ధరలు
నాలుగురోజుల క్రితం కూడా, శరద్ పవార్ 'ధరలు తగ్గించడానికి నా దగ్గరేమీ మంత్రదండం లేదు' అన్నాడు!
ఆహార ద్రవ్యోల్బణం రేటు దాదాపు 20 శాతానికి చేరింది!
పప్పుల ధరలు కేజీకి శతకం దగ్గరే వున్నాయి. ఇంకో మూడునెలలలో అవి 120 దాట వచ్చు అని ఓ ప్రముఖుడి ప్రకటన!
పెట్రోలు రేటు లీటరుకి 3 రూపాయలు పెంచుతామన్న మంత్రి!
ఓ పక్క అడ్డం గా పెంచేసిన ఆర్ టీ సీ చార్జీలు!
ఇలా ఓ పెద్ద భూతాన్ని ఇంకా పెద్దగా చేస్తూ గుండెలదరగొట్టిన సర్కార్లు!
మరి సరిగ్గా సంక్రాంతి పండగకి ఒక రోజు ముందు, భోగి రోజునే పప్పుల ధరలు కేజీ కి యేకం గా 20 రూపాయలు తగ్గాయి!
చక్కెర రేటు కూడా తగ్గింది! బియ్యం అప్పుడే పెరగవుట! పెట్రోలు ధరల పెంపు ప్రతిపాదన అప్పుడే లేదట!
మరి యెవరు యే మంత్ర దండం ప్రయోగించారు?
ఆ మంత్రదండం యెవరి చేతిలో వుందో తెలిస్తే, వాణ్ణి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, మనకవసరం వచ్చినప్పుడల్లా ఓ రెండు పీకుతుంటే సరి, ధరలు 20 రూపాయలు చొప్పున తగ్గుతూ వుంటాయి--మిగిలినవి పెరగవు!
ఇలా మీకు అనిపించడం లేదూ?
చక్కెర విషయానికొస్తే--ఈ సంవత్సరం ఇంకా పెద్ద కుంభకోణం యేమీ బయటకు రాలేదుగానీ--మాయావతిని కేంద్రం తప్పుపట్టబోతే, ఆవిడ తిరగబడి వీళ్ళ నోరు మూయించింది!
దాంతో, యూ పీ చక్కెరమిల్లులమీద ఆంక్షల్ని తొలగించారట! అందుకే ధరలు తగ్గుతున్నాయట!
మరి ముడిచక్కెర వేలాది టన్నుల దిగుమతికి 'ఆ మిల్లులకే' యెందుకు పర్మిట్లు ఇచ్చారో, వాళ్ళు దిగుమతి చేసుకున్న చక్కెర పోర్టుల్లోనే యెందుకు వుండిపోయిందో, ఇప్పుడు అదింకా మిల్లులకి చేరకుండానే రేటు 20 రూపాయలు యెలాతగ్గిందో ఆ పెరుమాళ్ళకే యెరుక!
మన చాగల్లు (జైపూర్ షుగర్స్) కార్మాగారం లోనే, 2007 లో తయారైన చక్కెర కూడా వేల టన్నుల్లో నిలవ వుండిపోతే, ఆ లెక్కల్ని గోల్ మాల్ చేసి, అక్కడి సిబ్బంది దొంగచాటుగా లారీలకొద్దీ బ్లాకు లో అమ్మేసుకొంటుంటే, వాళ్ళ మధ్యలో పంపకాలలో తేడా వచ్చి, విషయాన్ని బయటపెట్టేసుకున్నారు!
మరి ఒక్క కార్మాగారం లోనే మూడు సంవత్సరాల నిల్వలు కొన్ని లక్షల టన్నులు వుంటే, మిగిలిన వాటి మాట యేమిటి? వ్యాపారుల వద్ద నిల్వల మాటేమిటి?
అసలు రెండేళ్ళక్రితమే నేను ప్రశ్నించినట్టు--ఈ దరిద్రాలన్నీ ఈ కాంగీరేసు ప్రభుత్వం వున్నప్పుడే యెందుకు వస్తున్నాయి?
ఆలోచించండి!