మంత్రాలూ—గాయత్రి
మంత్రాలనేవి ‘కర్మలు ’ చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి! (అవి ‘బ్రహ్మ’ కర్మలైనా, ‘అపర’ కర్మలైనా!)
యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని, పురోహితులు వాటిని నేర్చుకొని, ప్రజలచేత చేయిస్తారు.
చెయ్యవలసిన కర్మ యేమిటో, యెందుకు చేస్తున్నామో ‘సంకల్పం’ చెప్పుకుంటారు ముందు. అదే పురోహితులు చెప్పి, మధ్యలో కర్మిష్టుల్ని ‘మమ’ అనుకోమంటారు అందుకే!
ఇక మంత్రాలని ‘చదవ కూడదు’ ‘జపించాలి’ లేదా, ‘అనుష్టించాలి’. గాయత్రి విషయానికొస్తే, అది వూరికే చదివేది కాదు. యెందుకంటే—
శిశువు జన్మించినప్పటినించీ (ఆడైనా, మగైనా) కొన్ని ‘జాతక కర్మలు’ నిర్దేశించారు—బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి—వీటిలో కొన్ని ఆడ శిశువులకీ, కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం.
ఇక మగ పిల్లలకి ‘గర్భాష్టమం’ లో చేసే జాతక కర్మ పేరు—వుపనయనం. (దాన్నే ‘ఒడుగు’ అంటారు) ఇది యెందుకు చేస్తారంటే—శిశువుకి 8 సంవత్సరాలు వయసు (తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా—అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు. అంతే కాకుండా, బాలారిష్టలన్నీ గడిచి, ఒక ధీమా వస్తుంది—అందుకని, ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు—అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా!
ఇక ఙ్ఞానార్జనకి మూలం ‘విద్య’. దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి—వాటికోసం, ఒడుగు లోనే ‘బ్రహ్మోపదేశం’ చేయిస్తారు—తండ్రి చేతగానీ, ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ. ఆ ఉపదేశం లో భాగంగానే, యఙ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రి ని ఉపదేశిస్తారు! అక్కడితో, విద్యార్జనకి అర్హత లభించినట్టే!
అక్కడి నించి, అనుష్టానాలు మొదలు అవుతాయి—ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి!
టూకీగా అదీ సంగతి.
ఇక ‘భూర్భువహ్ స్వహ్’ అంటే, మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు. వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు. అలా భూమికి పైన 7, భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు.
పైనుండేవి క్రమం గా 1.భూ లోకం, 2.భువర్లోకం, 3.స్వర్లోకం, 4.మహర్లోకం, 5.జనలోకం, 6.తపోలోకం, 7.సత్యలోకం (ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట).
వీటిని మంత్ర రూపంలో—‘ఓం భూ: ఓం భువ: ఓం స్వ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం~ సత్యం’ అని చెప్పి ‘ఓం తత్సవితుర్వరేణ్యం…….’ ఇలా సాగుతుంది.
గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు. అవి భూలోకం (అంటే మనం వున్నది—ఇది అందరికీ తెలిసిందే) భువ:+లోకము= భువర్లోకం అంటే, మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది. ఇక స్వ:+లోకము=స్వర్లోకం అంటే, మేఘాలకి పైన వున్నది. (దీన్నే పొరపాటుగా ‘స్వర్గం’ అని వ్యవహరిస్తున్నారు—నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం) మనిషి చనిపోయాక, జీవుడు (అంటే ఆత్మ) ఇక్కడవరకూ చేరడమే కష్టం. ఆతరవాత ‘ఆటోమేటిక్ ప్రమోషన్లు’—ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు!
అదిగో—అదీ గాయత్రి వుద్దేశ్యం! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా, ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో!
ఇక ‘మంత్రాలకి చింతకాయలు రాల్తాయా’ అనకుండా వాటిని విశ్వసించేవారికి, వాటి మహిమపై నమ్మకం వుంటే, ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ‘సైడ్ ఎఫెక్టు’లూ, బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి?
ఇంకొక మాట—ఇవన్నీ నమ్మినా, నమ్మకపోయినా—నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు. కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే!
యేమంటారు?
(ఇందులో కొంత పదార్థం (మేటర్) నా ‘హేతువాదం’ బ్లాగులో రావలసింది—సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను.)