Monday, September 28

నానని రోకలి

(సీ) నియర్లు  


ఇంకా రోకలి నానలేదు! యెందుకుట? యెక్కడనానిపోతుందో అని నీళ్ళక్రింద మంటలుపెట్టేస్తున్నారుట--సీనియర్లు! (సీనియర్లు అంటే సముద్రానికో, ఇంకదేనికో దగ్గరగా వున్నవాళ్ళు--అని నిర్వచించాడో యువ రాజకీయవేత్త!)  


'అధిష్టానంలో నేనుకూడా భాగమే!' అని ప్రకటించుకున్న కేకే ని చూసి, 'ఓసోస్! మాకు తెలీదులే! వీరప్ప మొయిలీలూ, అహ్మద్ పటేల్ లూ, వయలార్ రవిలూ కూడా అలా ప్రకటించుకోలేదు--వర్కింగ్ కమిటీ మెంబర్ అయినంతమాత్రాన నువ్వో అధిష్టానం!? నీక్కూడా అధిష్టానం అయినవాళ్ళెవరో మాకు తెలియదనుకోకు!' అని వెక్కిరిస్తున్నారు--కార్యకర్తలు!  


మొన్నెప్పుడో ఖమ్మం లో రేణుకా చౌదరి సోనియాతో వున్నట్టు వున్న ఫ్లెక్సీ బోర్డుని కార్యకర్తలు చింపేస్తే, వీ హెచ్ అది సోనియా మీద దాడిగా అధిష్టానికి పూర్తిగా నూరిపోశాడు!  


అక్కణ్ణించీ ప్రతీవాడూ 'అది తప్పు' అంటూ స్టేట్ మెంట్లు!  


అసలు గొడవ యెక్కడ మొదలయ్యింది? కాకా 'జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి'--అని వూరుకోకుండా, రాజీవ్ గాంధీకి ప్రథాని కాకముందు అనుభవం లేదుకదా? అన్నాట్ట!  


ఇక వీరభజనగాళ్ళకి మంచి అవకాశం వచ్చింది--సోనియా, రాహుల్ భజన చేస్తూ, పనిలో పనిగా తమ పబ్బం గడుపుకోడానికి!  


పార్టీ చీలిపోతే, అధిష్టానాన్ని నమ్ముకున్నవాళ్ళకి పదవులూ, కొత్తపార్టీ వారికి అఙ్ఞాతవాసం, మళ్ళీ యెలక్షన్లువచ్చేసరికి కొత్తపార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం--ఇలాగే జరుగుతూంది ఇన్నాళ్ళూ! 


మరి రేపేమవుతుందో? అసలే చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న పార్టీ--దాని క్రింద అధిష్టానం చెట్టునీ, దాని పిలకల్నీ నెత్తిమీదపెట్టుకొని, రాష్ట్రఫలాలని మింగాలనుకొనే నక్కలు ఇంతకంటే యేమి చేస్తాయి?  


చూద్దాం!



Sunday, September 13

అధిష్టానం మార్కు.....

 
ముఖ్యమంత్రెవరు? 

రాజశేఖర రెడ్డి కరువు ప్రకటనకి రోకలి నానేస్తే, ఇప్పుడు అధిస్టానం ఆయన తరవాత ముఖ్యమంత్రెవరు అని తెలియడానికి మళ్ళీ రోకలి నానేసిందట!  

అది పూర్తిగా నానగానే, సీల్డు కవరు పంపిస్తారట!  

ఈ లోపల రాజ్యాంగేతర శక్తి ఒకాయన పొద్దున్నే ఢిల్లీ కి మళ్ళీ రాత్రికి హైదరాబాదుకీ ప్రయాణాలు సాగిస్తున్నాడు. అక్కడ ఒక్కో అరగంటో, గంటో 'చిన్న అధిష్టానాల 'తోనూ, వీలైతే ఇంకో అరగంటో యెంతో 'పెద్ద అధిష్టానాల 'తోనూ సంప్రదింపులు సాగించి, హైదరాబాదు వచ్చాక 'అంతా సవ్యంగానే వుంటుంది--మీరందరూ నోరెత్తనంతవరకూ!' అని అందరినీ సవరదీస్తున్నాడు!  

ఇంత డ్రామా యెందుకో? కాంగ్రెస్ సంస్కృతి తెలియంది యెవరికి? 

ఆ వచ్చే సీల్డుకవర్ లో 'శ్రీమతి రాజశేఖర రెడ్డి ' పేరు వ్రాసి, సీ ఎల్ పీ లో ఆవిడ యెన్నిక కాగానే--'ఆంధ్ర ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి!' అనీ, 'ఓ స్త్రీ కి ఆ పదవి ఇవ్వడం లో అధిష్టానం త్యాగనిరతి ప్రశంసనీయం!' అంటూ ప్రకటనలు వెలువడి, పులివెందులనించి ఆవిడని పోటీకి దింపినా--ఆశ్చర్యపడక్కర్లేదు!  

(సానుభూతి కార్డూ పని చేస్తుంది, మిగిలిన సామాజిక వర్గాలూ, అసమ్మతులూ మాట్లాడరు--పరిపాలనకి రాజ్యాంగేతర శక్తులెలాగూ వుంటాయి!)  

బహుశా రోకలి మంగళవారానికి నానచ్చు అంటున్నారు!  

చూద్దాం!


Monday, September 7

స్మారక......


దోపిడి రాజకీయం


మాజీ ముఖ్యమంత్రి మరణం తరవాత, మొదటి మంత్రివర్గ సమావేశం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల్లో ఒక అతి ముఖ్యమైనది--వై యెస్ హెలికాప్టరు 'కూలిన చోట ' ఒక బ్రహ్మాండమైన 'స్మారక చిహ్నాన్ని ' నిర్మించి, ప్రతి రోజూ ప్రజల సందర్శనకి యేర్పాట్లు చెయ్యలి--అనిట!  


ఇంకేం! కొన్ని వందల కోట్ల అంచనాలూ, కాంట్రాక్టులూ, అంచనా వ్యయాలు మించడాలూ, మళ్ళీ కొన్ని వేల కోట్ల అంచనాలూ, ఓ పది పదిహేనేళ్ళు గుత్తదారుల, ఉప గుత్తదారుల, ఉప-ఉప గుత్తదారుల, వాళ్ళక్రింద వేలాదిమందీ--పంట పండినట్లే!  


మరి, 15 కిలోమీటర్లు కాలినడకన, దారి తెలియకుండా (జీ పీ యెస్ వున్నా) తప్పిపోయే అవకాశం వున్న దారి తెలియని దారుల్లో నడిచి, అక్కడకి చేరుకోవాలే? 


అక్కడున్న చెంచులూ వగైరాలకీ, అస్తమానూ అక్కడ తిరిగే మావోయిష్టులకీ కూడా సాధ్యం కాని చోటుకి, ప్రతిరోజూ ప్రజల సందర్శనానికి యెలా యేర్పాట్లు చేస్తారో?  


బహుశా, 'బెల్ 430' హెలికాప్టర్లలో వేలాది రూపాయల టిక్కెట్లు కొనుక్కొని, రాత్రి పూట మాత్రమే--లేదా తెల్లవారుజామునగానీ, సాయంత్రం పూటగానీ మాత్రమే (మధ్యాన్నం దాన్ని మూసేసి)--సందర్శించే యేర్పాట్లు చేస్తారేమో!  


జగన్ ముఖ్యమంత్రి సంగతేమోగానీ, ఓ నా కార్యకర్తల్లారా! ఆ డబ్బుతో యెంతమందికి 'ఆరోగ్య శ్రీ' పడుతుందో ఆలోచించండి!  


ఇలాంటివాటికి వ్యతిరేకంగా నిరాహారదీక్షలూ, ధర్నాలూ, ర్యాలీలూ చెయ్యండి!  


లేదూ--అలాగే కానివ్వండి!  

Sunday, September 6

రాజకీయం

రాచకం


ఇవాళతో నాలుగు రోజులుగా మన రాష్ట్రం లో ప్రభుత్వం లేదు! (వుంటే, ఇడుపులపాయ ముందు 15 కిలోమీటర్ల మేర 'ట్రాఫిక్ జాం' అవకపోను!)  


సంతాపదినాలు అయ్యేవరకూ 'అధిష్టానం' ఆలోచించదట.  


ఈ లోపల కాకాలు బాకాలు మొదలెట్టారు!  


హనుమంతుడికి రక్తం వుడికిపోతోందట!  


కేకే సాగిలపడిమరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ్యాలంటున్నాడు!  


'అనుభవం లేకపోయినా ఫరవాలేదు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి--రాజీవ్ ప్రథాని అయినప్పుడు ఆయనకి అనుభవం లేదు కదా?' అన్నాడు కాకా.  


'రాజీవ్, ఇందిరల కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది. నా రక్తం వుడుకుతోంది!' అన్నాడు వీ హెచ్!  


రాజీవ్ యేమి త్యాగాలు చేసి ప్రథాని అయ్యాడో? ఇందిరని కుట్రదారులు చంపడం రాజీవ్ త్యాగమా?  


వై యెస్ ని కూడా యే తీవ్రవాదులో చంపేసివుంటే, అప్పుడు జగన్ త్యాగం చేసినట్టేనేమో--ఈయనకి అభ్యంతరం లేకపోనేమో మరి!  


'123.....133 లెఖలు కాదు--మెజారిటి వుంటే తీర్మానం చేసి, దేశాన్ని అమ్మేద్దామా? సభలో ఎమ్మెల్యేలెంతమంది మద్దతు ఇచ్చినా, సోనియా కాదంటే అది శిరోధార్యం! (వాళ్ళు నోరుమూసుకోవాలి)' అని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యాలు చెపుతున్నాడు కేకే!  


ఇలాచేసే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది ఇందిర--వీళ్ళ దన్ను చూసుకొనే! అప్పుడే మరిచిపోయారా?  


నందో రాజా భవిష్యతి!