Friday, December 18

"ప్రధాన మం..."



రాజకీయ మోసం


"'.....పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో వున్నాయనుకుని, తెలంగాణా ప్రకటన చేశా'మని, 'ఒక మాట చెప్పి, మరోపని చేస్తారని 'తమకు' తెలియలేదని' " ప్రధాని మన్మోహన్ సింగ్--తనతో 'ఆవేదన' వ్యక్తం చేశారని--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ అన్నారట!  


ఇంకా, ".....పార్టీలు బాధ్యతతో, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడించాలని, 'భారత ప్రభుత్వానికి' మాటిచ్చే ముందు 'ఆచి తూచి' వ్యవహరించాలని, ప్రజల జీవితాలతో ఆడుకోవడం ప్రమాదకరమని" ఆయన అన్నట్టు కూడా జేపీ తెలిపారట!  


కాసేపు ఈ మాటలన్నీ నిజం అనుకుందాం!  


యెంతటి అక్షర సత్యాలవి!  


(రాజకీయానికి కొత్త అయిన రాజీవ్ గాంధీ, వోట్ల కోసం రామ జన్మ భూమి లో 'శిలాన్యాస్' చేయించారు!)  


యే రాజకీయం తెలియని మన్మోహన్ సింగే ఇలా అంటే, రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు, మన తెలుగు తేజం పీ వీ నరసిం హా రావు--"ఆ రోజుల్లో" యెంతటి మానసిక హింస అనుభవించాడో వూహించగలమా?  


ఆయనకి రాజకీయ పార్టీల సంగతీ, ముఖ్యం గా బీజేపీ సంగతీ, కల్యాణ్ సింగ్ గురించీ, చాలా బాగా తెలుసు--కానీ, ఆయన చేస్తున్న వుద్యోగం--పార్టీలని తిట్టడమో, దేబిరించడమో కాదు! ప్రధాన మంత్రిత్వం!  


పైగా, భారతదేశం లోని 'బ్యూరాక్రసీ' నియమాలకి కట్టుబడి వున్నవాడు! 


అందుకే 'భారత ప్రభుత్వానికి' బీజేపీ నుంచీ, రాష్ట్రప్రభుత్వం--కల్యాణ్ సింగ్ ప్రభుత్వం--దగ్గరనించీ, ప్రతీ క్షణం నివేదికల్ని--మౌఖికం గా, లిఖిత పూర్వకం గా--అందుకొంటూ, ప్రతీ క్షణం యేమి జరిగిందో దస్త్రాల్లో నిక్షిప్తం చేశారు! (కావాలంటే ఆయన స్వయం గా వ్రాసిన పుస్తకం చదవండి!)  


బై ది బై, మన 'లిబర్హాన్ కమిషన్' పీవీని యేవిధం గానూ తప్పు పట్టలేదు కదా--ఇప్పుడు 'అధిష్టానం'--ఇంతకాలం-- వోట్లకోసం, వోట్ బ్యాంకుల కోసం, అంటరానివాడిగా చూసిన పీవీ కి ఈ రోజు సరైన న్యాయం చేస్తుందా? అంత దమ్ము వారికుందా?  


'చేటపెయ్య' సోనియాని ముందు పెట్టుకుని, చిదంబరాలూ, పిళ్ళైలూ, ముఖర్జీలూ, మొయిలీలూ, అహ్మద్ పటేళ్ళూ, వయలార్లూ, శరద్ పవార్లూ ఆడుతున్న నాటకాలకి, వారికి వత్తాసు పలికే 'యాదవ్' లకీ, మిగిలిన వాళ్ళకీ, ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు.  


దానికోసమే నిరీక్షణ!




Saturday, December 5

స్వాతంత్ర్యోద్యమం



వందేమాతరం ఉద్యమం


చరిత్రలో లిఖించబడిన ప్రకారం, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జూలై 7న, ‘పరిపాలనా సౌలభ్యం’ పేరిట బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాడు.  


దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. పెద్ద ఉద్యమం జరిగింది. దీన్నే ‘వందేమాతరం ఉద్యమం’ అని వ్యవహరించారు. ఉద్యమం లో పాల్గొన్నవాళ్ళు సామూహికం గా బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని గానం చేసేవారు.  


ఆంగ్లేయులు తమ ‘విభజించి పాలించు‘ పధ్ధతి ప్రకారం—హిందూ ముసల్మానులని విడదీయాలని కుట్ర పన్నారు—అనే బలమైన భావనతో పెద్ద యెత్తున ఈ ఉద్యమం జరిగింది—దేశమంతటా!  


దీనికి ‘లాల్, బాల్, పాల్’ త్రయం గా పేరొందిన లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ నాయకత్వం వహించారు.  


1906 నుంచి 1911 వరకూ ఆంధ్రదేశం లో కూడా విశేషం గా, ఉధృతం గా ఈ ఉద్యమం జరిగింది. ఇందులో భాగం గా—విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, ఆంగ్లపాఠశాలలు మాని, జాతీయ పాఠశాలలు స్థాపించడం, ఆంగ్ల న్యాయ స్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘనం, పన్నుల చెల్లింపుకి నిరాకరణ—ఇలా అనేకవిధాలుగా సాగింది ఆ ఉద్యమం!  


ఇదే మొదటి పెద్ద జాతీయోద్యమం—మన దేశం లో!  


ఆ రోజుల్లో జోక్ యేమిటంటే, యెవరైనా యే మామిడికాయలో బేరం చేస్తూ, “వందేమాత్రం?” అని అడిగితే, అడిగినవాళ్ళని సైతం పోలీసులు అరెష్టు చేసేవారట—ఆ ప్రశ్న "వందే మాతరం” లా వినిపించి!  


మరి ఈ రోజున కొన్ని ముసల్మాన్ సంఘాలు ‘వందే మాతరం పాడడానికి వీల్లేదు‘ అని “ఫత్వా” జారీ చేస్తున్నాయట.  


దీనికి కేంద్రమంత్రులు కూడా వత్తాసు ట.  


యెంత సిగ్గులేని జాతి అయిపోయింది మనది!  


ఈ రోజు కూడా, మన సైనిక దళాలు కవాతు చెయ్యడానికి మహాకవి ఇక్బాల్ వ్రాసిన ‘సారే జహాన్ సే అచ్చా……’ ట్యూన్ నే వాయిస్తారే? దానికి యేమతం వాళ్ళూ వ్యతిరేకత కనబరచలేదే?  


అసలు ‘ముస్లిం సోదరులు‘ అంటూ ఓ ప్రత్యేక జాతిని సృష్టించి, ఆ పేరుతోనే ఫలానా మతస్థులని వ్యవహరిస్తున్న పేపర్లనీ, టీవీ చానెళ్ళనీ ప్రజలందరూ బహిష్కరిస్తే యెంత బాగుండును!  


మన 'ఈనాడు' ఆ దిశలో ముందడుగు వేస్తుందని ఆశిద్దామా?








Sunday, November 29

చిన్న చిన్న…..



జూదాలు

మొన్నోరోజు పేపర్లో, ‘పేకాట స్థావరం పై దాడిచేసి ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళ అరెస్టు‘ అనేవార్త వచ్చింది.  



పోలీసులకి వచ్చిన ‘సమాచారం’ మేరకు, పకడ్బందీగా దాడిచేసి, పోలీసు క్వార్టర్లలో ఓ క్వార్టర్ లో పేకాట ఆడుతున్న 9 మంది కానిస్టేబుళ్ళని అరెస్ట్ చేశారట. అందులో ముగ్గురు ఏ ఆర్ కానిస్టేబుళ్ళన్నమాట.  


మొన్న ‘అంతర్జాతీయ పురుషుల దినం’ సందర్భం గా అనుకున్నాను—పాపం ఆ కానిస్టేబుళ్ళని ఆడకూతుళ్ళు తమ ఇళ్ళల్లోనే పేకాట ఆడుకోనిస్తే, వీళ్ళకీ, వాళ్ళకీ ఈ కష్టాలు వుండకపోవును కదా అని!  


అసలు పేకాట నేరమెలా అయ్యింది?  


అప్పుడెప్పుడో బ్రిటీషుపాలనలో, శాంతిభద్రతలకి విఘాతం జరుగుతుందని పబ్లిక్ లో పేకాట ఆడడం నిషేధించారు!  


కానీ, పట్టణాల్లో టౌన్ హాళ్ళకీ, ఆఫీసర్స్ క్లబ్ లాంటివాటికి నిషేధం వర్తించేది కాదు—కొందరు ఊరి పెద్దలూ, రిటైర్ అయిన అధికారులూ మొదలైనవాళ్ళు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా వుండి, సాయంత్రం పూట సరదాగా కలిసి, డబ్బుకోసం కాకుండా కాలక్షేపం కోసం చిన్న చిన్న స్టేక్ లతో పేకాట ఆడుకొని, అలవాటున్నవాళ్ళు ఒకటో, రెండో పెగ్గులు బిగించి, రాత్రి పదింటికల్లా ఇంటికి చేరేవారు. (ఇదే కాకుండా, లైబ్రరీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్ లాంటి గేంస్ కూడా వుండేవి, ఆడేవారు!)


పది దాటాక క్లబ్బు తెరిచి వుంచితే కేసు పెట్టేవారు. ప్రభుత్వమే కొన్ని క్లబ్బులకి బార్ లైసెన్సులు కూడా ఇచ్చేది!  


ఓ పదేళ్ళనించి అనుకుంటా—ఇలాంటి క్లబ్బులని కూడా నిషేధించారు!  


ఓ నలభయ్యేళ్ళ క్రితమే, మేధావులు యెండమూరి వీరేంద్రనాథ్ లాంటివాళ్ళు వ్రాసిన నాటికల్లో, నవలల్లో “మన ప్రభుత్వం పేకాటను నిషేధించి, రేసులకి డబ్బు పోస్తూంది!” అని ఆవేదన చెందే పాత్రలచేత అనిపించారు!  


మాడబ్బుతో, మా యెకరాలతో, మేము ఆడుకొంటుంటే, ఈ పోలీసులకేమి పోయేకాలం? అని ప్రశ్నించారు చోటా మోటా రాజకీయులు—పండగల్లో కోడిపందాలు ఆడుకుంటూ!  


దానివల్ల లేని ‘శాంతిభద్రతల ముప్పు’ పేకాట వల్ల వస్తుందా?  


మరి, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, డెరివేటివ్స్—ఇలాంటి వందలకోట్ల తో జరుగుతూ, సమాజానికి నష్టం చేస్తున్న ఈ పెద్ద పెద్ద జూదాలని యెందుకు నిషేధించరు?  


యేమంటారు?  


(ఓ పదిరోజుల క్రితం వ్రాయడం మొదలుపెట్టిన ఈ టపా, అనివార్యకారణాలవల్ల ఆలస్యం గా పూర్త్రిచెయ్యబడి, ప్రచురించబడుతోంది!)


Friday, November 13

నైతికత


తప్పుడుబిల్లులకి శిక్ష


యెట్టకేలకు యెర్నేని రాజా రమచందర్ కి బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి మోసం ద్వారా ప్రభుత్వం నించి డబ్బు తీసుకొన్న కేసులో, నేరం నిరూపణ కావడం తో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సీ ఐ డీ న్యాయస్థానం.  


అప్పుడే న్యాయం జయించింది అని మనం అనుకోకుండా, శ్రీ నేతగారు 'పై కోర్టులో అప్పీలుచేసి, నిర్దోషిగా బయటికి వస్తాను' అంటున్నారు.  


మరి చూద్దాం!

Tuesday, November 10

మహానుభావులు


శ్రీ విశ్వనాథం


నవంబరు 10--1979 లో--బహుముఖ ప్రఙ్ఞాశాలి, పండితుడు, కవి, రచయిత, రాజకీయ వేత్త, మంత్రి, విశిష్ట పార్లమెంటేరియన్, మహామేథావి, విశాఖ ముద్దుబిడ్డ, అన్నిటినీ మించి గురువుని మించిన శిష్యుడు అని చెప్పుకోదగ్గ శ్రీ తెన్నేటి విస్వనాథం గారు పరమపదించిన రోజు--ఈరోజు ఆయన 'వర్థంతి '!  


అడ్డమైనవాళ్ళకీ సందర్భాలు ఙ్ఞాపకం చేసుకుని మరీ 'నివాళులు ' అర్పించే మన తెలుగు వాళ్ళు, ఈయన్ని యెక్కడా తలుచుకున్నట్టు లేదు!  


ఆయనతో నా పరిచయభాగ్యం--అవి 1972 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆందోళన రోజులు! నేను మా నరసాపురం 'నిరుద్యోగుల సంఘం' కార్యదర్శిగా, మా సంఘాన్ని కూడా ఉద్యమం లోకి తీసుకెళ్ళి, ఆందోళన సాగిస్తున్న రోజులు!  


అప్పటికి కొంతమంది ఇంకా సమైక్య వాదులుగా మిగిలిపోవడం తో, వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళని కూడా ఉద్యమం లోకి కలుపుకోడానికి, నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి మొదలైనవారు విస్తృతంగా తెలుగునేలని పర్యటిస్తున్నరోజులు!  


ఒక రోజున, తణుకులో ఓ ప్రముఖ సినిమా హాలులో, తణుకూ, చుట్టుపక్కల వూళ్ళలోని వివిధ పార్టీల, సంఘాల నాయకులనీ ఆహ్వానించి, విస్తృత సమావేశం యేర్పాటు చేశారు. మహామహులు వస్తున్న సమావేశం అవడం తో, మేము--మా రాజకీయ గురువు శ్రీ కుంచెనపల్లి నాగేశ్వర రావుగారితో ఆ సమావేశానికి వెళ్ళాము. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు అప్పుడే యెదుగుతున్న నాయకుడు!  


వేదికమీదకి దగ్గర దగ్గర ఓ వందమంది దాకా ముఖ్యులని అహ్వానించారు. (అందరూ వేదిక నేలమీద వరుసగా కూర్చోబెట్టబడ్డారు! నాయకులతోసహా!) శ్రీ తెన్నేటి, వారికి దిశా నిర్దేశం చేశారు--అందరూ ఒడంబడ్డారు. సమావేశం ముగుస్తుందనగా, (ఆ సాయంత్రం ఓ కాలేజ్ మైదానం లో బహిరంగ సభ.) మా గురువుగారు మమ్మలని హడావుడిగా వేదిక యెక్కించి, నన్ను శ్రీ తెన్నేటివారికి పరిచయం చేశారు--నిరుద్యోగుల సంఘం కార్యదర్శిగా, ఉద్యమం లో క్రియాశీల పాత్రపోషిస్తున్నవాళ్ళలో ఒకడిగా--చెయ్యెత్తి నమస్కరించాను. ఆప్యాయంగా నా చేతుల్ని పట్టుకుని 'మన రాష్ట్రం వస్తే, మీ సంఘం ఇక యెత్తెయ్యవలసిందే!' అన్నారు నవ్వుతూ! 'మా ఆశ కూడా అదేనండి!' అన్నాను కృతఙ్ఞతతో! తరువాత, ఇంకొకరితో ఆయనకి పరిచయం, నా నిష్క్రమణ!  


నిజం గా, తెలుగుతేజాలైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని, పొట్టి శ్రీరాములుగారిని, పీ వీ నరసిం హారావుగారిని, నీలం సంజీవరెడ్డిని, తెన్నేటిని--ఇలాంటి యెందరినో తలుచుకుంటున్న తెలుగువాళ్ళెంతమంది?  


శ్రీ తెన్నేటివారిగురించీ, 60 యేళ్ళ క్రితం కూడా 'సో కాల్డ్' కాంగ్రెస్ అధిష్టానం తెలుగువారిని యెలా చిన్నచూపు చూసిందీ, యెన్ని రాజకీయాలు చేసిందీ, (అన్న ఎన్ టీ ఆర్ వచ్చేవరకూ నార్తోళ్ళకి తెలుగోళ్ళంటేనే తెలీదన్నట్టు వుండేవారు!)--ఇలాంటివి వీలున్నప్పుడల్లా వ్రాస్తా!  


చదవండి!



Saturday, November 7

లాలూ మూర్ఖః


అగ్రేసరీ మమత!


రైలు బోగీల్లో బిగించిన 'కక్కుర్తి ' బెర్తులవల్ల యెంత నష్టం జరిగిందో, యెన్ని ప్రాణాలు పోయాయో యవరైనా లెఖ్ఖవేశారా?  


చులాగ్గా అవి తొలగించాలని నిశ్చయించారు!  


ఇప్పుడైనా యేమైనా సుఖం గా వుందా ప్రయాణికులకి? లేదు--యెందుకంటే, కక్కుర్తి బెర్తులకోసం మామూలు పై బెర్త్ ని ఓ ఆరంగుళాలు పైకి జరిపారు! ఇప్పుడు మధ్య వేసిన కక్కుర్తి బెర్త్ ని తొలగించేసి, చేతులు దులుపుకుంటున్నారు--మరి పై బెర్త్ ని ఆరంగుళాలు క్రిందకి యెవరు జరుపుతారు? వాళ్ళ బాబులా?  


అందుకే అన్నది 'లాలూ మూర్ఖః' అని!  


ఇక మమతాదీ--తనభాషలో 'తురంతో' అన్నవాటిని (హిందీలో 'తురంత్ ' అంటే శీఘ్రం గా అని అర్థం! అది వాళ్ళ భాషలో పదాలన్నిటికీ 'ఓ' కారం చేర్చే పధ్ధతివల్ల తురంతో అయ్యింది) మీడియా ఇష్టం వచ్చినట్టు 'దురంతో' (దుః+అంతః--అంటే చెడు అంతము కలిగినవి) అనీ, 'డ్యురాంటో' (ఇదేదో ఫ్రెంచ్ పదం లా వుంటుంది) అనీ పొగిడేశాయి!  


మరి ఈ రోజున, ఆ 'తురంతో' (అత్యధిక దూరపు, మధ్యలో యెక్కడా ఆగని) రైళ్ళకి, 'టెక్నికల్ స్టాపులు ' అని కనీసం 6 చోట్ల కనీసం అరగంటసేపు ఆపుతున్నారట! కానీ, అక్కడ యెవరైనా ప్రయాణికులు దిగిపోవచ్చుగానీ, యెవరూ యెక్కకూడదట! (మరి దిగిపోయేవాళ్ళుకూడా మొదటినించీ చివరివరకూ టిక్కెట్టు తీసుకోవాలో యేమిటో!).  


అలా అయినా, ఈ రైళ్ళన్నీ, 21 నించి 24 శాతం మాత్రమే నిండుతున్నాయట--76% ఖాళీగానే గమ్యస్థానం చేరుతున్నాయట! పైగా అన్నీ ఏ సీ బోగీలేనట! ఇక కనీసం 75 మంది ప్రయాణించవలసిన బోగీల్లో, అటెండెంట్లూ, హెల్పర్లూ, హాకర్లూ, టీ టీ ఈ లూ, 75 బ్లాంకెట్లనీ కప్పుకొని, హాయిగా నిద్రా, ఇతర సుఖాలని అనుభవిస్తున్నారో, యేమిటో!  


అందుకనే అన్నది--అగ్రేసరీ మమత--అని!  


దీనికైనా యెవరినైనా బాధ్యుల్ని చేస్తారా?  


ఇలాంటివాటికి ఓ 'తెల్ల యేనుగు ' ప్రభుత్వ సంస్థ వుంది-- 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ' అని! వాళ్ళెప్పుడూ ప్రభుత్వానికీ, యాజమాన్యాలకీ పాదాలొత్తుతూ, చిన్న చిన్న వుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తూ వుంటారు!  


దాని గురించి మరోసారి!



Friday, October 30

పాత్రలు


గంగాళం


అసలు పాత్రల అవసరం యేమిటి?  


ప్రవహించే గుణమున్న ద్రవ పదార్థాలని, ఒకచోట నిలబెట్టడమే వాటి వుద్దేశ్యం! అవునా?  


మొదట్లో రాతితో చేసేవారు--కానీ అవి చాలా బరువు, పైగా వాటిలో యేమైనా వండుకోవాలంటే వేడెక్కడానికే చాలాసేపు పట్టేది. రాచ్చిప్పలు కొన్నాళ్ళు వంటకి వుపయోగించగానే, పొడి పొడిగా రాలి పోయేవి!  


తరవాత మట్టితో కుండలు తయారు చేసి, వాటిని వాడుకొనేవారు. అవి తేలిగ్గానే వున్నా, తొందరగానే వేడెక్కినా, చిన్న తాకిడికే పగిలిపోయే వాటి గుణం వల్ల అవీ అంత లాభదాయకం కాలేదు.  


లోహాలు కనిపెట్టాక, ఇత్తడీ, రాగీ, కంచూ మొదలైన లోహాలతో పాత్రల్ని తయారు చేసేవారు. ఇత్తడీ, రాగీ 'చీప్ అండ్ బెస్ట్'. రాగి త్వరగా వేడెక్కేది, ఇత్తడి కూడా మందాన్నిబట్టి త్వరగానే వేడెక్కేది. యెక్కువకాలం పాత్రలు జీవించేందుకు, ఇత్తడీ రాగీ కలిపి కంచు తయారు చేసేవారు. కానీ ఇవి బరువు. గంటల్ని యెక్కువగా దీంతో తయారు చేసేవారు--బాగా మోగుతాయని.  


ఇత్తడీ, రాగి తో వచ్చిన సమస్యేమిటంటే--'కిలం'. ఉదాహరణకి ఇత్తడిలో పులుపు పదార్థాలు కాసేపు వుంచితే, అవి విష పదార్థాలుగా మారిపోయేవి--ఈ కిలం వల్ల. రాగి పాత్రలు కూడా, అస్తమానూ తోమకపోతే, రసాయన చర్యల వల్ల 'కాపర్ ఆక్సైడ్' 'మైలుతుత్తం' (కాపర్ సల్ఫేట్) తయారయ్యేవి--అవీ విషంతో సమానమే!  


ఇత్తడి పాత్రలకి లోపల తగరం, నవాసారం తో 'కళాయి' పూసేవారు--పులుపు నిలవ చేసినా కిలం పట్టకుండా వుండేందుకు--వాటినే కళాయి గిన్నెలు అనేవారు! పులుసు వడ్డించడానికి వుపయోగించే 'గోకర్ణాల'తో సహా అన్నిటికీ కళాయి పూయించేవారు!  


ఇక వాడుక నీటికోసం, రాతి బానలూ, మట్టి బానలూ, ఇత్తడి గంగాళాలూ, తరవాత్తరవాత ఇనప గుండిగలూ, సిమెంటు గోళేలు, ఇత్తడీ, అల్యూమినియం, ప్లాస్టిక్ బక్కెట్లూ--ఇలా!  


మరి ఆయనెవరో 3 కోట్లతో ఓ బంగారు 'గంగాళాన్ని ' తయారు చేయించి, శ్రీవారికి కానుక ఇచ్చాడట. దీని వుపయోగమేమి తిరుమలేశా!  


మా తెలుగు మేష్టారు, యెవరో వ్రాసిన ఓ పద్యం చెప్పేవారు--పూర్తిగా నాకు ఙ్ఞాపకం లేదు గానీ--'.........సుతుల్ గుడువనా, పతి సంతసింపనా............బాల రండా కుచ ప్రాభవంబునన్!' అని.  


అలాగే, 'అజాగళ స్థనాలు ' అనేవారు!  


అంటే--యెందుకూ పనికిరాని వాటిని ఇలా వర్ణిస్తారు!  


మరి ఆ గంగాళాన్ని యేమనాలి?  


కొసమెరుపేమిటంటే, 'స్నపన తిరుమంజనం' లాంటి వాటికి బాగా వుపయోగపడొచ్చు--అని పత్రికల కితాబు!  


అదండీ సంగతి!


(బెందాళం గురించి మరోసారి)


Monday, September 28

నానని రోకలి

(సీ) నియర్లు  


ఇంకా రోకలి నానలేదు! యెందుకుట? యెక్కడనానిపోతుందో అని నీళ్ళక్రింద మంటలుపెట్టేస్తున్నారుట--సీనియర్లు! (సీనియర్లు అంటే సముద్రానికో, ఇంకదేనికో దగ్గరగా వున్నవాళ్ళు--అని నిర్వచించాడో యువ రాజకీయవేత్త!)  


'అధిష్టానంలో నేనుకూడా భాగమే!' అని ప్రకటించుకున్న కేకే ని చూసి, 'ఓసోస్! మాకు తెలీదులే! వీరప్ప మొయిలీలూ, అహ్మద్ పటేల్ లూ, వయలార్ రవిలూ కూడా అలా ప్రకటించుకోలేదు--వర్కింగ్ కమిటీ మెంబర్ అయినంతమాత్రాన నువ్వో అధిష్టానం!? నీక్కూడా అధిష్టానం అయినవాళ్ళెవరో మాకు తెలియదనుకోకు!' అని వెక్కిరిస్తున్నారు--కార్యకర్తలు!  


మొన్నెప్పుడో ఖమ్మం లో రేణుకా చౌదరి సోనియాతో వున్నట్టు వున్న ఫ్లెక్సీ బోర్డుని కార్యకర్తలు చింపేస్తే, వీ హెచ్ అది సోనియా మీద దాడిగా అధిష్టానికి పూర్తిగా నూరిపోశాడు!  


అక్కణ్ణించీ ప్రతీవాడూ 'అది తప్పు' అంటూ స్టేట్ మెంట్లు!  


అసలు గొడవ యెక్కడ మొదలయ్యింది? కాకా 'జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి'--అని వూరుకోకుండా, రాజీవ్ గాంధీకి ప్రథాని కాకముందు అనుభవం లేదుకదా? అన్నాట్ట!  


ఇక వీరభజనగాళ్ళకి మంచి అవకాశం వచ్చింది--సోనియా, రాహుల్ భజన చేస్తూ, పనిలో పనిగా తమ పబ్బం గడుపుకోడానికి!  


పార్టీ చీలిపోతే, అధిష్టానాన్ని నమ్ముకున్నవాళ్ళకి పదవులూ, కొత్తపార్టీ వారికి అఙ్ఞాతవాసం, మళ్ళీ యెలక్షన్లువచ్చేసరికి కొత్తపార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం--ఇలాగే జరుగుతూంది ఇన్నాళ్ళూ! 


మరి రేపేమవుతుందో? అసలే చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న పార్టీ--దాని క్రింద అధిష్టానం చెట్టునీ, దాని పిలకల్నీ నెత్తిమీదపెట్టుకొని, రాష్ట్రఫలాలని మింగాలనుకొనే నక్కలు ఇంతకంటే యేమి చేస్తాయి?  


చూద్దాం!



Sunday, September 13

అధిష్టానం మార్కు.....

 
ముఖ్యమంత్రెవరు? 

రాజశేఖర రెడ్డి కరువు ప్రకటనకి రోకలి నానేస్తే, ఇప్పుడు అధిస్టానం ఆయన తరవాత ముఖ్యమంత్రెవరు అని తెలియడానికి మళ్ళీ రోకలి నానేసిందట!  

అది పూర్తిగా నానగానే, సీల్డు కవరు పంపిస్తారట!  

ఈ లోపల రాజ్యాంగేతర శక్తి ఒకాయన పొద్దున్నే ఢిల్లీ కి మళ్ళీ రాత్రికి హైదరాబాదుకీ ప్రయాణాలు సాగిస్తున్నాడు. అక్కడ ఒక్కో అరగంటో, గంటో 'చిన్న అధిష్టానాల 'తోనూ, వీలైతే ఇంకో అరగంటో యెంతో 'పెద్ద అధిష్టానాల 'తోనూ సంప్రదింపులు సాగించి, హైదరాబాదు వచ్చాక 'అంతా సవ్యంగానే వుంటుంది--మీరందరూ నోరెత్తనంతవరకూ!' అని అందరినీ సవరదీస్తున్నాడు!  

ఇంత డ్రామా యెందుకో? కాంగ్రెస్ సంస్కృతి తెలియంది యెవరికి? 

ఆ వచ్చే సీల్డుకవర్ లో 'శ్రీమతి రాజశేఖర రెడ్డి ' పేరు వ్రాసి, సీ ఎల్ పీ లో ఆవిడ యెన్నిక కాగానే--'ఆంధ్ర ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి!' అనీ, 'ఓ స్త్రీ కి ఆ పదవి ఇవ్వడం లో అధిష్టానం త్యాగనిరతి ప్రశంసనీయం!' అంటూ ప్రకటనలు వెలువడి, పులివెందులనించి ఆవిడని పోటీకి దింపినా--ఆశ్చర్యపడక్కర్లేదు!  

(సానుభూతి కార్డూ పని చేస్తుంది, మిగిలిన సామాజిక వర్గాలూ, అసమ్మతులూ మాట్లాడరు--పరిపాలనకి రాజ్యాంగేతర శక్తులెలాగూ వుంటాయి!)  

బహుశా రోకలి మంగళవారానికి నానచ్చు అంటున్నారు!  

చూద్దాం!


Monday, September 7

స్మారక......


దోపిడి రాజకీయం


మాజీ ముఖ్యమంత్రి మరణం తరవాత, మొదటి మంత్రివర్గ సమావేశం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల్లో ఒక అతి ముఖ్యమైనది--వై యెస్ హెలికాప్టరు 'కూలిన చోట ' ఒక బ్రహ్మాండమైన 'స్మారక చిహ్నాన్ని ' నిర్మించి, ప్రతి రోజూ ప్రజల సందర్శనకి యేర్పాట్లు చెయ్యలి--అనిట!  


ఇంకేం! కొన్ని వందల కోట్ల అంచనాలూ, కాంట్రాక్టులూ, అంచనా వ్యయాలు మించడాలూ, మళ్ళీ కొన్ని వేల కోట్ల అంచనాలూ, ఓ పది పదిహేనేళ్ళు గుత్తదారుల, ఉప గుత్తదారుల, ఉప-ఉప గుత్తదారుల, వాళ్ళక్రింద వేలాదిమందీ--పంట పండినట్లే!  


మరి, 15 కిలోమీటర్లు కాలినడకన, దారి తెలియకుండా (జీ పీ యెస్ వున్నా) తప్పిపోయే అవకాశం వున్న దారి తెలియని దారుల్లో నడిచి, అక్కడకి చేరుకోవాలే? 


అక్కడున్న చెంచులూ వగైరాలకీ, అస్తమానూ అక్కడ తిరిగే మావోయిష్టులకీ కూడా సాధ్యం కాని చోటుకి, ప్రతిరోజూ ప్రజల సందర్శనానికి యెలా యేర్పాట్లు చేస్తారో?  


బహుశా, 'బెల్ 430' హెలికాప్టర్లలో వేలాది రూపాయల టిక్కెట్లు కొనుక్కొని, రాత్రి పూట మాత్రమే--లేదా తెల్లవారుజామునగానీ, సాయంత్రం పూటగానీ మాత్రమే (మధ్యాన్నం దాన్ని మూసేసి)--సందర్శించే యేర్పాట్లు చేస్తారేమో!  


జగన్ ముఖ్యమంత్రి సంగతేమోగానీ, ఓ నా కార్యకర్తల్లారా! ఆ డబ్బుతో యెంతమందికి 'ఆరోగ్య శ్రీ' పడుతుందో ఆలోచించండి!  


ఇలాంటివాటికి వ్యతిరేకంగా నిరాహారదీక్షలూ, ధర్నాలూ, ర్యాలీలూ చెయ్యండి!  


లేదూ--అలాగే కానివ్వండి!  

Sunday, September 6

రాజకీయం

రాచకం


ఇవాళతో నాలుగు రోజులుగా మన రాష్ట్రం లో ప్రభుత్వం లేదు! (వుంటే, ఇడుపులపాయ ముందు 15 కిలోమీటర్ల మేర 'ట్రాఫిక్ జాం' అవకపోను!)  


సంతాపదినాలు అయ్యేవరకూ 'అధిష్టానం' ఆలోచించదట.  


ఈ లోపల కాకాలు బాకాలు మొదలెట్టారు!  


హనుమంతుడికి రక్తం వుడికిపోతోందట!  


కేకే సాగిలపడిమరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ్యాలంటున్నాడు!  


'అనుభవం లేకపోయినా ఫరవాలేదు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి--రాజీవ్ ప్రథాని అయినప్పుడు ఆయనకి అనుభవం లేదు కదా?' అన్నాడు కాకా.  


'రాజీవ్, ఇందిరల కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది. నా రక్తం వుడుకుతోంది!' అన్నాడు వీ హెచ్!  


రాజీవ్ యేమి త్యాగాలు చేసి ప్రథాని అయ్యాడో? ఇందిరని కుట్రదారులు చంపడం రాజీవ్ త్యాగమా?  


వై యెస్ ని కూడా యే తీవ్రవాదులో చంపేసివుంటే, అప్పుడు జగన్ త్యాగం చేసినట్టేనేమో--ఈయనకి అభ్యంతరం లేకపోనేమో మరి!  


'123.....133 లెఖలు కాదు--మెజారిటి వుంటే తీర్మానం చేసి, దేశాన్ని అమ్మేద్దామా? సభలో ఎమ్మెల్యేలెంతమంది మద్దతు ఇచ్చినా, సోనియా కాదంటే అది శిరోధార్యం! (వాళ్ళు నోరుమూసుకోవాలి)' అని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యాలు చెపుతున్నాడు కేకే!  


ఇలాచేసే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది ఇందిర--వీళ్ళ దన్ను చూసుకొనే! అప్పుడే మరిచిపోయారా?  


నందో రాజా భవిష్యతి!  

Wednesday, August 26

ఫుణ్యభూమి

యుగాలూ—భూమి
‘శ్రీమద్భాగవతం’ లో కృతయుగాదిగా జరిగిన పరిణామాలూ, అవతారాలూ వర్ణించబడ్డాయి.  


వేదాలు రచింపబడడం, మత్స్యావతారుడు వాటిని సోమకాసురుణ్ణించి రక్షించడం—ఇది జరిగింది కృతయుగం చివరి కొన్నివేల సంవత్సరాల్లో. యెందుకంటే, అప్పటికి ‘శ్రీ మహావిష్ణువు’ ‘స్థితికారుడు’ గా స్థాపించబడ్డాడు.  


అప్పటికి, భూమి లేదు—అంటే, ఉత్తరఖండం, దక్షిణఖండం మాత్రమే, పూర్తిగా మంచుతో కప్పబడివుండేవి. అక్కడక్కడా దక్షిణఖండంలో మనుషులుండేవారు. ఉత్తరఖండంలో మనుషులు లేరు.  


తరవాత, కృత యుగం లోనే, కూర్మావతారం కూడా జరిగింది. (అప్పటికి మానవ స్త్రీలు కూడా ‘గుడ్లు’ పెట్టేవారు—దేవతలవంటివాళ్ళ సంగతి తెలియదు. ఉదా:- అనూరుడూ, గరుత్మంతుడూ—వీళ్ళు పుట్టాక దేవతల సేవకి వెళ్ళిపోయారు!)  

తరవాత, వరాహావతారం అవసరం వచ్చి, తన కోరలమీద భూమిని (దక్షిణ ఖండాన్ని) తేల్చి, జరిపుకుంటూపోవడం తో ఆ ఖండం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైన ఖండాలుగా విడిపోయి, ‘ఉత్తరఖండాన్ని’ కలిసి (ఢీకొని) నేటి అఖండ ప్రపంచం, మధ్యలో సముద్రాలతో యేర్పడింది. (ఇప్పటి భూకంపాలకీ, అగ్నిపర్వతాలకీ, సునామీలకీ ఇదేకారణం!)  


అలా ఢీకొన్న రెండు భూభాగాల వల్లనే, ‘ఆండీస్’, ‘ఆల్ప్స్’, ‘హిమాలయాలు’ లాంటి మహాపర్వతాలు యేర్పడ్డాయి.  


ఇక ‘భరత ఖండానికి’ వస్తే, ఆగస్త్య మహర్షి పూనుకొనేవరకూ హిమాలయ పర్వతాలూ, వింధ్య పర్వతాలూ, తూర్పు-పడమర కనుమలూ పెరుగుతూనేవున్నాయి. 


హిమాలయాలకీ, వింధ్యకీ మధ్యలో సముద్రం యెక్కువగా వుండి పోవడంతో, అగస్త్యుడు ఆ సముద్రాన్ని ‘అవుపోసన’ పట్టి, తన కమండలంలో నిక్షిప్తం చేసి, వింధ్యపర్వతాలని దాటుతూ, తన కాలి బొటనవేలితో వింధ్యుడి నెత్తిమీద నొక్కి, ‘నేను మళ్ళి నీ నెత్తిమీదకి వచ్చేదాకా నీ పెరుగుదల ఆగిపోవుగాక!’ అని దక్షిణానికి వచ్చేశాడు.  


అలా ‘భరతఖండం’ మధ్యలో సముద్రాలు లేకుండా, ఒకటిగా నిలిచింది.  


తరవాత సంగతి మరోసారి. 




Tuesday, August 25

గాయత్రి

మంత్రాలూ—గాయత్రి
మంత్రాలనేవి ‘కర్మలు ’ చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి! (అవి ‘బ్రహ్మ’ కర్మలైనా, ‘అపర’ కర్మలైనా!) 

యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని, పురోహితులు వాటిని నేర్చుకొని, ప్రజలచేత చేయిస్తారు.

 చెయ్యవలసిన కర్మ యేమిటో, యెందుకు చేస్తున్నామో ‘సంకల్పం’ చెప్పుకుంటారు ముందు. అదే పురోహితులు చెప్పి, మధ్యలో కర్మిష్టుల్ని ‘మమ’ అనుకోమంటారు అందుకే!

 ఇక మంత్రాలని ‘చదవ కూడదు’ ‘జపించాలి’ లేదా, ‘అనుష్టించాలి’. గాయత్రి విషయానికొస్తే, అది వూరికే చదివేది కాదు. యెందుకంటే— 

శిశువు జన్మించినప్పటినించీ (ఆడైనా, మగైనా) కొన్ని ‘జాతక కర్మలు’ నిర్దేశించారు—బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి—వీటిలో కొన్ని ఆడ శిశువులకీ, కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం.

 ఇక మగ పిల్లలకి ‘గర్భాష్టమం’ లో చేసే జాతక కర్మ పేరు—వుపనయనం. (దాన్నే ‘ఒడుగు’ అంటారు) ఇది యెందుకు చేస్తారంటే—శిశువుకి 8 సంవత్సరాలు వయసు (తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా—అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు. అంతే కాకుండా, బాలారిష్టలన్నీ గడిచి, ఒక ధీమా వస్తుంది—అందుకని, ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు—అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా!

 ఇక ఙ్ఞానార్జనకి మూలం ‘విద్య’. దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి—వాటికోసం, ఒడుగు లోనే ‘బ్రహ్మోపదేశం’ చేయిస్తారు—తండ్రి చేతగానీ, ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ. ఆ ఉపదేశం లో భాగంగానే, యఙ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రి ని ఉపదేశిస్తారు! అక్కడితో, విద్యార్జనకి అర్హత లభించినట్టే!

 అక్కడి నించి, అనుష్టానాలు మొదలు అవుతాయి—ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి!

 టూకీగా అదీ సంగతి.

 ఇక ‘భూర్భువహ్ స్వహ్’ అంటే, మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు. వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు. అలా భూమికి పైన 7, భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు.

 పైనుండేవి క్రమం గా 1.భూ లోకం, 2.భువర్లోకం, 3.స్వర్లోకం, 4.మహర్లోకం, 5.జనలోకం, 6.తపోలోకం, 7.సత్యలోకం (ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట).

 వీటిని మంత్ర రూపంలో—‘ఓం భూ: ఓం భువ: ఓం స్వ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం~ సత్యం’ అని చెప్పి ‘ఓం తత్సవితుర్వరేణ్యం…….’ ఇలా సాగుతుంది.

 గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు. అవి భూలోకం (అంటే మనం వున్నది—ఇది అందరికీ తెలిసిందే) భువ:+లోకము= భువర్లోకం అంటే, మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది. ఇక స్వ:+లోకము=స్వర్లోకం అంటే, మేఘాలకి పైన వున్నది. (దీన్నే పొరపాటుగా ‘స్వర్గం’ అని వ్యవహరిస్తున్నారు—నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం) మనిషి చనిపోయాక, జీవుడు (అంటే ఆత్మ) ఇక్కడవరకూ చేరడమే కష్టం. ఆతరవాత ‘ఆటోమేటిక్ ప్రమోషన్లు’—ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు!

 అదిగో—అదీ గాయత్రి వుద్దేశ్యం! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా, ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో!

 ఇక ‘మంత్రాలకి చింతకాయలు రాల్తాయా’ అనకుండా వాటిని విశ్వసించేవారికి, వాటి మహిమపై నమ్మకం వుంటే, ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ‘సైడ్ ఎఫెక్టు’లూ, బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి?

 ఇంకొక మాట—ఇవన్నీ నమ్మినా, నమ్మకపోయినా—నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు. కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే!

 యేమంటారు?

 (ఇందులో కొంత పదార్థం (మేటర్) నా ‘హేతువాదం’ బ్లాగులో రావలసింది—సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను.)


Monday, August 24

విశ్వసనీయత

కాకుల్లెక్కలు
నిజం గా కాకుల్లెక్కలైతే, లెక్క ఓ పదివేలదాకా అటూ ఇటూ అయినా యెవరికీ నష్టం వుండదు.

కాని అతి ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వ లెక్కల్లోనే తేడాలు వుంటే?

స. హ. చట్టం పుణ్యమాని, మన వున్నత న్యాయస్థానం పుణ్యమాని—ఇలాంటి విచిత్రాలు బయటకొస్తున్నాయి!

ఎం బీ టీ నేత అంజదుల్లా ఖాన్ ముఖ్యమైన మూడు అంశాలమీద ఆయన తెప్పించుకున్న సమాచారం కాకుల్లెక్కలని మించి పోవడం తో ఆయన మన వున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు!

ఆ ప్రశ్నలు—1. రాష్ట్రం లో యెంత మంది ‘ఆయుధాలు’ కలిగి వున్నారు? 2. క్రిమినల్ చరిత్ర వున్నవారికి ఆయుధాలున్నాయన్న మాట వాస్తవమేనా? 3. లైసెన్స్ లు మంజూరు చేసే అధికారం యెవరెవరికి వుంది?—ఇవీ!

యెంత ముఖ్యమైన ప్రశ్నలో వేరే చెప్పాలా!

2007 లోనే దరఖాస్తు చేసినా, స్పందన కరువై, స. హ. శాఖ కమిషనరుకి అప్పీలు దరఖాస్తు చేశారట. మొదటి అప్పీలుకి స్పందన లేక, రెండో అప్పీలు చేస్తే, ఆయన ‘వారం లోగా’ సమాచారం అందించాలని రాష్ట్ర హోం శాఖని ఆదేశించారట!

హోం శాఖ లెక్కల ప్రకారం క్రిమినల్ కేసులున్న వాళ్ళెవరిదగ్గరా లైసెన్స్ లు లేవన్నారట!

మరి ఆయన అంతకు ముందే కలెక్టర్లూ, పోలీసుల దగ్గర్నించీ తెప్పించుకున్న సమాచారం ప్రకారం—కర్నూలు లో లైసెన్స్ వున్న వ్యక్తి పై 17 క్రిమినల్ కేసులు వున్నట్టు చెప్పారట!

ఇంకా విచిత్రం యేమిటంటే, హోం శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తం గా 19,757 లైసెన్స్ లుండగా, జిల్లాల లెక్కల ప్రకారం 21,324 వున్నాయట!

మరి దాదాపు 2,600 లైసెన్స్ లు హోం శాఖకి తెలియకుండా, యెవరు జారీ చేశారో!

లైసెన్స్ లకి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించేలా హోం శాఖ ని ఆదేశించాలనీ, అప్పటివరకూ కొత్త లైసెన్స్ లు మంజూరు చేయడం గానీ, గడువు ముగిసినవాటిని పునదుద్ధరించడం గానీ చేయకుండా వుత్తర్వులు ఇవ్వాలని వున్నత న్యాయ స్థానాన్ని కోరారట.

విచారణ చేపట్టబడింది.

అంత సుకుమారమైన గేదె శరీరాలు యెవరికున్నాయో బయట పడుతుందా? లేక దున్నపోతుమీద వానేనా!?

చూద్దాం!


Tuesday, August 11

మాయగాడి మరో మోసం

‘కోలా కృష్ణమోహనరావు’
—యూరో లాటరీ తగిలిందని నమ్మించి, కొంతమందిని కోట్లలో ముంచి ఇంకా పదేళ్ళు కూడా కాలేదేమో!
వాడి కేరేక్టరుతో సినిమాలు కూడా తీశారు! చట్టం వాడినేమీ చెయ్యలేకపోయిందని గుర్తు.

అప్పటిలో వాడు సంపాదించినదానితోనే యేమో, ఇథియోపియా లో 120 యెకరాల ప్రభుత్వ భూముల్ని కొని, గులాబీ తోటలు పెంచుతున్నాడట!

ఇప్పుడు మళ్ళీ ‘ఇథియోపియా లో వుద్యోగాలు’ పేరుతో తన www.srisaiflora.com ద్వారా ఓ 65 మంది నిరుద్యోగుల నించి దాదాపు ఒకటిన్నర కోట్లు వసూలు చేసి, వాళ్ళని ముంచాడట! (పాపం నిరుద్యోగులు మరి!)

ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, పోలీసులకప్పగిస్తే, వీరు ‘విచారించి’, ఎస్ ఆర్ నగర్ పోలీసులకప్పగిస్తాం, వారూ ‘విచారిస్తారు’ అంటున్నారట!

ఈ వరస చూస్తుంటే, ఈ సారి కూడా వాడికేమీ అవదు అనిపించట్లేదూ?

‘తోటకూర నాడే’ వాడి కాళ్ళు విరగ్గొట్టి వుంటే, ఇప్పుడు తీరిగ్గా ‘విచారించ’ వలసిన అవసరం తప్పేది కదా?

అయినా ఇప్పటికీ ‘బంగారం మెరుగు పెడతాం’ అంటూ వచ్చే అపరిచితులకి ఇంట్లో బంగారం అంతా అప్పచెప్పి, తరవాత లబో దిబో మంటున్న ఆడ మళయాళం వున్నారంటే, యేమనుకోవాలి!

అదంతే!

Monday, August 10

గుళ్ళో పాటల భక్తి

పాటల భక్తి
ఈ మధ్య ప్రతీ గుడిలోనూ అనేక రకాలైన భక్తి రికార్డులు గంటలతరబడీ వాయించేస్తున్నారు!
వీటిలో రకరకాల పాటలు వుంటున్నాయి! ‘జజ్జనకడి జనారే’ వరసలతోసహా….
ఇవి కాక ‘చ్హాంట్’ లంటూ ఒకే పదాన్నో, మంత్రాన్నో పదే పదే వల్లించే రికార్డులు కొన్ని!
అసలు ఆడవాళ్ళకి గాయత్రీ మంత్రానికి అర్హత లేదు—వాళ్ళు జంధ్యాలు వేసుకో కూడదు కదా?
అయినా, ఓ ఆడమేళం గాయత్రీ మంత్రాన్ని, వాళ్ళిష్టం వచ్చినట్టు ‘చ్హాంట్’ చేస్తున్న రికార్డొకటి!
అది ఇలా సాగుతుంది—“ఓం భూర్ భువహ స్వాహా! తత్స వితుర్వ రేణ్యం! భరుగో దెవస్య ధీమహీ! ధియో యోనహా ప్రత్యోదయాత్!”
పీటమీద కర్రతో తాళం వాయించుకుంటూ, అదే వరసలో పాడడం వల్ల ‘వచ్చిన రాగాలూ, తీసిన దీర్ఘాలూ’ ఇవి! (శంకరాభరణం శంకర శాస్త్రిగారికీ, పట్టాభి భాగవతార్ కీ క్షమాపణలతో!)
‘భూర్ భువహ్ స్వహ్’ అంటే అవి ‘భూ, భువ, స్వ’ (భూలోక, భువర్లోక స్వర్లోకాలు) లోకాలు అనీ, ‘స్వహ్’ కీ ‘స్వాహా’ దేవికీ యేమీ సంబందం లేదనీ—వీళ్ళకి యెవరు చెపుతారు?
‘భరుగో దెవస్య’ కాదు ‘భర్గో దేవస్య’ అనాలని యెవరు చెపుతారు?
‘ధియో యోనహా’ కాదనీ, “ధీయోయోనహ్’ అనీ యెవరు చెపుతారు?
‘ప్రత్యోదయాత్’ అనక్కర్లేదు ‘ప్రచోదయాత్’ అనాలని యెవరు చెపుతారు?
మనం చెప్పినా వాళ్ళు వింటారా! రికార్డుని మార్చి మగాళ్ళతో సరిగ్గా పాడిస్తారా! ఇప్పటి వరకూ అమ్ముడైన రికార్డులని నాశనం చేస్తారా! ఈ గుళ్ళలో వాటిని వేయడం మానేస్తారా! ఒరే వెధవల్లారా ఇది తప్పు అని యెవరైనా వాళ్ళకి చెప్పేస్తారా!
మన పిచ్చి గానీ, యేదైనా యెంత భ్రష్టు పడితే జనాలకి అంతానందం!
ఇవి వింటూంటేనే మనశ్శాంతి కలిగి, జన్మ తరించినట్టనిపిస్తోందట కొంతమందికి మరి!
యెవరి పిచ్చి వాళ్ళకానందం అని యెవరన్నారో!

Sunday, August 9

యెన్నికల యంత్రాలు

వోటేసే యంత్రాలు
మనం వోట్లు వెయ్యడానికి పనికొచ్చే యంత్రాలని, ‘వాటంతట అవే వాటికి కావలసినవాళ్ళకి వోట్లు వేసే యంత్రాలు’ అని ప్రచారం చేసి, వాటిని నిషేధించాలంటున్నారు కొంతమంది నయా మేథావులు!

వీళ్ళకి వంత పాడుతున్నారు—రాజకీయ పార్టీలవారు! (మరి రిగ్గింగులకీ, సైక్లింగులకీ కుదరడం లేదుగదా! బూత్ కేప్చరింగు చేద్దామన్నా, పోలింగు అధికారి ఒకే బటన్ నొక్కి, పోలింగుని రద్దు చేసేస్తున్నాడు! బేలట్ పెట్టెల్లో ఇంక్ పొయ్యడానికి లేదు—అందుకని, గొడ్డళ్ళతో ఈ వీ ఎం లని నాశనం చేసినా, ఫలితం రీ పోలింగే! అందుకని, ఆడలేక మద్దెల ఓడు అంటూ, తమ స్వయంకృతాలని కప్పిపుచ్చుకోజూస్తున్నారు!)
2004 యెలక్షన్లకి మీదగ్గర సిబ్బంది పేర్లు ఇస్తే, యెలక్షన్ డ్యూటీలు వేస్తాం అని రిటర్నింగు అధికారి అడగగానే, మా బ్యాంకు బ్రాంచిలో తనతో సహా అందరి సిబ్బంది పేర్లూ వ్రాసిచ్చేశాడు—తెలిసీ తెలియని మా మేనేజరు!

దాంతో, అందరికీ, యెలక్షన్ విధులు కేటాయిస్తూ, ఫలానా రోజు మీటింగుకీ, శిక్షణకీ రమ్మని తాఖీదులొచ్చేసరికి, కళ్ళు తేలేశాడు—బ్యాంక్ యెలా నడిపించాలి సిబ్బంది లేకుండా—అనుకుంటూ!

సరే—తరవాత, పొరపాటుని అధికారులకి విప్పిచెప్పి, బ్యాంకు నడవడానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నామనుకోండి!

కానీ శిక్షణ తరగతులకి మాత్రం తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పడంతో, మా సబ్ మేనేజరూ, నేనూ కూడా శిక్షణకి హాజరవ్వడం, మా అదృష్టం కొద్దీ ఈ వీ ఎం లని క్షుణ్ణంగా పరిశీలించి వాటితో రకరకాల ప్రయోగాలు చేసి, మొదటిసారి దేశ వ్యాప్తంగా నిజమైన యెన్నికలు జరగబోతున్నాయి అని సంతోషించాము!
తీరా పోలింగు రోజున పొద్దున్నే టీవీలో ‘ఫలానా చోట ఈ వీ ఎం లు మొరాయించాయి’ ‘ఫలానా చోట ఈ వీ ఎం లు లేటుగా ప్రారంభమయ్యాయి’ అంటూ వార్తలు వస్తుంటే, ఆశ్చర్యపోయాను!

ఇక్కడో మాట చెప్పుకోవాలి—అంతకు ముందే కొత్తగా ‘టీవీ 9’ ప్రారంభమై, వెలుగులోకి వస్తోంది! (నిజానికి టీవీ 9 రావడంతోనే మీడియా వెర్రితలలు వెయ్యడం మొదలు పెట్టింది! ముఖ్యం గా రవిప్రకాష్ మొదట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు—తరవాత తల బొప్పి కట్టాక మానేశాడానుకోండి!) మొట్టమొదట ఈ వీ ఎం లు మొరాయించాయి అని అన్నవాడు రవి ప్రకాషే!

నిజానికి ఈ వీ ఎం లు ‘మొరాయించవు’—వాటిని ప్రారంభించడానికి ముందు చెయ్యవలసిన ప్రక్రియలు—అభ్యర్థుల లిస్ట్ అందులో యెక్కించడం, మిగిలిన బటన్లని డమ్మీలుగా చెయ్యడం, నెంబర్లనీ వాటినీ నోట్ చేసుకొని, ‘టాంపర్ ప్రూఫ్’ గా సీలు చెయ్యడం—ఇలాంటివి! యెంత శిక్షణ పొందినా, పోలింగు సిబ్బంది ఈ విషయాల్లో తడబడం సహజం! అప్పుడు ఇతర అధికారులో, కంపెనీ వారో వచ్చి, వాటిని సరిగా ప్రారంభించేలాగ చేసేవారు—దానికి కొంత సమయం పట్టేది!

నేను చాలెంజి చేసి చెపుతున్నాను—వీటిని టాంపర్ చెయ్యడం యెవరి తరమూ కాదు!

మరి ఈ మధ్య ‘జనచైతన్య వేదిక’ వారు కొంత మంచి చేస్తున్నారు—మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా జనచైతన్యం కలిగించడం మొదలైనవి చేస్తూ.

వీరికేమొచ్చిందో—ఈ వీ ఎం లు టాంపర్ చెయ్యడం ద్వారా, పోలైన ప్రతీ అయిదో వోటో, ఎనిమిదో వోటో--ఇలా ఒకే అభ్యర్థికి పడేలా చెయ్యచ్చు అంటున్నారు!

వాళ్ళు సొంతంగా వాళ్ళకి తోచినట్టు ఈ వీ ఎం ల్లాంటివి తయారు చేసి, ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు! సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు కొంతమందితో!

మనిష్టం వచ్చినట్టు మనమే ఓ మెషీను తయారు చేసుకొని, దాన్ని వక్రం గా నడిపించి, అసలు మెషీన్లు కూడా ఇలా వక్రం గానే నడుస్తాయి అంటే, అది యేం నిరూపించినట్టూ?

మరి వీళ్ళెవరికి కొమ్ముకాస్తున్నట్టు?

(కొన్ని రోజుల క్రితం నేను తయారు చేసుకున్న టపా—కొన్ని తుదిమెరుగులు దిద్ది ప్రచురించాలని వుంచినది—ఇప్పుడు ప్రచురిస్తున్నాను! మెరుగుల సంగతి తరవాత!)




Saturday, August 8

నైతికత

తప్పుడు బిల్లులు
తప్పుడు మెడికల్ బిల్లులు సమర్పించి లక్షల రూపాయలు సంపాదించిన మాజీ ఎం ఎల్ యే యెర్నేని రాజా రమచందర్—తప్పు చెయ్యడం, నాకు తెలియక చేశానననడం బాగానే వుంది.

చిన్న కోర్టు దగ్గరనించీ, రాష్ట్ర వున్నత న్యాయ స్థానం దాకా ఇది తప్పు అని చెప్పాక కూడా, ఈ సిగ్గులేని గవర్నమెంట్ ప్రత్యేకం గా ఓ జీ ఓ వెలువరించి అతను నిర్దోషి అంది!

శాసన సభ నైతికవిలువల కమిటీ, కేసు ఉపసం హరించుకోమని సలహా ఇచ్చింది!

ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయ స్థానం వీళ్ళందరికీ అక్షింతలు వేసింది!

చిన్న ప్రభుత్వోద్యోగి ఎల్టీసీ వాడుకుని, బస్ టిక్కెట్లలో ఓ టిక్కెట్ పొరపాటుని పారేసుకొని, దాని బదులు ఇంకో టిక్కెట్ సంపాదించి బిల్లు పెట్టుకొంటే, తరవాత వాడి ఉద్యోగం తీసేసిన కేసులు వున్నాయి!

మరి ఎం ఎల్ యే అయితే వూడి పడ్డాడా!




Friday, August 7

జూదాలు

ఫ్యూచర్స్
ఫ్యూచర్స్ ఎక్స్చేంజీలవల్లే ధరలు పెరగలేదు’ అంటున్నాడు—నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎం డీ, సీ ఈ వో శ్రీ ఆర్ రామశేషన్!

‘ప్రస్తుతం సరకుల ధరలు భగ్గుమనడానికి ఈ ఎక్స్చేంజీలూ కొంతవరకూ కారణమనే అభిప్రాయం ప్రజల్లో వుంది. కానీ అందులో యేమాత్రం నిజం లేదు.సరకుల ధరలు పెరగడానికి గిరాకీ-సరఫరాల్లో అంతరాలే కారణం.’ అని ఆయన స్పష్టం చేశారుట.

‘మా పని కేవలం సరకుల ఫ్యూచర్స్ కాంట్రాక్టుల వర్తకానికి వీలు కల్పించడమే…సరకుల ధరల హెచ్చు తగ్గుల్లో మాకు ప్రమేయం వుండదు.’ అన్నారటాయన.

‘ఈ ఎక్స్చేంజీలలో రైతుల భాగ్యస్వామ్యం పెరగడానికి ఇంకా సమయం పడుతుంది. ఇతరదేశాలతో పోలిస్తే మాత్రం మనదేశం లో రైతుల భాగస్వామ్యం అధికం గానే వుంది’ అని కూడా అన్నారట!

ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలనీ, నోటికొచ్చిన లెఖ్ఖలనీ వల్లించేవాళ్ళని చెప్పుతో కొట్టాలా వద్దా?

యే ఎక్స్చేంజీ లోనైనా యే ఒక్క రైతు అయినా సభ్యుడిగా వున్నాడేమో చెప్పమనండి! వున్నది అందరూ స్పెకులేటర్లూ, కాంట్రాక్టర్లూ కాదా? గిరాకీ సరఫరాల్ని నియంత్రిస్తున్నది వీళ్ళ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు కాదా?
ఇక రెయిన్ ఫాల్ ఇండెక్స్ ప్రవేశ పెడతారట! అంటే యేమిటో!

ఫలానా నెలలో ఫలానా రోజుని ఫలానా చోట వర్షం వస్తుందా రాదా—వస్తే యెంత వస్తుంది—వస్తే యెంత ఇస్తావు—రాకపోతే నేనెంత ఇవ్వాలి—ఇలాంటి పందాలా?

క్రికెట్ లో ఫలానారోజు ఫలానా ఆటగాడు సెంచరీ కొడతాడనీ, కొట్టడనీ, సెంచరీ సంగతి దేవుడురుగు అసలు డక్ అవుట్ అవుతాడనీ, అవడనీ—ఇలా పందాలు వేసుకోవడం చట్టవిరుద్ధం!

మరి వీటినికూడా యే గేం స్ ఇండెక్స్ పేరుతోనో ఓ ఎక్స్చేంజీ లో పెట్టేస్టే, కోట్లు సంపాదించుకోవచ్చేమో—రామశేషన్ లు ఆలోచించాలి!

చిన్న పిల్లల్ని కాసేపు అల్లరి చెయ్యకుండా, యేడవకుండా కాలక్షేపం చేయించడానికి, ఓ బొమ్మలు/ఫోటోలు వుండే పుస్తకం తీసుకొని, ఒక్కొక్క పేజీని చేతితో మూసి, ‘బొమ్మొస్తుందా రాదా?’ అని, వాళ్ళు వొస్తుంది అంటే, పేజీ తిప్పి బొమ్మ వస్తే—నువ్వే నెగ్గావు—నా అరచేతిమీద ఒకటి కొట్టు అనీ, బొమ్మ రాకపోతే—నేనే నెగ్గాను—నీ అరచేతిమీదొకటి కొడతాను—అనీ—ఇలాంటి ఆట ఙ్ఞాపకం రావడం లేదూ?

దీంతొటే మనం చిన్నపిల్లలకి ‘స్పెక్యులేషన్’ నేర్పిస్తున్నామా?

అయినా ఇలాంటి చాలెంజి లు లేకపోతే సరదా యేముంది అనేవాళ్ళు కూడా వున్నారు—వాళ్ళనేమనాలి?