Wednesday, December 29

మన ఆచారాలు -5 మీద......

'కార్తీక.....' గురించి

(వ్యాసావళి ముగింపు కన్నా ముందు--వ్యాఖ్యాతలకి ఇచ్చిన మాటప్రకారం--ఈ టపా)

నా 5వ భాగం లో, '....నిద్రావస్థలో వున్నట్టున్నారు....' అని చదవగానే నిద్రలేచి, ఓసారి జుట్టు విదిలించుకుంటూ, చెవులు టపటపలాడగా, వళ్లు విరుచుకొని బయలుదేరిందో గ్రామ సిం హం--రాజేష్ జి అని.

వీడు వ్రాసిన దరిద్రపు వ్యాఖ్యలూ, వాడికి మద్దతుగా కొంతమంది వ్యాఖ్యలూ అందరూ చదివారు. 

వాటిగురించి ఇంక నేను వ్రాయవలసిన అవసరం లేదు.

వాడికిచ్చిన నా జవాబులో నేను వ్రాసినవి కూడా అందరూ చదివారు. వాటికి వాడి దగ్గరగానీ, వాడి మద్దతుదారుల వద్దగానీ జవాబులు లేవు.

వాడి మొదటి వ్యాఖ్యని '.....పెద్దలు చెయ్యగ్' అంటూ యెందుకు ముగించాడో యెవడూ చెప్పలేదు. వాడు మద్యపాన ప్రభావంలో లేడు అని వాడితో సహా యెవరూ అనలేదు. 

నా అన్ని బ్లాగుల్లోనూ చాలామందిని 'వాడు, వీడు' అన్నాను. వీడి వ్యాఖ్య లో క్లారిటీ కోసం, 'వెధవలు' అనికూడా తిట్టాను. అయినా వెర్రివాగుడు వాగాడుగానీ, సమాధానం లేదు. నదిలో దూకాలనే అనిపించిందని వొప్పుకున్నాడంటే, యెంత డిప్రెషన్లో వున్నాడో చూడండి!

వాడి బ్లాగులో టపాలేవీ యెందుకులేవు అన్నదానికి యెవడూ సమాధానం చెప్పలేదు.

వీళ్లని రెచ్చగొట్టయినా సమాధానాలు రాబట్టడానికి 'మలక్పేట్' 'కొత్తపాళీ' వగైరాల పేర్లు కూడా వాడుకున్నాను. 

అప్పటికి, ఓ అఙ్ఞాత బయటపడ్డాడు--దామోదరుడు; మద్యపానాలు--అంటూ. తాను నాస్తికుణ్ని కాదు అని కూడా చెప్పుకున్నాడు. ఆ రెండింటికీ సమాధానాలు ఇచ్చి, నా ప్రశ్నలకి సమాధానాలు అడిగాను.

దామోదరుడి గురించి, వాడెవడో గోస్వామి వ్రాసిన బ్లాగో, యేదో.....దానికి లింకిచ్చాడు. ఈ గోస్వామిలాంటి మెంటల్ గాళ్ల వ్రాతలు చదవడం కన్నా బుధ్ధి తక్కువ ఇంకేమీ వుండదు. అయినా పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను.....వాడి వెర్రి భక్తి తప్పితే, విషయం హుళక్కి!

ఇక, వీకెండునించి వచ్చానంటూ, తనకి వచ్చిన ఇంగ్లీషులో (అది బ్రిటిష్ కాదు, అమెరికన్ కాదు, చివరికి పీ.టీ.అమెరికన్ కూడా కాదు మరి) యేదో మిడికి, ఓ వ్యాఖ్య పెట్టాడు.....పద్మపురాణం అంటూ, దాన్నేదో వాడే వ్రాసినట్టు. సత్యవ్రతముని యెవడో, వాడి గోత్ర ప్రవరలేమిటో, వాడు నారదమునికి సైతం చెప్పడమేమిటో, గోవర్ధనగిరిని యెత్తినరోజునే తాడుతో కట్టడం యేమిటో.....ఇలా 'యధాలాభం గా' వాగెయ్యడం కాదు....నాకు పూర్తి సమాధానాలు కావాలి. కేశవ నామం నించీ, అనేక నామాలు వుండగా, దామోదర నామానికే ఈ మాసం యెందుకు అంటకట్టబడింది, యెవరు కట్టారు....చెప్పాలి. దామ=తాడు అనడంలోనే తెలుస్తోంది వీడి పాండిత్యం!

నా 'ఉజ్జోగం' యేమిటో తెలుసుకోలేని వీడికి యూకేలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు అని బిల్డప్పొకటి! అది నిజంగానే గుంటకట్టి గంటవాయించిందనీ, చంచల్ గూడా లోనో యెక్కడో తేలాడనీ, ఆమాట తానే వొప్పుకున్నాడనీ మొన్ననే బయటపెట్టారెవరో!

ఇక వీడి వెర్రి యెక్కడిదాకా పోయింది అంటే, '.....వచ్చే మూర్ఖత్వము ఏంటబ్బా?', 'విడగొట్టి మాట్లాడే....', 'ఎవరికీ తలనొప్పి లేదు', 'ఎవడికి నొప్పి? మీకా', 'అంటే ఎంటీ.....అర్థం అవుతుందా?' '....నిదర్శనం', 'కానివ్వండి......విమర్శించడమేనా?' అనేదాకా! యేమైనా పొంతన వుందా?

నేను ఛాలెంజ్ చేస్తున్నా.....30 యేళ్ల క్రితం నించీ, ఈ మధ్యదాకా, యెవరు ఈ దామోదర పూజ గురించి విన్నారో, జరిపించారో, కనిపెట్టారో,యెలుగెత్తి చాటారో, దాఖలాలు చూపించండి.......నెట్ లో వెతికేసి, లింకులు ఇవ్వడం కాదు!

నాస్తికుడు ప్రవీణ్ శర్మని కూడా అహ్వానించా--వ్యాఖ్యానించమని. వెంటనే, 'అన్యా' అంటూ కాకా పట్టాడీ రాజేష్, ప్రవీణ్ ని. మరి నాస్తికుడైన ప్రవీణ్ వీడికి అన్య అయితే, నాస్తికుణ్ణి కాదు అని చెప్పుకున్న అఙ్ఞాత రాజేష్ కి మద్దతు ఇస్తే, వీళ్ల సంబంధ బాంధవ్యాలేమిటీ?

నేను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నతరవాత, సమర్థించుకునే ఙ్ఞానమైనా వుండాలి. అది లేక, చూస్తున్న యెదటివాళ్లు, అది కుందేలు కాదురా, దాని ఖర్మకొద్దీ కాళ్లు లేకుండా పుట్టిన కోడి అని చెపుతున్నా, "నేను పట్టిన కుందేటికి కాళ్లే లేవు, రెక్కలువున్నాయి" అని వాదించే మూర్ఖులకి యెవరేమి చెప్పగలరు.....వారికి "................" అగుగాక అని దీవించడం తప్ప! 

Monday, December 27

మన ఆచారాలు - 9

......భోజనాలు

కార్తీక మాసం ఇంకా వస్తుంది అనగానే, నిర్వాహకులు వలసిన వారందరికీ సమాచారం పంపించడం, యెవరు యెంత చందా చెల్లించాలి, యే ఆటలు, ఈవెంట్లు జరిపించాలి, దేనికి యే బహుమతి ఇవ్వాలి, టిక్కెట్లు యెంత వసూలు చేయాలి, అసలెంత మంది వస్తారు--ఇలాంటివన్నీ ఓ ప్రణాళిక ప్రకారం చేసుకొంటూ, అనుకున్న రోజుకి ఓ రెండు రోజులు ముందు బజార్లో పడి, బహుమతుల కొనుగోలు మొదలుపెడతారు.

పిల్లలకైతే, పెన్సిళ్లూ, ఇరేజర్లూ, స్కేళ్లూ, పెన్నులూ, స్కెచ్ పెన్నులూ, పుస్తకాలూ, ఇన్స్ ట్రుమెంట్ బాక్స్ లూ--ఇలా--మరీ సామాన్యమైనవి కాకుండా కొంచెం వెరయిటీగా వుండేవి కొనాలి.

ఆడవాళ్లకి మేకప్ బాక్స్ ల నుంచి, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల నుంచి, చెంప పిన్నులవరకూ కొంటారు.

మగాళ్లకి, క్రికెట్ కాకుండా మహా అయితే కబడ్డీ ఆడిస్తారు. టగ్ ఆఫ్ వార్ కి ఒకటి. ఇలా మూడు వెండి (కోటింగు) కప్పులు కొంటారు.

తంబోలా కి క్యాష్ ప్రయిజులే కదా.

ఇక లక్కీ డిప్ కి మాత్రం, కాస్త ఘనంగా ఆనుతూ, యెగబడి టిక్కెట్లు కొనేలా--అప్పట్లో అయితే ఓ ట్రాన్సిస్టర్ రేడియో
--తరవాత టూ ఇన్ వన్ లూ--ఇలా కొంటారు.

ఇంక చివరగా, పెద్దాయన భార్యకి (ఆవిడకి యేదో ముఖ్యమైన ఆటలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వక తప్పదు మరి) ఓ చిన్న వెండి కుంకం భరిణా, పెద్దాయనకి అద్దాల ఫ్రేములో బిగించబడిన ఓ దేవుడి విగ్రహం--గోడకి తగిలించుకోడానికి వీలుగా!

నాలుగూ నలభై కి ఘనంగా తియ్యబడుతుంది--లక్కీ డిప్. 

అది అవ్వగానే, బహుమతి ప్రదానాలు.

దాంతో, ఐదు గంటలు దాటుతుంది. కార్యక్రమం పూర్తవుతుంది. నునుచీకట్లు కమ్ముతూ వుంటాయి--తోట అయితే. బస్సువాడు సిధ్ధంగా హారన్ కొడుతూ వుంటాడు. ఇతరవాహనాల వాళ్లూ, పెద్దాయనతో సహా బుర్రుమంటూ వెళ్లిపోతారు. బస్సుకూడా వెళ్లిపోతుంది జనాలతో.

పెట్రోమాక్స్ లైటు వెలిగించబడుతుంది.

......ఇక ముగింపే తరవాయి.

Friday, December 24

మన ఆచారాలు - 8

......భోజనాలు

అప్పటికి, స్టేజ్ దగ్గర తంబోలా సెట్, నంబర్లు తియ్యడానికి (సాధారణంగా పెద్దాయన తాలూకు పిల్లో, పిల్లాడో), వాటిని నెంబర్ షీట్ మీద పేర్చడానికొకడూ, మైక్ లో కాంపియర్ చెప్పిన నెంబర్ని మైక్ లేకుండా గట్టిగా ప్రకటించడానికి ఒకరిద్దరూ తయారయి పోతారు. 

కాంపియర్ "ఇప్పుడు మీరందరూ యెంతో వుత్కంఠతో యెదురు చూస్తున్న....'తంబోలా'...." అంటూ, గేము ఆడే విధానం, దానికి సంబంధించిన నిబంధనలూ.....డిస్ క్లెయిమర్లతోసహా (రేప్పొద్దున్నెవరైనా కోర్టుకి వెళితే తమ సమర్థనలకి సరిపోయే లెవెల్లో) ఓ పావుగంట ప్రకటిస్తూంటాడు.

ఇవన్నీ అలవాటే అయినవాళ్లు, 'ఇకచాలు.....మొదలెట్టండీ' అంటూ తొందరెపెడుతూండగా, మొదలవుతుంది ఆట.

(తంబోలా కలెక్షన్లు యెంతవచ్చాయో లెఖ్ఖించి, పెద్దాయనతో సంప్రదించి, నిర్వహణ ఖర్చులకి కొంత మినహాయించి, యే ప్రైజ్ కి యెంతో ముందే నిర్ణయించి, ప్రకటిస్తారు. ఈ ప్రైజ్ లలో, జల్దీ ఫైవ్, మొదటి, రెండవ, మూడవ లైన్లకీ పోగా మిగిలిన దాన్ని కొంచెం పెద్ద మొత్తంగా 'ఫుల్ హౌస్ ' కి కేటాయిస్తారు.)

అప్పుడు మొదలవుతుంది నెంబర్లు తియ్యడం. కాంపియరుని బట్టీ ఆ సంఖ్యలపై సమయస్ఫూర్తితో వ్యాఖ్యలు వెలువడుతూంటాయి....(వీళ్లలోకూడా, ఆధ్యాత్మికవాదులూ, యదార్థవాదులూ, సాధారణంగా కమ్యూనిస్టులైన కార్మిక నాయకులూ, ఇంచుక 'బూతాడక దొరకు నవ్వు పుట్టదు ' అనేవాళ్లూ.....ఇలా వుంటారు కదా!)

వుదాహరణకి ఒకటి వస్తే, 'బ్రహమమొక్కటే' అనీ, రెండు వస్తే 'వద్దురా ఇద్దరు ' అనీ, మూడు ని 'త్రిమూర్త్యాత్మకం' అనీ, ఇలా 16 ని 'టీనేజిలో అత్యంత తియ్యనైన స్వీట్...' అనీ, 33 ని 'రెండు మూడంకెలు ' అనీ, 69 ని అన్యోన్యదాంపత్యం అనీ, 96 ని యెడమొగం, పెడమొగం అనీ వ్యాఖ్యానాలతో సాగుతుంది--జనాల నవ్వుల మధ్య!

ఇక జనాలు, పెన్నులూ, పెన్సిళ్లూ వున్నవాళ్లు వాటితో నెంబర్లని టిక్కులు కొడుతూంటే, అవి లేని వాళ్లు.....వ్రాయని రీఫిళ్లతోనో, తోటలో వుండే నిమ్మ, నారింజ ముళ్లతోనో, పిన్నీసులూ, చీపురు పుల్లలతోనో వాళ్ల చేతులోని చార్టులలో నెంబర్లని గుచ్చుతూ వుంటారు.

జల్దీ ఫైవ్ కి అందరూ ఎలర్ట్ గానే వుంటారు. ఓ పదిహేనో, పాతికో నంబర్లు తీసేటప్పటికిది అయిపోతుంది. ఇక అక్కడినించీ, స్పీడందుకుంటుంది వ్యవహారం. గబగబా నంబర్లు ప్రకటించబడుతూంటే, ఓ లైన్ అయిపోయినా, నిర్ధారించుకోడానికి కొంత సమయం తీసుకొని, అయిపోయిందని ప్రకటించేలోగా, ఇంకో రెండు మూడు నంబర్లు ప్రకటించబడతాయి. దాంతో, ఒకే లైన్ కి ఇద్దరూ, ముగ్గురూ క్లెయిమెంట్లు వస్తారు. మళ్లీ పెద్దాయనని సంప్రదించి, ఆ లైను బహుమతిని క్లెయిమెంట్లందరికీ సమానంగా పంచుతామని ప్రకటిస్తూంటారు.

హోల్ హౌస్ కి కూడా అదే పరిస్థితి. 

హమ్మయ్య! హౌసీ అయిపోయింది. 

టైము నాలుగూ నలభై!
  
.......ఇంకా....తరువాయి!

Sunday, December 19

మన ఆచారాలు - 7

......భోజనాలు

ఈ ఫస్ట్ బ్యాచ్ లోనే చతుర్ముఖ పరాయణులూ వుంటారు. పలావు కొంచెం కెలికేసి, వైట్ రైస్ పెట్టెయ్యమని, పదార్థాలన్నీ నాలిక్కి వ్రాసుకున్నట్టు చేసి, 'పెరుగు తెండి' అంటూ వడ్డనకాళ్లని సతాయించి, బ్యాచ్లో మొదటిగా లేచిపోయేది వీళ్లే. (పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకోవద్దూ? అదీ తొందర.) వీళ్లు మళ్లీ పడమర యెండ పడే ప్రదేశాల్లో సెటిల్ అయిపోతారు.

ఇక భోజనాలు ముగించిన మొదటి బ్యాచ్ వారికి ఎంటర్టెయిన్ మెంట్ కావాలి కదా? ఆ వూళ్లో అప్పటికి కొంత పేరు తెచ్చుకొన్న మిమిక్రీ/వెంట్రిలాక్విజం ఆర్టిస్టుని రప్పిస్తారు. అతను పాపం, పిల్లి కూతల దగ్గరనించి, రైలు బ్రిడ్జి పై వెళ్లడం వరకూ అనుకరించి, విమానం సౌండ్లూ, చివరికి 'ఒథెల్లో', 'మెకన్నాస్ గోల్డ్' తో ముగిస్తాడు తన కార్యక్రమాన్ని. చెప్పొద్దూ....అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.....చప్పట్లు కొడతారు....రెండో బ్యాచ్ వారు కూడా త్వర త్వరగా భోజనాలు ముగించుకొని వచ్చేస్తారు అప్పటికి. 

ఇక మూడో బ్యాచ్.....వడ్డనకాళ్లూ, మొహమాటపడి ఆఖరివరకూ కూర్చున్నవాళ్లూ బంతిలో వుంటారు. 'ఇది మా బాధ్యత' అనుకునేవాళ్లు వాళ్లకి వడ్డిస్తూంటారు....తీరిగ్గా కూచోండి అంటూ. 

మిమిక్రీ ప్రొగ్రాం అవుతూండగానే (అప్పటికి సాయంత్రం 3-30; నాలుగు మధ్య అవుతుంది) కాంపియర్ని 'మీరు కూడా కొంచెం యెంగిలి పడండి' అంటూ మొహమాటపెట్టేసి, ఓ ఆకులో స్వీటూ, పలావూ, పెరుగు చట్నీ, కూరా, పచ్చడీ, వడ్డించి, మొహమాటపెట్టేస్తారు. స్టేజి ప్రక్కనే ఓ కుర్చీలో కూర్చొని, ఇవన్నీ రుచి చూసి, 'పెరుగు వడ్డించెయ్యండి ' అని, తన భోజనం ముగిస్తాడు.)

అప్పటికి మిమిక్రీ అయిపోవడం, మూడో బ్యాచ్ వాళ్లుకూడా భోజనాలు చేసెయ్యడంతో, మళ్లీ మైక్ పట్టుకొని, "ఇప్పుడు మీరందరూ యెదురు చూస్తున్న 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కాంటెస్ట్.....మొన్ననే పెళ్లయినవాళ్లయినా, పాతికేళ్ల క్రితం అయినవాళ్లయినా....అందరూ పాల్గొనడం 'కంపల్సరీ'.....అన్ని జంటలూ స్తేజి దగ్గరకి రావలసింది" అంటాడు.

జంటలు వస్తారు....ముసలి జంటల్ని తోస్తారు....అందర్నీ ఓ రవుండ్ గా నిలబెట్టి, జడ్జీగారు (పెద్దాయన) ఇన్స్ పెక్ట్ చేస్తారు.....సరదాగా కొన్ని ప్రశ్నలు కూడా అడగచ్చు.....!

ఈ లోపల, ఆ పెద్దాయన, ఒక్కరే వున్న కొంతమందిని గమనించి, 'మీకు చెప్పాముకదా, భార్యా సహితంగా రావాలని? రాలేదుకాబట్టి ఓ పది రూపాయలు ఫైన్ కట్టండి!' అంటాడు. ఆ సరదా నిజమైపోయి, జంటలు (అప్పటికి) లేనివాళ్లందరూ ఫైన్ కట్టాల్సిందే--నిర్వాహకులకి!)

జడ్జీగారు--పాతికేళ్లనించీ కాపురం చేస్తున్న ఓ జంటకి ఫస్ట్ ప్రైజూ, మొన్న వైశాఖమాసంలోనే పెళ్లయిన ఓ యువ జంటకి సెకండు ప్రైజూ, పదేళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలతో, అందం కాపాడుకొంటున్న ఓ జంటకి థర్డ్ ప్రైజూ, మిగిలిన ఒకటో రెండో జంటలకి కన్సొలేషన్ ప్రైజూ ప్రకటిస్తారు. అప్పటికి ముగుస్తుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్.

సాయంత్రం నాలుగు దాటిపోయింది!

.......ఇంకా....తరువాయి!

Thursday, December 16

మన ఆచారాలు - 6

.......వన భోజనాలు

సరే, వడ్డనలు పూర్తయ్యి, వైట్ రైస్ వచ్చేసిందంటే, అది ఓ వార్నింగన్నమాట--బంతి ఓ పావుగంటలోనో, ఇరవై నిమిషాల్లోనో పూర్తయి, లేవబోతూంది--అని!

ఆ వెనక్కాలే, 'సాంబారండీ సాంబార్' అంటూ వొకడూ, 'రసమండీ రసం' అంటూ వొకడూ స్టీలు బకెట్లతో బంతిని తరిమేస్తూంటారు. విస్తర్లో వైట్ రైస్ కనపడితే, ఓ డోకుడు పోసేస్తూంటారు కూడా దాని మీద. (ద్రవాత్మకపదార్థాలని వడ్డించడానికి ఓ కప్పులాంటి గిన్నెకి ఓ కాడ అతికించి వుంటుంది--డోకు అని--దానికీ, కక్కుకీ యేమైనా సంబంధం వుందో, లేదో నాకు తెలియదు)

అప్పటికి చాల మంది కలుపుకున్న పప్పూ అన్నం తినడమే పూర్తికాదు. ఇంకొంతమందైతే, పలావు పూర్తిగా లాగించి, తరవాత అన్నంలోకి వచ్చే టైము వుందా?! అని ఆలోచిస్తూంటారు. కొంతమందైతే, ఆ పప్పూ అన్నంలోనే, ఒక్కో కూరా అద్దుకొని తినేస్తూ వుంటారు--వదల్లేక, వదల్లేక, మధ్యలో వడియాలు పీక్కుంటూ. 

వైట్ రైస్ వడ్డన ప్రారంభం అవుతూండగా, అప్పుడు వంటపుట్టిగారి ఆఙ్ఞ ప్రకారం ఆయన అసిస్టెంటు 'అప్పడాలు వేయించడం' మొదలెడతాడు. వెంటనే వడ్డనకి వెళ్లిపోతాయి అవి. పై పేరాలో వ్రాసినవాళ్లెవరికీ ఇవి వుపయోగపడవు--ఆపైన వ్రాసిన వైట్ రైస్ లో సాంబారు దిమ్మరింపబడినవాళ్లకి తప్ప! మిగిలిన అందరూ సాంబారులోకి వచ్చేటప్పటికి అవి తోళ్లలా వ్రేళ్లాడుతూ వుంటాయి.

ఆవెనకాలే వచ్చేస్తుంది--పెరుగు! వెంటనే సాల్టు. బంతిలో వందమందీ చేతులు అడ్డుపెట్టేవాళ్లే--ఒకళ్లో ఇద్దరో సుమారు కారం, వుప్పూ కూడా తినలేనివాళ్లూ, ఓ పనైపోతుందిలే అని భోజనానికి కూర్చున్నవాళ్లూ మాత్రం, ఆ ఫార్మాలిటీని ముగించడానికి వడ్డించెయ్యమని, పని ముగిస్తారు.

ఈ మధ్యలో, పప్పూ, కూరలూ, పచ్చళ్లూ, సాంబారూ, రసం, పిండివంటా, ముఖ్యంగా 'మీ పెరుగులోకన్నం' అంటూ 'మారు చూపేవాళ్ల ' హడావిడి తక్కువేమీ కాదు.

పెరుగూ, సాల్టూ వాళ్లు మళ్లీ బంతి మొదటికి వచ్చేసరికి, అందరూ వైట్ రైస్ మధ్యలో వేలితో కన్నాలు చేసుకొని, యెదురు చూస్తూ వుంటారు--పెరుగు వడ్డించగానే పని పూర్తి చేసెయ్యడానికి. బంతి మధ్యలో నలుగురైదుగురు ఇంకా ఆ స్టేజికి రాకపోతే, మారు వడ్డింపు వాళ్లు షంటేస్తూ వుంటారు వాళ్లని--ఇంకేమీ వద్దండీ--పెరుగు వడ్డించండి అనేవరకూ! (వీళ్లు లేస్తేగానీ బంతి పూర్తికాదు మరి!)

హమ్మయ్య--లేస్తున్నారొకరొకరూ! 

(ఇక్కడ నిర్వాహకులు మరిచిపోయేది యేమిటంటే, చేతులు కడుక్కోడానికి ఓ చోటూ, అక్కడ నీళ్లూ, ఓ మగ్గో, చెంబో పెట్టడం! లేస్తున్నవాళ్లు యెందుకైనా మంచిదని మళ్లీ గ్లాసుల్లో మంచినీళ్లు పోయించుకొని, బంతినించి వెనక్కి కొంత నడిచి, అక్కడ గ్లాసులో నీళ్లతో చేయి కడిగేస్తారు--తమకి అనువుగా వున్నచోట.)

ఓ వరస మొదట్లో కొందరు లేవగానే, గబగబా యెగబడతారు--విస్తళ్లు తీసేవాళ్లు. సాధారణంగా వీళ్లని నిర్వాహకులు కుదుర్చుకోరు. ఆ వనం చుట్టుప్రక్కల కొంత దూరం లో నివసించే కడు పేదవాళ్లు దూరంగా నించుని యెదురు చూస్తూ వుంటారు--బంతి యెప్పుడు లేస్తుందా--అని! పనికొచ్చే విస్తళ్లని ఆపళంగా మడతపెట్టేసుకొని, తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ బకెట్లలోనో, కవర్లలోనో, గుడ్డల్లోనో మూటకట్టుకు పట్టుకుపోతూంటారు.

ఆ దెబ్బతో, మధ్య మధ్యలో ఇంకా కూర్చున్నవాళ్లు కూడా గబ గబా లేచిపోతారు--తింటూండగానే విస్తళ్లు యెక్కడ పట్టుకుపోతారో అని!

ఓ బ్యాచ్ భోజనాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి ఇప్పటికి.
  
.......ఇంకా....తరువాయి!

Sunday, December 12

మన ఆచారాలు - 5

కార్తీక సమారాధన అనే వన భోజనాలు

(వాగ్దానం సినిమాలోననుకుంటా--ఘంటసాలవారు చెప్పిన హరికథలో 'భక్తులందరూ నిద్రావస్థలో వున్నట్టున్నారు .....మరోసారి....శ్రీమద్రమారమణ గోవిందో.........హా...రి' అనకుండా.....అంటే మీకు బోరుకొట్టకుండా, వ్యాసావళిని తొందరగా ముగిద్దామనే నా ప్రయత్నం......!)

గాల్లో.....వైరస్ కన్నా తొందరగా వ్యాపించిన 'పెరుగొచ్చేసిందట' అనే వార్తతో, ఇక్కడ సన్మానాలు అవుతుండగానే, పొలోమంటూ అందరూ బంతిలో జంబుఖానాలమీద సెటిల్ అయిపోతూంటారు. 

(ఆకలికి వున్న పెద్ద దొబ్బుతెగులేమిటంటే, మనం చంపినంతవరకూ చచ్చూరుకొంటుంది....కానీ, తిండి మాట వినబడేసరికి మాత్రం, వెయ్యి నాలుకలతో, వెయ్యి కడుపులతో విజృంభిస్తుంది మరి!)

పాపం కాంపియరు 'ముందుగా ఆడవాళ్లనీ, పిల్లలనీ కూచోనివ్వండి.....మగాళ్లంతా వడ్డనలో సహకరించండి.....'అని మొత్తుకొంటూనే వుంటాడు.  

బంతి సిధ్ధమవుతూండగానే, వడ్డించేవాళ్లు.....ముందు ఒకడు వెజిటబుల్ పలావూ, ఒకడు పెరుగు చట్నీ, ఒకడు కూర్మా కూరా గబగబా వడ్డించేస్తారు అందరికీ....పలావు కనీసం ఒక హస్తం అయినా వడ్డించేస్తారు చిన్న పిల్లలకి కూడా--తగినంత చట్నీ, కూరాతో! 

(ఇక్కడ రహస్యమేమిటంటే, వచ్చినవాళ్లు యెప్పుడూ 'ఎస్టిమేట్' కన్నా యెక్కువమందే వుంటారు.....అందరికీ 'వండిన అన్నం' సరిపోదేమోనని అనుమానం పీకుతూ వుంటుంది నిర్వాహకుల్ని!)

స్వీటు (సాధారణంగా రవకేసరే అయివుంటుంది) మాత్రం 'ముఖ్య వడ్డనకాడి' చేతిలో వుంటుంది....సరిగ్గా ఓ చిన్న చిప్పగరిటో, ఓ పెద్ద చెంచానో పట్టుకొని వడ్డించేస్తాడు. (సాధారణంగా 'చివరి' బ్యాచ్ కి స్వీటు వుండదు. అప్పటికప్పుడు యెవరినో పరిగెత్తించి, స్వీటు షాపులో దొరికే యేదో ఒక స్వీటు తెప్పిస్తే తప్ప!) 

(జనాలు ముందు స్వీటు లాగించేసి, ఇక కష్టపడి ఆ పలావుని లాగించడం మొదలుపెడతారు. పిల్లలని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొన్న తల్లో, తండ్రో, ముందు వాళ్లకి తినిపిస్తూ వుంటారు--తన విస్తరిగురించి పట్టించుకోకుండా.)

ఒకడు పప్పూ, ఒకడు కూరలూ, ఒకడు పచ్చళ్లూ, ఒకడు వడియాలూ (వీటిని పెందరాడే వేయించేసి, చిదిపేస్తారు.....అలాగే వుంచితే మెత్తబడి సాగుతాయని.....అయినా వీటిని పీక్కోవడం పెద్ద విషయం కాదు.) గబగబా వడ్డించేస్తారు.

అవన్నీ వడ్డించాక వస్తారు....అసలు శ్రమ తీసుకొనే వడ్డనకాళ్లు......వైట్ రైస్.....తీసుకొని. పెద్ద పెద్ద పళ్లాలలో, (అన్నం వేడిగానే వుంటుంది పళ్లెంలో పెట్టుకొనేవరకూ, వడ్డించేవరకూ) పళ్లెం క్రింద ఓ ఆకుని పెట్టుకొని, 'వైట్ రైసండీ...వైట్ రైస్' అంటూ. 

(అప్పటికి ఇంకా పలావు లాగించడం పూర్తికాదు యెవరికీ!.....అందుకని, అది ప్రక్కకి తీసుకోమని, ఓ ప్రక్కని వడ్డించేస్తారు. అప్పటికి అది చల్లారిపోయి, కరుళ్లు కరుళ్లుగా అయిపోతుంది.....విస్తర్లో పడగానే, వుండలుగా దొర్లిపోతూ వుంటుంది.)

.......ఇంకా....తరువాయి!

Thursday, December 9

మన ఆచారాలు - 4

కార్తీక సమారాధన

ఇక్కడ రెండు ఆటలు వున్నాయి....వర్కర్లు ఓ కుండో, కూజానో తెచ్చుకుంటారు.....మంచినీళ్లకోసమని. దాన్ని తాడుతో ఓ చెట్టుకొమ్మకి వేళ్ళాడగట్టి, ఒకడికి కళ్లకి గంతలు కట్టి, చేతికో కర్ర ఇచ్చి, తనచుట్టూ తనని గిరగిరా తిప్పి వదిలేసి, ఆ కుండని కొట్టమనడం!

లేదా, బ్లాక్ బోర్డుమీద ఓ పిల్లి బొమ్మ వేసి, ఒకళ్లకి కళ్ల గంతలు కట్టి, ఆ బొమ్మకి తోక పెట్టమనడం!

గ్యారంటీగా అరగంట కాలక్షేపం అయిపోతుంది--వినోదం లో యెవరికీ ఆకళ్లు గుర్తురావు!

ఈ ఆటలవుతూండగానే, జంబుఖానాలన్నీ బంతికి వెళ్లిపోతాయి--అప్పటికి అందరూ నిలబడే వుంటారు కాబట్టి.

(అప్పటికే పదింటికల్లా వచ్చేసినవాళ్లు కొంతమంది 12 వరకూ చూసి, ఇప్పుడప్పుడే తేలే వ్యవహరం కాదులే అనుకొని, ఆకలికి తట్టుకోలేక, 'ఇప్పుడే వస్తాను' అని పక్కవాళ్లకి చెప్పి, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్లూ జారుకొంటారు. ఇక సాయంత్రం దాకా మిగిలేది--ఆకలి పట్టింపులేనివాళ్లూ, నిర్వాహకులు యేర్పాటు చేసిన బస్సులో వచ్చి, దాంట్లోనే తిరిగి వెళ్లవలసినవాళ్లూ!)

ఇంక అసలు విషయం ఒకటుంది--కాంపియరు పావుగంటకోసారి మైకులో 'ఈ సమారాధనకి మేము అడిగిన చందా ఇచ్చినవాళ్లందరికీ ధన్యవాదాలు--అలా ఇవ్వనివాళ్లెవరైనా వుంటే, దయచేసి ఇక్కడ కూర్చొన్నవారికి చెల్లించండి' అని చెపుతూంటాడు! ఆ కూర్చొన్నవాళ్లు తమదగ్గరకి యెవరూ రాకపోతే, వాళ్లే అప్పటికి ఇచ్చేసిన వాళ్ల లిస్టు పట్టుకొని, ఒక్కొక్కళ్ల మొహాలనీ తేరిపార చూస్తూ, మొహమాటంగా 'మీరూ......ఇచ్చేశారు కదా?' అంటూ జనాలని చుట్టేస్తూ వుంటారు.

కుండ కట్టడమో, బోర్డూ-బొమ్మా గియ్యడమో లేటయితే, ఈ లోపల, క్రితం సంవత్సరం సమారాధన తరవాత యెక్కువ డబ్బు ఇచ్చినవారికో, యేదైనా సాధించి పేపర్లో ఫోటో వేయించుకున్నవాళ్లకో--సన్మానాలు ప్రకటించవచ్చు--వాళ్లకి పెద్దాయనకి వేసిన పూలదండా, ఇచ్చిన బొకే, కప్పిన శాలువా--ఇచ్చేసి, ఫోటోలు తీయించుకోవచ్చు! 

మనం 'విధించిన' చందా వందో రెండువందలో కాకుండా, యెక్కువ యిచ్చినవాళ్లకీ సన్మానాలు చెయ్యచ్చు! (దండా, బొకే, శాలువా, ఫోటోలూ....మమూలే!

హమ్మయ్య! పెరుగు వచ్చేసింది!

........తరువాయి మరోసారి.

Tuesday, December 7

మన ఆచారాలు - 3

కార్తీక సమారాధన

అప్పటికి, పొద్దున్నే మొదలెట్టిన "పెద్దాయనా 11 వెర్సర్ ఇంకో 'చిన్న' పెద్దాయనా 11" లిమిటెడ్ ఒవర్స్ క్రికెట్ మ్యాచ్ పూర్తయి, 'ఆటగాళ్లు' నీరసంగా నడిచి వస్తూంటారు. (యెవరు గెలుస్తారో వేరే చెప్పఖ్ఖర్లేదుగా!) సెక్రెటరీగారి రిపోర్టు అయిపోతుంది--వెంటనే కాంపియరు '.....వుత్కంఠగా సాగిన క్రికెట్ మ్యాచ్ లో విజేతలు....'పెద్దాయనా 11' కి మా హార్దికాభివందనలు.....అందరూ అలిసిపోయారు, ఇక మనం.....(భోజనాలకి అనబోతాడు)' అంటూండగా వార్త చేరుతుంది '......పెరుగుకోసం వెళ్లారు.....ఓ అరగంట లాగించండి ' అని.

'....ఇప్పుడు మనం (అని కంటిన్యూ చేస్తూ) "మగవాళ్లూ వెర్సర్ ఆడవాళ్లు--టగ్ ఆఫ్ వార్!' అని ప్రకటిస్తాడు. ఆడవాళ్లు 'కడుపులో యెలకలు పరిగెడుతూంటే....ఇప్పుడు టగ్గాఫ్ వారేమిటీ' అని మూతులు ముడుచుకొంటూంటే, 'ఇలాంటి టైములోనే అసలైన ఫలితం వస్తుంది--రండి రండి' అంటాడు. ఓ ఐదు నిమిషాల్లోనే ఫలితం తేలిపోతుంది.

చతుర్ముఖ పారాయణాల్లో ఓ ఆచారం వుంది--'తీత' అని. అంటే, పేక సెట్లు ఓ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడనుకోండి ఒకడు, వాటితో ఆడే ప్రతీ ఆటనీ నెగ్గినవాడినించి ఓ రెండు రూపాయలు వసూలు చేస్తారు! ఓ పది ఆటల్లో 20 రూపాయలూ వచ్చేస్తుంది వాడికి. అక్కడితో వూరుకొంటారా? తీత 5 రూపాయలకి పెంచుదాం, 'ఇంకేమైనా తెప్పించుకోవచ్చు' అంటారు. సరిపోయే డబ్బులు పోగవగానే, 'భోజనాలకి ఇంకా ఆలస్యం వుందిట....ఓ రవుండు వేస్తే పోలా?' అంటూ ఒకళ్లిద్దరిని తోలుతారు 'వైన్ షాపు' కి!

అక్కడ టగ్గాఫ్ వార్ అయ్యేటప్పటికి ఇక్కడ ఓ రెండో యెన్నో 'రవుండ్లు' పూర్తవుతాయి.

ఇందులో ఇంకో చిత్రం యేమిటంటే, ఆట ఓ రవుండు పూర్తయ్యేలోపల ఒక ఆట ఖచ్చితంగా జిడ్డాడిస్తుంది. ఆట యెవరు నెగ్గినా, మిగిలినివాళ్లందరూ 'నిల్ కవుంట్' ఇస్తారు! నెగ్గినవాడు తన సొంత డబ్బుల్లోంచి 'తీత' సమర్పించుకోవాలి.

ఈ బ్యాచ్ లవాళ్లూ వుపేక్షించదగ్గవాళ్లు కాదు కదా? టగ్గాఫ్ వార్ టైములో ఓ విజిట్ వేసేవాణ్ని ఓ గ్రూపు దగ్గరకి. అందరూ 'రారా! ఓ ఆట వెయ్యి అనో, రండీ తప్పదు' అనో మొహమాటపెట్టేస్తే, అందులో రారా అన్న ప్రవీణుడితో 'షో' హేండ్ పెట్టుకొని, సరే పంచండి అని, ఫస్ట్ హేండ్ డీల్ కొట్టేసి, 'డబ్బులు నువ్వు వసూలు చేసుకోరా' అని నా షోగాడికి కి చెప్పి, మళ్లీ స్టేజి దగ్గరకి పరుగు--పెద్దాయన నీ గురించి అడిగాడు అని కబురు రావడంతో!

ఇంకా పెరుగుకెళ్లినవాళ్లు రాలేదు....ఇప్పుడేమి చెయ్యాలి?

.........ఇంకో భాగం తరువాయి

Monday, December 6

మన ఆచారాలు - 2

కార్తీక సమారాధన

అప్పటిదాకా మైక్ లో తనకొచ్చిన పాటలని పాడేస్తూ, మధ్య మధ్యలో పిల్లలచేత భవద్గీత శ్లోకాలూ వగైరా చెప్పిస్తూ జనాలకి వినోదాన్నందిస్తూ, 'మరో పదినిమిషాల్లో పెద్దాయన వచ్చేస్తున్నారు' అంటూ వూదరగొడుతున్నాయన 'అదిగో వచ్చేశారు' అనగానే, (నేను ఆర్గనైజ్ చేసిన అనేక సమారాధనల్లో ఈ పాత్ర నాదే మరి!) పొలోమంటూ అందరూ ఆయన చుట్టూ చేరి, పూజ దగ్గరకి సాదరంగా తోడ్కొనివెళ్లి, అందాకా కుర్చీల్లో ఆశీనుల్ని చేసి, కుశల ప్రశ్నలేస్తూంటారు. ఈలోపల ఫోటోలు తీసుకొనేవాళ్లూ, వీడియోవాళ్ల హడావిడి కొంత!

మరిచిపోయాను....హరిమీద గిరి పడ్డా చలించని కొన్ని బ్యాచీలవాళ్లు, నులివెచ్చని యెండతగిలేలా, పొదల చాటున చేరి, టిఫిన్లు, కాఫీలూ అక్కడికే తెప్పించుకొంటూ 'చతుర్ముఖ పారాయణం' చేసేస్తూ వుంటారు, ప్రపంచంలో అంతకన్నా ముఖ్యమైన విషయం మరేమీ లేదన్నట్టు!

ఈలోపల పురోహితుడు 'అయ్యా! అంతా సిధ్ధం, మీదే ఆలస్యం' అంటూ అరుస్తూంటాడు. 'సరే! ముందు పూజ కానివ్వండి' అంటూ అప్పటికి వదులుతారు తైనాతీలు.

ఇక అప్పుడు ప్రారంభం 'కార్తీక దామోదర పూజ!' (వాడెవడో నాకు తెలీదు, నేనెప్పుడూ వాణ్ని పూజించలేదు, చెయ్యించలేదు). పూజ పూర్తయ్యి, పుణ్యాహవాచనం, అదేదో ఆశీర్వచనం అయ్యేటప్పటికి 1:00 అవుతుంది.

అదవగానే, ప్రసాదాల పంపిణీ అవుతూండగా, ఓ రెండు డైనింగు టేబుళ్లు ప్రక్క ప్రక్కన చేర్చి, ముందో ఐదారు కుర్చీలు వేసి, స్టేజి సిధ్ధమవుతుంది. మళ్లీ 'కాంపియరు' (అప్పట్లో మైకు పట్టుకొనేవాళ్లని అలా అనేవాళ్లు) రెడీ.....ఫలనా ఫలానా వాళ్లని 'వేదికనలంకరించండి' అంటూ!

అలంకరణ పూర్తవగానే, స్వ, పర, పరస్పర డబ్బాలు పూర్తయ్యేసరికి ఇంకో అరగంట. తరవాత సంఘం సెక్రెటరీగారు తన 'సుదీర్ఘ' రిపోర్టు ఇస్తారు.....క్రితం సమారాధననించీ, ఇప్పటివరకూ చేసిన ఘనకార్యాలు యేకరువు పెడుతూ, మధ్యలో ఫలానా ఫలానా దాతల ఔదార్యంతో.....అంటూ!

(ఈలోపల కబురొస్తుంది--'పెరుగు బాగా పులిసిపోయిందండీ......పనికి రాదు...' అంటూ! 'అందుకే నేను పెరుగు చట్నీ ఒక్క బక్కెట్టే చేస్తే సరిపోతుందన్నాను! చూశారా, ఇప్పుడు ఆ పెరుగంతా చట్నీ చేసెయ్యండి! బాబూ మీరు మార్కెట్కెళ్లి తాజా పెరుగు తీసుకురండి సరిపడా!' అని ఒకడికి ఆర్డరు చేస్తాడు నిర్వాహకుడు.)

మళ్లీ మొదలు.....'యేమండీ....పెరుగు తేవాలట!' 'పెరుగు తెమ్మంటున్నారు!' 'నువ్వెళ్తావా? నన్నెళ్లమంటావా?' 'సరే నువ్వే వెళ్లు!' 'యెన్ని లీటర్లు తేవాలి?' 'యెందుకైన మంచిది, ఓ పదిహేను లీటర్లు తే!' 'పదిహేను లీటర్లు నేనెక్కొణ్నే యెలా తేను? ఒరే నువ్వుకూడా యెక్కు' 'సరే' 'మరి తేవడానికి బక్కెట్లు?' మళ్లీ ప్రక్కవాళ్లందరూ 'బక్కెట్లు' 'బక్కెట్లు' అంటూ పరిగెడుతూంటే, ఒకడు, 'ఫలానా షాపుకి వెళ్లు. వాడు పేకెట్లిస్తాడు. బకెట్లు అఖ్ఖర్లేదు. నాపేరు చెప్పూ' అనగానే, (అప్పట్లో ఓ సైకిలు) ఓ హీరో హోండా బయలుదేరుతుంది.

కార్యక్రమం ఆగకూడదు కదా? ఒకడంటాడు.....'వంటలు సిధ్ధమైపోయాయి....జంబుఖానాలు మడతపెట్టి పరవండి......' మళ్లీ ఓ బ్యాచ్ పరుగులు--ఇలా నిలువుగా వేద్దామా, రవుండుగా వేద్దామా--యెండ వచ్చేస్తుందేమో--ఇలా--కాదు అలా--యేమీ అఖ్ఖర్లేదు ఇలా రెండు వరసలు వేసెయ్యండి--చులాగ్గా ఓ వందమంది లేస్తారు బ్యాచ్ కి' 'అలాగే' అంటూ యెవరూ కూర్చోకుండా, ఇసుకతో నిండిన జంబుఖానాలని యెత్తుకుపోయి మడతలు పెట్టి పరిచేస్తూ వుంటారు.

(మాట సాయం చేసేవాళ్లు అనేక మంది--అసలు క్రియకొచ్చేటప్పటికి వుపయోగపడేది చాలా కొద్ది--యే పదిమందో--'నా బొందో' అని తమ భుజాల మీద వేసుకొని చేసేస్తూ వుంటారు--అలాంటివాళ్లని 'ఐడెంటిఫై' చేసి, వాళ్లతో 'ఆఙ్ఞాపించో, బతిమాలో, బామాలో' పనులు చేయించుకోవడమే 'ఆర్గనైజర్ల' లక్షణం. మిగిలినవాళ్లని వ్యంగ్యంగా 'ఆర్గాన్ రైజర్లు' అని వ్యవహరించేవాళ్లం సరదాగా!)    

మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!

(నా స్టయిల్లో ఇలా వ్రాసుకొంటూ పోతే, 'మైన్యుట్ డిటెయిల్స్' తో సహా--విస్తరణ భీతి! కొత్తపాళీ లాంటివాళ్లు యే కామెంటు పెట్టేస్తారో అని ఆదుర్దా! అందుకే చిన్న చిన్న టపాలు వ్రాయడానికే ప్రయత్నిస్తున్నాను.)

Sunday, December 5

మన ఆచారాలు

కార్తీక వన సమారాధన

మహానుభావుడు బలగంగాధర తిలక్ హిందువుల్నందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి గణపతి నవరాత్రులు ప్రారంభిస్తే, ఇంకెవరో కులాలని సంఘటితం చెయ్యడానికి ఈ వన సమారాధనలు ప్రారంభించారు. 

మన వాళ్లకి యేదీ శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదు కాబట్టి, దానికి పురాణ ప్రాశస్థ్యాన్నీ, మహత్వాన్నీ జోడించి, కార్తీక మాసం లో వుసిరి చెట్టు క్రింద భోజనాలు చేస్తే, యెంతో పుణ్యం వస్తుందని ప్రచారం చేస్తూ ఇవి ప్రవేశ పెట్టారు. బాగుంది.

దీపావళి నుంచి మొదలెట్టి, ఆ నిర్వాహకులు పడే పాట్లు దేవుడికే యెరుక! ఆహ్వానాలు అందించడం దగ్గరనించి, యెంతమంది నిజంగా వస్తారో ఓ లెఖ్ఖ వేసుకొంటూ, తగిన యేర్పాట్లు చెయ్యడానికి వాళ్లు పడే పాట్లు వర్ణనాతీతం!

రెండురోజులముందు 'అక్కడికి' అవసరమైన 'సామాగ్రి' చేరవెయ్యాలి. అవి దొంగల, కుక్కల, పిల్లుల, చివరికి 'చీమల' పాల పడకుండా, కాపు కాసేవాళ్లని యేర్పాటు చేసుకోవాలి. కాంతి నిమిత్తం బ్యాటరీలతోనో, జనరేటర్లతోనో ట్యూబు లైట్లు వెలిగించి తెల్లవార్లూ వుంచాలి. 

ఇక రేపనగా, రాత్రి అవుతూండగానే అక్కడికి చేరుకోవాలి. వంటపుట్టిలు తెల్లవారుఝామున 4:30 కే లేచి, కూరలు తరగడం, పోపులూ, మసాలాలూ వగైరా తయారీ ప్రారంభించాలి. ఖర్మకాలి టిఫిన్లు పూరీలైతే, రాత్రి 8:00 నించే పూరీలొత్తే మిషన్ తో పని ప్రారంభించాలి, కూర కోసం బంగాళా దుంపలూ, వుల్లిపాయలూ వగైరా సిధ్ధం చేసుకోవాలి! పొద్దున్నే 7:00 కల్లా టిఫిన్లు రెడీ చెయ్యాలి!

తీరాచేస్తే, 9:00 వరకూ యెవడూ రాడు. (నిర్వాహకులీలోపల రెండు సార్లు టిఫిన్లు లాగించేస్తారు, వంట వాళ్లతో సహా, అప్పుడప్పుడు టిఫిన్లని వేడి చేస్తూ!)

అప్పుడు, బ్రహ్మగారు వేంచేస్తారు. హడావిడి మొదలు......'బియ్యం 6 శేర్లు, కొబ్బరి బొండాలు 9, పసుపూ, కుంఖం, పంచామృతాలు, పువ్వులూ, గంధం, అక్షతలూ, అగ్గిపెట్టె.....' అంటూ పరుగులు పెట్టిస్తాడు. (ఇవన్నీ యేర్పాటు చెయ్యడానికి మనం అప్పచెప్పినాయన పాపం వాళ్ల కూతురికి విరోచనాలు అవుతున్నాయని వాళ్లావిడ సెల్లో ఫోన్ చేస్తే, తన 'డెప్యుటీ' కి ఆ బాధ్యతలు బదలాయించి లగెత్తి వుంటాడు. ఆ డెప్యుటీ ఆయన చెప్పింది పూర్తిగా వినకుండానే, 'అలాగే, అలాగే, అలాగలాగే, నేంచూసుకుంటాను, మీరు వెళ్లి రండీ' అంటూ ఆయన్ని పంపేస్తాడు. తీరాచేస్తే, యేదెక్కడుందో వీడికి తెలియదు!)

సరే....పూజ యేర్పాట్లన్నీ చేస్తారు. 'అసలు' వాళ్లు.......పీటలమీద కూర్చొనేవాళ్లు రావాలి కదా? ఈ లోపల నిర్వాహకులు పిల్లలకీ, ఆడవాళ్లకీ, రన్నింగు రేసులూ, స్పూన్ & లెమన్ రేసులూ, మ్యూజికల్ చెయిర్సూ ఆడించేస్తారు. చిన్న పిల్లల ద్వారా, మధ్యాన్నం జరగబోయే 'తంబోలా' టిక్కెట్లూ, లక్కీ డిప్ టిక్కెట్లూ, వచ్చినవాళ్లకి అంటకట్టించేస్తూ వుంటారు. 

అప్పటికి, యే పదిన్నరకో, 'అసలాయన', సతీ సుత సమేతంగా, యే మమతా, మనోరమా హోటెల్లోనో చక్కగా టిఫిన్ లాగించి, ఓ పెద్ద కారులో దిగుతాడు!

మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!

Saturday, November 27

సూ ఋ సంస్థలు - 11

ఆగడాలా......ఆవకాయ తోకా!

అనుకున్నాను....మధ్యలో ఈ ఆవకాయ "తోక" యేమిటీ.....తొక్కైనా కాకుండా అంటారని.

మా చిన్నప్పుడు మా ఆవిడ తరఫు (అప్పటికి మా ఆవిడ కాలేదు లెండి) బంధువొకాయన ఓ ప్రైవేటు రికార్డు ఇచ్చాడు. ఒకాయన తన కొడుకుని 'చల్దివణ్ణాల గదిలో' ఆవకాయ వేసుకు తినమని వొదిలేస్తాడు. ఆ కుర్రాడు, 'నాన్నా' అని పిలుస్తూవుంటాడు. ఆయన 'యెందుకూ' అంటూ వుంటాడు. మొదట, ఆవకాయకి పళ్లొచ్చాయీ అనీ, ఆవకాయ కరుస్తోందీ అనీ, ఆవకాయకి తోకొచ్చిందీ అనీ, చివరికి ఆవకాయ పరిగెడుతోందీ అనీ జవాబిస్తూ వుంటాడు. అదన్నమాట.

ఇంతకీ, సూ ఋ సంస్థల "ఆగడాలని" అరికట్టాలని వొకటే గోల అందరూ....మీడియా సహా. 

తీసుకున్న అప్పు తీర్చమనడం ఆగడమా?

మొన్న (22-11-2010) ఈనాడులో 'చేకూరి శ్రీరామ్' అనే ఆయన (ఈయన దేనిలో నిపుణుడో వాళ్లు వ్రాయలేదు) సంపాదకీయం ప్రక్కనే ఓ వ్యాసం వ్రాశాడు. ఓ వందకోట్లతో ఓ పథకం ప్రారంభించి, 72 గ్రామీణ బ్యాంకులకీ మూలధనం గా పంచిపెట్టి.....ఇలా అంతర్జాతీయ స్థాయి వరకూ పనికొచ్చే 11 పాయింట్లు (అచ్చం ఓ గొప్ప బుర్రోవాదిలా) వ్రాశాడు. చివరిదాకా చదివితే, 'ఇవన్నీ జరిగేవేనా?' అనిపిస్తుంది.

పక్కింటికి యేదోపని మీద వచ్చిన సూ ఋ సంస్థ ప్రతినిధిని ఓ అరగంటసేపు నిలబెట్టి, మాక్కూడా అప్పిస్తారా? అని అడిగి, వాయిదా కన్నా యెక్కువ కట్టెయ్యచ్చుకదా? మా బరువే తీరిపోతుంది కదా! వడ్డీ యెంతైనా పరవాలేదు--కట్టేసేవాళ్ళం మాకేమిటి! పదో తారీకు దాకా అఖ్ఖర్లేదు--ఒకటో తారీకు కల్లా కట్టేస్తాం, మరి వెంటనే పని అయిపోతుందా? అని, రేషన్ కార్డూ, వోటరు కార్డూ జెరాక్సులు తీసుకొని, బ్యాంకులో యెకవుంటు తెరిచి, చెక్కుబుక్కు ఇచ్చేదాకా బ్యాంకువాళ్లని విషయించి, అది పట్టుకొని సూ ఋ సంస్థ దగ్గరకి వెళ్లి, సంతకాలు చేసేసి, వాళ్లిచ్చిన చెక్కు పట్టుకొని మళ్లీ బ్యాంకుకి వచ్చి, మార్చుకొని ఋణం సొమ్ముని అనుభవించడం యెందుకు?

తిరిగి చెల్లించవలసొచ్చేటప్పటికి కాళ్లు చల్లబడి, "మీవన్నీ ఆగడాలు, మేము కట్టం, గట్టిగా అడిగితే ఆత్మ హత్య చేసుకొంటాం!" అనడం యెందుకు?

వీటికి పరిష్కారం చూడకుండా, ఆర్డినెన్స్ లు అనీ, అథారిటీలు అనీ, బ్యాంకులని బలి చేస్తాము అనీ వీళ్లు విఱ్ఱవీగడం యెందుకు?

చివరికి ఆవకాయకి తోక రావడమే కాదు, పరిగెట్టి పారిపోతుంది కూడా!

యేమంటారు?

Friday, November 26

స్వవిషయం

ఈ మధ్య టపాలు వ్రాయడం లేదు. 

కారణం....సమయం దొరకకపోవడమే! అంత యేమి పాటుపడిపోతున్నారు.....అనెయ్యకండి.

దీపావళికి బెంగుళూరు నించి మా అబ్బాయీ, కోడలూ మనవణ్ణి తీసుకొని వచ్చారు 20 రోజులు పైగా సెలవు పెట్టుకొని. ఇంక నిజం గా బయటి ప్రపంచం తెలియలేదు.

రాత్రి 8 అయ్యేసరికల్లా, అమెరికానించి మా మనవలు (అమ్మాయి కొడుకులు) ఇద్దరూ వెబ్ కేమ్ లో వాళ్ల విద్యా ప్రదర్శనలూ, మమ్మల్నందరినీ ఇంటర్వ్యూలు.

దీపావళి తరవాత నవమి నాడు మా తండ్రిగారి ఆబ్దీకం--మా అన్నదమ్ములూ, చెల్లెళ్లూ, వాళ్ల పిల్లలూ, మనవడూ, మనవరాలూ అందరూ వచ్చారు--మా చిన్నతమ్ముడూ, మరదలూ, వాడి ఇద్దరుకొడుకులూ తప్ప.

మొన్న 22న మా మనవడి మూడో పుట్టిన రోజు (రెండు నిండాయి). అదో హడావిడి.

ఇక, మా బ్యాంకు నించి నాకు రావలసిన దాదాపు పాతిక లక్షలని ఇవ్వకుండా, వేలికీ కాలికీ వేస్తూ, జాప్యం చేస్తున్న బుర్రోవాదులూ! ఇప్పటికి వాళ్ల బుర్రలు వుపయోగించి, నా సొమ్ము నాకు ఇవ్వడం ప్రారంభించారు విడతలుగా!

వీటన్నింటి మధ్యా ఇంక సమయం యెక్కడ! మెయిల్స్ చెక్ చేసుకోడానికి కూడా సమయం లేదు. 

కంప్యూటర్ ఆన్ చెయ్యగానే, మా మనవడు వొళ్లో చేరి, వరసగా బా బా బ్లాక్ షీప్ నుంచీ, చందమామ చందమామ నుంచీ, ఆటల దగ్గరనుంచీ, వాడిష్టం వచ్చినట్టు అన్నీ నొక్కేసి, "క్లోజ్", "షట్ దౌం" అనేవరకూ! ఇంకెక్కడి ఇంటర్నెట్!

ఇదిగో, ఇప్పటికి మళ్లీ మేమిద్దరూ మిగిలాం లంకంత కొంపలో!

మళ్లీ మొదలెట్టాను--మిమ్మల్ని సుత్తితో బాదడం.

రడీయేనా?

Monday, October 25

మన ఋణ వ్యవస్థ - 10

"సూక్ష్మ" ఋణాలు - 10


"ఆరంభింపరు......" అనే సుభాషితాన్ని మననం చేసుకొని, ఈ వ్యాస పరంపరని ముగిద్దామనే నిర్ణయానికొచ్చాను. (నాకేదో విఘ్నాలొచ్చాయని కాదు--ప్రారంభించినదాన్ని పూర్తి చెయ్యలి కదా అని.)

రెండు మూడు విషయాలు వ్రాసి ముగిస్తాను.

"ఇండియాలో జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే........" అని ఒబామా అన్నాడంటే, వాడిని తిట్టిపోశాము.

రాశ్శేఖర్రెడ్డి, "దొడ్డు బియ్యం సన్న బియ్యం కన్నా ఆరోగ్యానికి మంచివి, సన్న బియ్యం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి, అందరూ దొడ్డు బియ్యమే తినండి" అంటే, వాణ్ని కూడా వదలలేదు.

ఇప్పుడు అహ్లువాలియా "జనాలదగ్గర యెక్కువ డబ్బు వుంటే, ప్రతిరోజూ కూరగాయలు కొంటారు, పాలూ, పాల వుత్పత్తులూ యెక్కువగా వినియోగిస్తారు--అందుకే ఆహర ద్రవ్యోల్బణం 16.37 శాతానికి పెరిగింది--ఇప్పుడు కొంచెం తగ్గింది" అంటున్నాడు.

"గత మూడు నెలలుగా రేషన్ బియ్యం అందరూ తీసుకొంటున్నారు (అంతకు ముందు డీలర్లకే వదిలేసేవారట); మార్కెట్ లో సన్న బియ్యం సరఫరా బాగుండడంతో రేట్లు పెరక్కుండా వున్నాయి, పైగా తగ్గుతున్నాయి" అంటూ ప్రభుత్వాధికారులూ, పత్రికలూ అంటున్నారు!

--అంటే, యేమి జరుగుతోందో చిన్నపిల్లవాణ్ని అడిగినా చెపుతాడు! అవునా?

మన రిజర్వ్ బ్యాంక్ యేర్పడ్డాకా, స్వతంత్రం వచ్చాకా, అనేకమంది దిగ్దంతులు గవర్నర్లు గా పని చేశారు--ఎల్ కే ఝా నుంచీ, మన్మోహన్ సింగ్ నుంచీ, బిమల్ జలాన్ ల వరకూ! కానీ ఇప్పుడు వున్నంత దుస్థితిలో ఇంతకు ముందు లేదు--క్రమ క్రమంగా నెట్టివెయ్యబడింది! (పాపం వేణుగోపాల రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు ల తప్పేమీ లేదండి!--పాపం అంతా సో కాల్డ్ "అధిష్టానాలదే"--యెక్కువగా కాంగీల!)

లేకపోతే, ఆర్బీఐ కి "లీజింగ్ & ఫైనాన్స్" సంస్థలమీదా, "ఎన్ బీ ఎఫ్ సీ" ల మీదా, "బ్యాంకుల" మీదా, వడ్డీ రేట్ల మీదా, రెపో, రివర్స్ రెపో, రేట్లమీదా, ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్ లమీదా, దేనిమీదా కంట్రోలు లేదు!

ఇక, అవసరం లేకపోయినా, తమతోటివాళ్లతో అప్పులు తీసుకున్న స్వ స సం సభ్యులు, ఆ డబ్బులతో బంగారాలు కొనేశారనుకున్నాం కదా. మరి ఆ బంగారాలు యేమయ్యాయి? ఆత్మహత్యలెందుకు? అంటే, వాటిని సూ ఋ సం ల అప్పులు తీర్చడానికి, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లలో తనఖా పెట్టారు!

(నేను అడపాదడపా ఈ సంస్థల గురించి హెచ్చరిస్తూనే వున్నాను! మన దేశం లో కాంగ్రెస్ కూడా పుట్టక ముందు నించీ ఇవి "బిజినెస్" చేస్తున్నామని చెప్పుకొంటున్నాయి! యేం బిజినెస్ అని నన్నడక్కండి--యెందుకంటే మన రిజర్వ్ బ్యాంకు తో సహా మనమెవరూ పుట్టలేదు అప్పటికి! మరి ఇప్పుడు, గత రెండేళ్లుగా--పత్రికల్లో మొదటి పేజీలలో ఓ మూల చిన్న ప్రకటన వేసే స్థాయి నుంచి ఇప్పుడు సినీ యాక్టర్లతో ఓ పావుపేజీ ప్రకటనలు ఇచ్చే, టీవీల్లో వార్తలు కూడా "స్పాన్సర్" చేసే స్థాయికి యెలా యెదిగాయో, అనేక బ్రాంచీలని యెలా యేర్పాటు చేసుకొని, వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాయో--యెవరికీ తెలియదు, యెవరూ పట్టించుకో లేదు!)

ఇక మన రా నా లు మాత్రం గత ఆరేళ్లు గా సామాన్య జనాన్ని--

"దొరికిన చోట్లల్లా అప్పులు చెయ్యండి, కట్టలేము అని చేతులెత్తెయ్యండి--తరవాత ప్రయోగించడానికి 'మాఫీ అస్త్రం' మేము సిధ్ధం చేస్తాం"!

--అని జనాలని రెచ్చగొట్టడం లో కృతకృత్యులయ్యారు! ఇక ఈ వాగ్దానాలు వోట్లు గా మారతాయో లేదో--కాలమే నిర్ణయించాలి! 

సర్వే జనాస్సుఖినో భవంతు!

Saturday, October 23

మన ఋణ వ్యవస్థ - 9

"సూక్ష్మ" ఋణాలు - 9

ఓ పక్క సూ ఋ సంస్థలగురించి గోల జరుగుతూండగానే, ఇంతకు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ ఎల్ బీ సీ) లో నిర్దేశించిన మేరకు, మహిళా స్వ స సం లకి ఋణాలు ఇవ్వడానికి "ఆంధ్రా బ్యాంకు" ముందుకు వచ్చి, "గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ" (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవెర్టీ--ఎస్ ఈ ఆర్ పి)--(ఇది ప్రభుత్వ సంస్థో,  ఎన్ జీ వో నో తెలీదు) తో 12-10-2010 న ఓ వొప్పందం కుదుర్చుకుందట!

ఈ "సెర్ప్" పోషిస్తున్న పాత్ర యేమిటో స్పష్టం కాలేదు కానీ, "గతంలో తీసుకున్న ఋణ వాయిదాలని స్వ స సం లు యెప్పటికప్పుడు చెల్లించే విధం గా తాను చూస్తాను" అని హమీ యిచ్చిందట.

ఈ సంస్థ ఒక సర్వే నిర్వహించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో 4.23 లక్షల స్వ స సం లు రూ.7,698 కోట్ల ఋణం పొందడానికి "అర్హులు" అని తేల్చి, ఆ జాబితాని బ్యాంకులకి అందజేసిందట. వీటిలో, ఆంధ్రా బ్యాంకు 64,271 సంఘాలకి రూ.1,238.86 కోట్లు "ఇవ్వాల్సి" వుందట. ఈ మేరకు వొప్పంద పత్రం మీద "సంతకాలు" చేసిందట.

కొన్ని బ్యాంకులతో ఇలాంటి వొప్పందాలు ఇప్పటికే జరిగితే, ఇంకొన్నిటితో జరగబోతున్నాయట!

ఆగస్టునాటికి రూ.2,200 కోట్లు సంఘాలకి అందాయని "సెర్ప్ అధికారులు" చెప్పారట.

14-10-2010 న సూ ఋ సంస్థల గురించి ప్రత్యేక ఎస్ ఎల్ బీ సీ సమావేశం జరగనుండగా, 12-10-2010 న ఈ బ్యాంకు ఈ వొప్పందం చేసుకోవడం లో మతలబేమిటో మరి.

ఇక మొన్న ముఖ్యమంత్రితో సమావేశం లో సూ ఋ సం ల బాధితులకు వాటినుంచి బయటపడడానికి సాయం చేస్తామని ఆవేశ పడ్డ బ్యాంకులకి, వాస్తవాలు వాటి ముఖం మీద కళ్లెర్రజెయ్యగనే, కాళ్లూ చేతులూ చల్లబడ్డాయట!

వాళ్లని బయట పడెయ్యాలంటే, 10 వేల కోట్ల పైమాటగా కొత్త ఋణాలు ఇవ్వాలనీ, అక్కడితో ఆగకుండా, ఒకళ్లకిస్తే అనేకమంది బ్యాంకులమీద దాడి చేసే అవకాశాలున్నాయనీ గ్రహించి, "ఇది జరిగేపని కాదు" అని తేల్చి చెప్పేశారట ప్రభుత్వానికి. హమ్మయ్య.

రిజర్వ్ బ్యాంకు కమిటీని కూడా యేర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది--చూద్దాం యేమి జరుగుతుందో!

Thursday, October 21

మన ఋణ వ్యవస్థ - 8

"సూక్ష్మ" ఋణాలు - 8


ఇక, ఈ సూ ఋ సంస్థలు "బ్లాంకు చెక్కులు" యెందుకు తీసుకుంటాయి? అవి పూర్తి చేసి బ్యాంకులలో వేసి, తిరిగి వస్తే వాటికి యేమిటి కలిసొచ్చేది? అంటే......

ప్రస్తుతం బ్యాంకులకి సెలవలెప్పుడో నిర్ణయించడానికి మాత్రమే వుపయోగిస్తున్న "నెగోషియబుల్ ఇన్స్త్రుమెంట్ ఆక్ట్" వల్ల ఇంకా వూడిపోని రెండో వుపయోగం ఇదొకటి. యెవరైనా తమ ఖాతాలో సరిపోయిన సొమ్ము లేకుండా, చెక్కులు జారీ చేస్తే, అవి బ్యాంకులో 'బౌన్స్' అయితే, వెంటనే వారిమీద కోర్టులో కేసు వేసి, తమకి రావలసిన మొత్తాన్నీ, పరిహారాన్నీ కూడా పొందవచ్చు.

(అడపాదడపా సినిమా రంగం లోనూ, కొంతమంది సెలెబ్రిటీల విషయం లోనూ ఇలాంటి కేసుల గురించీ, అరెస్టులగురించీ పేపర్లలో చదువుతూ వుంటాం!)

అందుకోసమే--ఈ అవకాశం యెప్పటికైనా అట్టేపెట్టుకోడానికి--బ్లాంక్ చెక్కులు. కానీ, ప్రతీ బ్యాంకులోనూ, చిన్న శాఖలలోసైతం రోజూ 10 చెక్కులైనా తిరిగి వెళుతూంటాయి బౌన్స్ అయి. రాష్ట్ర వ్యాప్తం గా యెన్ని కోర్టులలో, యెంతమంది మీద యెన్ని లక్షల కేసులు నమోదు చెయ్యగలరు ఈ సూ ఋ సంస్థల వాళ్లు? వాటికోసం వాళ్లకీ, ప్రభుత్వానికీ యెంత ఖర్చు అవుతుంది?

అసలే కోర్టులు "పెండింగ్ కేసులు" పేరుకుపోతున్నాయి అని, ముఖ్యమైన కేసులు కూడా వెంటనే నమోదు చేసుకొని నెంబర్లు ఇవ్వడానికి నీళ్లు నములుతున్నాయి! లాయరు రోజూ ప్రయత్నిస్తుంటే, ఏ పది రోజులకో నెంబరవుతున్నాయి! ఇంకెక్కడి చెక్ బౌన్స్ కేసులు!
  
ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో వింతలు జరిగేవి--బ్యాంకు తన అధికార ముద్రతో, "సరిపోయే నగదు లేదు" అనేకారణం తో చెక్కులు తిప్పి పంపినా, లాయర్లు కాలయాపన కోసం జడ్జీల చేత ఆ మేనేజర్లకి సమన్లు ఇప్పించేవారు! అక్కడనించి, ఆ మేనేజర్లు తమ పన్లన్నీ ప్రక్కనబెట్టి, ఆ కోర్టు వున్న వూరికి అధికార హోదాలో ప్రయాణించి, అక్కడ రోజంతా పడిగాపులు పడి, మళ్లీ తిరిగి వచ్చి ద్యూటీలో చేరడానికి కనీసం 3 రోజులు పట్టేవి! తరవాత్తరవాత ఇలా సమన్లు జారీ చెయ్యడం మానేశారు జడ్జీలు.

ఈ విధం గా యేడాది క్రితానికే రాష్ట్రం లోని స్త్రీలందరూ ఒక్కొక్కళ్లూ అనేక సంఘాల్లో సభ్యులై, అనేక సంఘాలూ బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్ని పంచుకొనీ, బంగారాలు కొనుక్కొనీ, వైభవం గా శుభ/అశుభ కార్యాలు జరుపుకునీ, గుళ్లనీ, దేవుళ్లనీ, దేవతలనీ భక్తితో వైభవం గా అర్చించీ, రేషను బియ్యాన్ని డీలర్లకి వదిలేసీ, మళ్లీ పొదుపుకీ, అప్పు తీర్చడానికీ సూ ఋ సంస్థల దగ్గర మళ్లీ వ్యక్తిగతం గా అప్పులు చేసీ, మళ్లీ అవి తీర్చడానికి ఇంకో సూ ఋ సంస్థ దగ్గర అప్పులు చేసీ, పీకల మొయ్యా ఋణ వూబిలో కూరుకు పోయారు.

(ఇంకా బ్యాంకర్లు కొత్త గ్రూపులని గుర్తిస్తూనే వున్నారు--తమ టార్గెట్ల కోసం!)

ఇక గత పదేళ్లుగా, స్త్రీలకి వర్తింపజేసిన ఈ సూత్రాన్నే పురుషులకి కూడా వర్తింపజేసి, యువజన సంఘాలూ, సేవా సంఘాలూ, రైతుమిత్ర సంఘాలూ యేర్పరచుకొని, యే హామీ లేకుండా ఒక్కో సంఘానికీ యేకంగా పదేసి లక్షలు (ఒక్కోడికీ ఓ లక్ష) ఇవ్వాలని ప్రభుత్వంచేత సూచనలు జారీ చేయించుకొని, బ్యాంకుల మీద పడ్డారు గానీ, బ్యాంకులు వీళ్లని శక్తివంతంగా నిరోధించగలిగాయి. లేకపోతే, ఈ పాటికి కొన్ని లక్షల కోట్లకి ములిగిపోయి వుండేవి. 

(మెజారిటీ యువజన సంఘాలు యే వ్యాపారం కోసం అప్పు అడిగేవో తెలుసా? మట్టితో ఇటుకలు చేసే వ్యాపారం! వాళ్ల పెట్టుబడీ, హామీలు లేకపోగా, వ్యాపారం లో కూడా ఆస్థులు (స్టాక్, యంత్రాలూ ఇలాంటివి కూడా) లేకుండా, రేపు అప్పు తీరక పోతే బ్యాంకు వాళ్లు పీక్కోడానికి వాళ్ల నెత్తిమీద జుట్టు కూడా లేకుండా వీళ్లకి లక్షల్లక్షలు పందేరం చెయ్యమని 'గవుర్నమెంటోడి ' సూచన! యెంత బాగుందో!)

ఇప్పుడు గత మూడేళ్లుగా, కనీసం "రైతు మిత్ర" గ్రూపులకైనా (కౌలు రైతుల తో యేర్పడేవి) గ్రూపు గ్యారంటీ మీద ఒక్కో గ్రూపుకీ కనీసం 5 లక్షలైనా బ్యాంకులచేత ఇప్పించాలని రా నా ల ప్రయత్నాలు!

ఈ గ్రూపుల గురించి మరోసారి.   

చాలామంది గమనించని ఇంకో చిన్న విషయం కూడా బయటికి వచ్చింది--పత్రికలలో.

"అవసరమైనప్పుడు" బ్యాంకులు ఋణాలు అందించడం లేదు అనీ, "సెప్టెంబరు; డిసెంబరు; మార్చి" నెలల్లోనే ఇస్తున్నారు అనీ, వాటికోసం "చాలాసార్లు"  తిరగాల్సి వస్తోంది అనీ!

దీని వెనకున్న "మతలబు" మరోసారి.

Monday, October 18

మన ఋణ వ్యవస్థ - 7

"సూక్ష్మ" ఋణాలు - 7

ఇందిరా గాంధీ ప్రభుత్వం లో ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ బ్యాంకుల జాతీయం కన్నా ముందు, 1960 లలో "బ్యాంకింగ్ సోషల్ కంట్రోల్ ఆక్ట్" (ఈ చట్టం సరిపోతుంది, బ్యాంకులని జాతీయం చెయ్యఖ్ఖరలేదు--అనే పాయింట్ మీదే, ఇందిరతో విభేదించి, మొరార్జీ 1969 లో తన పదవి కి రాజీనామా చేశాడు) తెచ్చిన ఫలితం గా, రిజర్వ్ బ్యాంకు దేశం లోని బ్యాంకులకి కొన్ని నిబంధనలు విధించింది--వాటి మొత్తం ఋణాలలో "ఇంత శాతం" ప్రాధాన్యతా రంగానికి (వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, రోడ్డు/నీటి రవాణా రంగాలు, రిటెయిల్ వ్యాపారాలు--ఇలా) ఇవ్వాలనీ, అందులో తిరిగి "ఇంత శాతం" వ్యవసాయానికి తప్పకుండా ఇవ్వాలి అనీ--ఇలా కేటాయించింది. అలా ఖచ్చితం గా పాటించే బ్యాంకులని బాగా ప్రోత్సహించేది. అందుకని, అప్పటికీ, ఇప్పటికీ ఈ "శాతాలని" ఖచ్చితం గా పాటిస్తున్నాయి మన బ్యాంకులు!

అన్ని బ్యాంకులూ ఈ స్వ స సంఘాలకి ఇస్తున్న ఋణాలని--క్షేత్ర రంగం--ఫార్మ్ సెక్టర్--అంటే వ్యవసాయ ఋణాలుగా చూపిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ రంగం కోటా లో ఇంతమేరకు కోత జరుగుతోంది.

ఇక, "ఇందిరమ్మ" పథకం లో మంజూరైన నిధులు అరకొరగా వుండి, ఇళ్లు మొండిగోడలతోనే నిలిచి పోతుంటే, స్వ స సంఘాల సభ్యులకి "బ్యాంకు లింకేజి" క్రింద  ఒక్కొక్కరికీ 20 వేలు అదనం గా మంజూరు చేయమన్నారు. ఇవి "క్షేత్ర రంగం కాని"--నాన్ ఫార్మ్ సెక్టర్--ఋణాలుగా వ్యవహరిస్తారు. అయినా అవి గృహ నిర్మాణానికి ఇస్తున్నవి కాబట్టి, "ప్రధాన్యతా రంగం" గానే పరిగణించబడి, ఆ మేరకి ప్రాధాన్యతా రంగ ఋణాల లో కోత పడుతోంది. వీటికి ప్రభుత్వం చెప్పుకొనే "పావలా వడ్డీ" వర్తించదు!

బ్యాంకు అధికారులు స్వయం గా ఆ లబ్ధిదారులు "ఇందిరమ్మ పథకం" లో వున్నారనీ, ఇల్లు మధ్యలో ఆగిపోయింది అని నిర్ధారించుకుంటేనే వీళ్లకి అదనపు ఋణాలు ఇస్తారు.

మరి వట్టి అంటాడూ--"బ్యాంకు లింకేజీ చాలా ఘోరం గా వుంది" అని. ఆర్డినెన్స్ తరవాత ఈ లింకేజీ ఋణాలు కూడా "విరివిగా" మంజూరు చేయ్యాలంటున్నారు!

ఒక ఇంట్లో, ఒకావిడా, ఇద్దరు కోడళ్లూ, ఇద్దరు కూతుళ్లూ (వాళ్లలో ఒకామె ఇంటరు చదువుతోంది), పక్కింట్లో ఆమె తోడికోడలు, ఆమె కోడలూ, కూతురూ--ఇక్కడికి యెనిమిది మంది అయ్యారు కదా--ఇంకో ఇద్దరు పక్కిళ్లవాళ్లని చేర్చుకొని, ఓ సంఘం స్థాపించుకొని, బ్యాంకుకి అప్పుకోసం వస్తే, ఆ మేనేజరు లోపాలని యెత్తి చూపి ఇవ్వనంటే, "వుంగరాలూ, తెల్లచొక్కలూ, యమహాలూ" వేసుకొచ్చినవాళ్లు ఆయనని "యెందుకివ్వవూ?" అంటూ రచ్చ రచ్చ చేసిన సందర్భాలు వున్నాయి. 

(మామూలుగా కూడా "వ్యక్తులకి" ముఖ్యంగా మధ్య, యెగువ మధ్యతరగతి ప్రజలకి ఇచ్చే ఋణాలని ప్రాధన్యతా రంగం లోనే మంజూరు చేస్తారు--కానీ, "టీజర్ రేట్లు" అనే ముసుగులో, అడిగినవారికల్లా (రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కూడా) కొన్నివేల కోట్లు ఋణాలు మంజూరు చేసేస్తున్నాయి--ప్రాధాన్యతా రంగం లో! మరి మన సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు--"టిజర్ రేట్లు డిసెంబరు నెలాఖరుదాకా కొనసాగుతాయట" అని ఆనందించేస్తూ వుంటారు.)

మన లోక్ సత్తా జే పీ, 2006 లో బంగ్లాదేశ్ లో యూనిస్ యేర్పాటు చేసిన సూ ఋ వ్యవస్థని పరిశీలించి, "అంతర్జాతీయ సమాజం" నించి "తక్కువ వడ్డీ"కో, గ్రాంటులుగానో తెచ్చి, నిరుపేదలకి "నామ మాత్రపు వడ్డీకి" ఇచ్చే వ్యవస్థ యేర్పాటు చేశారు అనీ, మన రాష్ట్రం లో కూడా కొన్నాళ్లు ఈ వ్యవస్థ బ్యాంకుల ద్వారా చక్కగా జరిగింది అనీ, ఈ సూ ఋ సంస్థల వ్యవహారం "ఓ తప్పుడు నమూనా" అనీ కుండ బద్దలుకొట్టారు.

ఇంకా, 2008 లో ఋణ మాఫీపేరుతో 73 వేల కోట్లు వెదజల్లి, గ్రామీణ పరపతి విధానాన్ని దెబ్బతీశారు--అని కూడా అందరికీ తెలిసిన విషయాన్నే--మరోమారు చెప్పారు!

ఈ విషయం లో యే రైతునైనా కదిలించండి--"యెగ్గొట్టినవాళ్లకి యెదురు డబ్బులిచ్చారు, క్రమం తప్పకుండా కట్టినవాళ్లకి "మొండి" చెయ్యి చూపించారు" అంటారు! (ఇకనించీ మేము కూడా కట్టం అని, అ మాటమీద నిలబడిపోయినవాళ్లు కూడా వున్నారు!)

తక్షశిల రాజు 'అంభి ' తరవాత జాతికి ద్రోహం చేసినవాళ్లలో మొదటివాడు దేవెగౌడ అయితే, రెండోవాడు దేవీలాల్! (ఈ స్థానాలు యెవరిష్టం వచ్చినట్టు వాళ్లు మార్చుకోవచ్చు) వాడు మన దేశం లోని "ఋణ క్రమశిక్షణ" ని తన "మాఫీ" పథకం ద్వారా నాశనం చెయ్యకుండా వుండి వుంటే.....ఇలాంటి పరిస్థితులు దాపురించేవి కాదు దేశానికి!

Sunday, October 17

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 6

ఆర్డినెన్సు వచ్చేసింది!

మన బ్యూరోక్రాట్లు (ఈ ఇంగ్లీషు మాటకి సమానార్థకం గా తెలుగు మాట వచ్చినట్టులేదు! పోనీ మన "బుర్రో వాదులు" అని పెట్టుకుందాం--వీళ్లు తమ బుర్రనంతా వుపయోగించి, అందరికీ చక్కగా అర్థమయ్యే చిన్న విషయాన్ని, దాని చుట్టూ తీగలూ లతలూ మెలికలతోటి యెంబ్రాయిడరీ చేసి, మొత్తానికి 'కాంప్లికేట్' చేసేస్తారు కదా! అందుకని) తమ మేధోమథనం సాగించి, వండి వార్చారు ఈ ఆర్డినెన్సుని. 

ఇందులో విషయాలు అందరూ పత్రికలలో చదివే వుంటారు. దీని వల్ల వుపయోగం యెంత? అంటే "మంత్రాలకి చింతకాయలు రాల్తాయా?" అనే ప్రశ్నే!

ఈ సూ ఋ సంస్థల కార్యకలాపాలపై ఆర్బీఐ కూడా ఓ వుపసంఘాన్ని వేస్తున్నాము అని ప్రకటించింది.

మరి ఈ ఆర్డినెన్సు వెనకాల యెంత 'తతంగం' నడిచిందనుకున్నారూ?

పెద్ద బుర్రోవాదులు క్రిందవాళ్లని పరుగులు పెట్టించారు! వాళ్లా పరుగులు పెట్టేది.....నటించారంతే! 

పరుగులెందుకంటే--"మీ యేరియాలో పని చేస్తున్న సూ ఋ సంస్థలెన్ని? స్వ స సం లెన్ని? వాళ్లలో సభ్యులెంతమంది? వాళ్లలో బ్యాంకు ఋణాలు తీసుకున్నదెంతమంది? తిరిగి చెల్లిస్తున్నవాళ్లెంతమంది? చెల్లించలేకపోతున్న వాళ్లెంతమంది? వాళ్లలో యెవరు యెన్ని సూ ఋ సంస్థల్లో యెంతెంత అప్పు చేశారు..............ఇలా 'ముత్యాల ముగ్గు ' సినిమాలో మాడా అడిగినన్ని ప్రశ్నలకీ......వెంఠనే సమాధానాలు పంపించమని తహశీల్దార్లూ, రెండురోజుల్లో అని ఆర్ డీ వో లూ, జాయింట్ కలెక్టర్లూ, వారం లో అని కలెక్టర్లూ, నెలాఖరులోగా అని ప్రభుత్వమూ........ఇలాగన్నమాట!

ఆయనే వుంటే మంగలెందుకన్నట్టు, ఈ సమాచారమంతా మన ప్రభుత్వోద్యోగుల దగ్గర వుంటే, ప్రస్తుత దురవస్తే దాపురించేది కాదు కదా!

ఇప్పుడు సూ ఋ సంస్థలు 30 రోజులలోపల ప్రభుత్వం దగ్గర 'రిజిస్ ట్రేషన్ ' చేయించుకోవాలనీ, అది అయ్యేవరకూ తమ కార్యకలాపాలు సాగించకూడదు అనీ ఆర్డినెన్సు లో మొదటి పాయింటు. పోనీ, ఇప్పటికి వున్న ఇరవై ఒకటో, యాభయ్యో సంస్థలు దరఖాస్తులు రెండురోజుల్లోనే దాఖలు చేస్తే, వెంటనే అనుమతి ఇచ్చేస్తారా? అబ్బే! అలా అయితే బుర్రో వాదులెందుకవుతారు? ఇంకా టైము వుంది కదా, అందరినీ దరఖాస్తులు చేసుకోనివ్వండి చూద్దాం.....అంటారు. మరి నెల్లాళ్లూ ఈ సంస్థలు గోళ్లు గిల్లుకుంటూ కూర్చొనే వుండాలేమో!

వివిధ చట్టాల క్రింద రాష్ట్రం లో నమోదైన సూ ఋ సంస్థలు ఇంకొన్ని బయటికి వచ్చాయి (వీటిలో ఇంతకు ముందు మనం చెప్పుకున్న 13 లో కొన్ని రిపీట్ అవుతాయి--గమనించండి)

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు : 1. ఎస్ కే ఎస్; 2.షేర్; 3. స్పందన; 4.స్పూర్తి; 5.అస్మిత; 6.ఫ్యూచర్; 7.బేసిక్స్; 8.శారద; 

సొసైటీల చట్టం క్రింద : 1.సి సి డి; 2.డౌవ్; 3.గైడ్; 4.సిరి; 5.ఆదర్శ; 6.సెంటర్ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్; 7.కృషి; 8.ప్రగతి; 9.సాధన; 10.స్టార్.

మాక్స్ (మ్యూచువల్లీ ఐడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ) క్రింద : 1.కాంఫెడరేషన్ ఆఫ్ వాలంటీర్స్ అసోసియేషన్; 2.దీపిక మహిళా; 3.ఝాన్సీ రాణి మహిళా; 4.కాకతీయ మహిళా; 5.మదర్ థెరిస్సా మహిళా; 6.వాగ్దేవి మహిళా; 7.ఇందూరు ఇంటిదీపం; 8.పి డబ్ల్యు ఎం ఏ సీ ఎస్

ట్రస్టు ల క్రింద : 1.ది మాక్స్ వెల్త్ ట్రస్ట్; 2.రాష్ట్రీయ సేవా సమితి.

ఇప్పుడీ పేర్లన్నీ, వాటిలో అప్పు తీసుకున్నవాళ్లకి కూడా గుర్తుండవు లెండి. ముందు చెప్పుకున్న 13 లో మాత్రం, ఓ ఐదారు బాగా ఫేమస్!

సరే....మన ప్రభుత్వ వుద్యోగులూ, మీడియా వాళ్లూ యెంత చక్కగా విషయ సేకరణ చేస్తున్నారో పత్రికలలో చదివే వుంటారు. 

వొక సంస్థ దగ్గర అప్పు తీసుకొని, దాని వాయిదా చెల్లించడానికి ఇంకో సంస్థ దగ్గరా--ఇలా చేస్తున్నామని చాలా మంది చెపుతున్నారు. (ఇప్పుడడిగితే, ప్రతీవాళ్లూ నాకు 4, నాకు 5, నాకు 7 సంస్థలు అప్పు ఇచ్చాయి అనే చెపుతారు--యెందుకో వూహించండి!)

'కట్టలేకపోతే, ఆత్మహత్య చేసుకోండి ' అని సూ ఋ సంస్థ ప్రతినిధులు అంటున్నారు (ట). (వాళ్లెంత విసిగి పోతే అలా అంటారో వూహించండి--బీమా మొత్తం వస్తే, అప్పుతీరిపోవడం తోబాటు, కుటుంబానికి ఇంతో అంతో మిగులుతుంది--వుభయతారకం--అనికూడా చెపుతున్నారని అంటున్నారు!)

"ఒకసారి ఈ 'సంస్థల ' అప్పులు తీరిపోతే మళ్లీ జీవితం లో వాటి ముఖం కూడా చూడము" అని సెలవిస్తున్నారట. (వెలుగుతోందా ఇప్పటికైనా, వీళ్లకి తరిఫీదు యెవరు ఇస్తున్నారో?)

ఇదంతా, ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర! రొచ్చుగుంటలని సృష్టించడానికి పంచవర్ష ప్రణాళికలూ, దశవర్ష ప్రణాళికలూ రచించబడ్డాయి! 

"వచ్చే ఐదేళ్లలో, ప్రతీ ఆడకూతుర్నీ లక్షాధికారిని చేస్తాం..........." అని మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదూ?

వురుమురిమి, మంగలం మీద పడ్డట్టు, ఇప్పుడీ సూ ఋ సంస్థల అప్పుల్ని తీర్చడానికి, మళ్లీ బ్యాంకులే 'పావలా వడ్డీ' ఋణాలని మంజూరు చెయ్యాలట! (ఈ సూ ఋ సంస్థలు వర్థిల్లుతాయి, జనాలూ చేతులు దులిపేసుకుంటారు--పోయేది? ఇంకెవరు? బ్యాంకులే!)

Saturday, October 16

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 5


"ఇదేదో రొచ్చు గుంటలా కనపడుతోందే.......అది కూడా 'పేధ్ధది '........భలే బాగుంది.......రండ్రా.......అందరూ చేపలు పట్టేద్దాం!" అంటూ తయారయిపోతున్నారు మన రా నా లు. 

ఒకడేమో, "ఈ సూ ఋ సంస్థల 'యజమానుల్ని వురి తీయాలి', వీళ్లకీ రాహుల్ కీ సంబంధమేమిటో తేల్చాలి" అంటాడు.

ఇంకోడేమో, "దీనంతటికీ చంద్రబాబుదే బాధ్యత...వాడిని వురి తీయండి" అంటాడు.

మరోడు, వసూలు కోసం వచ్చే వాళ్లని "చీపురుకట్టలు తిరగేసి" తరిమి కొట్టండి--అంటాడు.

సామాన్యుడంటాడూ--"వొరే! మీ చుట్టాలూ, తైనాతీలూ నూటికీ నెలకీ మూడు రూపాయల వడ్డీకిచ్చి, వసూలుకోసం వచ్చినాళ్లని ప్రజలు "చీపురుకట్టలతో" తరిమికొట్టాలేంట్రా?" అని!

యెవడి గోల వాడిది!

ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం (మాననీయ ముఖ్యమంత్రి రోశయ్య) గురువారం (14-10-2010) న మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి వర్గం భేటీ అవుతుంది అని ప్రకటించారు.

ఆయన బుధవారం రాత్రే, బ్యాంకరులు, కొందరు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు(ట). ఈ సమావేశం లో, ము మం "బ్యాంకులనుంచి సకాలం లో ఋణాలు అందకపోవడం, అందినవి అవసరాలకు యేమాత్రం సరిపోవకపోవడం" వల్లే, సూ ఋ సంస్థలు విజృంభించాయంటే....

బ్యాంకర్లు, "బహుళ ఋణాల వూబిలో ఇరుక్కోవడం వల్లే 'పావలా వడ్డీ' ఋణాలని సహితం పేదలు సకాలం లో చెల్లించలేకపోతున్నారు" అన్నారట! (నిజానిజాలు ముంజేతి కంకణమేగా!)

గురువారమే (14-10-2010) సమావేశామవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ ఎల్ బీ సీ) నిర్ణయించిందట! 

ఈ ఎస్ ఎల్ బీ సీ కి సారధ్యం వహించేది రాష్ట్రం లో లీడ్ బ్యాంకు గా వ్యవహరిస్తున్న బ్యాంకే! (నిజానికి ఈ లీడ్ బ్యాంకుల వ్యవహారం, అడాప్టెడ్ విలేజీల వ్యవహారం, బ్యాంకు శాఖలని తెరుచుకొని, మూసుకొనే వ్యవహారం, వడ్డీ రేట్ల వ్యవహారం, ఏ టీ ఎం లని యేర్పరచుకొనే వ్యవహారం--ఇలాంటి వాటినన్నీ రిజర్వ్ బ్యాంకు యెప్పుడో పది పన్నెండేళ్ల క్రితమే యెత్తేసింది!)

కా......నీ....ఈ బ్యాంకులలో వుండే (ఇసుమంతైనా అవగాహన లేని) "బ్యూరోక్రాట్లు" అన్ని విషయాలనీ "రిజర్వ్ బ్యాంకు" మీదకి తోసేస్తూంటారు! వారి చేతికి మట్టి అంటుకుంటుందేమో అని భయంతో!

ఫైనల్ గా, చివరాఖరికి మన లాంటి వాళ్లు యెంత మోసపోతున్నామో తెలుసుకోడానికి--ఈనాడు ఆదివారం అనుబంధం లో (10-10-10) న ప్రచురితమైన 'ఉమాబాల చుండూరు ' వ్రాసిన "అపాత్రదానం" కథ చదవండి.

ఇందులో ఒకావిడ, వాళ్ల పనిమనిషి మీద జాలిపడి, (వాళ్ల నాన్న తనకి ఇచ్చిన, తను అపురూపంగా దాచుకొంటున్న 1500 రూపాయల సొమ్ముని) ఆమె యేడో క్లాసు చదివే కూతురుకి పుస్తకాల నిమిత్తం దానం చేసేస్తుంది! 

ఆ తరవాతోరోజు, ఆ పని మనిషి, "మా అమ్మాయి పెద్దమనిషి అయిందటమ్మా!" అంటే, ఆవిడకి అమాంతం సెలవిచ్చేసి, 'పసుపూ, కుంకం, చీరా, జాకెట్టు గుడ్డా వున్న కవరునిచ్చేసి' ఆనందిచిన ఆ "మధ్య తరగతి" అమ్మ, క్రింది తరగతి కి చెందిన పని మనిషి చేసిన "ఖర్చులని" చూసి (విని) మూర్చపోయినంత పని చేసి "అయ్యో! అపాత్రదానం చేశానా?" అనుకుంటుందట!

అదండీ సంగతి!



Friday, October 15

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 4



వచ్చిన గొడవల్లా, ఋణ గ్రహీతల ఆదాయమెంత, ఖర్చు యెంత, పొదుపు యెంత, ఋణాలెంత, గ్రూపు సభ్యులా కాదా, గ్రూపుకి అప్పు వుందా--ఇలాంటివన్నీ వీళ్లకి అనవసరం.

యెందుకంటే, తమ దగ్గర మురుగుతున్న డబ్బుని, యెలాగోలా వితరణ చెయ్యాలి--చట్టబధ్ధం గా! దానికోసం తమ వుద్యోగులకి కూడా లక్ష్యాలు నిర్దేశించి, వాటిని అందుకునేదాకా చంపుకు తిన్నాయి! (ఈ వుద్యోగులకి కనిష్టం 500 నించి గరిష్టం 10 వేల వరకే జీతాలు! అందుకనే, ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తాయి--నగదు రూపం లో--లక్ష్యాలు చేరిన వాళ్లకి! అదే ఋణ వసూళ్లకైతే, లక్ష్యాలు చేరనివాళ్లకి జీతాలు కోస్తారు! మరి పాపం వాళ్లెలా ఛస్తారు?)

ఇంకేం? నెత్తిమీద జుట్టు కూడా లేనివాడికీ, అప్పటికే గ్రూపులలో వుండి, జుట్టు మాత్రమే కలిగి వున్న వాళ్ల ఆడాళ్లకీ, మేజర్లయిన కొడుకులకీ, కూతుళ్లకీ (కూతుళ్లు రేపు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతారు!) కొండొకచో, మైనర్లకీ (తండ్రినో, తల్లినో గార్డియన్ గా పెట్టుకొని) సూ ఋ లు మంజూరు చేసేశారు!

ఇక నెల నెలా ఠంచనుగా ఋణ గ్రహీత అప్పు చేసిన తేదీ నాడే వాళ్ల చెక్కులని పూర్తి చేసి, బ్యాంకులలో దాఖలు చేస్తారు. (మొదట్లో ఓ ఐదారు వాయిదాలు బాగానే చెల్లిస్తారు--చేతిలో డబ్బులు బాగానే ఆడుతుండడంతో!) ఖాతాలో డబ్బు లేక, చెక్కు తిరిగి వెళితే, ఖాతా వున్న బ్యాంకు వారు ఓ 46 రూపాయలు (సర్వీస్ ఛార్జి + 13% టాక్స్) వసూలు చేస్తారు. సూ ఋ సంస్థ వారు తమకి ఆ నెలలో రావలసిన వాయిదా డబ్బు రాలేదు కాబట్టి, వడ్డీతో లెఖ్ఖగట్టి, మళ్లీ నెల చెక్కుని వాయిదా+వడ్డీ కి వ్రాసి, బ్యాంకులలో జమ చేస్తారు! ఆ నెలా చెక్కు తిరిగి వెళితే--షరా మామూలే!

ఇలాంటి సూ ఋ సంస్థలు మన దేశం లో 21 వుండగా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక లలో వ్యాపారం సాగిస్తున్నవి 16. వీటి వ్యాపారం కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే యెక్కువ. (ఇక్కడ విజయాలు సాధిస్తే, అక్కడ విస్తరణ చేసేవి!)

ఆ 16 సంస్థల లో, ప గో జి లో "హెచ్చు" వ్యాపారం చేస్తున్న 13 సంస్థల పేర్లు--1. ఎస్ కే ఎస్ (స్వయం కృషి) 2. అస్మిత 3. స్పందన 4. షేర్ 5. క్రీసా 6. ఫుల్లర్ టన్ ఇండియా (గ్రామ శక్తి) 7. ఎల్ & టీ 8. ఉండమ్మా, బొట్టు పెడతా 9. పంపు కింద బింది, 10. స్వయం 11. ప్రగతి 12. గృహలక్ష్మి 13.హెల్ప్.

వీటిలో ఎస్ కే ఎస్ సంస్థ యజమానులకీ, రాహుల్ గాంధీ కీ సంబంధం వుందని ఇటీవలి ఆరోపణలు!

మొన్నో రోజు ఒకే సారి యెనిమిదో యెంతమందో ఆత్మహత్యలు చేసుకోగానే, రాహుల్ మన మంత్రి వట్టి వసంత కుమార్ ని ఢిల్లీ పిలిపించుకొని, ఆరా తీశాడట! వట్టి యేదో సర్ది చెప్పాడట! ఇదో పిడకల వేట.

అన్నట్టు, ఎస్ కే ఎస్ సంస్థ పబ్లిక్ ఇస్యూ కి కూడా వెళ్లింది--రేపో మాపో లిస్టింగ్ అవుతుంది! ఇంకెంత విజృంభిస్తుందో! ఈ కంపెనీలో పనిచేస్తున్న "గుర్మన్" యేటా రెండు కోట్ల జీతం, 80 లక్షల బోనస్ తీసుకుంటున్నాడట! (చందా కొచ్చార్ కూడా యేడుస్తుందేమో! ఈ మాట వింటే)

ఇక ఆర్ బీ ఐ, సూ ఋ సంస్థల మీద నాకు ఆధిపత్యం లేదు, వడ్డీలు తగ్గించమని వాళ్లకి చెప్పలేను--అంటుంది!

సూ ఋ సంస్థలు, మేము ఎన్ బీ ఎఫ్ సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) గా రిజర్వ్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యాము, నువ్వెవడివిరా కోన్ కిస్కా? అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని!

(మనకి హర్షద్ మెహతా కుంభకోణం తరవాతో, కేతన్ పరేఖ్ కుంభకోణం ముందో కొన్ని వేల "లీజింగ్ & ఫైనాన్స్" కంపెనీలు పుట్టుకొచ్చాయి దేశ వ్యాప్తం గా--రెండు మూడేళ్లలో వాటా దారులనీ, ప్రజల్నీ మోసగించి, బోర్డులు తిప్పేశాయి! ఇంకా కొన్ని అదేపని చేస్తున్నాయి--వీటి సంగతి క్రమం లో.)

మన కొత్త తరం బ్యాంకులు విచ్చలవిడిగా "వ్యక్తిగత", "వాహన", "క్రెడిట్ కార్డు" ఋణాలిచ్చేసి, వాటి వసూలుకై "గూండాలని" రికవరీ యేజంట్లుగా వినియోగిస్తున్నాయి అని వార్తలు వచ్చినప్పుడే--గత మూడు సంవత్సరాలుగా నేను టపాలు వ్రాస్తూనే వున్నాను--ఇండియాలో "లోన్ షార్కింగ్" మొదలవుతోందనీ, త్వరలో అమెరికా, లాటిన్ అమెరికా, మెక్సికో దేశాల లెవెల్లో కాకపోయినా--ఇది "మాఫియా" లాంటి వాళ్ల చేతుల్లోకి వెళుతోందనీ!

యే దావూద్ ఇబ్రహీమో.........21 టినీ.....పాపం శమించుగాక....ఆ రోజు రాకూడదు!

Thursday, October 14

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 3


నిజం గా 2000 వ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థలోనూ, బ్యాంకింగ్ లోనూ ఒక "వాటర్ షెడ్" లేదా "బెంచ్ మార్క్" అని చెప్పుకోవాలి.

రమేష్ గెల్లీ ఆధ్వర్యం లో దూకుడుగా వెళ్లిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నాశనమై పోవడం, ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవాలని ఐ సీ ఐ సీ ఐ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, యూ టీ ఐ బ్యాంక్ వగైరాలు పోటీ పడి, ఋణ వితరణలో అత్యధిక విపణి వాటా (మార్కెట్ షేర్) ని చేజిక్కించుకోవడం తో, ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా నిధులు పేరుకు పోయాయి.

దాంతో, అప్పటివరకూ "వుత్పాదక ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) కే ప్రాధాన్యమిచ్చేవి, "వినియోగ ఋణాలకి" (పర్సనల్ క్రెడిట్) కి ప్రాధాన్యతని మార్చుకున్నాయి. ప్రత్యేక "వ్యక్తిగత ఋణ కేంద్రాలు" యేర్పాటు చేసి మరీ, వుద్యోగులకీ, ఇతర నియమిత ఆదాయ వర్గాలకీ కొన్ని వందల కోట్లు వితరణ చేసేశాయి!

(ఒక్కొక్క వుద్యోగీ నాలుగైదు బ్యాంకులనించి వ్యక్తిగత ఋణాలు పొందిన దాఖలాలు వున్నాయి. ఇప్పటికీ, బీ ఎస్ ఎన్ ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల వుద్యోగులు ఇలా రెండు మూడు బ్యాంకుల నించి ఋణాలు పొందుతున్నారు!)

దాంతో ద్రవ్యోల్బణం పెరగడం, సెన్సెక్స్ 8000 పాయింట్లు ఛేదించడం, అది 16000 వేలకి 'అనతికాలం లోనే' చేరుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించడం, అదీ నెరవేరడం, మళ్లీ 8000 కి పడి పోవడం--ఇదంతా పాత కథ. అలాగే, వడ్డీలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనీ, మళ్లీ తగ్గుతున్నాయి, తగ్గుతున్నాయి అనీ, అలాగే ద్రవ్యోల్బణం విషయం లో కూడా, విచారించడాలూ, ఆనందించడాలూ జరగడం కూడా ఓ ప్రహసనం గా మారింది--అవన్నీ వేరే సంగతులు.

ఇక మన ప్రస్తుత విషయానికీ వీటికీ సంబంధం యేమిటంటే--మన సూ ఋ సంస్థల దగ్గరకూడా నిధులు మురిగి పోతున్నాయి కదా? అందుకే వీళ్లు కూడా "వ్యక్తిగత ఋణాలకి" తెర తీశారు. 

కేవలం "రేషన్ కార్డు" జెరాక్సూ, బ్యాంకు అకవుంట్ పాస్ బుక్కూ, చెక్ బుక్కూ వుంటే చాలు--యెవరికైనా 14 వేలు గానీ, 30 వేలు గానీ ఋణాలివ్వడం మొదలెట్టాయి. గమనించవలసిన విషయం యేమిటంటే, రేషన్ కార్డు లో "యజమానురాలు, భర్త, మేజరూ, మైనరూ పిల్లల వివరాలూ, ఇంటి చిరునామా" స్పష్టం గా వుంటాయి. ఇక బ్యాంకు పాస్ బుక్ వుందంటే, వాళ్లు "కే వై సీ" నిబంధనలు పాటించకుండా జారీ చెయ్యరుగా (పాటించే వుంటారు) అని తలంపు!

ఇక చెక్కు బుక్కులెందుకంటే--వాయిదాల వసూళ్ల కోసం! ఇక్కడ మరో మతలబేమిటంటే, బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకి వాళ్లు "ఖాతా యెంత మొత్తం తో తెరిచారు" అనే అంశం పై ఆధారపడి, 10 చెక్కులుగానీ, 25 చెక్కులు గానీ జారీ చేస్తారు. 10 చెక్కులంటే 500/-, 25 చెక్కులంటే కనీసం 1000/- తో ఖాతా తెరిచారని అర్థం--స్థూలం గా!

పది చెక్కులవాళ్లకి 14 వేలూ, 25 చెక్కుల వాళ్లకి 30 వేలూ అలవోకగా మంజూరు చేసేస్తారు. పది చెక్కులలో తొమ్మిది వాళ్ల దగ్గర అట్టే బెట్టుకొని (బ్లాంకు గా--ఖాతాదారుడి సంతకంతో) పదో చెక్కుని మాత్రం వాళ్ల బ్యాంకు ఖాతాలో జమ చేసే ఋణ మొత్తం 'విత్ డ్రా' చేసుకోడానికి వుపయోగిస్తారు. (25 చెక్కులలో 24 అట్టేపెట్టుకుంటారు).

అప్పటికే "విషవలయం" మొదలయ్యింది అనే సంగతి సూ ఋ సంస్థలకీ తెలుసు, ఋణ గ్రహీతలకీ తెలుసు, బ్యాంకులకీ తెలుసు!

.................మిగతా తరువాయి.

Wednesday, October 13

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 2

నిజం గా పొదుపూ, వ్యాపారం చెయ్యగలిగీ చేయూత కోసం యెదురు చూస్తున్న సంఘాలు--కళ్లు చెదిరే విజయాలు నమోదు చేశాయి. వాటిని తరచూ యెక్జిబిషన్లలో పెట్టేవాళ్ళు.

కానీ ఇవేవీ లేని సంఘాలే యెక్కువ! పూర్తిగా "వాడుక" కోసమే అప్పు తీసుకొనేవి, నెమ్మదిగా తిరిగి చెల్లించుకోవచ్చులే--అని. ఇలాంటివాళ్లతోనే వచ్చింది తంటా!

మొదటి సారి 50 వేలు అప్పుతీసుకోగానే, పది మంది సభ్యులూ ఐదేసి వేల చొప్పున పంచేసుకొనేవారు. కొంతమంది అత్యవసర ఖర్చులు కొంత పోగా, యే నాలుగు వేలో మిగుల్చుకొని, బంగారం కొనేసేవాళ్లు. సగానికి సగం మంది యెచ్చులకి పోయి, కుటుంబాల్లో ఫంక్షన్లకీ, పండగలకీ యెక్కువ మొత్తాలు ఖర్చుపెట్టేసేవారు. కొంతమంది తమ కుటుంబం లోని ఒకరిని పట్నానికో, విదేశానికో పంపించడానికి వాడుకొనేవారు. కొంతమంది, అప్పటికే దుబాయికో, ముంబాయికో వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకొంటున్నవాళ్లు, అలాగే యెగిరి పోయేవారు!

ఇవన్నీ అప్పు తీర్చవలసిన మూడేళ్లలో క్రమం గా జరిగిపోతూండేవి!

గ్రూపు లోని మిగతా సభ్యులు కొన్నాళ్లు పొదుపునీ, అప్పునీ జాగ్రత్తగా తిరిగి చెల్లిస్తూ వుంటే, చెల్లించ(ని)లేనివాళ్లు మానేశారు. ఓ యేడాదిపాటు బ్యాంకులో జమలు చేసినా, తరవాత మానేసినా, బ్యాంకు వాళ్లెవరూ పట్టించుకోలేదు. పాపం వాళ్లకి తమ పైవాళ్లిచ్చిన ఋణ వితరణ లక్ష్యాలని పూర్తి చేసే హడావిడిలో, కొత్త గ్రూపులని గుర్తించడం, వాళ్లకి
యాభయ్యేసివేలు అప్పులు ఇవ్వడం లో నిమగ్నమయి వుండిపోయారు!

దాంతో, మూడేళ్లలో గ్రూపులకి ఇచ్చిన అప్పులన్నీ, అన్ని బ్యాంకుల్లోనూ "ఎన్ పీ యే" లు అయిపోయాయి!

యంత్రాంగం పరుగులు మొదలెట్టింది--వ్యూహాలు రచించింది--అక్కడ రంగ ప్రవేశం చేయించారు--ఈ సూక్ష్మ ఋణ సంస్థలని! ప్రభుత్వ యంత్రాంగం సాయం తో గ్రూపులని "రిపేరు" (తప్పుకున్న సభ్యుల స్థానం లో కొత్తవాళ్లని చేర్పించడం--ఇలా) చేయించో, పూర్తిగా రద్దు చేయించి, కొత్త గ్రూపులు యేర్పాటు చెయించో, బ్యాంకులకి పంపించడం
మొదలెట్టారు.

పత్రికలు వ్రాసింది నిజమైతే, ఈ సూ ఋ సంస్థలకి బ్యాంకులు కోట్లలో, "ప్రయారిటీ సెక్టార్" (ప్రాధాన్యతా రంగం) క్రింద, తక్కువ వడ్డీ (7 నించి 8 శాతం) కి అప్పులివ్వడం ప్రారంభించాయి.

ఈ సూ ఋ సంస్థలు, రిపేరు చెయ్యబడ్డ గ్రూపులకి బ్యాంకులలో యెంత ఎన్ పీ యే ఋణం వుందో, దానికి తగ్గట్టు ఋణాలని మంజూరు చేసి, బ్యాంకులలో కట్టించేసేవి. బ్యాంకులకి ఎన్ పీ యే రికవరీ జరిగిపోవడం తో పాటు, ఋణ ప్రణాళిక ప్రకారం అదే గ్రూపుకి మళ్లీ (మొదటి యాభై వేలూ చెల్లించేశారు కాబట్టి) వాళ్ల పొదుపు మీద ఆథారపడి, కొత్తగా ఒక లక్ష నించీ, 3 లక్షలవరకూ ఋణాలు మంజూరు చెయ్యడం మొదలెట్టాయి--సభ్యురాళ్లందరికీ తలా పదివేల నించి, 30 వేల వరకూ! (వీటిని తిరిగి చెల్లించడానికి 5 సంవత్సరాల వ్యవధిని ఇస్తారు)! ఈ డబ్బుతో సూ ఋ సంస్థల అప్పులని తీర్చేసి, నిబంధనల ప్రకారం మళ్లీ వాళ్ల దగ్గరనించి అప్పు తీసుకోవడం మొదలెట్టాయి!

(రిపేరు కాని గ్రూపుల ఋణాలని పారుబాకీల క్రింద రద్దు చేసుకొన్నాయి బ్యాంకులు! మళ్లీ కొత్త గ్రూపులకి యాభయ్యేసి వేల చొప్పున అప్పులు ఇవ్వడం ప్రారంభించాయి!)

హమ్మయ్య! ఇప్పటికి కంతలు కనబడకుండా, వెల్ల వేయడం జరిగింది--అని వూపిరి పీల్చుకున్నాయి బ్యాంకులూ, యంత్రాంగమూ!

(ఇవన్నీ జరిగింది 2000-2005 సంవత్సరాల మధ్య--అప్పటికి రాశ్శేఖర్రెడ్డి అధికారం చెలాయిస్తున్నాడు!)

అంతకు ముందు తెలుగు దేశం ప్రభుత్వం లో, రాష్ట్ర హౌసింగ్ బోర్డు ద్వారా, తమదైన పధ్ధతీ, యంత్రాంగాల ద్వారా, ప్రజలకి గృహ ఋణాలు, సబ్సిడీలూ మంజూరు చేసేవి. వాటి ద్వారా చిన్నా చితకా తెలుగు తమ్ముళ్లు, కోరా సిల్కు పచ్చ చొక్కాలు కుట్టించుకొని, వ్రేళ్లకి వుంగరాలు పెట్టుకొని, పుష్కరాల కాంట్రాక్టర్లుగా అవతారమెత్తేందుకు అవకాశం లభించింది!

మరి రాశ్శేఖర్రెడ్డి వూరుకుంటాడా? "ఇందిరమ్మ" పథకం క్రింద తనదైన శైలిలో కొన్ని లక్షల గృహ ఋణాలని మంజూరు చెయ్యడం మొదలెట్టాడు! దానికి లబ్ధిదారులుగా--ఇంకెవరు--మొగాళ్లయితే తాగేస్తున్నారని, గ్రూపులలోని ఆడవాళ్లకి ఇవ్వమన్నాడు! (రేషన్ కార్డులని కూడా "చెల్లెమ్మల" పేరుతోనే జారీ చెయ్యన్నాడండోయ్!)

ఇంకేం! "థేంక్స్ అన్నా" అంటూ కాంగ్రెస్ తమ్ముళ్లు ఇటు ఇందిరమ్మ ఋణాల మంజూరూ, అటు బ్యాంకులలో గ్రూపు ఋణాల మంజూరూ చేయించడానికి మధ్యవర్తుల అవతారమెత్తి, కొత్త తెల్ల చొక్కలూ, వుంగరాలూ, యమహా బైకులూ కొనుక్కోవడం మొదలెట్టారు!  (తరవాత క్లాస్ వన్ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు).


.............మిగతా తరువాయి.

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు

(గత నాలుగు రోజులుగా ఈ టపా వ్రాస్తున్నాను--ఇంకా వ్రాయవలసిన ముఖ్య విషయాలు చాలా వుండటం తో, వాయిదాల వారీగా ప్రచురించాలని నిశ్చయించుకున్నా, ఇంకా ఆలస్యం అవుతూంది--అందుకే ఈ మొదటి వాయిదా! కనీసం ప్రతీ రోజూ ఓ వాయిదా ప్రచురించడానికి ప్రయత్నిస్తాను)

"జనాలకి 'చేపలని' పంచిపెట్టడం కాదు, వాటిని 'పట్టుకోవడం' నేర్పించాలి--అందువల్ల వాళ్ల జీవన ప్రమాణం పెరుగుతుంది, దేశ వృధ్ధి జరుగుతుంది"--అన్నాడట ఇదివరకటికి ఆయన యెవడో!

మరి జనమందరూ గేలాలూ, వలలూ పట్టుకొని, చేపలు పట్టుకొని వండుకొని తినలేరు కదా? చేపలు పట్టేవాళ్లున్నారు, వాటిని కొనీ, అమ్మేవాళ్లున్నారు, యెగుమతులు చేసేవాళ్లున్నారు--వీళ్లందరిమీదా దేశాభివృధ్ధి ఆథారపడి వుంది! మరి జనాలు చేపలు తినడం యెలాగా?

"చేపలు కొనడానికి జనాలకి 'అప్పులు సుళువుగా దొరికే' మార్గం చూపించండి"--అని మధ్యేమార్గం గా చూపించి, నోబెల్ బహుమతి కొట్టేశాడో మహానుభావుడు--మహమ్మద్ యూనిస్ అనీ--ఆయన (తనకొచ్చిన నోబెల్ డబ్బుతో చేపలు కొని తినేశాడో, అమ్ముకున్నాడో, యెంతమందికి చేపలు కొనడానికి ఋణాలకి యేర్పాట్లు చేశాడో ఆయన దేశం లో--మనకి తెలీదు!)

ఇంకేం! మన రాష్ట్ర ప్రభుత్వం (దాంతో రాష్ ట్రం లో లీడ్ బ్యాంకు అయిన ఆంధ్రా బ్యాంకూ) ఆయన్ని పల్లకీలో వూరేగించుకొంటూ తీసుకొచ్చి, 'ఆ విద్య మా జనాలకి నేర్పరూ?' అంటూ కాళ్లా, వేళ్లా పడ్డాయి! (ఓ పది సంవత్సరాల క్రితం)

సరే--బ్యాంకులూ ముందుకు వచ్చాయి--తామిచ్చిన ఋణాలు తిరిగి వసూలవడమే ముఖ్యం వాటికి--దీనికి 'సంఘాల' గ్యారంటీ వుంటుంది కదా అని వాటి నిశ్చింత! (నిజానికి 12 యేళ్ల క్రితమే మన రాష్ట్ర ప్రభుత్వం 'డ్వాక్రా' గ్రూపుల 'కాన్సెప్ట్' మొదలెట్టింది)

రక రకాల ప్రభుత్వ శాఖల సమన్వయం తో ఈ ప్రణాళిక ని పట్టాలకి యెక్కించారు.

ఓ పది మంది స్త్రీలు, ఓ "స్వయం సహాయక సంఘం" సంఘం గా యేర్పడి, ముగ్గురు లీడర్లని యెంచుకొని, వాళ్లలో వాళ్లు (ఇంటర్ సే) వొడంబడిక వ్రాసుకుంటారు. తరవాత, ఒక్కో సభ్యురాలూ నెలకి ఇంత అని నిర్దిష్టం గా 'పొదుపు' చేసి, ఆ పొదుపుని బ్యాంకుల్లో అదివరకే తెరిచిన ఖాతాల్లో జమ చెయ్యాలి. ప్రతీ నెలా మీటింగులు పెట్టుకొని, సాధక బాధకాలని చర్చించుకొని, తీర్మానాలు చేసుకోవాలి. ఇలా సవాలక్ష నిబంధనల క్రింద, ఓ యేడాది పాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన "గ్రూపులకి" అప్పు చెయ్యడానికి అర్హత లభిస్తుంది--అన్నమాట!

మొదట్లో, ఈ గ్రూపులలో--సభ్యులు యెవరెవరు, వాళ్ల చిరునామాలేమిటి, వాళ్ల మధ్య బంధుత్వాలేమిటి, వాళ్ల జీవనోపాధి యెలాగ, పొదుపు యెలా చెయ్యగలుగుతున్నారు--ఇలాంటి విషయాల్నెవరూ పట్టించుకోలేదు!

"నిబంధనల" ప్రకారం బ్యాంకులు మొదటి విడత అప్పుగా నిర్దేశించిన రూ.50,000/- ఆ సంఘాలకి ఇచ్చేశాయి.

ఇచ్చేశాక, వాటికి అందులోని 'లుకలుకలు ' మూడేళ్ల తరవాత బయట పడ్డాయి!

.......అవన్నీ తరవాత.

Thursday, October 7

యెలక్షన్ కమిషనూ......

......ఈ వీ ఎం లూ

మన చంద్రబాబునాయుడుని వెర్రిబాబు నాయుడుని చేసేస్తున్నారందరూ.

హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందిన ఆయనకే ఈ వీ ఎం ల విషయం లో అన్ని సందేహాలుంటే......అంటూ పెదవి విరుస్తున్నారు.

దానికి తగ్గట్టు, ఆయన సంప్రదించిన "మేతావులు" ఈ వీ ఎం లకి ప్రింటర్లని అనుసంథానిస్తే, వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వస్తుంది, అలా చెయ్యమని చెపితే, మన యెలక్షన్ కమిషన్ వారు 'అందుకభ్భెంతరమేటుందీ? మా కమిటీల్నీ, నిపుణుల్నీ దీనిమీదికి తోలుతాం!' అన్నారట.

ఇక్కడ విషయాలేమిటంటే--

1. మన ప్రింటర్లు యెంతబాగా పని చేస్తున్నాయో యే కంప్యూటర్ సెంటర్ వాడినడిగినా చెపుతారు. మనం యే రైల్వే టిక్కెట్టో ప్రింటు కావాలని వెళితే, "ఇప్పుడే పాడయ్యిందండీ! ప్రింటు సరిగ్గా రావడం లేదు. సర్వీసు వాళ్లకి ఫోను చేశాం. రేపొస్తానన్నారు" అంటారు. 

2. బ్యాంకుల్లోనూ అక్కడా, పాస్ బుక్ ప్రింటర్లకీ, ఇతర ప్రింటర్లకీ వచ్చే జాడ్యాలకి మందు వెయ్యడానికి ఆ సర్వీస్ వాళ్లు రాక తలలు మొత్తుకుంటున్నారు.

3. సరే--ప్రింట్ అవుట్ వచ్చింది--దాన్నేమి చెయ్యలి? వోటువేసిన వాడు చింపి, మడిచి, జేబులో పెట్టుకొని--హమ్మయ్య, నా వోటు చక్కగా రికార్డు అయ్యింది--అనుకొంటూ బయటికి వెళ్లిపోవాలా? అలా సరి చూసుకోగల వోటర్లు యెంత శాతం?

పీ సీ వో ల్లో ఎస్ టీ డీ మాట్లాడి, డబ్బులిచ్చి, వాడిచ్చిన కాగితమ్ముక్కని పట్టుకొని బయటికి వచ్చి, 'బిల్లెంతయ్యిందో చూడండి ' అని ఓ పది మందిని అడిగి, 29 రూపాయల 24 పైసలు అని అందరూ చెప్పగానే, "ముఫ్ఫై రూపాయలు దొబ్బేశాడు....నా...ంల్లిగాడు" అని గోల చేసేవాళ్ళని యెందర్ని చూడడం లేదు మనం?

4. వాళ్లు ఆ ప్రింట్ అవుట్ ని తీసుకోవడం తెలియకో, మరిచో, బయటికి వచ్చేస్తూంటే, ఆ బూత్ లోని ప్రభుత్వోద్యోగో, యేజంటో వాళ్లకి నేర్పించడానికి లోపలకి వెళ్లి, ఆ ముక్క చింపి, వాళ్ల జేబుల్లో పెట్టే ముందర దాన్ని ఓ లుక్కెయ్యకుండా వుంటాడా?

5. ఇవేమీ జరగలేదు....ముగ్గురో, నలుగురో ప్రింట్ అవుట్లు తీసుకోకుండా వెళ్లిపోయారు....ఐదోవాడిగా నాలాంటి వాడొచ్చాడు....మొత్తం ప్రింట్ అవుట్ ని తీసుకెళ్లి, బయట--నా ముందు వోటు చేసిన నలుగురూ "ఫలానా పార్టీలకి" వోటు వేశారు....లం కొ లని తన్నండి--అంటే?

6. ఇలాంటి "సీక్రెసీ చెడిపోతుంది కదా?" అనే ప్రశ్నలకి, "జన విఙ్ఞాన వేదిక" మేతావులు మళ్లీ ఛానళ్లలోకి వచ్చేశారు--వీళ్లేమంటున్నారంటే, "వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వచ్చేసి, ఆటోమేటిక్ గా చింపబడి, బ్యాలట్ బాక్స్ లో పడి పోతుంది. కాబట్టి సీక్రసీకి యే లోపం రాదు!" అని.

ఇలాంటి ప్రత్యేక ప్రింటర్లని గురించీ, ప్రత్యేక బ్యాలెట్ బాక్స్ ల గురించీ ప్రపంచం లో యెవరైనా, యే "మేతావు" అయినా వూహించారా, కనిపెట్టారా, వుపయోగించారా? (కలలు కనండి--వాటిని సార్థకం చేసుకోడానికి ప్రయత్నించండి!)

2012 కో, 2015 కో "పేపర్ లెస్ బ్యాంకింగ్" "చెక్ లెస్ బ్యాంకింగ్" అంటూ "విజన్" లు ప్రకటిస్తున్నవాళ్లు ఇలాంటివాటిని గురించి ఆలోచించరేమో--వాళ్ల మెదళ్లు మోకాళ్లలో వుంటాయి కదా!!!???

ఇది అసాధ్యమని నాలాంటి వాళ్లకి తెలుసు--యెందుకంటే, బ్యాంకు మేనేజర్లు తమ పై అధికారులకి పంపించే నివేదికలూ వగైరాలు "సత్యమేనని" వాళ్ల సంతకాలూ, సీళ్లూ, వ్రేలిముద్రలూ, కాలి ముద్రలూ, ఆడిటర్ సంతకాలూ, సీళ్లూ, వ్రేలి ముద్రలూ, కాలి ముద్రలూ--లేకుండా యెవరూ స్వీకరించరు! యేమో యే పుట్టలో యే పాము (స్కాము) వుందో!

మేతావులూ! మీకు జోహార్లు!
 

Friday, October 1

అర్థం లేని......

"ఆథార్"

అయిపోయింది--అనుకున్నంతా అయిపోయినట్టే!

ఇవాళ (01-10-2010) ఈనాడు 'ఇదీసంగతి'లో శ్రీధర్ కార్టూన్ సర్వస్వం తేట తెల్లం చేస్తే, సంపాదకీయం మిగిలిందాన్ని నగ్నం గా నిలబెట్టింది!

కార్యక్రమం ప్రకారం ఓ పదిమందికి 12 అంకెల "ఆథార్" కార్డులు అందచేశారట మన ప్రథాని.

'వివిధ సంక్షేమ వ్యూహాల ఫలాల్ని సామాన్యులకి చేరవేస్తుందనీ', 'అనేక పత్రాలు సమర్పించే అగత్యాన్ని తప్పిస్తుందనీ' హోరెత్తిస్తున్నారు కానీ, ఇవి జారీ చేసే సంస్థలకి 'జనాభా లెఖ్ఖలూ, రేషన్ కార్డుల సమచారమే' అథారం ట!

పైగా ఈ సంఖ్యకీ ప్రణాళికా సంఘానికీ లంకెపెట్టి, 'మహా సమాచార నిధి ' తయారు చేసే బాధ్యత అప్పగించారు!

అంతేకాదు--ఇప్పటికే జారీ అయిన చెత్తా చెదారం కార్డులకి ఇది యేమాత్రమూ ప్రత్యామ్నాయం కాదట. అన్ని కార్డులూ చెల్లుబాటులో వుంటాయట.

చివరికి పెద్దాయన నందన్ నీలేకణి కూడా, 'సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని యెంపిక చేసే బాధ్యత రాష్ట ప్రభుత్వాలదే' అని తప్పించుకుంటున్నారట.

పైగా, ఆథార్ కార్డు కోసం యెవరైనా తప్పుడు సమాచారం ఇస్తే, ప్రభుత్వాన్నించి 'కఠిన శిక్షలు' వేస్తామని బెదిరింపోటి!

చట్టబధ్ధతేలేని సంస్థకి నాలుగేళ్లలో 45 వేల కోట్ల ప్రాజెక్టుని అప్పగించడం ఓ యెత్తైతే, వచ్చే అయిదేళ్లలో సుమారు నూరుకోట్లమందికి ఈ కార్డులు అందించడానికి యెంతవుతుందో?

మొట్టమొదట మన రాష్ట్రం లోనే, యేడు జిల్లాల్లో మూడుకోట్లమందికి జారీ చేస్తామనీ, మొదటి కార్డు మనరాష్ట్రం లోనే ప్రథాని జారీ చేస్తారనీ, చెప్పినవి వుత్తరకుమార ప్రఙ్ఞలే అని తేలిపోయింది.

ఇంతకీ, మన రాష్ట్రం లో ఈ కార్యక్రమానికి "టెండర్లు పిలవడం" మాత్రమే పూర్తయ్యిందట--మిగతాదంతా నత్తనడకే!

కొసమెరుపేమిటంటే, ఇది "భారతీయులకే ప్రత్యేకం" కాదుట--ఇప్పటికి దేశం లో వున్నవాళ్లందరికీ--వాళ్లేదేశం వాళ్లయినా--కేటాయిస్తారట!

మరింకెందుకో యీ ఆర్భాటం--కోట్లు దండుకోడానికి కాకపోతే!

Saturday, September 25

నిఘా వ్యవస్థ

కొత్త పథకం

చాలా రోజులే అయ్యింది ఈ వార్త చదివి. అప్పణ్ణించీ వ్రాద్దామనుకొని కూడా వ్రాయలేదు. ఇప్పుడు నిమజ్జనాల హడావిడిలో మళ్లీ గుర్తొచ్చి వ్రాస్తున్నాను.

హైదరాబాదులో తీవ్రవాదుల కుట్రల్ని తిప్పి కొట్టేందుకూ, నిఘా విభాగాన్ని పటిష్ట పరచేందుకూ, ఐదు కోట్ల ఖర్చుతో 155 కెమేరాలను కొనుగోలు చెయ్యడానికి టెండర్లు కూడా పిలిచేశారట, ఆగస్ట్ నెలాఖరుకి ప్రక్రియ పూర్తయిపోతుందట.

ఈ కెమేరాలని కీలక స్థానాల్లో పెట్టి, కంట్రోలు రూముకి అనుసంధానం చేస్తారట. అవి వందమీటర్ల దూరం లో వున్నా, వస్తువుని స్పష్టంగా చూపిస్తాయట. యెటుకావాలంటే అటు వీటిని తిప్పుకుంటూ, కంట్రోలు రూము నించే వీటిని నియంత్రించవచ్చట. రాత్రీ, పగలూ, వర్షం, మంచూ యేదైనా, చక్కగా పనిచేస్తాయట.

భవిష్యత్తులో వీటిని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తారట. ఇంకో 12 అదనపు కంట్రోలు రూముల్ని యేర్పరుస్తారట. ఇంకా 5 మొబైల్ వీడియో కెమేరాలని కూడా యేర్పాటు చేసుకొని, (టీవీ వాళ్లలా) సంఘటనల్ని చిత్రీకరిస్తారట!

(పోతే పోయాయి ఓ ఐదు కోట్లు కెమేరాలకీ, మరో యాభై కోట్లు కంట్రోలురూములకీ, మొబైల్ కెమేరాలకీ అనుకున్నా) ఈ నిఘా వ్యవస్థ కార్యరూపం దాలిస్తే, ప్రజలు నిశ్చింతగా వుండొచ్చు! అని ఆ నాటి వార్త.

ఆగస్ట్ నెలాఖరు గడిచింది, సెప్టెంబరు నెలాఖరు కూడా వస్తోంది, నిమజ్జనాలు అయిపోతున్నాయి, మరి ఈ నిఘా వ్యవస్థ యేమయ్యిందో?

అయినా మన పిచ్చి గానీ, మందమైన చర్మం గలిగి, ఆరు చేతులున్న కోతి లా, మిగిలిన నాలుగు ఇంద్రియాల్నీ ఆ చేతులతో మూసేసుకొని వుండే మన వ్యవస్థకి, ఈ కెమేరాలూ అవీ యెందుకు? (ఆయనే వుంటే, మంగలాడెందుకన్నట్టు!)

Wednesday, September 22

సమస్య

కాశ్మీరు

20-09-2010 మొదటిపేజీలో శ్రీధర్ పెద్ద కార్టూను భలే వుంది. మన్మోహన్ నాయకత్వం లో అఖిలపక్షం వాళ్లు, బక్కెట్లతో నీళ్లూ, తువ్వాళ్లతో సహా, షేవింగ్ క్రీములూ, కత్తెరలూ, దువ్వెన్నలూ, రేజర్లూ, అద్దాలూ తీసుకెళుతుంటే, కాశ్మీరువాడు తన గడ్డం, జుట్టూ నిక్కబొడుచుకోగా, వురిమి చూస్తున్నాడు.

ఆయన కార్టూను వేసిన అసలు వుద్దేశ్యం యేమిటోగానీ, ఓ కొత్త అయిడియా వచ్చింది.

నిజం గా కేంద్ర ప్రభుత్వం "కాశ్మీరు సాయిబ్బు బాబులూ--భారతీయ జన జీవన స్రవంతిలో కలవండి--మీకు గడ్డాలూ, జుట్టూ మేము వుచితం గా, నెప్పి తెలియకుండా కత్తిరించి పెడతాము!" అంటూ ఓ పథకం ప్రకటించి, దాని అమలుని అఖిలపక్ష నేతలకి అప్పచెపితే యెంత బాగుంటుంది!

అలాగే, రాష్ట్రాలకి కూడా ఆ పథకాన్ని విస్తరింపచేసి, అక్కడ కూడా అఖిలపక్ష నేతలకి అప్పగిస్తే, ఇంకా బాగుంటుంది.

ఇష్టం లేనివాళ్లకి పాకిస్తానుకో, దుబాయికో లేదా ప్రపంచం లో మీరుకోరుకున్న చోటికి వుచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామంటే, కాశ్మీరు సమస్య శాశ్వతం గా తీరడం తో పాటు, మన దేశ వుగ్రవాద దరిద్రం పూర్తిగా వొదిలి పోతుందేమో!

మరి ఈ పథకానికి మీ వోటు వేస్తారా?

Sunday, September 19

గుర్తింపు కార్డులూ.....

......యూనిక్ నెంబర్లూ

బయోమెట్రిక్, ఐరిస్ వగైరాలతో రేషన్ కి మొదలు, వెంకన్న దర్శనం వరకూ అనేక రకాల కార్డులు అయ్యాయి, అవుతున్నాయి. 

ఇప్పుడు, "చిరునామా నిర్ధారణ" కార్డులట. 

పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని, ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి, ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి, దాఖలు చేస్తే--ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని, మనకి ఓ కార్డు ఇస్తారట. అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట. మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట. ఇదోరకం కార్డు!

డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇక అంతర్జాలం లో దరఖాస్తు చేస్తే ఇచ్చేస్తారట! ఇప్పటికి బ్రోకర్ల వ్యవస్థని రద్దు చేశామని చెప్పి ఓ ముఫ్ఫై యేళ్లు అవుతున్నా, వాళ్ల ఆఫీసుల్లో వుద్యోగులు సుఖపడుతూ, వాళ్ల స్థానాల్లో తక్కువజీతాలకి ప్రైవేటు వ్యక్తులచేత పనిచేయిస్తూ, కార్యాలయం చుట్టూ తిరిగి, వాళ్ల ముడుపులు చెల్లిస్తేనేగానీ రాని లైసెన్సులు--ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యగానే వచ్చేస్తాయంటే--నవ్వుతారా?!

ఇంక, పట్టాదారు పాస్ పుస్తకలమీదా, భూయాజమాన్య హక్కు పుస్తకాలమీదా, "యూనిక్" నెంబర్లు వేస్తున్నారట.

గ్రామ సభల్లో, రైతుల దగ్గరవున్న పుస్తకాల మీద వేస్తే, బ్యాంకుల్లో వున్న పుస్తకాలని బ్యాంకువాళ్లే పట్టుకెళ్లి వేయించుకోవాలట! ఇది ప్రారంభించి నెలన్నర అయినా, మా జిల్లాలో ఇప్పటివరకూ ఓ 15 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయట.

సారవా పంటల సీజన్లో, పాసు పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనో, సొసైటీల్లోనో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరో వుంటాయి అని ఈ ప్రభుత్వానికి తెలియదా?

పైగా ఈ నెంబర్లు లేకపోతే ఆ పాసు పుస్తకాలిక చెల్లవు అని బెదిరింపోటి!

ఇక ఆధార్ సంగతి--ప్రజాపంపిణీ వ్యవస్థతో పెట్టుకుంటే, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే--అని ఇదివరకే వ్రాశాను. ఇప్పుడు హైదరాబాదులో మొదలుపెట్టారో, పెడతారోనట.

అసలు బుధ్ధున్నవాడెవడైనా, ఓ తేదీని నిర్ధారించి, ఆ రోజునించీ పుట్టిన ప్రతీ శిశువుకీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని పెట్టి, వాళ్లకి--సెల్ నెంబర్లలాగా 9 తో మొదలుపెట్టి 16 అంకెల సంఖ్యని ఇవ్వడం ప్రారంభిస్తే, ఇప్పటికి కొన్ని కోట్లు జారీ అయ్యేవి. 

వీటితోపాటు ఇప్పుడున్నవాళ్లకి 0 తో మొదలు పెట్టి జారీ చెయ్యడం మొదలు పెట్టచ్చు. ఇవికూడా ఇప్పటికే కొన్ని కోట్లు జారీ అయ్యుండేవి!

మన అధికార వ్యవస్థతో ఇలాంటివి సాధ్యమంటారా? వీటివల్ల యేమైనా వుపయోగం వుంటుందంటారా?

ఇప్పటికీ రేషన్ కార్డూ, వోటూ లేని నాలాంటివాళ్లెంతమందో! మాకు ఆధార్ సంఖ్య అయినా వస్తుందో రాదో!

అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు--మనమూ 'అనుభవిద్దాం' మరి! 



Monday, September 13

కబుర్లు

అవీ ఇవీ - 3

గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ని పోలీసులు అరెస్ట్ చేస్తామనడం, తరవాత ఆయన కోర్టులో లొంగి పోవడం, ఇదంతా రాజకీయ కుట్ర అని కొందర రా నా లు ప్రకటనలివ్వడం--ఇవన్నీ మామూలు వార్తలే అని నేను పట్టించుకోలేదు.

అసలు విషయం మాడభూషి శ్రీధర్ నిన్న (12-09-2010) ఈనాడులో వ్రాసిన వ్యాసం చదివాక అవగతమయ్యింది!

సొహ్రబుద్దీన్ (బూటకపు) ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారట. సొహ్రబుద్దీన్ నూ, ఆయన స్నేహితుడు ప్రజాపతి ని తరవాత ఆయన భార్య కౌసర్ బీ ని, --ఓ బస్సులోంచి దింపి తీసుకెళ్లి, కాల్చి, అత్యాచారం చేసి, విషం ఇచ్చీ చంపేశారట పోలీసులు.

అసలు సొహ్రబుద్దీన్, ప్రజాపతి అమిత్ షా అనుచరులేనట. వాళ్లిద్దరూ అనేకమంది పోలీసు అధికారులతో కలిసి, బలంతపు వసూళ్లు లంటి నేరాలకి పాలుపడేవారట. తరవాత యెందుకో వీళ్లకి చెడి, ఎన్‌కౌంటర్ చెయించేశాడట.

ఇంకా అమిత్ షా మీద 197 కేసులు వున్నాయట. కొన్ని వేల గంటల ఫోను సంభాషణలు సాక్ష్యం గా దొరికాయట.

మానవహక్కుల న్యాయవాది ముకుల్ సిన్‌హా, ఆయన భార్య నీర్జారీ, జన సంఘర్ష్ మంచ్ అనే సంస్థ ద్వారా ఈ కేసులన్నీ బయటికి వచ్చేలా చేసి, సీ బీ ఐ సుప్రీం కోర్టులో కేసు పెట్టేలా చేశారట.

ఇదీ--ఓ హోం మంత్రి చరిత్ర.

మనదేశ టెలికామ్ పితామహుడు శాం పిట్రోడా, వచ్చే ముఫ్ఫై యేళ్లలో కాగితం డబ్బు మాయమౌతుందనీ, ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపం లోనే జరుగుతాయి అనీ తన తాజా గ్రంధం లో వ్రాశారట. ఇవన్నీ మోబైల్ ద్వారానే జరుగుతాయని కూడా అన్నారట. సాధ్యమేనా అని సందేహం వున్నా, ఆయన అన్నాడు కాబట్టి నిజం కావచ్చేమో అనిపిస్తుంది.

మహమ్మదీయులు చేసే ప్రార్థనని 'నమాజ్' అంటారు. దాన్ని వాళ్లు ప్రతీరోజూ ఐదు సార్లు చెయ్యాలి. సాధారణం గా పెద్దవాళ్లూ, చాందసులూ తప్ప, మిగిలినవాళ్లందరూ ఇలా ఐదుసార్లు చెయ్యరు. ఈ నమాజ్ ఇంట్లో అయినా, వీధిలో అయినా, ఆసమయం లో యెక్కడ వుంటే అక్కడ చెయ్యచ్చు. ఆడవాళ్లు ఇంట్లోనే చెయ్యాలి.

ఇక పర్వదినాల్లో, సామూహికం గా నమాజ్ చెయ్యడానికి 'మసీదు 'లు యేర్పాటు చేస్తారు. అంటే ఓ ఖాళీ స్థలం లో ఓవైపు, మక్కా యెటువైపు వుందో సూచిస్తూ ఓ గోడకడతారు. దానికి యెదురుగా నమాజ్ చేస్తే సరిగ్గా మక్కా వైపు తిరిగి చేసినట్టు. అంతే. (స్థలం యెక్కువ వుంటే, వంటశాలలూ, భోజన శాలలూ, కార్యాలయాలూ కూడా కట్టచ్చు)

మహాత్ములూ, ప్రవక్తలూ, వాళ్ల అవశేషాలూ సమాధి చేసిన చోట్లని 'దర్గా'లు అంటారు. ఆ దర్గాల్లో, ఆ సమాధుల దగ్గర ఆ మహాత్ములని ప్రార్థిస్తే, కోరికలు తీరుతాయని నమ్మకం. సాధారణం గా అన్ని మతాలవారూ వీటికి వెళ్తారు.

వీటిలో యేకోవకీ చెందని 'తాజ్ మహల్' దగ్గర మహమ్మదీయులు ప్రార్థనలు చెయ్యడం ఇదివరకు లేదు. మరి ఇప్పుడు అక్కడకూడా రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నట్టు పత్రికల్లో ఫోటోలు వచ్చాయి!

ఫరవాలేదు--వాళ్ల మతం లో కూడా మూఢనమ్మకాలు బాగానే వ్యాప్తి అవుతున్నాయన్నమాట.

శుభం! ముబారక్!

........గణానాంత్వా


బెంగళూరు లో మా పౌత్రుడి వినాయకుడు



వీడి వయసూ యేడాదిన్నరే!

"ఓమ్ బోం, బోం, బోం, నమః" అనేస్తున్నాడు.

సమస్త సన్‌మంగళాని భవంతు.