Monday, February 16

దేశ భక్తి

ఇంక మా తరానికి వొస్తే, మేము నోట్లో వెండి చెంచా తో పుట్టక పోయినా, కష్టం అంటే యేమిటో తెలియకుండా పెరిగాము!

మా తాతలు కష్టాలు పడ్డారు, మా తండ్రులు కష్టాలు పడ్డారు కానీ, మాకు కష్టం అంటే యేమిటో తెలియకూడదు అని వాళ్ళు అహోరాత్రం కష్ట పడ్డారు!

ఓ క్రమ శిక్షణలో పెంచారు!

ఎలిమెంటరీ స్కూల్ లో నాలుగవ తరగతి నించే, ‘కబ్స్’ అని, (స్కౌట్స్ కి జూనియర్ డివిజన్) వుండేది—అందులో చేరమని ప్రోత్సహించేవారు!

హై స్కూల్ లో ఆరో తరగతి నించి ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’ శిక్షణ వుండేది!
ఇది కాకుండ, ప్రత్యేకంగా వారానికో పీరియడ్ ‘సిటిజన్ షిప్ ట్రైనింగ్’ వుండేది. వీటిలో క్రమ శిక్షణతో పాటు—పరిశుభ్రత, ప్రధమ చికిత్స, లోకోపకారం, పౌర నిబంధనలు (రోడ్డు మీద యెటువైపు నడవాలి, రోడ్డు యెలా దాటాలి లాంటివి) కూడా చెవినిల్లు కట్టుకొని బోధించే వారు!

యెనిమిదో తరగతి నించీ ‘నేషనల్ కేడెట్ కోర్’ (ఎన్. సీ. సీ.)—ఇంకొంచెం కఠిన క్రమ శిక్షణ, శారీరక శ్రమ, కొంచెం క్లిష్టమైన నియమావళి—లీడర్ చెప్పిన దాన్ని వెంటనే ఆచరించడం, తోటి విద్యార్ధులతో చక్కగా సహ జీవనం, కేంపులు, ఆయుధాల శిక్షణ, మేప్ రీడింగ్—ఇలా మిలిటరీ కి సంబంధించిన శిక్షణ ఇచ్చి, ఏ సర్టిఫికెట్ ఇచ్చే వారు—ఉత్తీర్ణులకి!

ఇక కాలేజ్ లో సీనియర్ డివిజన్ ఎన్. సీ. సీ. దీంట్లో మళ్ళీ ఆర్మీ డివిజన్, నేవీ డివిజన్ రెండూ వుండేవి! చిన్న వూళ్ళలో ఎయిర్ ఫోర్స్ లేదు!

ఇంకా చక్కటి శిక్షణ ఇచ్చి, బీ-1, బీ-2, సీ సర్టిఫికెట్ లు ఇచ్చేవారు ఉత్తీర్ణులకి!
యాన్యువల్ ట్రైనింగ్ కేంపులే కాకుండా, అడ్వాన్స్డ్ లీడర్ షిప్ కేంపులూ, ఆర్మీ ఎటాచ్ మెంట్ కాంపులూ నిర్వహించేవారు! మంచి ట్రైనింగ్ పొందిన వారిలో ఒకరిద్దరికి, రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనే అవకాశం వచ్చేది!

వారానికి రెండు పెరేడ్లు, యే కారణం చేతైనా కుదరక పోతే ఆదివారం డబల్ పెరేడ్, పెరేడ్ అయ్యాక అందరికీ ఉచితంగా టిఫిన్, డబల్ పెరేడ్ రోజున డబల్ టిఫిన్, అందరూ గబగబా ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన వాళ్ళూ, లీడర్లూ, మిగిలిన టిఫిన్ పొట్లాలని సద్వినియోగం చెయ్యడం, తిరునాళ్ళూ, తీర్థాలూ వచ్చినప్పుడు బందోబస్తు నిర్వహించడం, కలరా వంటి జాడ్యాలు వ్యాపిస్తున్నాయంటే, మంచినీళ్ళలో (క్లోరిన్) మందు కలపడం అందరికీ అలవాటు చెయ్యడం—అన్నిటికన్నా మిగిలిన విద్యార్ధుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు—యూనిఫారం ధరించగానే ఓ ఠీవి—చాలా ఉత్తేజ పూరితంగా వుండేది!

ఇక కేంపుల విషయానికొస్తే, ఫిజికల్ ట్రైనింగ్ దగ్గర నించీ, అన్ని రకాలైన శిక్షణలూ ఇచ్చి, ఆయుధాల వినియోగం లో ప్రత్యేక శిక్షణనిచ్చి రైఫిళ్ళూ, గ్రెనేడ్లూ, మెషీన్ గన్లూ పేల్చడం, టాంకులూ, రాకెట్ లాంచర్లూ, యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్ లూ, ఆర్ సీ ఎల్ గన్ లూ మొదలైన వాటితో ప్రత్యక్ష పరిచయం కలిగించి, వాటిలో శిక్షణ ఇవ్వడం ఒక యెత్తైతే, మన పనులు మనమే చేసుకోవడం, నిజమైన స్నేహాన్ని పొందడం, అనుభవించడం, కేంపు ఆఖర్లో (మిగిలిపోయిన బడ్జెట్ తో కొన్న రేషన్లతో) బడా ఖానా, సాంస్కృతిక కార్య క్రమాలు—వొదల్లేక వొదల్లేక పూర్తి ఆత్మ విశ్వాసంతో తిరిగిరావడం మరో యెత్తు!

………(ఇంకా చాలా వుంది)

Sunday, February 15

మానవహక్కులు

పోలీసులపై కేసులు!

వినడానికి చిత్రంగానే వుంటుందిగాని, మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది జరిగే తీరాలట!

ఓ పదిహేనేళ్ళ క్రితం, పోలీసుల తీరుపై ‘అమానుష హక్కులు’ శీర్షిక తో ఈనాడు పత్రికలో నా లేఖ ఒకటి ప్రచురితమయ్యింది.

అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా అంటే, వచ్చింది—వెనకనించి!

అప్పట్లో, యెవరైనా అందోళన చేస్తూ వుంటే, పోలీసులు అక్కడకి చేరుకొని, మైకులో రెండు మూడు సార్లు హెచ్చరికలు చేసి, అప్పుడు గుంపుని చెదరగొట్టేవారు! బెత్తాలకీ, లాఠీలకి పని చెప్పేవారు! యెవరికీ పెద్దగా గాయాలు తగిలేవి కాదు—అవి నిజమైన అందోళనలు కాబట్టి!

తరవాత్తరవాత, ఈ రాజకీయ, కుల, మత ఫ్యాక్షన్ అందోళనలు పెరిగాక, తరలించబడిన జనాలతో, గూండాల నాయకత్వం లో జరుగుతున్న అందోళనలు ముష్టి యుద్ధాలనీ, కత్తి యుద్ధాలనీ తలపిస్తున్నాయి! ఇంకా పురాణాలు, ఇతిహాసాల్లో విన్న కుస్తీలూ, పోరాటాలూ వీటి ముందు దిగదుడుపు అనిపిస్తున్నాయి!

పైనించి వచ్చే అదేశాలమేరకు వాళ్ళని ఓఅరగంటో, గంటో అందోళన చెయ్యనిచ్చి, ఆ తరవాత విజృంభిస్తున్నారు! మన పోలీసులు! ఆడవాళ్ళనీ, మొగవాళ్ళనీ ఒకే విధంగా పక్షపాతం లేకుండా చూస్తున్నారు!

ఇక పేపర్లలో ఫోటోలూ, టీవీల్లో వీడియోలూ చూస్తూనే వున్నాము—చెరో పోలీసు ఒకణ్ణి చెరోకాలూ పట్టుకొని భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్టు చీలుస్తుంటే, ఇంకొకడు కాళ్ళ మధ్యన బూటు కాలితో తన్నడం! వెనక్కి రెక్కలు విరిచేసి ఒకడు పట్టుకుంటే, ఇంకొకడు బూటు కాళ్ళతో గూడు మీద తన్నడం! ఈడ్చుకు తీసుకెళ్ళి, కాళ్ళొకళ్ళూ, చేతులొకళ్ళూ పట్టుకొని, వాన్ లోకి బస్తాని విసిరినట్లు, నడుములు విరిగేలాగ విసిరెయ్యడం! (దీంట్లో నాయకులకి కూడా మినహాయింపు లేదు!)

మరింక మానవహక్కులెక్కడ?

అదే విదేశాల్లో చూస్తే, ఆందోళనలు కాక పోయినా, క్రిమినల్స్ నీ, మాఫియా వాళ్ళనీ కూడా రాగ ద్వేషాలకతీతంగా అందర్నీ ఒకే రకంగా ఒకే పద్ధతిలో లొంగతీసుకుని అరెష్టు చేస్తారు!

మన పోలీసులు యెప్పుడు అలా అవుతారు? యెన్ని కోర్టు తీర్పులూ, యెన్ని కేసులూ విచారణలు జరగాలి? యెంతమంది పోలీసులూ, ఉన్నతాధికారులూ శిక్షలు అనుభవించాలి? అసలు ఇవన్నీ జరిగేవేనా!

చూద్దాం!

Saturday, February 14

" 'క్రూర'మండల్" అనే గరీబ్ (లాలూ) రథం

మన దేశం లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ‘కోరమాండల్ ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పిందిట! కేవలం 18 మందే మరణించారట! యెందుకంటే, అప్పుడు అది గంటకి 60 కి.మీ. వేగంతోనే వెళుతోందట!

మరి దాని పూర్తి వేగం (గంటకి 120 కి.మీ. తో మొదలు పెట్టారు—ఇప్పుడు 140 కి.మీ. కి పెంచినట్టున్నారు) తో వెళుతూ వుండగా (అమంగళము ప్రతిహతమగుగాక!) అయితే అని అడగద్దు.

మన రైల్వేలకే ప్రతిష్ఠాత్మకమైన కోరమండల్ ప్రవేశపెట్టగానే—అతి తక్కువ స్టేషనులలో ఆగుతూ, మధ్య స్టేషనులలో ఆగకుండా వెళ్ళిపోతుంటే జనం నోరు వెళ్ళబెట్టి ‘అబ్బా! కోరమాండల్’ అంటూ చూసేవారు! (వెంటనే మనసులో ప్రశ్న—అంత స్పీడులో అది గానీ………అనుకొని చెంపలు వేసుకునేవారు పాడు ఆలోచన వచ్చినందుకు).

ఇప్పటివరకూ యెప్పుడూ జరగరానిది జరగలేదు! మరి ఇప్పుడెందుకు—అంటే సమాధానం—లాలూగారి కక్కుర్తీ, మన బ్యూరాక్రసీ!

దాదాపు 50 యేళ్ళుగా యెప్పుడూ వినని ‘పట్టాలు విరిగిపోవడం’ గురించి 21వ శతాబ్దం మొదట్లో విని, ఆశ్చర్య పోయేవాడిని!

చిన్నప్పుడు సైన్సు లో లోహాల సంకోచ వ్యాకోచ లక్షణాల గురించి చెపుతూ, ‘రైలు పట్టాల్కి ఒక దానికీ, ఇంకోదానికీ యెడం వుంచుతారు యెందుకు—అవి వ్యాకోచించి, ఒకదాని నొకటి గుద్దుకొని ప్రమాదాలు జరుగుతాయని’ అని చెప్పేవారు మా మేష్టారు!

కొత్త టెక్నాలజీ అంటూ, పట్టాలని వెల్డింగ్ చేయడం మొదలు పెట్టారట—అందుకని పట్టాలు విరిగి పోవడం మొదలు పెట్టాయి!

మరి ఆ టెక్నాలజీని యెక్కడ సంపాదించారో, దాని మీద సరైన అధ్యయనం జరిగిందో లేదో మన బ్యూరాక్రసీయే చెప్పాలి.

అక్కడనించీ, కోకొల్లలుగా ‘త్రుటిలో తప్పిన’ రైలు ప్రమాదాలూ, గ్యాంగుమన్ సమయ స్పూర్తి వల్ల తప్పిన రైలు ప్రమాదాలూ, లైన్మెన్ కి అవార్డులు ప్రకటించడాలూ లాంటి వార్తలు పేపర్లలో చదువుతూనే వున్నాము.

వీళ్ళ కక్కుర్తికి పరాకాష్ట—‘సైడ్ మిడిల్ బెర్త్ లు’ బిగించడం!

ఒక రైలు పెట్టెలో, తొమ్మిది ‘సెల్స్ ‘ గా, ఒక్కోదాంట్లో అడ్డంగా యెదురెదురుగా మూడేసి చొప్పున ఆరూ, నిలువుగా రెండూ కలిపి, యెనిమిది బెర్తులతో మొత్తం 72 బెర్తులూ, యేదో ఒక పక్క మరో మూడు బెర్తులూ కలిపి, పెట్టెకి 75 చొప్పున బెర్తులు వుంటాయి.

ఇప్పుడు, తొమ్మిది సెల్స్ లో ఒక్కొక్కటి చొప్పున 9 సైడ్ మిడిల్ బెర్తులు బిగించడంవల్ల—తొమ్మిది మంది మనుషులు—ఒక్కొక్కరూ సగటున 50 కే జీల బరువున్నా, దాదాపు అర టన్నూ, బెర్తుల, వాటి గొలుసుల, బరువూ, వాళ్ళ లగేజీ బరువూ కలుపుకుంటే, కనీసం ఒక టన్ను బరువు పెరుగుతుంది కదా? మరి చక్రాలూ, ఇరుసులూ, బ్రేకులూ—వాటి పై యెంత భారం పడుతోంది—అని అధ్యయనం చేశారా? అదీ మన బ్యూరాక్రసీయే చెప్పాలి.

బొగ్గు ఇంజన్లతో రైళ్ళు నడిచేటప్పుడు మామూలు ఇంజన్లతో నడిచే రైళ్ళకి గరిష్ఠంగా యేడు లేక ఏనిమిది పెట్టెలు వుండేవి! కెనడా ఇంజను తో నడిచే మెయిలూ, జీటీ, సర్కార్ లాంటి రైళ్ళకి గరిష్ఠంగా పది/పన్నెండు పెట్టెలు వుండేవి. అప్పట్లో చక్రాల క్రింద నిప్పురవ్వలు రావడం, చూడడం చాలా అరుదు! అది కూడా మెయిలూ అవీ రాత్రి పూట పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు—యెవరోగానీ చూసేవారు కాదు.

ఇప్పుడు చిన్న రైలుకి కూడా 18 పెట్టెలూ, పెద్దవాటికి 23 నించి 27 వరకూ తగిలిస్తున్నారు. వాటిల్లో కనీసం 9 నించి 14 వరకూ స్లీపరు క్లాస్ పెట్టెలూ, రెండైనా ఏ సీ (III) పెట్టెలూ వుంటున్నాయి. అంటే, కనీసం 15 నించి 20 టన్నులు బరువు పెరుగుతోంది ఈ సైడ్ మిడిల్ బెర్త్ ల వల్ల.

మరి పట్టాల లో యేమైనా మెరుగుదల వుందా?

కాంట్రాక్టర్ల అధికారుల అవినీతి తో బల్లాస్ట్ గా వాడే కంకర దగ్గరనించీ, ఒకచోట వేసిన దానినే బిల్లు తినేశాక ఇంకో చోటు కి తరలించి బిల్లులు పెట్టుకోవడం లాంటి లీలలతో నానాటికి తీసికట్టు నాగంభొట్టు అన్నట్టుంది వాటి స్థితి.

చక్రాలనించి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు, పట్టాల వెల్డింగ్ కి ఉపయోగించిన లోహం కరిగిపోయి, చక్రాలకి చుట్టుకుని చక్కగా మండుతూ, బోగీలని అంటించేస్తోంది! అందుకే స్లీపర్ క్లాస్ లో మొదటి లేదా చివరి బోగీలకీ, వాటి పక్కనే ఏ సీ బోగీలకీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి--బ్రేకులు వేసినప్పుడు వాటి చక్రాలకే వత్తిడి యెక్కువగా వుండి, నిప్పులు బాగా యెక్కువగా వచ్చి!

ట్యూటికోరిన్ లో తనకు బహూకరించిన మేకపిల్లని ఢిల్లీలో తన మనవడికి ఇచ్చి, అది మళ్ళీ తల్లికోసం బెంగ పెట్టుకుందని ఆ తల్లిని వెతికించి, దాన్ని మళ్ళీ ప్రత్యేక ఏ సీ బోగీలో ఢిల్లీ కి పంపించిన మన మేనేజిమెంటు గురు లాంటి వాళ్ళ నడ్డి విరగదన్నాలా వద్దా.

ఆలోచించండి!

Monday, February 2

I'm a citizen of the World

మన బ్యూరాక్రసీ


దీనికి సరైన తెలుగుమాట ఇంకా పుట్టలేదు!

ఇదెలాంటిదంటే, నిద్ర నటిస్తున్న గాడిద లాంటిది!

నిజంగా నిద్రపోతున్న గాడిదని లేపితే, వెనుక కాళ్ళతో తన్ననైనా తన్నుతుంది. దీనికి అలాంటి అనుభూతులేమీ వుండవు—నిద్ర నటిస్తోందిగదా!

రెండు చిన్న వార్తలు చూడండి!

ఈనాడు 06-01-2009 సంచికలో, పెట్రోలు కోసం క్యూలో రమ్మన్నందుకు కోపం వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు, ఆ లైనుకి చెందిన ట్రాన్స్ ఫార్మర్లోని ఫ్యూజులు తీసి పారేశాడట! బంకుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అంధకారం లో ముంచాడట ఆ రాత్రిపూట! ఆ బంకు ఒక్కదానిలోనే పెట్రోలు వుందట! జనరేటరు కూడా లేదట! దాంతో గంటకు పైగా యెంతమంది యెన్నివిధాల ఇబ్బంది పడ్డారో ఊహించండి!

ఆ సోమరాజు మీద వాళ్ళ ఏ డీ ఈ కి ఫిర్యాదు చేస్తానన్నాడట వాళ్ళ ఏ ఈ!

తరవాతకధ వెండితెరమీద రాదు కదా? అందరూ అప్పుడే మరిచిపోయుంటారు!

అదే రోజుల్లో, ఏలూరులో, విద్యుత్ బిల్లులు కట్టలేదని, పురపాలక సంస్థ కి విద్యుత్ సరఫరా నిలిపి వేశారట విద్యుత్ శాఖవారు!

నీ పని ఇలాగవుందా? అని నగరపాలక సంస్థవారు ఓ జే సీ బీ ని తీసుకొచ్చి, మీ విద్యుత్ శాఖ భవనమే అక్రమ కట్టడం! దీన్ని కూల్చి వేస్తాము—యెవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని విజృంభిస్తే, ఆ ఉద్యోగులందరూ నాలుగు దిక్కులకీ పరార్! ఆనక పోలిసులు రంగ ప్రవేశం చేసి, జేసీబీని స్వాధీనం చేసుకొని, 17 మంది ఉద్యోగులమీద కేసులు పెట్టి, తీరిగ్గా ‘విచారిస్తున్నారు’ట.

అదండీ!

Sunday, February 1

కార్పొరేట్.....

కార్పొరేట్ చిల్లర దుకాణాలు!


నేను ముందే చెప్పాను—రిటెయిల్ (చిల్లర) వ్యాపారాల్లోకి కార్పొరేట్ లు ప్రవేశించడం వాటికీ, ప్రజలకీ, చిన్న దుకాణదారులకీ, ఆర్ధిక వ్యవస్థకీ దేనికీ మంచిది కాదని! విన్నారా? వినరు!

ఒక తాగుబోతు ఒక పెద్ద వీధి దీపం క్రింద గంట నించీ వెదుకుతున్నాడట దేనికోసమో! ఆ వీధినే గంటక్రితం వెళ్ళి, తిరిగి వస్తున్న వ్యక్తి అతన్ని అడిగాడట ‘యేమి వెతుకుతున్నావు?’ అని. అతను చెప్పాడు ‘పక్క వీధిలో మా యింటి తాళం పడిపోయింది—వెతుకుతున్నాను’ అని. ‘అదేమిటీ—పక్క వీధిలో పోతే అక్కడే వెతకాలిగాని, ఇక్కడ వెతుకుతే యెలా?’ అన్న ఆ వ్యక్తికి తాగుబోతు సమాధానం ‘మరి అక్కడ వెతకడానికి దీపం లేదుగా!’ అని!

మన కార్పొరేట్లు మాత్రం, ‘లాభాలు’ యెక్కడ వున్నాయా అని, సెర్చి లైట్లు పట్టుకొని వెతికేస్తాయి! చీమ దూరేంత సందు వుంటే యేనుగుని దోపెయ్యడానికి ప్రయత్నించేస్తాయి! దాని కోసం యెన్ని అడ్డ దారులైనా తొక్కుతాయి!

కొన్ని లక్షల చతురపు అడుగుల వ్యాపార ప్రదేశం లో, అనేక రకాల వస్తువులని నిలవ వుంచి, జనాన్ని రండి, కొనండి, ఆనందించండి అంటూ అహ్వానిస్తాయి!

మరి ఆ నిల్వలకి పెట్టుబడీ, భవన కట్టుబడి వ్యయం, దుకాణం నిర్వహణ ఖర్చులూ, ఉద్యోగుల జీత భత్యాలూ ఇలాంటివాటినన్నీ లెక్క వేసుకుని, వీధి చివర విల్లర కొట్టు వాడి కన్నా ప్రతీ వస్తువూ ఒకటి నించి పది రూపాయల తక్కువకి అమ్మి కూడా, లాభాలు అర్జించాలంటే, ముందే లెక్కలు వేస్తారు—మొదటి మూడు నాలుగు సంవత్సరాలూ నష్టాలు వచ్చినా, తరవాత (చిల్లర కొట్లన్నీ భూమి మీద నించి మాయం అయ్యాక, రెట్టింపు ధరలకి అన్నీ అమ్మడం మొదలెడితే) అయిదో సంవత్సరం నించీ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి—అని!

మరి ఈ లెక్కలు వేసేవాళ్ళు కూడా మన తొట్టి ఆడిటర్లే కదండీ? కాయితం మీద అన్నీ బాగానే వుంటాయి గాని, అసలు మాత్రం……అదన్నమాట!

నా చిన్నప్పుడు మా అమ్మ ‘బాబూ, ఎదురుగా వున్న చిల్లర కొట్లో ఓ పావుకేజి పంచదార పట్రా’ అంటే వెళ్ళిన నేను, దుకాణంవాడు కడుతుంటే, ఇంకొకావిడ వచ్చి ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం బేగి ఇచ్చెయ్యి బాబూ! ఈళ్ళ నాన్న కోప్పడిపోతన్నాడు’ అని చంకలో చంటిబిడ్డని చూపిస్తుంటే, దుకాణంవాడు ‘కాసేపాగు! కాటాలొ పంచదార కనబడడంలేదు!’ అని విసుక్కుంటుంటే, ‘పోనీ ఆవిడకి ఇచ్చేసిన తరవాతే నాకు పంచదార ఇయ్యి!’ అనేవాడిని—నాకంత అర్జెంటు లేదని!

మరి ఈ రోజునైనా, పొద్దున్నే ఆరింటికి కాఫీ గొంతులో పడక పోతే గడవని వాళ్ళూ, నిన్న రాత్రి పొద్దు పోతేగానీ తమ ఆర్జన చేతిలో పడని వాళ్ళూ, తొమ్మిదింటికో, పదింటికో తెరిచి, ఉద్యోగులందరూ వచ్చి, సర్దుకుని, అమ్మకాలు సాగించే వరకూ, ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం’ యెక్కడ వున్నాయా అని ‘మాల్’ అంతా గంటల తరబడి వెతుక్కుని, కొని, తీసుకెళ్ళడం—సాధ్యమేనా?

అందుకే ఈ రోజు ‘సుభిక్ష’ సంక్షోభంలో వుంది; రేపు త్రినేత్ర; యెల్లుండి ఇంకో చతుర్ముఖ, ఇలా అన్నీ!

మీ పిచ్చిగానీ! ఆడిటర్లూ—చిన్న లెఖ్ఖకి సమాధానం చెప్పండి—ఒక ఇల్లు కట్టడానిమి 30 మంది మనుషులకి 60 రోజులు పడితే, 600 మంది మనుషులు అదే ఇంటిని యెంత సేపట్లో కట్టగలరూ?

బుర్రలకి పదును పెట్టండి మరి!

పీ ఎస్: అపార్ట్ మెంట్ కొనబోతున్నారా? కొనొద్దు! ఆగండి. యెందుకంటే బిల్డర్లు ఉక్కుని టన్ను 60 వేల రూపాయలకి కొని కట్టారట! అదంతా మన మీద రుద్దుతారు! ఇప్పుడు టన్ను 29 వేలే! వాళ్ళు చెప్పిన ధరకి సగం రేటు కి ఇస్తేనే కొంటాం అని చెప్పండి! ఇవాళ కాక పోతే రేపు చచ్చినట్టు మీరడిగిన రేటుకే ఇస్తారు—లేదా కోట్లలో ములుగుతారు! తొందర మనకు లేదు!


విన్నారా?

విన్నారా?


".....వాల్ స్ట్రీట్ అధికారులు బిలియన్ డాలర్ల కొద్దీ బోనస్ లు తీసుకోవడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం" అని అమెరికా అధ్యక్షుడు ఒబామా......"ప్యాకేజీతో జెట్ విమానం కొనేందుకు సిటీ బ్యాంకు యత్నాల"ను తప్పు పట్టారు!

మన చట్ట సభల సభ్యులూ! వింటున్నారా?