. బోల్డ్ గా వున్నవి నేను ప్రాథాన్యత ఇచ్చినవి--కృష్ణశ్రీ)