Friday, January 30

“ఫుట్ బాల్”

మా చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడేవాళ్ళం!

మరీ చిన్నప్పుడు టెన్నిస్ బాల్ తో, ఎలిమెంట్రీ స్కూల్లో వున్నప్పుడు యెప్పుడో వారానికో, 15 రోజులకో ఒకసారి డ్రిల్లు పీరియడ్ లో, మా స్కూలు వెనక ఉన్న పుంతలో, యేరంగుదో తెలియని నిజం ఫుట్ బాల్ తో, హై స్కూల్ లో నిజం గ్రౌండ్ లో, నిజం ఫుట్ బాల్ తో, నిజం గా—ఇలాగ! కాలేజీకి వచ్చాక చిత్రంగా హాకీ లోకి మారి పోయే వాళ్ళం!

ఇప్పుడు యెవరన్నా ఆడుతున్నారో లేదో తెలీదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ‘సాకర్’ అనే వ్యవహరిస్తున్నారు.

ఇంతకీ, నేను మొదలుపెట్టింది ఆ ఫుట్ బాల్ గురించి కాదు!
అమెరికా ప్రెసిడెంట్ దగ్గర వుండే “ఫుట్ బాల్” గురించి!

అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రెసిడెంట్ ఒక్కడే అణ్వాయుధ ప్రయోగం పై చివరి నిర్ణయం తీసుకో వచ్చు—అంతే కాదు వాటి ప్రయోగాన్ని ప్రారంభించవచ్చు! ఆ ప్రారంభాన్ని చేసేదే ‘ఫుట్ బాల్’! ప్రెసిడెంట్ శరీరాన్ని యెల్లప్పుడు అంటి పెట్టుకొనే వుంటుంది ఆ పరికరం!

మాజీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తుపాకి తో కాల్చబడి, చావు బతుకుల్లో వుండగా, పెద్ద తర్జన భర్జన దీని గురించే జరిగింది! వైస్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో వున్నాడు! ఫుట్ బాల్ వుండగా, శస్త్ర చికిత్స చేస్తే, అటూ ఇటూ అయితే, ఆ ఫుట్ బాల్ సంగతేమిటి? ఆయన హాస్పిటల్ లో వుండగా, ఆ ఫుట్ బాల్ ని వైస్ ప్రెసిడెంట్ కి అమర్చ వచ్చా? అవసరం పడితే దాన్ని ఆయన ప్రయోగించదానికి రాజ్యాంగం అనుమతి ఇస్తోందా? ఇలా వందలాది ప్రశ్నలు!
యేదో చేసి, వెంటనే వైస్ ప్రెసిడెంట్ ని వెనక్కి రప్పించి, ఆ పరికరం నియంత్రణని తాత్కాలికంగా ఆయనకి అప్పచెప్పారు! తరవాత, రీగన్ కోలుకొని, మళ్ళీ తన ఫుట్ బాల్ తాను తీసేసుకుని వుంటాదనుకోండి.

మరి మనకి ‘ఫుట్ బాల్’ అనేది వుందా? అది మన అధ్యక్షురాలు వొంటి మీదే వుందా?
లేక మన ప్రధాని దగ్గర వుందా? మన ప్రధాని 18 గంటలకి పైగా అయిదో ఆరో బైపాస్ లు చేయించుకొంటున్నపుడు, అది యేమయ్యింది? కొంపదీసి ప్రణబ్ ముఖర్జీ కి గానీ ఇచ్చారా!

మరి పాకిస్థాన్ మాటేమిటి? వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర వుందా? మహమ్మద్ అజర్ దగ్గర వుందా?

ఒసామా బిన్ లాడెన్ దగ్గర యే దేశానికి సంబంధించినదైనా వుందా?

మన సోకాల్డ్ ప్రింట్/ఎలక్ట్రానిక్/ఇతర మీడియా యేమైనా పరిశోధన చేసి, ప్రజలకి వెల్లడించ గలుగుతుందా?

(అమెరిచాలో రోనాల్డ్ రీగన్ సంఘటన జరిగినప్పుడు విషయం బయట పెట్టినది వాళ్ళ మీడియానే!)

Thursday, January 29

"దేశ భక్తి"

యుద్ధోన్మాదమా?


మన పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలనడం యుద్ధోన్మాదమా!

యుద్ధోన్మాదమంటే—1948 లో పాక్ ప్రదర్శించిందీ, 1962 లో చైనా చూపిందీ, తరవాత సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ పాక్ చెలరేగిందీ—అదీ యుద్ధోన్మాదమంటే!

ఇంకా, వియత్నం మీదా, అఫ్ఘాన్ మీదా, సద్దాం మీదా, అమెరికా వాడు చూపింది!

మరి, మన జనం యెందుకు ఉలిక్కిపడతారు యుద్ధం అనగానే?

మనది శాంతికాముక దేశం కాబట్టి—అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాము!

నిజంగానే మనది శాంతికాముక దేశం సరే! మన జాతి యెప్పుడో ఘోర యుద్ధాలు చేసీ, చూసీ, శాంతిని కోరుకుంది. అశోకుడంతటి వాడిని అహింసా పథానికి నడిపించిన కళింగ యుద్ధమే మన దేశంలో జరిగిన ఆఖరి అతిపెద్ద యుద్ధం!

తరవాత మన దేశం లో రాజులూ, చక్రవర్తులూ, సార్వభౌములూ యుద్ధాలు చేసినా, నష్టం వాళ్ళ (అంటే మన) వైపే వుండేది—యెందుకంటే మన సైనికులే తుపాకి గుళ్ళకీ, ఫిరంగి గుళ్ళకీ బలయి పోయేవారు!

అందుకే, అలాంటి మూర్ఖులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు ఆయుధాలు పనికి రావు అని, అహింసనీ, సత్యాగ్రహాన్నీ పరమాయుధాలుగా మలిచి, ప్రజల్లో దేశ భక్తి ని రగిల్చి, అందర్నీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించాడు మన జాతిపిత గాంధీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు!

ఆ తరంలో అందరికీ, దేశ భక్తి అనేదొకటి అన్నిటికన్నా ముందు వుండేది!

1962 లో మనకి ఆధునిక ఆయుధాలు లేక పోయినా, మన సైన్యం చాలా తక్కువైనా, మన ప్రజల దన్నుతో ధైర్యంగా పోరాడగలింది మన సేన. అప్పట్లో ‘దేశ రక్షణ నిధి’ స్థాపించి, పిలుపు ఇవ్వగానే, దేశ ప్రజలే స్వచ్చందంగా కోట్లాది రూపాయలు ధార పోశారు—నగదుగా, బంగారం గా, వస్తు రూపంలో—యెలా వీలైతే అలాగ!

1965 లో, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ‘వారానికొక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చుని రక్షణ నిధికి విరాళంగా ఇవ్వండి!’ అని పిలుపు ఇస్తే, దేశ ప్రజలందరూ వీలైనన్ని రోజులు ఒంటిపూట భోజనమే చేసి, పొదుపు చేసిన సొమ్ము విరాళాలిచ్చారు!

మహాత్ముడు ధనవంతులు సంపదకి దేశ ప్రజల తరుఫున ట్రస్టీలుగా వుండండి అంటే, ఆతరం అలాగే వుండేది! టాటాలు మొదలైనవాళ్ళు ఉక్కు కార్మాగారాల్ని స్థాపించినా, జౌళి మిల్లులు పెట్టినా, మన దేశ సంపద పెరగాలి, మనదేశం వర్ధిల్లాలి అనే భావించేవారు!

ధనికుల కుటుంబాల్లో పుట్టినా, జే ఆర్ డీ టాటా కూడా కష్టాలు అనుభవించాడు—వ్యాపారాభివృద్ధికి! ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు, బిర్లాలు, దాల్మియాలూ, రూయాలూ, వాడియాలూ, అంబానీలూ—ఇలా అందరూ!

యెంత దార్శనికుడు కాకపోతే, వంటనూనెల వ్యాపారం చేసుకునే ‘విప్రో’ అధిపతి ‘కంప్యూటరు’ వ్యాపారం లోకి దిగాడు?
కార్సన్ భాయ్ పటేల్ ఇంటింటికీ తిరిగి, తన ‘నిర్మా’ అమ్ముకొనేవాడట!

(యెక్కడో ఒక ధీరెంద్ర బ్రహ్మచారి—జయంతీ షిప్పింగ్--వుండేవాడనుకోండి) అయినా, ఆ తరం అందరిలో, దేశ భక్తి అనేది ఒకటి వుండేది!

సరే, తరవాతది, మా తరం!

—(ఇంకా వుంది)