skip to main |
skip to sidebar
జూదాలు
మొన్నోరోజు పేపర్లో, ‘పేకాట స్థావరం పై దాడిచేసి ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళ అరెస్టు‘ అనేవార్త వచ్చింది.
పోలీసులకి వచ్చిన ‘సమాచారం’ మేరకు, పకడ్బందీగా దాడిచేసి, పోలీసు క్వార్టర్లలో ఓ క్వార్టర్ లో పేకాట ఆడుతున్న 9 మంది కానిస్టేబుళ్ళని అరెస్ట్ చేశారట. అందులో ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళన్నమాట.
మొన్న ‘అంతర్జాతీయ పురుషుల దినం’ సందర్భం గా అనుకున్నాను—పాపం ఆ కానిస్టేబుళ్ళని ఆడకూతుళ్ళు తమ ఇళ్ళల్లోనే పేకాట ఆడుకోనిస్తే, వీళ్ళకీ, వాళ్ళకీ ఈ కష్టాలు వుండకపోవును కదా అని!
అసలు పేకాట నేరమెలా అయ్యింది?
అప్పుడెప్పుడో బ్రిటీషుపాలనలో, శాంతిభద్రతలకి విఘాతం జరుగుతుందని పబ్లిక్ లో పేకాట ఆడడం నిషేధించారు!
కానీ, పట్టణాల్లో టౌన్ హాళ్ళకీ, ఆఫీసర్స్ క్లబ్ లాంటివాటికి నిషేధం వర్తించేది కాదు—కొందరు ఊరి పెద్దలూ, రిటైర్ అయిన అధికారులూ మొదలైనవాళ్ళు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా వుండి, సాయంత్రం పూట సరదాగా కలిసి, డబ్బుకోసం కాకుండా కాలక్షేపం కోసం చిన్న చిన్న స్టేక్ లతో పేకాట ఆడుకొని, అలవాటున్నవాళ్ళు ఒకటో, రెండో పెగ్గులు బిగించి, రాత్రి పదింటికల్లా ఇంటికి చేరేవారు. (ఇదే కాకుండా, లైబ్రరీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్ లాంటి గేంస్ కూడా వుండేవి, ఆడేవారు!)
పది దాటాక క్లబ్బు తెరిచి వుంచితే కేసు పెట్టేవారు. ప్రభుత్వమే కొన్ని క్లబ్బులకి బార్ లైసెన్సులు కూడా ఇచ్చేది!
ఓ పదేళ్ళనించి అనుకుంటా—ఇలాంటి క్లబ్బులని కూడా నిషేధించారు!
ఓ నలభయ్యేళ్ళ క్రితమే, మేధావులు యెండమూరి వీరేంద్రనాథ్ లాంటివాళ్ళు వ్రాసిన నాటికల్లో, నవలల్లో “మన ప్రభుత్వం పేకాటను నిషేధించి, రేసులకి డబ్బు పోస్తూంది!” అని ఆవేదన చెందే పాత్రలచేత అనిపించారు!
మాడబ్బుతో, మా యెకరాలతో, మేము ఆడుకొంటుంటే, ఈ పోలీసులకేమి పోయేకాలం? అని ప్రశ్నించారు చోటా మోటా రాజకీయులు—పండగల్లో కోడిపందాలు ఆడుకుంటూ!
దానివల్ల లేని ‘శాంతిభద్రతల ముప్పు’ పేకాట వల్ల వస్తుందా?
మరి, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, డెరివేటివ్స్—ఇలాంటి వందలకోట్ల తో జరుగుతూ, సమాజానికి నష్టం చేస్తున్న ఈ పెద్ద పెద్ద జూదాలని యెందుకు నిషేధించరు?
యేమంటారు?
(ఓ పదిరోజుల క్రితం వ్రాయడం మొదలుపెట్టిన ఈ టపా, అనివార్యకారణాలవల్ల ఆలస్యం గా పూర్త్రిచెయ్యబడి, ప్రచురించబడుతోంది!)
తప్పుడుబిల్లులకి శిక్ష
యెట్టకేలకు యెర్నేని రాజా రమచందర్ కి బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి మోసం ద్వారా ప్రభుత్వం నించి డబ్బు తీసుకొన్న కేసులో, నేరం నిరూపణ కావడం తో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సీ ఐ డీ న్యాయస్థానం.
అప్పుడే న్యాయం జయించింది అని మనం అనుకోకుండా, శ్రీ నేతగారు 'పై కోర్టులో అప్పీలుచేసి, నిర్దోషిగా బయటికి వస్తాను' అంటున్నారు.
మరి చూద్దాం!
శ్రీ విశ్వనాథం
నవంబరు 10--1979 లో--బహుముఖ ప్రఙ్ఞాశాలి, పండితుడు, కవి, రచయిత, రాజకీయ వేత్త, మంత్రి, విశిష్ట పార్లమెంటేరియన్, మహామేథావి, విశాఖ ముద్దుబిడ్డ, అన్నిటినీ మించి గురువుని మించిన శిష్యుడు అని చెప్పుకోదగ్గ శ్రీ తెన్నేటి విస్వనాథం గారు పరమపదించిన రోజు--ఈరోజు ఆయన 'వర్థంతి '!
అడ్డమైనవాళ్ళకీ సందర్భాలు ఙ్ఞాపకం చేసుకుని మరీ 'నివాళులు ' అర్పించే మన తెలుగు వాళ్ళు, ఈయన్ని యెక్కడా తలుచుకున్నట్టు లేదు!
ఆయనతో నా పరిచయభాగ్యం--అవి 1972 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆందోళన రోజులు! నేను మా నరసాపురం 'నిరుద్యోగుల సంఘం' కార్యదర్శిగా, మా సంఘాన్ని కూడా ఉద్యమం లోకి తీసుకెళ్ళి, ఆందోళన సాగిస్తున్న రోజులు!
అప్పటికి కొంతమంది ఇంకా సమైక్య వాదులుగా మిగిలిపోవడం తో, వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళని కూడా ఉద్యమం లోకి కలుపుకోడానికి, నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి మొదలైనవారు విస్తృతంగా తెలుగునేలని పర్యటిస్తున్నరోజులు!
ఒక రోజున, తణుకులో ఓ ప్రముఖ సినిమా హాలులో, తణుకూ, చుట్టుపక్కల వూళ్ళలోని వివిధ పార్టీల, సంఘాల నాయకులనీ ఆహ్వానించి, విస్తృత సమావేశం యేర్పాటు చేశారు. మహామహులు వస్తున్న సమావేశం అవడం తో, మేము--మా రాజకీయ గురువు శ్రీ కుంచెనపల్లి నాగేశ్వర రావుగారితో ఆ సమావేశానికి వెళ్ళాము. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు అప్పుడే యెదుగుతున్న నాయకుడు!
వేదికమీదకి దగ్గర దగ్గర ఓ వందమంది దాకా ముఖ్యులని అహ్వానించారు. (అందరూ వేదిక నేలమీద వరుసగా కూర్చోబెట్టబడ్డారు! నాయకులతోసహా!) శ్రీ తెన్నేటి, వారికి దిశా నిర్దేశం చేశారు--అందరూ ఒడంబడ్డారు. సమావేశం ముగుస్తుందనగా, (ఆ సాయంత్రం ఓ కాలేజ్ మైదానం లో బహిరంగ సభ.) మా గురువుగారు మమ్మలని హడావుడిగా వేదిక యెక్కించి, నన్ను శ్రీ తెన్నేటివారికి పరిచయం చేశారు--నిరుద్యోగుల సంఘం కార్యదర్శిగా, ఉద్యమం లో క్రియాశీల పాత్రపోషిస్తున్నవాళ్ళలో ఒకడిగా--చెయ్యెత్తి నమస్కరించాను. ఆప్యాయంగా నా చేతుల్ని పట్టుకుని 'మన రాష్ట్రం వస్తే, మీ సంఘం ఇక యెత్తెయ్యవలసిందే!' అన్నారు నవ్వుతూ! 'మా ఆశ కూడా అదేనండి!' అన్నాను కృతఙ్ఞతతో! తరువాత, ఇంకొకరితో ఆయనకి పరిచయం, నా నిష్క్రమణ!
నిజం గా, తెలుగుతేజాలైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని, పొట్టి శ్రీరాములుగారిని, పీ వీ నరసిం హారావుగారిని, నీలం సంజీవరెడ్డిని, తెన్నేటిని--ఇలాంటి యెందరినో తలుచుకుంటున్న తెలుగువాళ్ళెంతమంది?
శ్రీ తెన్నేటివారిగురించీ, 60 యేళ్ళ క్రితం కూడా 'సో కాల్డ్' కాంగ్రెస్ అధిష్టానం తెలుగువారిని యెలా చిన్నచూపు చూసిందీ, యెన్ని రాజకీయాలు చేసిందీ, (అన్న ఎన్ టీ ఆర్ వచ్చేవరకూ నార్తోళ్ళకి తెలుగోళ్ళంటేనే తెలీదన్నట్టు వుండేవారు!)--ఇలాంటివి వీలున్నప్పుడల్లా వ్రాస్తా!
చదవండి!
అగ్రేసరీ మమత!
రైలు బోగీల్లో బిగించిన 'కక్కుర్తి ' బెర్తులవల్ల యెంత నష్టం జరిగిందో, యెన్ని ప్రాణాలు పోయాయో యవరైనా లెఖ్ఖవేశారా?
చులాగ్గా అవి తొలగించాలని నిశ్చయించారు!
ఇప్పుడైనా యేమైనా సుఖం గా వుందా ప్రయాణికులకి? లేదు--యెందుకంటే, కక్కుర్తి బెర్తులకోసం మామూలు పై బెర్త్ ని ఓ ఆరంగుళాలు పైకి జరిపారు! ఇప్పుడు మధ్య వేసిన కక్కుర్తి బెర్త్ ని తొలగించేసి, చేతులు దులుపుకుంటున్నారు--మరి పై బెర్త్ ని ఆరంగుళాలు క్రిందకి యెవరు జరుపుతారు? వాళ్ళ బాబులా?
అందుకే అన్నది 'లాలూ మూర్ఖః' అని!
ఇక మమతాదీ--తనభాషలో 'తురంతో' అన్నవాటిని (హిందీలో 'తురంత్ ' అంటే శీఘ్రం గా అని అర్థం! అది వాళ్ళ భాషలో పదాలన్నిటికీ 'ఓ' కారం చేర్చే పధ్ధతివల్ల తురంతో అయ్యింది) మీడియా ఇష్టం వచ్చినట్టు 'దురంతో' (దుః+అంతః--అంటే చెడు అంతము కలిగినవి) అనీ, 'డ్యురాంటో' (ఇదేదో ఫ్రెంచ్ పదం లా వుంటుంది) అనీ పొగిడేశాయి!
మరి ఈ రోజున, ఆ 'తురంతో' (అత్యధిక దూరపు, మధ్యలో యెక్కడా ఆగని) రైళ్ళకి, 'టెక్నికల్ స్టాపులు ' అని కనీసం 6 చోట్ల కనీసం అరగంటసేపు ఆపుతున్నారట! కానీ, అక్కడ యెవరైనా ప్రయాణికులు దిగిపోవచ్చుగానీ, యెవరూ యెక్కకూడదట! (మరి దిగిపోయేవాళ్ళుకూడా మొదటినించీ చివరివరకూ టిక్కెట్టు తీసుకోవాలో యేమిటో!).
అలా అయినా, ఈ రైళ్ళన్నీ, 21 నించి 24 శాతం మాత్రమే నిండుతున్నాయట--76% ఖాళీగానే గమ్యస్థానం చేరుతున్నాయట! పైగా అన్నీ ఏ సీ బోగీలేనట! ఇక కనీసం 75 మంది ప్రయాణించవలసిన బోగీల్లో, అటెండెంట్లూ, హెల్పర్లూ, హాకర్లూ, టీ టీ ఈ లూ, 75 బ్లాంకెట్లనీ కప్పుకొని, హాయిగా నిద్రా, ఇతర సుఖాలని అనుభవిస్తున్నారో, యేమిటో!
అందుకనే అన్నది--అగ్రేసరీ మమత--అని!
దీనికైనా యెవరినైనా బాధ్యుల్ని చేస్తారా?
ఇలాంటివాటికి ఓ 'తెల్ల యేనుగు ' ప్రభుత్వ సంస్థ వుంది-- 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ' అని! వాళ్ళెప్పుడూ ప్రభుత్వానికీ, యాజమాన్యాలకీ పాదాలొత్తుతూ, చిన్న చిన్న వుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తూ వుంటారు!
దాని గురించి మరోసారి!